27, జులై 2024, శనివారం

దృక్పథం

 *దృక్పథం!* 


ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ పై తల పెట్టి అలా కూర్చుని నిద్ర పోతున్నాడు. అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది. అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్నుపై అతని ముందున్న రైటింగ్ పాడ్ పై పడింది.


దాని మీద ఏదో రాసి వుంది. ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసినదాన్ని నిశ్శబ్దంగా చదవసాగింది.. అందులో ఇలా వుంది :


గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు. మూడు నెలలు మంచం మీదేఘ గడపాల్సి వచ్చింది.


ఈ ఏడాదే నాకు 60 ఏళ్లు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను. నేను ముప్ఫై ఏళ్లు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పని చేసి కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకున్నాను. ఆ కంపెనీతో నాకెంతో అనుబంధం ఉంది. దానితో ఇక ఋణం తీరిపోయింది.


ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది.


ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, ఎన్నాళ్లుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకూ పనికిరాకుండా పోయింది.


దేవుడా! ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు!


చివరి వరకూ చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ పాడ్ ను తీసుకుని బయటకు నడిచింది. 

కాసేపటి తర్వాత ఆమె వచ్చి పాడ్ ను అక్కడేపెట్టి వెళ్ళిపోయింది.


ఆయనకి మెలుకువ వచ్చింది. తన చేతిలో పెన్ను, టేబుల్ మీద రైటింగ్ పాడ్ చూసుకున్నాడు. దానిమీద తను రాసింది కాకుండా ఇంకేదో రాసి వుండటం గమనించి చదవడం ప్రారంభించాడు.


అందులో ఇలా వుంది :


గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పి నుంచి శాశ్వతంగా ఉపశమనం లభించింది.


ఈ ఏడాదిలోనే నాకు అరవై ఏళ్లు నిండాయి. సంపూర్ణ ఆరోగ్యం తో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నా పూర్తి సమయాన్ని నా కుటుంబంతో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతాను.


ఈ ఏడాదిలోనే మా నాన్నగారు 95 ఏళ్ళ వయసులో ఎవరితోనూ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బందీ లేకుండానే ప్రశాంతంగా సహజమరణం చెందారు.


ఈ ఏడాది నా కొడుక్కి పునర్జన్మనిచ్చింది. కారు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైనా నా కొడుకు ప్రాణాలతో బైటపడ్డాడు, కార్ కి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో మరో కొత్త కారు కొనుక్కున్నాను.


హే భగవాన్! ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు!! ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు!!!"


అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూసాడు. కర్టెన్ వెనకాల తన భార్య నీడను గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు. తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు.


ఎంతో ప్రోత్సాహ భరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు.


చాలావరకూ సమస్యలు మన ఆలోచనా దృక్పథం నుంచి ఉద్భవించేవే! మన ఆలోచనా దృక్పథం పాజిటివ్ గా ఉంటే ఎంతటి సమస్య ఐనా దూదిపింజెలా తేలికైపోతుంది, ఫలితం అనుకూలంగా ఉంటుంది. కానీ నెగటివ్ ఆలోచనలు చిన్న సమస్యను కూడా భూతద్దంలో చూపించి మనశ్శాంతిని దూరం చేస్తాయి.

కామెంట్‌లు లేవు: