18, నవంబర్ 2024, సోమవారం

78. " మహాదర్శనము

 78. " మహాదర్శనము " --డెబ్భై ఎనిమిదవ భాగము --చివరి దినములు


78. డెబ్భై ఎనిమిదవ భాగము--  చివరి దినములు


          దేవరాతుడు పయో వ్రతమును ఆరంభించి తొమ్మిది నెలలయినవి. దీక్షను వదలినాడు. గడ్డమూ , శిఖా పెరిగి ఇంతింత పొడుగ్గా అయినాయి. అలాగని రూపము ఘోరముగా లేదు. ముఖము సౌమ్యముగా ఉంది. అన్నిటికన్నా ఎక్కువగా , కనుల దృష్టి ప్రశాంతమైనది. అయినా ఏదో ఒక అలౌకికత. పోగొట్టుకున్న తన రత్నమును వెదకు వానివలె ఏదో ఒక వెదకుచున్న చూపు. భగవానులతో ఉన్నపుడు కనులు మూసుకొని మౌనముగా కూర్చుంటాడు. ఒక్కడే ఉన్నపుడు కనులు తెరచి ఏదో ఒక వ్యాపారము చేస్తూ ఉంటాడు. సామాన్యముగా ఒక చేతిని అడ్డముగా ఉంచి, ’ ఇలాగ కామము ఆగి ఉన్నది , అయితే అది ప్రవాహమునకు అడ్డముగా ఉంచిన చేయి వలెనే. చేయి అడ్డమైతే ప్రవాహము ఆగునా ? అలాగ ఖండము అఖండమగుటకు అడ్డముగా ఉన్నది కామము. ఒకసారి గనక ఖండము అఖండము వైపుకు తిరిగితే ఖండము తాను అఖండమగును. నిజంగా సంకల్పిస్తే అప్పుడు కామమును ఆపుట ఏమిగొప్ప ! అయితే ఖండము ఎరుగదు , తానే అఖండమని! కాబట్టే ఈ కామపు జోరు , అధికారము." అని గల గలా నవ్వుతాడు. 


         ఆలంబిని వచ్చేది  ’ తన స్నానానికి నీరు ఇచ్చుటకు ’ అని అతడిది ఒక సిద్ధాంతము. ఆమె ఎప్పుడు  వచ్చినా , ’ ఏమి , స్నానానికి సమయమయినదా ? ’ అంటాడు. స్నానము చేస్తే , అభ్యాస బలము చేత నిత్య కర్మ , అగ్నిహోత్రములను చేస్తాడు. అయితే ఆహార విచారములో మాత్రము బహు కచ్చితము. పాలు తప్ప ఇంకేమీ తీసుకోడు. ఒక్కొక్క నాడు , ’ ఆలంబినీ , నేను పాలను మాత్రమే తీసుకొనుట ఎందుకో తెలుసా ? మనము తీసుకున్న ఆహారము మూడు పాలు అగును. ఒక భాగము దేహమునకు అనవసరమై మలమై బయటికి వచ్చేస్తుంది. ఇంకొక భాగము సూక్ష్మముగా రక్తమై శరీర భాగముల నిర్మాణములో ఉపయోగపడును. దానికన్నా సూక్ష్మమైన భాగము మనసును చేరుతుంది. కాబట్టి ఆహారశుద్ధి వలన సత్త్వ శుద్ధి, సత్త్వ శుద్ధి వలన మనశ్శుద్ధి . కాబట్టి , చూడు , మనస్సు   శుద్ధముగా ఉండవలెను అనువాడు ఆహార శుద్ధి వైపు సంపూర్ణ లక్ష్యము పెట్టవలెను. " అంటాడు.   


          ఇంకొక దినము తానే ఆలంబినిని పిలచి ," నువ్వు ఊ అను ఆలంబినీ , , ఈ కర్మలన్నీ మనకు నానావిధములైన స్వర్గములను తెచ్చిచ్చునది నిజము. అవి ఎలా వస్తాయి ? ఈ కర్మలు పుణ్యములైనందు వలన.     ఒకవేళ మన కర్మ పాపమైనది అనుకో , అప్పుడు ఏమి కావలెను? పాపలోకములు కలగవలెను. మనము ఒక కర్మ చేస్తే దానికన్నా విరుద్ధమైన మరొక ఫలము వచ్చుట ఉంటుందా ? దారిలో నడిస్తే పొట్ట నిండునా , భోజనము చేయాలి గానీ? ఇలాగైతే , కర్మ చేస్తే బ్రహ్మ దొరకునా ? మొక్కజొన్న పైరులో గోధుమలు వస్తాయా ? అలాగని కర్మను చేయకుండుటెట్లు ? కర్మ చేయకుండా ఉండుటకూ లేదు, కర్మ చేయకపోతే దేహము వినవలెను కదా ? కాబట్టి కర్మము చేసే తీరవలెను అను. ఆ ! చూడు ! ఆలంబినీ ! గుట్టు దొరికింది , కర్మ ఆహారము వలెనే , ఇక సరే , దేహపు రక్షణకు తిను ఆహారము వేరే , బొజ్జ పెంచుటకు గేదెలు తినునట్లు తిను ఆహారము వేరే , కాదా ? అలాగే కర్మ కూడా! "


     ఆలంబినికి,’ ఇదేమిటి ? వీరికేమైనా పిచ్చి పట్టినదా ? లేక పిచ్చి పట్టుటకు ముందు సూచనగా ఇలాగ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారా ? " అనిపిస్తుంది.


         అది అతడికి ఎలాగో తెలిసిపోవును. వెంటనే అతడు నవ్వి , " నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావేమో ? పిచ్చివాడికీ జాణకూ  ఏమి తేడా ? ఇతరులకు కావలసిన మాటలనే చెప్పుచూ , ఏమైనా సరే , ఇతరులను తృప్తి పరచవలెను అని తన వ్యవహారముల నన్నిటినీ అటువైపుకు తిరుగునట్లు చేసుకున్నవాడు జాణ. అటుల కాక, తనకోసము తాను తనతో ఆడుకొను మాటలను ఇంకొకరి దెప్పుడు లేకుండా ఆడుకొనువాడు పిచ్చివాడు. సరిగ్గా చూస్తే , ఈ జగత్తులో ఇతరులకు తనను బలి ఇచ్చుకొని తనను అంతగా కుంగ జేసుకున్నవాడు పిచ్చివాడా ? లేక ఇతరుల గోజు వద్దేవద్దని తనకు తోచినట్లు చేయువాడు పిచ్చివాడా ? నేను చెప్పేది నీకు తెలియక పోతే నీ కొడుకు ఆ భగవానుడున్నాడు కదా , వాడిని అడుగు. ఏమి చేయుట ? నాకు కావలసినది వాడిలో ఉంది. వాడు ఇచ్చుటకు ఇంకా మనసు చేయలేదు. అలాగని ఇవ్వక పోయేవాడు కాదు. సరేలే , ఏదో ఒకరోజుకు ఇవ్వనే ఇవ్వవలెను , ఇస్తాడు " అంటాడు. ఆలంబిని ," ఔనౌను, మీకు కాకపోతే ఇంకెవరికిస్తాడు ? " అంటుంది. దేవరాతుడు పెద్దగా నవ్వి , " నేను ఆశ్రమమునకు వచ్చినదే అందుకు ఆలంబినీ. గంగా యమునా సంగమములో ప్రాణము వదిలితే ముక్తి యంట ! అలాగ , ఈతని సన్నిధానమే మాకు సంగమము. ఏమంటావు ? " అంటాడు. 


        ఆలంబినికి రానురాను మొగుడి విచిత్ర వర్తనము అలవాటై పోయినది. అయినా ఆమెకు ఒక ఆశ్చర్యము. ఎన్నో సంవత్సరాలనుండీ కర్మమే సరియైనది అనేవారు ఇప్పుడు కర్మకు మించి ఇంకేదో ఉంది అంటారు. అదేమిటి ? నేను కూడా దాన్నెందుకు పొందరాదు ? " అనుకుంటుంది. 


         ఈమె కూడా ఇప్పుడు భర్త వలెనే పయోవ్రతములో ఉన్నది. ఆమెకు ఒక ఆశ ఉండినది, మనవడిని ఎత్తుకోవలెను. ఇప్పుడది కూడా లేదు. అదెట్లో , ఆ ఆశ కాలిన నేలపై పడిన వాన నీటి వలె ఇంకిపోయింది. భర్త యొక్క చింతయే అంతా అయినపుడిక వేరే చింతనలు , ఆశలూ ఏముంటాయి ? 


         ఒక దినము భగవానులు తానుగా తల్లిని చూడవలెనని వచ్చినారు. " అమ్మా , నీకు దేవతలు ఒక వరమును ఇచ్చినారు " అన్నారు. ఆమెకు భర్త అంటున్న, ’ వాడు కావాలంటే దానిని ఇవ్వగలడు ’ అనే మాట గుర్తొచ్చి , " తప్పకుండా కానిమ్ము , ఇవ్వవయ్యా ! " అని కొంగు చాచింది. 


