*ఓం నమో భగవతే వాసుదేవాయ*
*🌀 ఎప్పుడు కోప్పడాలి? 🌀*
*కోపం అనేది నిన్ను నిన్నుగా నిలవనీయని ఒక అనిశ్చిత ఉద్విగ్న స్థితి. కోపానికి కారణాలు అనేకం. నష్టాలు కూడా ఎన్నో. కోపం సింహాసనం ఎక్కితే కారణం నిష్క్రమిస్తుంది. ఇంగితం నశిస్తుంది. హృదయం జ్వలిస్తుంది. చెవి మంచిమాటలు వినదు. మాట అదుపు తప్పుతుంది. కంటికి దోషాలు మాత్రమే కనపడతాయి. మనసు యథార్థాన్ని చూడదు, చూసినా అంగీకరించదు. చేతలు అదుపులో ఉండవు. శక్తి వృథా అవుతుంది. మనసు అశాంతికి నెలవవుతుంది. మితిమీరిన కోపం ఆవహిస్తే మనిషి పశువవుతాడు.
*కోపాన్ని వ్యక్తం చేస్తే బంధాలు కోల్పోతారు, అణచుకుంటే మనశ్శాంతి కోల్పోతారు. ఫలితంగా తనకోపమే తనకు శత్రువవుతుంది.
*కోపం అదుపులో ఉన్నంతసేపు దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు. నయాన చెప్పినా గ్రహించనప్పుడు తల్లిదండ్రులు సంతానం మీద, ఉపాధ్యాయులు విద్యార్థుల మీద, పెద్దలు పిన్నల మీద కోపం ప్రదర్శించాలి. అది వారి నడక, పద్ధతులు, మాటతీరు బాగాలేవని తెలియజెప్పేందుకు, భయభక్తులు కలిగించేందుకు ఒక మార్గం. అంతేగాని, కోపం తెచ్చుకోకూడదు. ఈర్ష్యాద్వేషాలకు తావు లేకుండా ఇతరుల తప్పులు తెలియజెప్పేలా ఉండాలి. ఇతరుల అహాన్ని వ్యక్తిత్వాన్ని గాయపరచకూడదు. అహం దెబ్బతిన్నప్పుడు, తిరస్కృతికి గురైనప్పుడు కోపం అదుపు తప్పుతుంది. విషయం మరుగునపడి విధ్వంసానికి, తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
*కోపం తెచ్చుకోవడం ఎంత ప్రమాదమో, కోపం తెప్పించడం కూడా అంతే ప్రమాదం. పెద్దలు గురువులు, సాధువుల పట్ల వినయ విధేయతలతో వారి అనుగ్రహం పొందేట్లు అప్రమత్తంగా నడచుకోవాలి. ఆగ్రహం కలిగిస్తే వారి కోపాగ్నికి ఆహుతి కాక తప్పదు. కోపానికి గురైనవారు ఇతరుల ఆగ్రహానికి కారణం అర్థం చేసుకుంటే ఘర్షణ ఉండదు.
*చాలామంది తాము అనుకున్న పద్ధతికి ఎవరైనా భిన్నంగా ప్రవర్తించినా, బాగా ప్రేమించి అభిమానించేవారు తన భావాలను అర్థం చేసుకోక పోయినా, చివరికి నిత్యం వాడే వస్తువులు సరిగ్గా లేకపోయినా పనిచేయకపోయినా కోపమొస్తుంది. అటువంటి చిన్న చిన్న విషయాలకు సహనం కోల్పోయి కోపం తెచ్చుకోవడం తప్పు. అది అవగాహన రాహిత్యాన్ని చాటుతుంది. అసమర్థుడి కోపం ఇంట్లో వస్తువులకు, బయటి బంధాలకు చేటు.
*తలనొప్పి రోగం కాదు, అంతర్గతంగా తలెత్తిన ఏదో ఒక రోగానికి సూచన అంటారు వైద్యులు. కోపం కూడా మనసులో ఉత్పన్నమైన ఏదో ఒక ఉద్విగ్నతకు పర్యవసానం. సద్వివేచన, ఆత్మవిమర్శతో కోపానికి కారణాన్ని తెలుసుకుని దాన్ని పరిష్కరించుకోవాలి. లేకపోతే మూల్యం చెల్లించక తప్పదు.
*వ్యక్తిత్వానికి, తనను నమ్ముకున్నవారికి, దేశానికి, ధర్మానికి హాని కలిగినప్పుడు కోపం రాకపోతే తప్పు.
కోపానికి ఎవరూ అతీతులు కారు. కోపాన్ని సదా నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైన సందర్భాల్లో మాత్రమే కోపం ప్రదర్శించాలి. ఎప్పుడు ఎంతవరకు కోపం తెచ్చుకోవాలి అనేది కూడా తెలిసి ఉంటేనే అది సాధ్యం. మనిషి నిగ్రహం అప్పుడే తెలుస్తుంది. ఉచితంగా లభిస్తుందని ప్రతిసారి అందరిమీదా కోపాన్ని ప్రదర్శించకూడదు. అది పిచ్చివాడి చేతిలో రాయిలా కాకూడదు. విజ్ఞతతో ఆయుధంగా మలచుకోవాలి.
🪴🌷💠💠💠 💠💠 🌷🪴
🙏సర్వేజనా సుఖినో భవంతు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి