4, జులై 2025, శుక్రవారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🍁శనివారం 5 జూలై 2025🍁*

``

           *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

     *వాల్మీకి రామాయణం*               

            *89వ భాగం*

```

సుగ్రీవుడు అలా అనగానే ఇన్ని కోట్ల వానరాలు లంక యొక్క అంతఃపురాల మీద పడిపోయి రావణ అంతఃపురంతో సహా అన్ని ఇళ్ళని అగ్నికి ఆహుతి చేశాయి. ఆ ఇళ్ళల్లో ఉన్న రకరకాల వస్త్రాలు, బంగారు పాత్రలు, ముత్యాలు, రత్నాలు మొదలైనవన్నీ కాలిపోయాయి. బాలురు, వృద్ధులు మినహాయించి లంకలో ఉన్న మిగిలిన మూలబలంలోని రాక్షసులు చాలామంది కాలిపోయారు. 


ఇదేసమయంలో రామచంద్రమూర్తి క్రుద్ధుడై ధనుష్టంకారం చేశాడు. ఒకపక్క ధనుష్టంకారం, ఒకపక్క వానర ఘోష, ఒకపక్క రాక్షసుల అరుపులు, ఒకపక్క రామ బాణ పరంపర వచ్చి లంకా పట్టణ ప్రాసాదముల మీద పడిపోతోంది. 


ఎక్కడా చూసినా అరుపులతో పరిస్థితి ఘోరంగా ఉంది.

అప్పుడు రావణుడు కుంభకర్ణుడి కుమారులైన కుంభుడు, నికుంభుడిని యుద్ధానికి పంపాడు. వాళ్ళతో పాటు ప్రజంఘుడు, మకరాక్షుడు అనే తన కుమారుడిని యుద్ధానికి పంపాడు.


అప్పుడు సుగ్రీవుడు కుంభుడిని, హనుమంతుడు నికుంభుడిని, అంగదుడు ప్రజంఘుడిని, రాముడు మకరాక్షుడిని సంహరించారు.


ఈ వార్త విన్న రావణుడు విశేషమైన శోకాన్ని పొంది, మళ్ళీ ఇంద్రజిత్ ని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు.


ఆ ఇంద్రజిత్ మళ్ళీ అదృశ్యమయిపోయి బాణ పరంపరతో వానరాలని కొట్టడం మొదలుపెట్టాడు.


అప్పుడు లక్ష్మణుడు రాముడితో…  

“అన్నయ్యా! వీడు ఎన్నోసార్లు యుద్ధానికి వస్తున్నాడు. నువ్వు నాకు అనుమతిని ఇవ్వు, సమస్త రాక్షసజాతి నశించిపోవాలని సంకల్పించి, అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాను” అన్నాడు.


రాముడన్నాడు…  

“పారిపోతున్నవాడిని, ప్రమత్తుడై ఉన్నవాడిని, కనపడకుండా మాయా యుద్ధం చేస్తున్నవాడిని, వెన్ను చూపి పారిపోతున్నవాడిని, శరణాగతి చేసినవాడిని కొట్టకూడదు. పైగా బ్రహ్మాస్త్రం వేస్తే సమస్త భూమండలం క్షోభిస్తుంది. అందుకని ఒక్కడిని సంహరించడం కోసం అలాంటి అస్త్ర ప్రయోగం చెయ్యకూడదు. మనం అదును చూసి, వాడు ఎటువైపు తిరుగుతున్నాడో, బాణాలు ఎటువైపు నుండి వస్తున్నాయో చాలా నిశితంగా పరిశీలించు. ఇవ్వాళ వాడు ఎక్కడో అక్కడ దొరకకపోడు, అప్పుడు తీవ్రమైన వేగం కలిగిన బాణములతో ఇంద్రజిత్ ని కొట్టి భూమి మీద పడేస్తాను. లక్ష్మణా! ఇది నా ప్రతిజ్ఞ" అన్నాడు.


రాముడి మాటలను విన్న ఇంద్రజిత్ అనుకున్నాడు.. 'ఈ రామలక్ష్మణులు నన్ను కనిపెట్టి కొట్టడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి నేను ఏదో ఒక మోసం చేసి, రామలక్ష్మణుల దృష్టిని నా నుంచి మరల్చాలి' అనుకుని ఆలోచించాడు. 


అప్పుడాయన వెంటనే సీతమ్మని మాయ చేత సృష్టించి తన రథంలో కూర్చోపెట్టాడు.


ఆయనకి ఎదురుగా హనుమంతుడు ఒక పర్వతాన్ని పట్టుకొని వస్తున్నాడు. అప్పుడా ఇంద్రజిత్ తన రథంలో ఉన్న మాయా సీత చెంపల మీద ఎడాపెడా కొట్టాడు. వాడు అలా కొడుతుంటే ఆవిడ… 'హా రామా, హా రామా' అని ఏడుస్తోంది. 


అలా ఏడుస్తున్న సీతమ్మని చూసిన హనుమంతుడు తట్టుకోలేక ఆ పర్వతాన్ని కిందపడేసి, ఏడుస్తూ…  

“దుర్మార్గుడా, ఆమె మహా పతివ్రత, రామ కాంత. సీతమ్మని అలా కొడతావా, నాశనమయిపోతావురా నువ్వు, నేను, సుగ్రీవుడు నిన్ను విడిచిపెట్టము, నీ శిరస్సు గిల్లేస్తాను. సీతమ్మని వదులు” అని హనుమంతుడు బాధతో ఏడుస్తూ అరిచాడు.


అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు… “ఆమె స్త్రీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కాని మాకు దుఃఖాన్ని కల్పించింది కాబట్టి ఈమెని మాత్రం నేను విడిచిపెట్టను" అని చెప్పి ఒక ఖడ్గాన్ని తీసుకొని ఆమె శరీరాన్ని చీరేశాడు. అప్పుడా మాయా సీత మరణించి ఆ రథంలో పడిపోయింది. తరువాత ఇంద్రజిత్ ఆ రథంతో వెళ్ళిపోయాడు.


ఎప్పుడైతే సీతమ్మ పడిపోయిందో అప్పుడు హనుమంతుడు యుద్ధం మానేసి, ఏడుస్తూ, పెద్ద పెద్ద కేకలు వేస్తూ… “ఇంకా ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తారురా. ఏ తల్లిని రక్షించడానికి యుద్ధానికి వచ్చామో ఆ తల్లిని సంహరించాడు. ఇంక నేను యుద్ధం చెయ్యను" అని ఏడుస్తూ రాముడి దగ్గరికి వెళ్ళి… 

“రామా! దుర్మార్గుడైన ఇంద్రజిత్ వానరులందరూ చూస్తుండగా సీతమ్మని తీసుకొచ్చి, సంహరించి తీసుకెళ్ళిపోయాడు. ఇంక సీతమ్మ లేదు" అని చెప్పాడు.


ఈ మాటలు విన్న రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు.

తరువాత వాళ్ళు రాముడి ముఖం మీద కొన్ని నీళ్ళు పోసి ఆయనని లేపారు.


అప్పుడు లక్ష్మణుడు అన్నాడు… 

“అన్నయ్యా! నువ్వు ‘ధర్మము ధర్మము ధర్మము’ అని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు. ఆ ధర్మం నీకు ఏ ఫలితాన్ని ఇచ్చింది. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల రాజ్య భ్రష్ట్రుడివి అయ్యావు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల తండ్రిగారు మరణించారు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల సీతమ్మ అపహరింపబడింది, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల జటాయువు మరణించాడు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల 14 సంవత్సరాలుగా అరణ్యాలలో తిరుగుతున్నావు. ధర్మాన్ని విడిచిపెట్టిన రావణుడు అంతఃపురంలో కులుకుతున్నాడు, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అధర్మంతో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు, ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు. ఇంకా ధర్మము ధర్మము అని ఎందుకంటావు అన్నయ్యా, ఆ ధర్మాన్ని విడిచిపెట్టు. మనం కూడా అధర్మాన్నే స్వీకరిద్దాము” అన్నాడు. 


వెంటనే విభీషణుడు పరుగు పరుగున వచ్చి… “ఎంతమాటన్నావు లక్ష్మణా, సీతమ్మని ఇంద్రజిత్ సంహరిస్తే రావణుడు ఊరుకుంటాడనుకున్నావా? ఎంతోమంది చెప్పినా సీతమ్మని విడిచిపెట్టనివాడు ఇంద్రజిత్ సీతమ్మని చంపితే ఊరుకుంటాడా. ఆ ఇంద్రజిత్ మహా మాయావి, మీరు అంతలోనే వాడి మాయ మరిచిపోయారు. వాడు మాయా సీతని సంహరించి తీసుకుపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా. పెద్ద ఊడలు దిగిపోయిన మర్రి చెట్టు ఒకటి ఉంది, దాని చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. వాడు అక్కడికి వెళ్ళి నికుంభిలా హోమం చేస్తాడు. అక్కడ వాడు నికుంభిలా దేవతని ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి, వాడి గుర్రాల మీద, ఆయుధముల మీద ఆ అక్షతలని చల్లుకొని యుద్ధ రంగంలోకి వస్తే దేవేంద్రుడు కూడా వాడితో యుద్ధం చెయ్యలేడు. సీతమ్మ చనిపోయింది అనుకుని మీరు ఇక్కడ ఏడుస్తున్నారు, కాని వాడు అక్కడ హోమం చేస్తుంటాడు. రామా! నన్ను అనుగ్రహించు, నాతో లక్ష్మణుడిని తీసుకెళ్ళి ఆ హోమం పూర్తవకుండానే వాడిని సంహరిస్తాను” అన్నాడు.


అప్పుడు రాముడు లక్ష్మణుడిని ఆశీర్వదించి, హనుమ మొదలైన వీరుల్ని సాయంగా పంపారు.


విభీషణుడు లక్ష్మణుడిని ఇంద్రజిత్ హోమం చేసుకునే చోటుకి తీసుకెళ్ళాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఆ హోమం చెయ్యడం కోసం సిద్ధపడుతున్నాడు. తన హోమాన్ని ఎవరూ పాడుచెయ్యకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు.


అప్పుడు విభీషణుడు… “లక్ష్మణా! నువ్వు ఒకపక్క నుంచి సైన్యాన్ని బాణాలతో కొట్టి కాకావికలం చెయ్యి, అప్పుడు ఇంద్రజిత్ కనపడతాడు. అదే సమయంలో హనుమ వెళ్ళి రాక్షస సైన్యాన్ని తుదముట్టించెయ్యాలి. అంతమంది అక్కడ పడిపోతుంటే వాడు అక్కడ కూర్చుని హోమం చెయ్యలేడు. కాబట్టి రథం ఎక్కి వస్తాడు, అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి” అన్నాడు.


వెంటనే లక్ష్మణుడు బాణ ప్రయోగం చేశాడు. అప్పుడా సైన్యం పక్కకి తప్పుకుంది, వాళ్ళు పక్కకి తప్పుకోగానే ఆ మర్రి చెట్టు కనపడింది. వెంటనే హనుమంతుడు అరివీరభయంకరుడై ఆ రాక్షసులని మర్దించేశాడు. హనుమ ప్రతాపం ముందు ఆ రాక్షస సైన్యం నిలబడలేక పెద్ద హాహాకారాలు చేశారు. 


ఆ హాహాకారాలు విన్న ఇంద్రజిత్ హోమాన్ని ఆపి 'ముందు హనుమంతుడిని సంహరించి, అప్పుడు హోమం చేస్తాను' అని అనుకొని రథం ఎక్కాడు. 


అప్పుడాయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. 


ఆ టంకారానికి ఇంద్రజిత్ లక్ష్మణుడి వైపు చూశాడు.


అప్పుడు లక్ష్మణుడు.. “దుర్మార్గుడా, హనుమతో యుద్ధం ఎందుకు, నీతో యుద్ధం చెయ్యడానికి నేను వచ్చాను. పౌరుషం ఉంటే నాతో యుద్ధం చెయ్యి” అన్నాడు.


అప్పుడు ఇంద్రజిత్ …

“ఇంతకముందు నిన్ను రెండు మూడుసార్లు కొట్టాను, అయినా బుద్ధి లేకుండా మళ్ళీ వచ్చావు. చూడు నీకు ఎటువంటి యుద్ధం చూపిస్తానో ఇవ్వాళ” అని ఇద్దరూ యుద్ధం మొదలుపెట్టారు.


లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుడిని ఇంద్రజిత్ చూసి అన్నాడు… “నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావు, నువ్వు స్వయానా నా తండ్రికి తమ్ముడివి, నాకు పినతండ్రివి. నీ కొడుకు వరసైన నన్ను చంపడానికి ఇవ్వాళ శత్రువులతో చేతులు కలిపావే, నీకు ఇలా చెయ్యడానికి సిగ్గుగా లేదా. శత్రువులతో చేతులు కలిపి తనవారిని చంపినవాడు చివరికి ఆ శత్రువుల చేతులలోనే చనిపోతాడు” అన్నాడు. 


విభీషణుడు అన్నాడు… “నీ తండ్రియందు, నీయందు పాపం ఉంది కనుక నేను మిమ్మల్ని విడిచి ధర్మాత్ముడైన రాముడి పక్కకి వచ్చాను” అన్నాడు.


అప్పుడు ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. ఇద్దరూ ఒకరిని ఒకరు బాణాలతో కొట్టుకున్నారు. లక్ష్మణుడు వేసిన బాణాలకి ఇంద్రజిత్ యొక్క ధనుస్సు ముక్కలయిపోయింది. తరువాత ఇంద్రజిత్ బాణాలతో లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు. ఇద్దరూ సింహాలలా యుద్ధం చేశారు. విభీషణుడు ఆ రాక్షసుల మీద బాణాలని వేసి వాళ్ళని సంహరించాడు. ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆఖరికి ఇంద్రజిత్ యొక్క సారధిని లక్ష్మణుడు కొట్టాడు. అప్పుడా ఇంద్రజిత్ ఒక చేతితో సారధ్యం చేస్తూ లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. అప్పుడు నలుగురు వానర వీరులు ఆ రథం యొక్క గుర్రాలని కిందకి లాగేసి ఆ రథాన్ని నాశనం చేశారు.


లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలని వేసినా ఇంద్రజిత్ సంహరింపబడకపోయేసరికి విభీషణుడు అన్నాడు… “ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రజిత్ ని సంహరించు” అన్నాడు.

```

*ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది*

*పౌరుషే చా అప్రతిద్వంద్వః తదైనం జహి రావణిమ్*

```

అప్పుడు లక్ష్మణుడు రెండు కోరలు కలిగిన సర్పంలాంటి ఒక బాణాన్ని తీసి, వింటినారికి తొడిగి “మా అన్న రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, దశరథుడి కొడుకే అయితే, పౌరుషం ఉన్నవాడే అయితే నా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంది అయిన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక” అని బాణ ప్రయోగం చేశాడు. 


ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్ కంఠానికి తగలగానే ఆయన శిరస్సు శరీరం నుండి విడిపోయి కింద పడిపోయింది. ఇంద్రజిత్ మరణించాడు.```


       *రేపు…90వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

శనివారం🚩* *🌹05 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        *🚩శనివారం🚩*

  *🌹05 జూలై 2025🌹*        

    *దృగ్గణిత పంచాంగం*  

                   

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - శుక్లపక్షం*


*తిథి  : దశమి* సా 06.58 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం   : స్వాతి* రా 07.51 వరకు ఉపరి *విశాఖ*

*యోగం : సిద్ధ* రా 08.36 వరకు ఉపరి *సాధ్య*

*కరణం   : తైతుల* ఉ 05.45 *గరజి* సా 06.58 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ10.30-12.00 సా04.00 - 06.30*

అమృత కాలం  : *ఉ 09.57 - 11.45*

అభిజిత్ కాలం  : *ప 11.46 - 12.38*

*వర్జ్యం          : రా 02.07 - 03.54*

*దుర్ముహూర్తం  : ఉ 05.40 - 07.24*

*రాహు కాలం   : ఉ 08.56 - 10.34*

గుళికకాళం       : *ఉ 05.40 - 07.18*

యమగండం     : *మ 01.50 - 03.28*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 05.47*

సూర్యాస్తమయం :*సా 06.55*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.40 - 08.16*

సంగవ కాలం         :      *08.16 - 10.53*

మధ్యాహ్న కాలం    :     *10.53 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 04.07*

*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ శుద్ధ దశమి*

సాయంకాలం        :  *సా 04.07 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.55*

రాత్రి కాలం           :*రా 08.55 - 11.50*

నిశీధి కాలం          :*రా 11.50 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.12 - 04.56*

--------------------------------------------------

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి*


*🙏శ్రీ వేంకటేశ్వర స్వామి🙏* 

*🔯సహస్రనామ స్తోత్రం*🔯


        *నాగరాజపాలనం*  

       *భోగినాథశాయినం*  

        *నాగవైరిగామినం*  

    *నగారిశత్రుసూదనమ్*  

       *నాగభూషణార్చితం*


*🌹ఓం నమో వేంకటేశాయ🌹*


***************************

   *🍁శ్రీ ఆంజనేయ స్తోత్రం🍁*


      *నమో వాయుపుత్రాయ*  

     *భీమరూపాయధీమతే*

     *నమస్తే రామదూతాయ*  

     *కామరూపాయశ్రీమతే!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🚩🪷🌹🛕🌹🌷🪷🌷🚩

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

పంచ గయలు*

 *పంచ గయలు* 


మన దేశంలో మొత్తం 5 గయలు ఉన్నాయని చెబుతారు. 


*1. శిరోగయ, 2. నాభిగయ, 3. పాదగయ, 4. మాతృగయ, 5. పితృగయ.* 


 1. *శిరోగయ* : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో *“శిరోగయ”* గా వెలసింది. దీనినే బుద్ధగయ అని కూడా అంటారు.


 2. *నాభిగయ* : జాజ్ పూర్, ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను *“నాభిగయ”* అని అంటారు.


 3. *పాదగయ* : పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్‌లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని *“పాదగయ”* అంటారు.


 4. *మాతృగయ* : గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని *“మాతృగయ”* అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కి 33 కి||మి|| దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.


5. *పితృగయ* : బధరీనాథ్, ఉత్తర ప్రదేశ్‌లోని అలకనందా నదీ తీరంలో గల *“బ్రహ్మకపాలం”* అనే ప్రదేశాన్ని *“పితృగయ”* అంటారు.

దండం దశగుణం భవేత్"*

 *"దండం దశగుణం భవేత్"*


దండిస్తే కాని పని జరగదు అనే సందర్భంలో "దండం దశగుణం భవేత్" అంటూంటారు. _"దేవుడికైనా దెబ్బే గురువు"_ అంటే కొడితేగాని పని జరగదు అని భావం. 

కానీ ఈ శ్లోకం పూర్తిగా చూద్దాం.


*విశ్వామిత్రా హి  పశుషు*

*కర్దమేషు జలేషు చ |*

*అంధే తమసి వార్ధక్యే*

*దండం దశగుణం భవేత్ ||*


ఇది శ్లోకం.

 మరి దీనిలోని అర్థం - 

1. వి - పక్షులు, 

2. శ్వా - కుక్కలు, 

3. అమిత్ర - మిత్రులుకానివారు (శత్రువులు), 

4. అహి - పాములు, 

5. పశు - పశువులు, 

6. కర్దమేషు - బురదలో, 

7. జలేషు - నీటిలో, 

8. అంధే - గుడ్డితనంలో,

9. తమసి - చీకటిలో, 

10. వార్ధక్యే - ముసలితనంలో 

దండం - కర్ర,

దశగుణం - 10 గుణాలను, 

భవేత్ - కలిగిస్తుంది. 


అంటే కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపు చేయడానికి, బురదలోను, నీటిలోను, గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలోను ఆపుగా(ఆసరాగా) ఉంటుంది. కావున కర్ర ఈ పది రకాలుగా ఉపయోగపడుతుంది - అని భావం.


~సాహితీనందనం

జెండా రూపశిల్పి

 జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా..


జాతి గుండెల్లో పింగళి వెంకయ్య...!!


జాతి గుండెలో త్రివర్ణమై ఎగురుతూ

తెలుగువాడిగా ఖ్యాతిని పొందుతూ

స్వాతంత్ర్య సమరం లో జెండాగా వెలుగొంది

దేశభక్తికి నిలువెత్తు రూపముగా నిలిచే...


జాతి చేతికి ఘనమైన పతాకం

ప్రతి హృదయములో ఎగురుతుంది ప్రతి క్షణం

మూడు రంగుల ముచ్చట గొలుపుతూ

నింగిలో రెపరెపలాడుతుంది అనుక్షణం..


పింగళి వెంకయ్య మదిలో మెదిలిన రూపం

యావత్ జాతి చేతిలో మెరిసిన కంకణం

గుండె నిండా ధైర్యము నింపే జెండా

చిరునవ్వులతో విశ్వంలో ఎగురుతుంది నిత్యం...


భారతీయుడికి చిహ్నంగా నిలిచింది

ప్రపంచ వేదికలో చిరునామాగా తిరుగుతుంది

స్వాతంత్ర్యానికి గుర్తుగా సగర్వంగా నవ్వుతూ

చేతి పిడికిలి కర్రలో మువ్వర్ణమై తిరుగుతుంది....


జాతి మరిచిపోతున్న మహానేత ఇతను

గుర్తు చేయుట మనందరి బాధ్యత

జాతికి ఆయుధమైన త్రివర్ణం అతను 

దేశ సంగ్రామపు నిజమైన రూపం ఈ కేతనం..


జెండాకిచ్చే గౌరవం రూప శిల్పి 

జాతి కీర్తిని భుజాలపై మోసే దేశభక్తుడు 

జాతి మనుగడలో ఆణిముత్యం 

స్వాతంత్ర్య సమరంలో అసామాన్య విజేత..


జోహార్లు జోహార్లు పింగళి వెంకయ్య

జాతి జెండాలో నిన్ను చూస్తూ మురిసిపోతూ 

నీ ఇచ్చిన ఈ త్రివర్ణం సమైక్యతగా కదులుతూ 

యావత్ దేశం మొత్తం రుణపడి ఉంది నీ త్యాగానికి..


కొప్పుల ప్రసాద్

నంద్యాల

9885066235

నయమొసంగును

 ऊँ!

----

" తేటగీతి..

--

*వి* నయమొసంగును కీర్తిని విస్తృతముగ 

*శా* స్త్రవిజ్ఞానగరిమయు సత్కృతియును 

*లా* తివిధముగనుండిన రక్తిఁబోవు

*క్షి* తిలోప్రతిష్టఁగలుఁగు క్షేమమలర !!! "

----

పోతనార్యుని పద్య మాధురి

: పోతనార్యుని పద్య మాధురి పొందు భాగవతోత్తముల్

లేత కొబ్బరి లౌజు జూసిన, లేచిపోయెదరంతలో,

పోతపోసిన ఖండ చక్కెర పోలు లీలల దేలుచున్

పూతరేకులు తిన్నవెంటనె పుల్లనైనవటందురే 🙏🙏🙏 భూమికాకర్షణ పుష్టిగా గలదని

         తెలిపినందుకొకడు విలువబడసె

శక్తిసూత్రముజూపి జగతినందికొకడు

         శాస్త్రజ్ఞుడైపోయి చాలమెరసె

విద్యుదయస్కాంత వివరములను దెల్పి

         విజ్ఞుడంచొకడిల పేరుపొందె

సృష్టి నీవిడినట్టి చిరమైన శక్తినే

          మరలవెలుపలకు మరలజేసి


రన్న నిజమరయగలేక నవనిజనులు

శాస్త్రవేత్తలె ఘనులన సరియె కనగ

పూర్ణవిధుభాస కోదాడు పురనివాస

పాపనిష్కాస రఘునాథ పరమపురుష

శ్రీకాళహస్తీశ్వరా

 🌻శ్రీకాళహస్తీశ్వరా నమోస్తు🌻


భవదీయ నామంబు ప్రత్యహ మందునన్ 

           భజియించు నుత్తమ భక్తతతికి

దుశ్శకునంబులు దూరంబుగా నుండు 

          గ్రహదోష కష్టముల్ కలుగ కుండు 

శలభంబు లెంతగా సంరంభమున పడ్డ

         కాలెడు ననలమున్ గప్ప గలవె !

అరయ నీ మానవు  లెఱిగియు న్నన్నియున్

         సతతంబు నీసేవ సల్పు కొనియు

పడెడు నిడుముల నెల్లను బాపు కొనక 

కోలు పోయదరేలనో కాల మంత ?

భక్త పాలన శంకరా ! పరమ పురుష !

ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ !             29*



ఈ ప్రాణముల్ నేను కాపాడు కొనుటకు

        నన్య దైవతముల న్నడుగ నెపుడు

నడుగంగ బోయిన న్ననయంబు నీదు పా 

        దార్చనారతులనే నడుగ బోదు

నీ పద పద్మముల్ నిరతంబు గొల్చెడు

       మహితమౌ భక్తిలో మసలునాకు

నింకనున్ గోరంగ నేముండు శంకరా !

         భక్తి సాధకమైన ముక్తి దప్ప

ఇట్టి నాపైన దయజూపి పట్టి కరము

చింతలనుదీర్చి నీలోన చేర్చు కొనుము

కరుణ చూపుము నా పైన కామదహన ! 

ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ !              30*


✍️గోపాలుని మధుసూదనరావు🙏

పద్యతాంబూలం

 పద్యతాంబూలం 


గెంతుల పినవయసున పిత, 

కాంతుడు కళ్యాణమునను, కన్నసుతుండున్, 

పంతమునకన్నదమ్ములు, 

చెంతన మగతలపె లేని చేడియ గలదే?  


చిగురొత్తగ తల్లిని, చెరి 

సగమని దెచ్చిన సుదతిని, సరి వదినమ్మన్, 

బగి తోబుట్టును, తనయను, 

మగువను బ్రతుకున తలవని మగవాడేడీ?


ఇలా, ఇద్దరూ ఒకరికొకరు కావాలిగా, 

అందుకే, జంట తాంబూలములు..😀


🙏🕉️🙏


- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్

వారాహీ మాత🙏

 🙏 వారాహీ మాత🙏

వారాహీ మాత గురించి ఒక్కొక్క పురాణం లో ఒకోరకంగా చెప్పబడింది. వారాహీ మాతను గురించి వివరిస్తాను

వారాహీ దివా న స్మరేత్ అని శాస్త్ర వచనం 

వారాహీ మాతను పగటి పూట స్మరింపరాదు అంటే జపించకూడదు. మాత విశ్రాంతి తీసుకునే సమయం.ఆ తల్లికి నిద్రాభంగం అవుతుంది 

వారాహీ మాత ఆవిర్భాము గురించి వివిధ పురాణాలలో వివిధములుగా వివిధ వాహనాలతో వివిధ ఆయుధాలతో ఉన్నది. అవి ఒక్కసారి పరిశీలిద్దాము.

వారాహి దేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశమహావిద్యలలో ఒకామెగా కొలుస్తారు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహ స్వామి. నేపాల్ లో ఈమెను బారాహి అంటారు.( వబయో రభేదః )

వారాహి

పులిని వాహనంగా కలిగి వరాహ ముఖం, పది చేతులతో వారాహి దేవి ఉంటుంది .


ఆయుధములు

త్రిశూలం, ఖడ్గం

వాహనం

గేదె, సింహం, పులి, గుర్రం


వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే.


మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యంలో శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది.

రక్తబీజుడిని చంపడం కోసం దుర్గా దేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది. ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు. వారాహి ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా చేతులలో ఖడ్గం, డాలు, అంకుశం ఆయుధాలుగా కలిగి ఉంది.

దేవీ మాహాత్మ్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే, ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడ్ని సంహరిస్తుంది. వామన పురాణాం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది.


మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి, వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలపబడి ఉంది.


దేవీ భాగవత పురాణం ప్రకారం వారాహిని, ఇతర మాతృకలతో పాటుగా, అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది. రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది.


వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది. ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత.


మత్స్యపురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు.


దేవీ పురాణం వారాహీ దేవిని విచిత్రంగా వరాహా స్వామికి తల్లిగా (వరాహజననిగా) వర్ణించింది.


వారాహిని శైవులు , వైష్ణవులు , శాక్తులు పూజిస్తారు . వారాహిని సప్త-మాతృకల సమూహంలో పేర్కొన్నారు., ఇవి శక్తి మతంలో పూజించబడుతున్నాయి, అలాగే శివునితో సంబంధం కలిగి ఉంటాయి .


వారాహి ఒక రాత్రి దేవత మరియు కొన్నిసార్లు ధ్రుమ వారాహి ("చీకటి వారాహి") మరియు ధూమావతి ("చీకటి దేవత") అని పిలుస్తారు. తంత్రం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు వారాహిని పూజించాలి. పరశురామ కల్పసూత్రం ఆరాధన సమయం అర్ధరాత్రి అని స్పష్టంగా పేర్కొంది. శక్తలు వారాహిని రహస్య వామమార్గ తాంత్రిక పద్ధతుల ద్వారా పూజిస్తారు, ఇవి ప్రత్యేకంగా పంచమకార ఆరాధనతో సంబంధం కలిగి ఉంటాయి - ద్రాక్షారసం, చేపలు, ధాన్యం, మాంసం మరియు కర్మ సంయోగం . గంగానది ఒడ్డున ఉన్న కాళరాత్రి ఆలయంలో ఈ పద్ధతులు పాటిస్తారు, ఇక్కడ రాత్రిపూట మాత్రమే వారాహికి పూజలు చేస్తారు; గుడి పగటిపూట మూసివేయబడుతుంది. వారాహిని లలితా త్రిపురసుందరి దేవత యొక్క అభివ్యక్తిగా లేదా "దండనాయక" లేదా "దండనాథ"గా భావిస్తారు.

 శక్తిమతం యొక్క శ్రీ విద్యా సంప్రదాయం వారాహిని పరా విద్య ("అతీంద్రియ జ్ఞానం") స్థాయికి పెంచింది . దేవీ మహాత్మ్యం దీర్ఘాయువు కోసం వారాహిని ప్రేరేపించాలని సూచించింది. వారాహి పూజకు మరియు సిద్ధులను పొందేందుకు ముప్పై యంత్రాలు మరియు ముప్పై మంత్రాలు నిర్దేశించబడ్డాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే లలితా దేవి ఇచ్చా శక్తి, రాజమాతంగేశ్వరి జ్ఞానశక్తి వారాహీ మాత క్రియాశక్తి.

మన పురాణాల ప్రకారం మహా శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు,వీరే బ్రహ్మీ ,మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండీ.

8.వ మాతృక గా నారసింహి

9.వ మాతృక గా వినాయకి నీ ఆరాధించడం జరుగుతుంది,భక్తులకు కొంగుబంగారంగా మనల్ని ఎప్పుడు చల్లగా చూసేందుకు వీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు,ఈ సప్త మాతృక స్వరూపిణి ఈ వారాహి మాతగా పరిగణించపడుతోంది, ఈ వారాహిరూపం రూపాన్ని పోలిఉండి,నల్లని శరీరఛాయాతో మేఘ వర్ణంతో ఎనిమిది చేతులతో, అభయ వరద హస్తం,శంకు చక్ర, రోకలి నాగలి,పాశం హలం ఆయుధాలతో భక్తులకు దర్శనం ఇస్తుంది,ముఖ్యంగా లలితదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు ఈ వారాహిమాత,అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామాలలో వినిపిస్తుంది,వారాహి మాతను భక్తి శ్రద్ధలతో కొలిచినవారికి,భక్తుల పాలిట కొంగు బంగారమై,తన పైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధురాలిగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్ని తొలగించి,శత్రుభయం,జ్ఞానసిద్ధి బుద్ధి, ధనప్రాప్తి,ఇంకా అనేక అనేక సకల జయాలు సిద్ధిస్తాయి,అలాగే ఈమె అజ్ఞాచక్ర కుండలిని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది, అందుకే ఆమెను ఆజ్ఞచక్రేశ్వరి అన్నారు,శుంభ నీశుoబ,రక్త బీజ వధలోను ఈమె ప్రస్తావన ఉంది.

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

చిత్రము వింతయే యగును

 




చిత్రము వింతయే యగును చిన్నకు పెద్దది చేయి యుండగా


చిత్రము తల్లికిన్ నమరె చిన్నది హస్తము వికృతంబుగా


ఆత్రము నయ్యె చూపరకు హాస్యము దోచెను తల్లి బిడ్డకున్


నేత్రము గొన్నదేమొ భ్రమ నిక్క మదెయ్యది చెప్పరేలకో.


అల్వాల లక్ష్మణ మూర్తి

తిప్పతీగ ఉపయోగాలు

 తిప్పతీగ ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . 


      తిప్పతీగ అనునది ప్రతి వూరు డొంకలలో పెరుగుతుంది . దీనిని సంస్కృతంలో " గుడూచీ" అని పిలుస్తారు . దీనికి అర్థం వ్యాధుల నుండి రక్షించునది అని అర్థం.  " అమృత" అనే పేరు కూడా దీనికి కలదు. అనగా అమృతమునకు సమానం అయినది అని అర్థం. 


            ఇప్పుడు మీకు దీనిలోని ఔషధ గుణముల గురించి మీకు వివరిస్తాను. 


  తిప్పతీగ యందలి ఔషధ గుణములు  - 


 *  ఇది వాత , పిత్త , కఫ దోషముల మూడింటి మీద పనిచేస్తుంది . బలకరము , ఆకలిని పెంచుతుంది . మెదడుకు మంచిది . నేత్రములకు బలాన్ని ఇచ్చును. పాండు , కామెర్లు , జ్వరము , మూత్రవ్యాధులు , కుష్ఠు , దగ్గు మొదలగు వ్యాధులను పోగొట్టును . కడుపులోని నులిపురుగులను నశింపచేయును . తల్లిపాలను శుద్ధిచేయును . 


 *  జ్వరములలో తిప్పతీగ కషాయం 20ml ఉదయము , సాయంత్రం ఇచ్చిన జ్వరములు తగ్గును. 


 *  మూత్రసంబంధ వ్యాధులలో తిప్పతీగ రసములో తేనె కలిపి ఇవ్వాలి. కామెర్ల యందు కూడా తిప్పతీగ రసములో ప్రతిరోజూ తేనె కలిపి ఇచ్చిన కామెర్ల సమస్య తగ్గును. 


 *  కీళ్లనొప్పుల యందు తిప్పతీగ , శొంఠి కలిపి ఇచ్చిన కీళ్లనొప్పులు తగ్గును. 


 *  ప్రతిరోజూ తిప్పతీగ రసం తాగించి రోగి బలానుసారం కందికట్టులో నెయ్యి చేర్చిన అన్నము తినుచున్న కుష్ఠు వ్యాధి తగ్గును. 


 *  తిప్పతీగ రసమును ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం ఒక నెలరోజుల పాటు సేవిస్తే ఏ వ్యాధులు రాకుండా , ముసలితనం రాకుండా మానవుడు ఆరోగ్యముగా ఉండును. 


 *  తిప్పతీగ చూర్ణము , బెల్లం , నెయ్యి , తేనె కలిపి ముద్దగా చేసి ఉండలా చేసి రోజూ ఒక ఉండ తింటే మానవుడు ఆరోగ్యముగా 100 సంవత్సరాలు జీవిస్తాడు. 


 *  తిప్పతీగ రసం కొద్దిగా నూనెలో కలిపి తాగిన బోదకాలు తగ్గును. 


 *  తిప్పతీగ కషాయంలో పిప్పలి చూర్ణం కలిపి ఇచ్చిన చాలా రోజుల నుంచి వేధిస్తున్న జీర్ణజ్వరం తగ్గును. 


 *  తిప్పతీగ కషాయం ప్రతిరోజూ సేవించిన మధుమేహం తగ్గును. మూత్రాశయపు రాళ్లు కూడా కరిగిస్తుంది. 


 *  మొలల సమస్య ఉన్నవారు తిప్పతీగ స్వరసాన్ని మజ్జిగతో కలిపి వాడవలెను . 


 *  తిప్పతీగ కషాయాన్ని సేవించిన వాంతులు తగ్గును. 


 

        పైన చెప్పిన విధముగా ఎన్నో విలువైన ఔషధయోగాలు తిప్పతీగతో ఉన్నాయి. స్థలాభావం వలన నేను వాటిని సంపూర్ణముగా వివరించలేకున్నాను. నేను రాసిన గ్రంథాలలో చాలావరకు మూలికల గురించి సంపూర్ణ వివరణ ఇవ్వడం జరిగింది...


  

    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

      9885030034                       


    

    కాళహస్తి వేంకటేశ్వరరావు 


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🪷శుక్రవారం 4 జూలై 2025🪷*

``

          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

      *వాల్మీకి రామాయణం*                

           *88 వ భాగం*

```

అప్పుడు యుద్ధరంగం లోకి రావణుడి కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. 


అంగదుడు తన పిడికిలిని బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి, వాడు తల పగిలి చనిపోయాడు. 


తదనంతరం మహోదరుడిని నీలుడు సంహరించాడు. 


దేవాంతకుడిని, త్రిశిరుడిని(మూడు తలకాయలతో ఉంటాడు) హనుమంతుడు సంహరించాడు. 


ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించాడు. 


ఆ తరువాత అతికాయుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రాముడు… “విభీషణా! అంత పెద్ద శరీరంతో ఉన్నాడు, అసలు వాడెవడు?” అని అడిగాడు.


అప్పుడు విభీషణుడు… “ఆయన సామాన్యుడు కాదు. ఆయన వేదం చదువుకున్నాడు, బ్రహ్మగారి దగ్గర వరాలు పొందాడు. ఆయన కవచాన్ని ఎటువంటి బాణం పెట్టి కొట్టినా అది పగలదు. అందుచేత అతనిని నిహతుడిని చెయ్యడం చాలా కష్టం అన్నాడు.


ఆ అతికాయుడు యుద్ధంలో చాలా మందిని నెత్తురు కారేటట్టు కొట్టాడు, ఎందరినో నిగ్రహించాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ అతికాయుడితో యుద్ధం చెయ్యబోతుంటే వాడన్నాడు… “లక్ష్మణా! నువ్వు పిల్లవాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి. నేను అతికాయుడిని, చిన్న చిన్న వాళ్ళతో నేను యుద్ధం చెయ్యను, అలా చెయ్యడం నాకు అసహ్యం. నన్ను ఎదిరించి నిలబడగలిగిన నా స్థాయివాడు ఎవడన్నా ఉన్నాడా వానర సైన్యంలో?” అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు… “ఈ డాబులెందుకురా, నాతో యుద్ధం చెయ్యి” అన్నాడు.


అతికాయుడన్నాడు… “పిల్లవాడివి, అగ్నిహోత్రాన్ని ఎందుకు పైకి లేపుతావు, నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతావు. ఆ తరువాత నీ శరీరం పడిపోయాక బాధ పడతావు. వెళ్ళి రాముడిని పిలువు” అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు… “నీ బతుక్కి రాముడు కావాలేంటి, నీకు నేను సమాధానం చెబుతాను” అని అర్ధచంద్రాకార బాణాలని అతికాయుడి మీదకి ప్రయోగించాడు. 


ఆ బాణాలు తగిలాక వాడన్నాడు… “అబ్బో నీతో యుద్ధం చెయ్యవలసిందే!” అని ఐంద్రాస్త్రం, వాయువ్యాస్త్రం మొదలైన ఎన్నో అస్త్రాలని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. 


ఆ అస్త్రములన్నిటికి లక్ష్మణుడు ప్రతిక్రియ చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములను ప్రయోగించినా, ఎన్ని అస్త్రములను ప్రయోగించినా, అన్నీ వాడి యొక్క కవచానికి తగిలి పడిపోతున్నాయి.


ఆ సమయంలో వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడితో… “వాడికి బ్రహ్మగారు ఇచ్చిన వరం ఆ కవచం. వాడు ఆ కవచం పెట్టుకుని ఉన్నంతసేపు ఎవరు ఏది పెట్టి కొట్టినా ఆ కవచం పగలదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే వాడి కవచం పగులుతుంది” అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ అతికాయుడిని సంహరించాడు.


అతికాయుడు మరణించాడన్న వార్త విని రావణుడు క్రుద్ధుడై, సామాన్యమైన వారిని పంపిస్తే వీలులేదని మళ్ళీ ఇంద్రజిత్ ని పిలిచి… “నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమయ్యింది!”అన్నాడు.


అప్పుడా ఇంద్రజిత్ 4 గుర్రములు పూన్చిన రథం ఎక్కి అనేకమంది సైన్యంతో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. ఆయన చుట్టూ సైన్యం మొహరించి ఉంది, కాని ఇంద్రజిత్ మాత్రం కొంతసేపు ఎవరికీ కనపడలేదు.(ఆ సమయంలో చుట్టూ మోహరించిన సైన్యం మధ్యలో ఉన్న ఇంద్రజిత్ సమిధలు, పుష్ప మాలికలు, ఎర్రటి వస్త్రాలతో అగ్నిహోత్రంలో హోమం చేస్తాడు. ఆ హోమం చేశాక ఆ హోమాగ్ని సుడులు తిరుగుతూ పైకిలేస్తుంది, అప్పుడు ఒక నల్ల మేకని పట్టుకొచ్చి తన పళ్ళతో దాని కంఠాన్ని కొరికి, మెడ చీల్చి, ఆ మేక మాంసాన్ని ఆ హోమాగ్నిలో వేస్తాడు {వీటిని ఆభిచారిక హోమాలు అంటారు, ఇవి చాలా ప్రమాదకరమైనవి}. అప్పుడా పుష్పాలని, అక్షతలని తన ఆయుధముల మీద వేసి, ఎర్రటి వస్త్రాలు కట్టుకొని, రథం ఎక్కి మాయమయిపోతాడు, ఇంక ఎవరికీ కనపడడు. ఆ ఇంద్రజిత్ గుర్రాల చప్పుడు కాని, వాడి ధనుస్సు యొక్క శబ్దము కాని, వాడి బాణ ప్రయోగం కాని ఎవరికీ వినపడదు, అర్ధం కాదు. ఆయనకి అందరూ కనపడతారు, కాని ఆయన ఎవరికీ కనపడడు. ఒక్క విభీషణుడు మాత్రమే ఆయనని మాయా బలంతో చూడగలడు)


హోమాన్ని పూర్తి చేసిన ఇంద్రజిత్ రథం ఎక్కేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేసి, బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆవాహన చేసుకున్నాడు. ఆయన రథం ఎక్కగానే ఆ రథం ఎవ్వరికీ కనపడలేదు, అప్పుడాయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మేఘాల మధ్యకి వెళ్ళిన ఇంద్రజిత్ దిక్కులని, విదిక్కులని మంచుతో కప్పేసి, ధనుష్టంకారం కూడా వినపడకుండా కొన్ని వేల బాణాలను ప్రయోగం చేసి హనుమంతుడిని, సుగ్రీవుడిని, ద్వివిదుడిని, మైందుడిని, అంగదుడిని, గంధమాదనుడిని, జాంబవంతుడిని, సుషేణుడిని, వేగదర్సిని, నీలుడిని, గావాక్షుడిని, కేసరిని మొదలైన అనేకమంది వానర వీరులని తన బాణములతో కొట్టి భూమి మీద పడేశాడు. అన్ని కోట్ల వానర సైన్యాన్ని బ్రహ్మాస్త్రం చేత కట్టి పడేశాడు.


అప్పుడు వాడు పైనుంచి ఒక పెద్ద నవ్వు నవ్వి రామలక్ష్మణులతో అన్నాడు… “ఒకసారి నాగ పాశాలతో మిమ్మల్ని కట్టాను, కాని మీరు విడిపించుకున్నారు. ఇవ్వాళ బ్రహ్మాస్త్రంతో మిమ్మల్ని కట్టేస్తాను, ఇవ్వాల్టితో యుద్ధం అయిపోతుంది” అన్నాడు.


అప్పుడు రాముడు లక్ష్మణుడితో… “లక్ష్మణా! ఇవ్వాళ మనకి వేరొక దారిలేదు. వాడు బ్రహ్మగారికి చెందిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కొడుతున్నాడు, ఆ బ్రహ్మాస్త్ర బంధనం చేత మొత్తం వానర సైన్యం పడిపోయింది. ఎదురుగా ఉన్న వీరుడైతే మనం కొట్టచ్చు, కాని వాడు మాయా యుద్ధం చేస్తున్నాడు, కనుక మనం వాడిని కొట్టలేము. అందుచేత వాడు కొడుతున్న బాణ పరంపరకి ఓర్చుకున్నంతసేపు ఓర్చుకో, తరువాత స్పృహతప్పినవాడు పడిపోయినట్టు రణభూమిలో పడిపో. అప్పుడు వాడు ఎన్ని బాణములు కొట్టాలో అన్ని బాణములతో మన శరీరాలని కొడతాడు. అలా కొట్టేశాక శత్రువు మరణించాడనుకొని, జయలక్ష్మిని పొందాననుకొని వాడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. 

ఆ తరువాత బతికుంటే చూద్దాము. ముందు వాడిని కొట్టెయ్యని” అన్నాడు.


అప్పుడు ఇంద్రజిత్ రామలక్ష్మణులిద్దరినీ బాణాలతో కొట్టేశాడు. ఇద్దరి శరీరాల నిండా బాణాలతో కొట్టాడు, నెత్తురు వరదలై కారిపోయింది. వాడి బాణ పరంపరని తట్టుకోలేక రామలక్ష్మణులిద్దరూ భూమి మీద పడిపోయారు. 


అప్పుడు వాడు వికటాట్టహాసం చేసి చూసేసరికి ఆ యుద్ధ భూమిలో నిలబడి ఉన్నవాడు ఎవడూ లేడు, అందరినీ ఒక్కడే కొట్టేశాడు, మొత్తం 67 కోట్ల వానర సైన్యాన్ని ఇంద్రజిత్ ఒక్కడే కొట్టాడు. 


తరువాత వాడు అంతఃపురానికి వెళ్ళి రావణుడితో… “రామలక్ష్మణులిద్దరినీ బ్రహ్మాస్త్ర బంధనం చేశాను, వాళ్ళు పడిపోయి ఉన్నారు” అని చెప్పాడు.


ఇంద్రజిత్ బాణములు ప్రయోగించకముందే విభీషణుడు యుద్ధ భూమినుంచి పారిపోయాడు. హనుమంతుడికి ఉన్న వరం వలన ఆయనని ఏ అస్త్రము బంధించలేదు. 

ఆ విభీషణుడు, హనుమంతుడు కలుసుకొని… “అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా, ప్రాణాలు విదిచిపెట్టేశారా?” అని ఒక కాగడా పట్టుకొని ఆ యుద్ధ భూమిలో వెతికారు.(ఇంద్రజిత్ అందరినీ కనురెప్పలు కూడా తెరవడానికి వీలులేకుండా బాణాలతో కొట్టాడు) అలా వెతుకుతుండగా వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు, అప్పుడు విభీషణుడు… “జాంబవంతా! నీకు స్పృహ ఉందా, మేము మాట్లాడుతుంది నీకు అర్ధం అవుతుందా?” అని అడిగాడు.


అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకి ఎత్తి అన్నాడు… 

“నాయనా, నీ కంఠం చేత గుర్తుపట్టానయ్య, నువ్వు విభీషణుడివి కదా. హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా?” అని అడిగాడు.


విభీషణుడు అన్నాడు… “నువ్వు పెద్దవాడివి, వానర యోధులకందరికి కూడా నువ్వు తాతవంటి వాడివి. అటువంటి నువ్వు రామలక్ష్మణులు బతికి ఉన్నారా? అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకు అడిగారు” అన్నాడు.


అప్పుడు జాంబవంతుడు అన్నాడు… “మొత్తం వానర సైన్యం అంతా మరణించని, హనుమంతుడు ఒక్కడు బతికుంటే మళ్ళి వీళ్ళందరూ బతుకుతారు. మొత్తం వానర సైన్యం బతికి ఉండని, హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టే. హనుమ శక్తి ఏమిటో నాకు తెలుసు, హనుమ ఉన్నాడా?” అని అడిగాడు.


వెంటనే హనుమంతుడు జాంబవంతుడి పాదాలు పట్టుకొని… “తాతా! హనుమ నీకు నమస్కరించుచున్నాడు” అన్నాడు.


అప్పుడు జాంబవంతుడు… 

“అందరినీ రక్షించగలిగినవాడివి నువ్వే. ఆలస్యం చెయ్యకుండా ఉత్తర క్షణం బయలుదేరి హిమాలయ పర్వతాలకి వెళ్ళు. అక్కడ కైలాస పర్వతం పక్కన ఓషది పర్వతం ఒకటి ఉంది. దానిమీద ఉండే మృతసంజీవని(దీని వాసన చూస్తే చనిపోయిన వాళ్ళు బతుకుతారు), విశల్యకరణి (దీని వాసన చూస్తే, శరీరంలో బాణపు ములుకులు గుచ్చుకుని ఉంటె అవి కింద పడిపోతాయి), సంధానకరణి (దీని వాసన చూస్తే విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి), సౌవర్ణకరణి (దీని వాసన చూస్తే, ముర్చపోయిన వాళ్ళకి తెలివి వస్తుంది) అనే నాలుగు ఓషదులని తీసుకురా” అన్నాడు.


జాంబవంతుడు ఈ మాట చెప్పగానే హనుమంతుడు ఒక పర్వతాన్ని ఎక్కి, మెరుపు వెళ్లినట్టు ఆ పర్వతాన్ని తొక్కేసి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. హనుమంతుడు తీవ్రమైన వేగంతో హిమాలయ పర్వతాలని చేరుకొని, ఓషది పర్వతం ఎక్కడుందని చూస్తుండగా ఆ హిమాలయాల మీద ఆయనకి బ్రహ్మగారి ఇల్లు కనపడింది, అక్కడే పరమ శివుడు తన ధనుస్సుని పెట్టే ఒక పెద్ద అరుగు కనపడింది. అక్కడే హయగ్రీవుడిని ఆరాధన చేసే ప్రదేశం కనపడింది, సూర్య భగవానుడి కింకరులు ఉండే ప్రదేశం కనపడింది, అక్కడే ఇంద్రుడు ఉండే గృహం, కుబేరుడు ఉండే గృహం కనపడింది, అక్కడే సూర్య భగవానుడిని విశ్వకర్మ చెక్కిన వేదిక కనపడింది.

తరువాత ఆయన ఆ ఓషది పర్వతం కోసం వెతికాడు. ఆ ఓషది పర్వతంలోని ఓషదులు తమని ఎవరో తీసుకుపోడానికి వస్తున్నారని, అవి తమ ప్రకాశాన్ని తగ్గించేసి లోపలికి అణిగిపోయాయి.


ఆ ఓషదులను చూసిన హనుమంతుడు… “ఆ ఓషదులని నాకు కనపడకుండా దాస్తారా, రామ కార్యానికి సాయం చెయ్యరా?” అని ఆ పర్వత శిఖరాన్ని పీకి, చేతితో పట్టుకొని వాయు వేగంతో ఆ శిఖరాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టాడు.


అలా పెట్టేసరికి వాటి వాసనలు పీల్చిన ఇన్ని కోట్ల వానరాలు పైకి లేచిపోయాయి, రామలక్ష్మణులు పైకి లేచారు.

అప్పుడు హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి ఆ హిమాలయ పర్వతాల దగ్గర పెట్టి వచ్చేశాడు.


అప్పుడు సుగ్రీవుడు అన్నాడు…

“మనల్ని బ్రహ్మాస్త్ర బంధనం చేసి వెళ్ళిన ఇంద్రజిత్ కి బుద్ధి రావాలి. అందుకని మీరందరూ ఒకసారి ఎగిరి లంకలోకి దూరిపోండి, కాగడాలు పట్టుకొని లంకనంతా కాల్చెయ్యండి” అన్నాడు.```


        *రేపు…89వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

శుక్రవారం🌹*_ *🪷04 జూలై 2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     _*🌹శుక్రవారం🌹*_ 

  *🪷04 జూలై 2025🪷*         

    *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - శుక్లపక్షం*


*తిథి  : నవమి* సా 04.31 వరకు ఉపరి *దశమి*

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం   : చిత్త* సా 04.50 వరకు ఉపరి *స్వాతి*

*యోగం : శివ* సా 07.36 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం   : కౌలువ* సా 04.31 *తైతుల పూర్తిగా రాత్రంతా*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 05.30 - 06.30*

అమృత కాలం  : *ఉ 09.37 - 11.26*

అభిజిత్ కాలం  : *ప 11.46 - 12.38*

*వర్జ్యం          : రా 11.08 - 12.56*

*దుర్ముహూర్తం  : ఉ 08.16 - 09.09 మ 12.38 - 01.30*

*రాహు కాలం   : ఉ 10.34 - 12.12*

గుళికకాళం       : *ఉ 07.17 - 08.56*

యమగండం     : *మ 03.28 - 05.06*

సూర్యరాశి : *మిధునం* చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 05.46*

సూర్యాస్తమయం :*సా 06.55*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.39 - 08.16*

సంగవ కాలం         :      *08.16 - 10.53*

మధ్యాహ్న కాలం    :     *10.53 - 01.30*

అపరాహ్న కాలం    : *మ 01.30 - 04.07*

*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ శుద్ధ నవమి*

సాయంకాలం        :*సా 04.07 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.55*

రాత్రి కాలం           :*రా 08.55 - 11.50*

నిశీధి కాలం          :*రా 11.50 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.12 - 04.56*

-----------------------------------------------

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


*సర్వలౌకికకర్మభ్యో*  

*విముక్తానాం హితాయ వై*

*భుక్తిముక్తిప్రదం*  

*జప్యమనుబ్రూహి దయానిధే*


*🪷ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః🪷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

పోతన రూపచిత్రణ!

 పోతన రూపచిత్రణ! 


మ: త్రిజగ న్మోహన నీలకాంతి తనువుద్దీపింపఁ బ్రాభాత నీ


        రజ బంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల , నీలాలక


        వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృభింప మా


        విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్!


                   ఆం: భాగవతం- ప్రధమస్కంథం- 247: వ: పద్యము;


                     

                   ముల్లోకాలను మైమరపించే నీలమేఘ ఛ్ఛాయగల తనువుతో, ఉదయారుణ కిరణ కాంతిని 


   ప్రతిఫలించు నుత్తరీయంబుతో ,గాలికి నూయలలూగు నల్లని ముంగురులతో నొప్పు ముఖారవిందముతో చూడముచ్చటఁ గొల్పుచు మా అర్జును దరికి నరుదెంచుచుండు అందగాడు శ్రకృష్ణుఁ డెల్లవేళల నామదిలో నిలచుగాక! అనిభీష్మ స్తుతి;


                 నల్లనివాడే గాని యామేనిలో నొక మెఱపున్నది. ఆకర్షణ యున్నది. అదియెంతటిదనగా ముల్లోకములను మోహింప జేయు నంతటిదట! ఆమూర్తి కన్నుల బడెనా అంతే ఆయాకర్షణ ప్రవాహమున గొట్టికొని పోవలసినదే!


                         ఇఁక నాతఁడు ధరించిన పీతాంబరమా ఉదయారుణ కాంతి రంజితమై చూపరులకు యింపు నింపు చున్నది. 

కృష్ణుడు కదలివచ్చుచుండ బాలసూర్యోపమ మైన కాంతిపుంజ వలయమేర్పడుటకా వస్త్రము ఆధారమగుచున్నది. ఎంత యద్భుతము! 


                  మోమా అరవిందమును బోలియున్నది. అది నల్లని ముంగులతో శోభాయమానమై యున్నది.కవి బయటకు చెప్పకున్నను తుమ్మెదలు ముసిరిన పద్మమును బోలియున్నది. 


                              ఇంత యందమును మూటగట్టి వచ్చువాడు వన్నెలాడు (సోకులరాయడు) గాకుండునా? 


              ఇదీ పోతన గారి యద్భుత రూప చిత్రణా సామర్ధ్యము!


                                                             స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