" దేవతలు నీకు స్వేఛ్చా మరణమను వరమును ఇచ్చినారు " 


" అంటే ఏమిటయ్యా ? "


" చూడమ్మా , మరణము కాల , కర్మ సంయోగము వలన సంభవించేది. అలాగ కాకుండా నువ్వు కావాలన్నప్పుడు కాల కర్మలు మృత్యువును తీసుకొస్తాయి. ’  


" అంటే అప్పుడేమవుతుంది ? "


        " చూడమ్మా , కాలము వచ్చినపుడు ఈ శరీరములో నున్న జీవుడు ఈ శరీరమును వదలి వెళ్ళిపోవును. అప్పుడు అతడికి కామములు లేకున్నచో ముక్తుడగును. సకాముడై ఉంటే , యథాకాముడై లోకములను పొందును. " 


" ఇదేనా వారు చెప్పేది ? వారు పదే పదే ’ కావాలంటే నీ కొడుకు భగవాన్ ఇవ్వగలడు , ఇస్తాడు ’ అంటారు. వారు అనేది ఇదేనా ? "


        భగవానులు నవ్వుతూ , "కావచ్చును. నువ్వు అదంతా పట్టించుకోవద్దు. నన్ను కొడుకుగా కన్నావు. నాకు ఈ జన్మను ఇచ్చినావు. అందువలన నీకు కావాలన్న లోకములు దొరకును. నీకు కావలసినది చెప్పు. నువ్వు చెప్పేలోపలే దేవతలు అస్తు అంటారు " 


         " చూడు నాయనా , ఈ మధ్య వారికి దేహము కృశిస్తూ వచ్చినది . అందువలన నాకు కలుగుతున్న దిగులు ఇంతా అంతా అని చెప్పలేను. అదీకాక, ఆ దిగులును గురించి నేను ఎవరి దగ్గర చెప్పుకోవలెను ? ఒకవేళ చెప్పుకున్నా , విన్న వారు నా అదృష్టాన్ని మార్చగలరా ? అని ఇంతవరకూ ఊరికే ఉన్నాను. ఈ దినము ఏమైనా కానీ , నీ దగ్గరకు వచ్చి చెబుదామని మనసు చేసుకున్నాను. నువ్వే వచ్చి స్వేఛ్చా మరణము పొందవచ్చని దేవతలు వరమునిచ్చినారని అన్నావు. చూడు , నాకున్న ఆశలు రెండు. ఒకటి, ముత్తైదువగా చావవలెను. వారి ముందర కన్నుమూయవలెను. అలాగని వారిని ఇంకొకరి చేతిలో పెట్టి చావలేను. కాబట్టి , ఇప్పుడు నువ్వు చెప్పిన స్వేఛ్చా మరణము కానిమ్ము , అయితే , వారు పోవు కాలమునకు ఒక ముహూర్తము ముందర నా మరణము కలగ వలెను. ఇది ఒక ఆశ. "


" అలాగే అవుతుంది , ఇంకొకటి ? "


      " అబ్బ! , ఎద ను  నాటిన శూలము తీసేసినట్లయింది , నీ మాట వలన నాకు ఎంతో తేలికైంది. ఇక సంతోషముతో అడుగుతాను , అక్కడ నీ దేవతలను అడుగు , దానిని వారు ఇవ్వనీ , ఆ తరువాత నా నోటితో చెప్పెదను. " 


" సరేనమ్మా ! దానిని దేవతలు జరిపించెదరు , చెప్పు " 


" చూడు నాయనా , నాకు భర్త పైన  ఎంత ఆశో అనుకున్నా ఫరవా లేదు, పోయిన తరువాత కూడా వారెక్కడున్నా నేను కూడా అక్కడే ఉండ వలెను. అదే నా ఆశ "


        " ఇంతేనా ? నీకేమిటమ్మా , వదలకుండా అగ్నిహోత్రమును చేసిన మీకు ఒకటే గతియగును , పిచ్చిదానా , సరే , దేవతలు ఒప్పుకున్నారు. నేను వచ్చువరకూ మీరిద్దరూ బ్రహ్మలోకములో ఉండండి. ఈ దేహానంతరము నేను కూడా అక్కడికే వస్తాను. మనమందరమూ ముక్తికి వెళదాము. " 


" ముక్తి అంటేనేమి నాయనా ? " 


" నేను  , నువ్వు అన్న భేదములన్నీ వదలి , నీటిలో నీరు కలసిపోవునట్లే చైతన్యము చైతన్యములో చేరి పోవును. "


" నువ్వు వెయ్యి చెప్పు నాయనా ! నాకు  , ఈ తల్లీ కొడుకు , భార్యా భర్త అన్న నాటకమే బాగుంది. ఇది ఇలాగే నిలచునా ?? "


" ఇది నిలవదు. అయితే , మనకు చాలంటే లేచి వెళ్ళిపోవచ్చును. "


" ఏమో , చూడవయ్యా , ఇది మీ ఇద్దరికీ సంబంధించినది. మీరు ఎలాగ చెప్పితే అలాగ నేనూనూ ! "                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              

Janardhana Sharma

కామెంట్‌లు లేవు: