🌹శ్రీకృష్ణ పరమాత్మ🌹
శ్రీమహావిష్ణువు క్షితిభారమును బాప
ప్రార్థితుండయ్యును బ్రహ్మవలన
వసుదేవప్రభువుకు వనిత దేవకికిని
పుట్టె చెఱసాలలో గుట్టు గాను
శ్రీకర వర్షమౌ "శ్రీముఖ" మందున
భవ్య " శ్రావణ మాస బహుళ " మందు
" అష్టమి తిథి " యందు నర్థరాత్రంబున
జన్మించె కృష్ణుడు జగతి పొంగ
మథురానగరు నుండి మందలన్ జేరియు
న్నందు నింట బెరిగె నందనునిగ
పడతి యశోదమ్మ పాలను ద్రావియు
న్నల్లారు ముద్దుగా నలరి బెరిగి
పడతి పూతన మృత్యు పాలను ద్రావియున్
బంపెనా పడతిని పరమపదము
పెక్కు లీలలు జూపి బృందావనము నందు
పరిమార్చె కంసుని పదుగు రెదుట
నష్ట భార్యల పొంది నలరించి నందరిన్
కళ్యాణపురుషుడై ఘనత నొందె
పౌండ్రక శిశుపాల పగతుర జంపియున్
జగదభిరక్షణ జరిపి చూపె
భవరమధ్యంబున పాండునందనునకు
పూతమౌ గీతను బోధ జేసె
దుర్యోధనాదుల దురమందు ద్రుంచియున్
ధరణిపట్టము గట్టె ధర్మజునకు
ధర్మ సంస్థాపనార్థము ధరణి వెలసి
దుష్టులనుద్రుంచె బ్రోచియు శిష్టజనుల,
విష్ణు పరిపూర్ణ రూపుడౌ “కృష్ణు” నకును
ప్రణతు లర్పింతు నత్యంత భక్తి తోడ
"శ్రీకృష్ణజన్మాష్టమి" పర్వదిన శుభాకాంక్షలులతో
గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి