3, జులై 2025, గురువారం

దురద రోగిని

 తే.గీ.

దురద రోగిని దైవము వరము గోరు

మనగ,గోళ్ల బెంచు మనుచు నతడు గోరె!

మందభాగ్యుల తీరిది మహిని గనుము!

హితము జెప్పెద వినుము సుహృద్వరేణ్య!


------కోడూరి శేషఫణి శర్మ

ఆటపట్టు

 *ఆటపట్టు (జాతీయం) :*

ఆట = నాట్యం 

పట్టు = స్థానం 

▪️ నాట్యానికి స్థానము అని అర్థం.

 పూర్వకాలంలో ప్రజల ప్రధాన వినోద సాధనం నాట్యం. తోలుబొమ్మలాటలు, వీధి నాటకాలు సామాన్య ప్రజల వినోద సాధనాలైతే..... నాట్యం ఉన్నత కుటుంబాల వారి వినోద మార్గం.

 రాజ్యం నలుమూలల నుండి ఎంపిక చేసిన నాట్య కత్తెలను రాజుగారు కళా కేంద్రం అని పిలవబడే ఒక ప్రదేశంలో ఉంచేవారు. ఆ రాజ్యము సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే అన్ని రకాల నాట్యాలు ఇక్కడ ప్రదర్శితం అయ్యేవి. ఒకే నాట్యాన్ని పదే పదే చూస్తే.... కాస్త విసుగు అనిపిస్తుంది. విభిన్న రకాల నాట్యం చూడటం వలన రాజుకు, ఉన్నత వర్గాల వారికి కొత్తగా అనిపిస్తుంది. చూడాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇలాంటి నాట్య కేంద్ర నిర్వహణ రాజుగారికి ఆర్థికంగా భారమైనా .... నాట్య కేంద్రాన్ని పోషించడం రాజు గారి గౌరవానికి, కళాదృష్టికి నిదర్శనంగా ఉండేది. అలాంటి సకల నాట్యాలకు అనువైన ప్రదేశమే ఆటపట్టు. ఇది సాధారణ అర్థం. కానీ ప్రజలు ఈ సాధారణ అర్ధాన్ని మరుగుపరిచి, ఇప్పుడు 'నాట్యానికి నెలవు' అనే అర్థంలోనే కాకుండా "ఏదైనా ఒక అంశం ఫలానా చోట విరివిగా లభిస్తుంది" అని చెప్పేటప్పుడు *ఆటపట్టు* అనే జాతీయాన్ని వాడుతున్నారు.

 ఉదా : భారతదేశము కుటుంబ వ్యవస్థకు ఆటపట్టు.

నేనే బ్రహ్మను

 అహం బ్రహ్మాస్మి: నేనే బ్రహ్మను


'అహం బ్రహ్మ అస్మి' అంటే నేను 'బ్రహ్మ' అగుగాక అని, బ్రహ్మ జ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మను అంటే నాలోనే 'బ్రహ్మ' ఉన్నాడనే భావన రావాలి. నేనే బ్రహ్మను, నేను ఏం చేసిన అది బ్రహ్మాజ్ఞ అంటే కుదరదు!


మనం చేసేది మనసా, వాచా, కర్మణా అంతరాత్మ చెప్పిందే అయితే నిశ్చయంగా మనం 'బ్రహ్మమే"! దీని ప్రకారం బ్రహ్మ ఎవరో కాదు, నేనే అని ఈ ఉపనిషత్తు వాక్యం చెబుతుంద. ఇక మరో మహావాక్యం తత్వమసి. తత్వం అంటే నువ్వు, నువ్వు కూడా బ్రహ్మవే అని దీని అర్థం.


సామవేదంలోని చాందోగ్యోపనిషత్తు నుంచి వచ్చిన వాక్యం ఇది. మరో మహత్తర వాక్యం 'అయమాత్మా బ్రహ్మ'. అంటే ఈ ఆత్మే బ్రహ్మ అని అర్థం.


అధర్వణవేదంలోని ముండకోపనిషత్తు నుంచి ఈ వాక్యం వచ్చింది. ఈ మహత్తర వాక్యాల సారాన్నంతా మళ్లీ ఒకే వాక్యంలో చేర్చి చెప్పటం జరిగింది. అదే 'సర్వం ఖల్విదం బ్రహ్మ'. అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే తప్ప మరేమీ కాదు!ఈ వాక్యాల సారం అర్థమయితే చాలు, భగవంతుడు మరెక్కడో లేడు-మన అందరిలోనూ, అన్ని జీవుల్లోనూ ఉన్నాడనే భావన వస్తుంది.


మన అంతరంగంలో అన్వేషిస్తే దీనికి సరైన సమాధానం లభిస్తుంది. బయట వెతికితే ఏమీ లభించదు .శంకరులు "అహం బ్రహ్మస్మి" అన్నారు. వెంటనే శిష్యులు కూడా "అహం బ్రహ్మస్మి" అన్నారు. మరి కొందరు అహంకారులు "అహం పరబ్రహ్మస్మి" అన్నారు.


ఇంకా కొందరు అహంకారులు "అహం పరాత్పర బ్రహ్మస్మి" అన్నారు. అనగా శంకరులు నేను బ్రహ్మము అనగా కొందరు శిష్యులు నేను బ్రహ్మమునే అనియు, మరి కొందరు శిష్యులు నేను బ్రహ్మము కన్న అధికమైన పరబ్రహ్మము అనియు, నేను పర బ్రహ్మము కన్న ఇంకా అధికమగు పరాత్పర బ్రహ్మమనియు అన్నారు. బ్రహ్మమగు శంకరులు చెప్పిన విషయాన్నిఎవరూ గ్రహించలేక పోయారు! ఈ తత్వసారాన్ని తెలుసుకోవాలంటే అహంకారాన్ని పూర్తిగా వదలివేయాలి! చాలా మంది అహంకారం, గర్వం ఒకటే అని అనుకుంటారు . గర్వం వేరు, అహంకారం వేరు. 'అహం' అన్నది 'నేను' అనే వ్యక్తిత్వ భావన ఎక్కువైతే వచ్చేది.


'నేను' కు మూలంలోకి వెళ్ళితే తప్ప 'అహం' అసలు స్వభావం తెలియదు.


' అహం బ్రహ్మస్మి ' అన్నారు పెద్దలు.' అహం ' అంటే 'ఆత్మ' అని వారి భావన. నిర్గుణబ్రహ్మస్థితి కలిగి 'సోహం' మంత్రమును శ్వాస, నిశ్వాసాల ద్వారా నిరంతరము జపించేవారికి ఆత్మతత్త్వము తెలుస్తుందని కొందరి అభిప్రాయం. 'సోహం' అనగా 'అదే నేను' అని అర్థం. 'అహం బ్రహ్మస్మి' అనే మహావాక్యానికి ఇది మంత్రరూపం. ఇది ప్రతివ్యక్తిలోను వారికి తెలియకుండా ఉఛ్వాసలో 'సో' అని, నిశ్వాసలో 'హం' అని నిత్య సాధన జరుగుతుంటుంది. దీన్నే'అజపాగాయత్రి' అని అంటారు.


పూర్వం కణాదుడనే తత్వవేత్త ఉండేవాడు. అతను ప్రతి పదార్థం అణువులతో నిర్మితమై ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు అణువులు విడిపోవడం వల్లే పదార్థం ముక్కలవుతుందని భౌతిక నిజాన్ని ఊహించాడు కానీ అతను కూడా భౌతికతకి వ్యతిరేకమైన ఆత్మని నమ్మాడు. ప్రతి పదార్థంలో ఆత్మ ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు


ఆత్మ కూడా ముక్కలవుతుందని నమ్మాడు. గ్రీక్ తత్వవేత్త ఆరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మాడు.


పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చెయ్యలేము అని సూత్రీకరించాడు. "తానూ, దైవమూ ఒక్కటేనని, అలాంటి ప్రజ్ఞ కలిగినప్పుడు ఆ మనిషి దివ్యాత్మని అనుభవిస్తాడనే " ఆత్మ జ్ఞానాన్ని మహనీయులు కొందరు చెప్పారు..


ప్రతి మనిషిలోను భగవంతుడు కొలువై ఉంటాడు. అందుకే అన్నారు "అహం బ్రహ్మస్మి" అని !కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకుంటారు. సాధన చేసి అంధకారాన్ని పారద్రోలాలి! శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు. ఆత్మ నాశనం కానిదని, శస్త్రం ఏదీ ఛేదించలేనిదని , అగ్ని దహించలేనిదని, నీరు తడపలేనిదని, వాయువు ఆర్పలేనిదని అని వివరించాడు.


అహం అనే మాటని "నేను" గా అనువదిస్తే వచ్చే అర్ధం నేను బ్రహ్మని (ఇక్కడ బ్రహ్మ అనే మాట త్రిమూర్తుల్లో బ్రహ్మ కాదు, పరమ చైతన్యం) అని అర్ధం! కాబట్టి ప్రతి ప్రాణి ఆ చైతన్యమే! దేవుడు మనలోనే ఉన్నాడు, మనం దేవుడిలో ఉన్నాం. ఆ దివ్య చైతన్యంలో మనం కూడా భాగం అవ్వటం గురించి సాధన చేయాలి.


ఆత్మ ఒక్కటే. అది పరిమితమైతే అహంకరణం, పరిమితం కానప్పుడు అది అనంతము, సత్యమూనూ అని శ్రీ రమణులు చెప్పారు. ''నేనెవ్వరు?'' అన్న విచారణా మార్గం సాధకులకు తెలియాలి. శివుడికి లింగభేదం లేదు. తనలో అటువంటి భేదాన్ని సృష్టించబోయిన మన్మధుడిని దహించాడు. కాముడిని జయించాడు. శివుడు అవసరమైతే విషం పుచ్చుకుంటాడు. సన్యాసిగా మన్మధుడిని కాల్చినవాడే, పార్వతిని వివాహమాడి


సంసారి అయ్యాడు.


మన్మధుడిని మళ్ళీ బ్రతికించాడు. ఈ భిన్న తత్వాల ఏకత్వమే అర్థనారీశ్వర తత్వం. శివుడు తన దేహాన్ని (ప్రకృతిని) ఆలిగా చేసుకున్నాడు. శివపార్వతుల (దేహత్మల) కలయికే మానవుడు. అంతా నేనే అయినపుడు, ఇతరులను హింసించడమంటే, నన్ను నేను హింసించుకోవడమే అవుతుంది!


పూర్ణ మదం: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే

పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమే వా వశిష్యతే. 


సాధనాత్ సాధ్య తే సర్వం

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సమస్యకు

 *పూత రేకులc దిన్న వెంటనే పుల్లనైన వటందురే* 

ఈ సమస్యకు నా పూరణ. 


"చేతగాదనె వండివార్చను"-చిట్టి చెప్పెను చిన్నగా


మూత బెట్టిన యట్ట డబ్బను ముందు నుంచెను మేతకై


పాత బడ్డవి మాసమయ్యెను పంచుకొన్నవి యందరున్


పూతరేకులc దిన్న వెంటనే పుల్లనైన వటందురే.


అల్వాల లక్ష్మణ మూర్తి.

మనసుండగ మార్గంబులు

 *2165*

*కం*

మనసుండగ మార్గంబులు

ననేకములనుండు నిలను నందుత్తమమున్

కనుగొని నడయంగవలయు

పనులను నెరవేర్చనెంచ పదపడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనసుంటే అనేక మార్గములు దొరుకుతాయి,పనులను నెరవేర్చే ఆసక్తి గలవారు అందులోని గొప్ప (మంచి) మార్గము ను గుర్తించి నడవవలెను(ముందు కు సాగవలెను).

*సందేశం*:-- పనిచేసే ఆసక్తి ఉన్న వారికి అనేక మార్గాలు ఉంటాయి, అందులో అనువైన మంచి మార్గమును ఎంచుకొని పని నెరవేర్చవచ్చు. మనసుంటే మార్గములనేకములుండును. అంటే మనస్సే ప్రధానం.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మనసుండగ మార్గంబులు

 *2165*

*కం*

మనసుండగ మార్గంబులు

ననేకములనుండు నిలను నందుత్తమమున్

కనుగొని నడయంగవలయు

పనులను నెరవేర్చనెంచ పదపడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనసుంటే అనేక మార్గములు దొరుకుతాయి,పనులను నెరవేర్చే ఆసక్తి గలవారు అందులోని గొప్ప (మంచి) మార్గము ను గుర్తించి నడవవలెను(ముందు కు సాగవలెను).

*సందేశం*:-- పనిచేసే ఆసక్తి ఉన్న వారికి అనేక మార్గాలు ఉంటాయి, అందులో అనువైన మంచి మార్గమును ఎంచుకొని పని నెరవేర్చవచ్చు. మనసుంటే మార్గములనేకములుండును. అంటే మనస్సే ప్రధానం.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కృతజ్ఞత

 🍃🌸🍃 *కృతజ్ఞత*


“కృతజ్ఞత ”అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచిపోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, ఏదో ఒక సహాయం మనకు అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. 


మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే ఉదారులు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృజ్ఞత అనేది నాగరక సంస్కారం. కృతఘ్నత అనాగరక లక్షణం.


వాల్మీకి రాముణ్ణి వర్ణిస్తూ “ధర్మజ్ఞశ్చ , కృతజ్ఞశ్చ” అన్నాడు. సీతమ్మను అపహరించుకొనిపోతున్న రావణునితో పోరాడి ,ఆ సమాచారాన్ని రామునికి చెప్పి ప్రాణాలు కోల్పోయిన జటాయువుకు రాముడు కృతజ్ఞతతో అంతిమ సంస్కారం చేశాడు. 


రావణసంహారంలో తనకు తోడ్పడిన వానరులకోసం - ఈ వానరులు ఎక్కడ ఉంటే అక్కడ త్రికాలాలలోనూ మధురఫలాలను ఇచ్చే వృక్షాలు ఉండేటట్లు, అక్కడి నదులలో నిరంతరం స్వాదు జలం ప్రవహిస్తూ ఉండేటట్లు వరం ఇవ్వ వలసిందిగా రాముడు ఇంద్రుణ్ణి కోరాడు.ఇదీ ఆయన కృతజ్ఞతా లక్షణం.


మహా భారతంలో - దగ్ధమైన లక్క గృహంలోంచి ప్రాణాలతో బయటపడి, ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో, తన కుమారులతో తలదాచుకుంటున్నకుంతి , తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణునకు ఒక కష్టదశ సంభవించగా, అతనికి ప్రత్యుపకారం చేయటం తన ధర్మమని భావించిన సందర్భంలో - “ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం” అంటుంది.


“ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం” – అనే చందంగా కాకుండా, మన ఉనికికి , ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి , విధివశాత్తూ ఒక కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే -అతనియందు సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతఘ్నత ఔతుంది. ఈ విషయాన్ని మహాభారతం ఆనుశాసనిక పర్వంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఒక కథారూపంలో ధర్మరాజుకు చెప్పాడు.


ఒక బోయవాడు వేటకు వెళ్ళి "ఘనతర విషదగ్ధ శరం" తో ఒక మృగాన్ని కొట్టబోయాడు. అది గురి తప్పి ఒక చెట్టును తాకింది. పువ్వులతో, కాయలతో పచ్చగా ఉన్న ఆవృక్షం విష శరాఘాతం వల్ల నిలువునా శుష్కమైపోయింది. ఆ చెట్టే ఆశ్రయంగా ,దానితొర్రలో నివాసముంటున్న ఒక మహాశుకం దానిని వదలలేక దానిమీదనే ఉండిపోయింది. 


దీనిని గమనించిన ఇంద్రుడు మానుషరూపంలో దాని దగ్గరకు వెళ్ళి –

"ఓ కీరమా! ఈ వృక్షం బెండువారిపోయింది. ఫలసంపదగల అనేక ఇతర వృక్షాలు ఈ అరణ్యంలో ఉండగా, ఇంకా దీనినే అంటిపెట్టుకున్నావెందుకు?" అని అడిగాడు.


అపుడాశుకం "ఈ చెట్టు తాను మధుర ఫలాలతో నిండి ఉన్న సమయంలో నాకు ఆశ్రయం ఇచ్చింది.ఈ వేళ ఇది ఎండిపోయిందని నేను దీనిని వదలి వెళ్ళిపోవటం కృతఘ్నత కాదా అనిమిషనాథా!" అంది. తాను మానుషరూపంలో వచ్చినా "పురాకృత సంజనిత విశేషము" చేతనే ఈ మహా శుకం తనను ఇంద్రునిగా పోల్చుకోగలిగిందని ఆశ్చర్య పోయి - "నీ మాటలకు మెచ్చాను, నీకేంకావాలో కోరుకో" అన్నాడు ఇంద్రుడు.


అపుడామహాశుకం "ఈ వృక్షానికి మేలుచెయ్యి చాలు" అంది. ఇంద్రుడు సంతోషించి అమృత సేచనంతో ఆ వృక్షానికి పూర్వం కంటే ఎక్కువ శోభను , ఫలసంపదను కలుగజేశాడు.

ఈ కథవల్ల ఉత్తములైన ఆశ్రితులు – ఆశ్రయ దాత క్షేమాన్ని కోరుకోవాలనీ , కృతజ్ఞత ఉత్తమ లక్షణమనీ తెలుస్తోంది. సజ్జనులు ఇతరులు తమకు చేసిన ఉపకారాన్ని మరచిపోరు..

ప్రతిగా స్పందించనపుడు

 *2164*

*కం*

ప్రతిగా స్పందించనపుడు

నతిగా వెంబడగవద్దు నతివల కెపుడున్.

మతిగల సుదతులు నిన్నట

నతమొందించగ తరిగొను నవనిన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ప్రతి స్పందన కనబరచని స్త్రీలకు అతి గా వెంటబడవద్దు. నీపై మనస్సు ఉన్న స్త్రీలు నిన్నే తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించెదరు.

*సందేశం*:-- నీ ప్రయత్నాలు పట్టించుకొనని ఆడవారికి నీవంటే ఇష్టం లేదని తెలుసుకొనవలెను. వారి వెంటబడటం వలన లోకువగుదువు. నీవంటే ఇష్టం ఉన్న స్త్రీలు నీ చూపు చాలునని,అదే గొప్పగా భావిస్తారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సజ్జనులకీగుణములు

 శు భో ద యం🙏


సజ్జనులకీగుణములు

  ప్రకృతి జన్యములే!!


"ఆపదలందుధైర్యగుణ మంచిత సంపదలందుదాల్మియున్

భూపసభాంతరమ్మునను బుష్కలవాక్చతురత్వ మాజిబాహాపటుశక్తియున్ యశమునందనురక్తియు

విద్యయందు వాం

ఛాపటుశక్తియువ్ బ్రకృతి జన్యగుణంబులు సజ్జనాళికిన్;

-సజ్జనపధ్ధతి-భర్తృహరి సుభాషితములు.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - ఆషాడ మాసం - శుక్ల పక్షం -‌ అష్టమి -హస్త -‌‌ గురు వాసరే* (03.07.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

_(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)_

 

విషాదే మనః కార్యం 

విషాదో దోషవత్తమః 

విషాదో హన్తి పురుషం 

బాలం క్రుద్ధ ఇవోరగః

(4.64.11)


*అర్థం:*

నిరుత్సాహం పనికి రాదు, అది అతి పెద్ద లోపం. కోపంతో ఉన్న పాము చిన్న పిల్లవాడిని చంపినట్లు ఆ నిరుత్సాహం ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది.


శ్రీ ప్రయాగ రంగదాసు గారి మథుర గీతంతో శుభోదయం.


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః 


శుభ గురువారం.

గుండె నిండా ఆకారమై..‌‌.!

 *గుండె నిండా ఆకారమై..‌‌.!!*


ఎక్కడ నీకోసం ఎదురు చూడాలి

నీ ముద్దు మాటల మైకంలో 

తనువును ముంచి తేల్చాలి

మనసుకు సుఖస్నానం చేయించాలి...


నీ వొస్తావని ఆశతో నిలుచున్నాను 

నడిరేయి స్వప్నంలా తలుచుకుంటూ

మధుర స్మృతులు ఆస్వాదిస్తూ 

చెట్టు కొమ్మల్లో కోయిలలా కూర్చున్నాను...


రేయి మరిచిన కళ్ళలో నిస్పృహలు

నీటి మీద రూపం అదృశ్యమైతే

వెన్నెల వర్షంలో తడుస్తూ 

చీకట్లో నీ రూపాన్ని ఎలా వెతకాలి..


మది నిండా నిండిన నీ అందం

నింగి సంద్రంలో వెలసిన చందనం

మరుపురాని గీతమై బాధిస్తుంటే

తనువులో నీకై అలజడి పెరుగుతుంది...


ప్రేమ గీతానికి రెక్కలు తొడిగి

చిత్తు కాగితాన్ని నింగికి విసిరితే 

మబ్బుల్లో చిక్కుకొని విలపించే

విరహం వికటించి కవితలై కనిపించే..


కుంచె తీసి గీశాను నీ రూపం 

ఊహకు అందని అపురూపంగా 

వర్ణంలో సువర్ణ మై మెరుస్తూ 

గుండె నిండా ఆకారమై నిలిచావు..


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఎనిమిదవ అధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:


పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా 

యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ (22)


యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః 

ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ (23)


అర్జునా.. సమస్తభూతాలనూ తనలో ఇముడ్చుకుని, సకలలోకాలలో వ్యాపించి వున్న పరమాత్మను అచంచలమైన భక్తివల్లనే పొందవచ్చు. భరతవీరా.. యోగులు ఏ సమయంలో మరణిస్తే మళ్ళీ జన్మించరో, ఏ వేళ దేహం విడిచిపెడితే పునర్జన్మ పొందుతారో చెబుతాను విను.

శుశ్రూష చేసి పొందవలెను.*

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో|| *యథా ఖనన్ ఖనిత్రేణ*

           *నరో వార్యధిగచ్ఛతి|*

           *తథా గురుగతాం విద్యాం*

           *శుశ్రూషురధిగచ్ఛతి||*


తా|| *మనుష్యుడెట్లు గునపముతో త్రవ్వి భూమి నుండి నీరు పొందునో అట్లే గురువుయందున్న విద్యను ఆ గురువుకి శుశ్రూష చేసి పొందవలెను.*

     

 ✍️🌸🌹💐🙏

⚜ శ్రీ గిరిజాత్మజ్ గణపతి ఆలయం

 🕉 మన గుడి : నెం 1161


⚜ మహారాష్ట్ర : లెన్యాద్రి


⚜  శ్రీ గిరిజాత్మజ్ గణపతి ఆలయం



💠 గిరిజాత్మజ్ అష్టవినాయక ఆలయం బౌద్ధ గుహ ప్రాంతంలో నిర్మించబడిన అష్టవినాయక ఆలయంలోని ఏకైక ఆలయం. 

ఈ గుహలను గణేష్ గుఫా అని కూడా పిలుస్తారు. ఇక్కడ, గణేష్‌ను గిరిజాత్మజ్‌గా పూజిస్తారు. (పార్వతి దేవి కుమారుడు)


💠 విగ్రహం యొక్క 'గిరిజత్మజ్' పేరు 'గిరిజ' అంటే దేవి పార్వతి మరియు 'ఆత్మజ్' అంటే కుమారుడు అని వస్తుంది. 

మరాఠీలో 'లేని' అని అర్థం వచ్చే గుహలు గుహలకు లెన్యాద్రి అనే పేరును పొందాయి. కాబట్టి 'గిరిజత్మజ్ లేన్యాద్రి గణపతి' అనే పేరు వచ్చింది. 


💠 గణపత్య గ్రంథం గణేశ పురాణం ప్రకారం , గణేశుడు ఆరు చేతులు మరియు తెల్లటి రంగు కలిగిన మయూరేశ్వరుడుగా అవతరించాడు. అతని వాహనం నెమలి. సింధు అనే రాక్షసుడిని చంపే ఉద్దేశ్యంతో త్రేతా యుగంలో శివుడు మరియు పార్వతికి జన్మించాడు . 


💠 ఒకసారి పార్వతి (గిరిజ) తన భర్త శివుడిని ఎవరి గురించి ధ్యానం చేస్తున్నావని అడిగింది. 

అతను "సమస్త విశ్వానికి ఆధారమైన" గణేశుడి గురించి ధ్యానం చేస్తున్నానని చెప్పి, "గం" అనే గణేశ మంత్రంతో పార్వతిని చెప్పాడు.


💠 ఒక కొడుకు కావాలని కోరుకుని, పార్వతి లెన్యాద్రిలో 12 సంవత్సరాలు గణేశుడి గురించి ధ్యానం చేస్తూ తపస్సు చేసింది. ఆమె తపస్సుకు సంతోషించిన గణేశుడు, తాను ఆమెకు కొడుకుగా జన్మిస్తానని వరం ఇచ్చాడు. దీని ప్రకారం, హిందూ నెల భద్రపద ( గణేశ చతుర్థి రోజు)పార్వతి గణేశుడి మట్టి విగ్రహాన్ని పూజించింది, అది సజీవంగా వచ్చింది. 

ఆ విధంగా, గణేశుడు పార్వతికి లెన్యాద్రిలో జన్మించాడు. 

తరువాత, శివుడు అతనికి గుణేశ అని పేరు పెట్టాడు. 


💠 15 సంవత్సరాలు గుణేశుడు లెన్యాద్రిలో పెరిగాడు. గుణేశుడి చేతిలో తన మరణం జరుగుతుందని తెలిసిన సింధు, గుణేశుడిని చంపడానికి క్రూరుడు, బాలాసురుడు, వ్యోమాసురుడు, క్షేముడు, కుశలుడు మరియు మరెన్నో రాక్షసులను పంపాడు, కానీ వారందరినీ అతనిచే చంపబడ్డరూ. 


💠 ఆరేళ్ల వయసులో, విశ్వకర్మ గుణేశుడిని పూజించి, అతనికి పాశ (పాశం), పరశువు (గొడ్డలి), అంకుశం (కొన) మరియు పద్మ (కమలం) అనే ఆయుధాలను ప్రసాదించాడు. 

ఒకసారి, చిన్న గుణేశుడు మామిడి చెట్టు నుండి గుడ్డును కొట్టాడు, దాని నుండి నెమలి ఉద్భవించింది. గుణేశుడు నెమలిని ఎక్కి మయూరేశ్వరుడు అనే పేరును స్వీకరించాడు. 

తరువాత మయూరేశ్వరుడు సింధు మరియు అతని సైన్యాధిపతులను మోర్గావ్ వద్ద చంపాడు ,

అందువల్ల లెన్యాద్రిని పవిత్ర స్థలంగా భావిస్తారు.


 💠 ఈ ఆలయం ఒకే రాతి కొండ నుండి చెక్కబడింది, దీనికి పర్వతంలోని 18 బౌద్ధ గుహలలో, గిరిజాత్మజ్ గణపతి ఆలయం 7వ గుహలో ఉంది. వీటిని గణేష్-లేని అని కూడా పిలుస్తారు.


💠 ఈ ఆలయంలో ఎటువంటి సహాయక స్తంభాలు లేని విశాలమైన హాలు ఉంది. ఆలయ హాలు 53 అడుగుల పొడవు, 51 అడుగుల వెడల్పు మరియు 7 అడుగుల ఎత్తు ఉంటుంది.


💠 లేన్యాద్రి కుకాడి నది వాయువ్య ఒడ్డున ఉంది.  ప్రస్తుత పేరు 'లెన్యాద్రి' అంటే 'పర్వత గుహ' అని అర్థం.

 ఇది మరాఠీలో 'లెనా' అంటే 'గుహ' అని మరియు సంస్కృతంలో 'అద్రి' అంటే 'పర్వతం' లేదా 'రాయి' అని అర్థం. దీనిని జీరాపూర్ మరియు లేఖన్ పర్వత్ ('లేఖన్ పర్వతం') అని కూడా పిలుస్తారు.



💠 ఇక్కడ గణేశుడి  తొండం ఎడమ వైపుకు తిప్పి, తూర్పు ముఖంగా, అతని కన్నులలో ఒకటి కనిపించేలా చూడవచ్చు. ఈ చిహ్నం సిందూరంతో కప్పబడి ఉంది మరియు గుహ యొక్క రాతి గోడపై నేరుగా రూపొందించబడింది.



💠 శ్రీ గిరిజత్మజ్ లేన్యాద్రి గణపతి గుహలలో చెక్కబడిన ఏకైక గణేష్ ఆలయం. లెన్యాద్రి ఒక పురాతన పురాణాన్ని కలిగి ఉంది, ఇది పాండవులు వారి 13వ సంవత్సర వనవాసంలో అజ్ఞాతవాసంలో నివసించినప్పుడు, వారు ఈ గుహలను కేవలం ఒక రాత్రిలోనే చెక్కారని చెబుతుంది. 



💠 ఆలయ నిర్మాణం : 

శ్రీ వరదవినాయక లేన్యాద్రి ఆలయం ఒకే రాతి కొండ నుండి చెక్కబడింది. ఇది దాదాపు 100 అడుగులు లేదా 30 మీటర్ల ఎత్తు ఉంటుంది. 

ఆలయానికి చేరుకోవడానికి 300+ మెట్లు ఎక్కాలి. ఇది బౌద్ధ గుహలలో భాగం కాబట్టి, భూభాగం కొంచెం నిటారుగా ఉంటుంది.


💠 గిరిజాత్మజ్ గణపతి ఆలయంలో గణేశుడితో సంబంధం ఉన్న సాధారణ పండుగలు జరుపుకుంటారు: 

గణేష్ జయంతి మరియు గణేష్ చతుర్థి .


💠 గణేష్ జయంతి సమయంలో, ఆలయం పువ్వులు మరియు దీపాలతో అలంకరించబడుతుంది. 

గణేష్ జయంతిలో గణేష్ దర్శనం కోసం లక్షలాది మంది ప్రజలు ఇక్కడకు వస్తారు



💠 పూణే-లేన్యాద్రి దూరం NH60 హైవే ద్వారా 96 కి.మీ (2 గం 45 నిమి). 


రచన

©️ Santosh Kumar