9, సెప్టెంబర్ 2025, మంగళవారం

దేవరకొండ బాగంగాధర తిలక్

 🙏దేవరకొండ బాగంగాధర తిలక్ 🙏

తెలుగు కవితావరణంలో అమృతం కురిపించిన దేవరకొండ బాలగంగాధర తిలక్‌ … ఎప్పటికీ గుర్తుండిపోతాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో 1921 ఆగస్టు 1న పుట్టిన తిలక్‌ … తన 11వ ఏటనే కథ రాయడం, 16వ ఏట నుంచే కవిత్వం అల్లడం ప్రారంభించారు. విశాఖపట్నం ఏవిఎన్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి, అనారోగ్య కారణాల చేత ఉన్నత విద్య అభ్యసించలేకపోయారు. తణుకులో ‘సాహితీ సరోవరం’ పేరిట విజ్ఞాన పరిషత్‌ను స్థాపించి, సాహిత్య సృజన సాగించారు.

తిలక్‌ అనారోగ్య సమస్య మానసికమైనది. లేనిపోని జబ్బులు తనకే ఉన్నాయనే భావం హైపో కాండ్రియాసిస్‌ వల్ల సైకోన్యూరోసిస్‌, గుండె సంబంధమైన వ్యాధులతో 1946 నుంచి 1954 వరకు ఎనిమిదేళ్లపాటు మంచానికే పరిమితమయ్యారు. ఆ దశలోనే ‘బాధాగళము’, ‘మండోదరి’ వంటి పద్య కవిత్వం రాశారు తిలక్‌. ఆరోగ్యం కుదుట పడ్డాక 1954 – 1966 మధ్య ఒక పుష్కర కాలం పాటు అన్ని సాహితీ ప్రక్రియల్లోనూ విస్తారంగా రచనలు చేశారు. ఇరుగు- పొరుగు, సుచిత్ర ప్రణయం, సుప్తశిల, పొగ, భరతుడు (ఏకపాత్రాభినయం) వంటి నాటికలు; సుశీల పెళ్ళి, సాలెగూడు వంటి నాటకాలు కూడా రాశారు. కావ్యసృష్టి, గాంధీ జీవితం ఒక మహాకావ్యం, హేమంత హసంతిక, కావ్యరసం, యుద్ధం వంటి వ్యాసాలు రాశారు. తన మిత్రులకు గొప్ప జీవిత స్పర్శ, సాహిత్య సౌరభం ఉన్న లేఖలు రాశారు. మాక్సిం గోర్కీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్ఫూర్తితో కథలు రాశారు. సుందరి సుబ్బారావు, ఊరి చివర ఇల్లు కథలు ఎంతో ప్రసిద్ధం. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆయన సృజియించిన వచన కవిత్వం మరొక ఎత్తు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల ప్రభావంతో ఆయన భావాభ్యుదయ కవిత్వాన్ని ఆవిష్కరించారు. శ్రీశ్రీ మహాప్రస్థానం, తిలక్‌ అమతం కురిసిన రాత్రి సాహితీ ప్రపంచంలో విహరిద్దామనుకునే పాఠకులకు, వర్ధమాన కవులకు రెండు అద్భుత ద్వారాలుగా నిలుస్తాయి. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం తిలక్‌కు కరతళామలకం. ఆధునిక జీవితాన్ని అభివర్ణించడానికి వృత్త పరిధి చాలక శ్రీశ్రీ లాగానే, వచన గేయాన్ని ఎంచుకున్నారు. అది తన చేతిలో ఒకనొక ప్రత్యేకతని సంతరించుకొని, సౌందర్యాన్ని సేకరించుకుంది.

‘అమృతం కురిసిన రాత్రి’లో ”అందరూ నిద్ర పోతున్నారు- నేను మాత్రం- తలుపు తెరచి ఇల్లు విడిచి- ఎక్కడికో దూరంగా- కొండ దాటి కోన దాటి- వెన్నెల మైదానంలోకి వెళ్లి నిలుచున్నాను” అంటూ పాఠకున్ని కూడా వెన్నెల మైదానంలోకి తీసుకుపోతారు. ”నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు/ నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు/ నా అక్షరాలు వెన్నెలలో ఆడుకోనే అందమైన ఆడపిల్లలు” అని తిలక్‌ చెప్పుకున్నారు. ఇందులోని మొదటి రెండు వాక్యాలూ తిలక్‌ తన వస్తువుల గురించి, మూడవది తన శైలిని గురించి చెప్పుకున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ”పాడువోయిన ఊరు”లో – అది అంతా యిసుక- చరిత్రలో ఒక మసక- ఇది నశించిన గ్రామం- విశ్వసించే ఒక శ్మశానం- కాలిపోయే ఇల్లులా జీవితం ఒరుగుతుంది- కాలం పాడు నుయ్యిలా నా కన్నులకు కనబడింది అంటూ భాష సరళతను భావగాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు తిలక్‌. ‘సైనికుడి ఉత్తరంలో’ ఇక్కడ నేను క్షేమం- అక్కడ నువ్వు కూడా- ముసలి అమ్మ- పాత మంచం కోడు- మన చిన్నబ్బాయి- చెరువులో కొంగా” అంటూ ప్రారంభమైన ఉత్తరం- ”నేనిది వరకటి నేను కాను – నాకు విలువల్లేవు – చంపడం, చావడం తప్ప- కనిపించే ఈ యూనిఫారం కింద- ఒక పెద్ద నిరాశ, ఒక అనాగరికత బ్రిడ్జి కింద నదిలా రహస్యంగా ఉంది” అని సైనికుడు భార్యకు రాసే ఉత్తరాన్ని వివరించారు తిలక్‌.

సంఘవంచితుల పట్ల ఎంత కారుణ్యాన్ని చూపిస్తారో సంఘ దురన్యాయాల పట్ల అంతే క్రోధాన్ని ప్రదర్శిస్తారు తిలక్‌. ‘ఆర్తగీతం’లో ”నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలి వాణ్ణి- నేను చూసాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెన కింద- నిండు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని- నేను చూశాను నిజంగా తల్లి లేక, తండ్రి లేక, తిండి లేక, ఏడుస్తూ ఏడుస్తూ- ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కనే నిద్రించిన మూడేళ్ళ పసి బాలుణ్ణి …” ఇలా వంచితుల దీన గాధల్ని వివరిస్తూ- ఇది ఏ నాగరికతకు ఫలశృతి? ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి? ఏ బుద్ధ దేవుని జన్మభూమికి గర్వ స్మ ృతి” అనే ప్రశ్నలతో తన క్రోధాన్ని ప్రదర్శించారు. ‘న్యూ సిలబస్‌’ అనే కవితలో సౌత్‌ ఆఫ్రికా ప్రధాన మంత్రికి సామరస్యం ప్రధాన లక్ష్యం- రష్యా నేత కశ్చేవ్‌కి ప్రపంచ శాంతి ఒకటే గమ్యం- అమెరికన్‌ కెనడీకి పరోపకారం స్పూనుతో పెట్టిన ఆహారం అయినా యుద్ధం ఎందుకంటే తమ్ముడు! అది మన ప్రారబ్దం అంటూ అని ఆనాడే వాపోయారు. కష్ణశాస్త్రి, శ్రీశ్రీ ప్రభావంతో కవిత్వం రాసినా వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభా సంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళిన వాడు తిలక్‌.

‘నవత కవిత’లో – ”గంతలు కట్టినంత మాత్రాన గాడిద గుర్రం కాదు- ఖద్దరు ధరించిన ప్రతివాడు గాంధేయుడు కాడు- ఆధునికత ఉన్నంత మాత్రాన ప్రతీదీ శిరోధార్యం కాదు- ఆహార్యం మార్చినంత మాత్రాన సామాన్యుడు మహారాజవడు- అంత్యప్రాసలు వేసినంత మాత్రాన ప్రొసైక్‌ భావం పోయెట్రీ అవదు- కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసును- కాళిదాసుకు తెలుసు- పెద్దన్నకి తెలుసూ – కృష్ణ శాస్త్రికి తెలుసు- శ్రీశ్రీకి తెలుసు” అంటూ కవిత్వానికి ప్రామాణికాలను నిర్దేశించారు తిలక్‌. ‘నీడలు’ కవితలో ”చిన్నమ్మా – నేను వెళ్ళొస్తాను- చీకటి పడుతోంది- చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకొంది- శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది- దారంతా గోతులు ఇల్లేమో దూరం- చేతిలో దీపం లేదు- ధైర్యమే ఒక కవచం” అంటూ ఆశావాహ దక్పథాన్ని పాఠకులకు కలిగిస్తారు.

తిలక్‌ రాసిన ‘తపాలా బంట్రోతు’ గేయం బాగా ప్రాచుర్యం పొందింది. ”ఎండలో, వానలో – ఎండిన చివికిన- ఒక చిన్న సైజు జీతగాడు – చెవిలో పెన్సిల్‌- చేతిలో సంచి- ఖాకీ దుస్తులు- అరిగిన చెప్పులు- ఒక సాదా పేదవాడు- ఇంటింటికి- వీధి వీధికి ప్రతిరోజూ తిరిగేవాడు- ప్రైమినిష్టరా ఏం అని అంటూనే అదృష్టాద్వం మీద నీ గమనం- శుభా శుభాలకి నువ్వు వర్తమానం- నీ మ్యాజిక్‌ సంచిలో- ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం!” అంటూ తన పోస్టుమేన్‌ స్నేహితున్ని రాజును చేశారు తిలక్‌. ”ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగా వెళ్లిపోయే నిన్ను చూసినపుడు – తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు” అనే ముగింపు గుండెల్ని పిండేసినట్లుంటుంది.

కృష్ణశాస్త్రి ‘కృష్ణపక్షం’ లాగా, శ్రీశ్రీ మహాప్రస్థానం లాగా తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’ కూడా ఆధునికాంధ్ర కవిత్వ చరిత్రలో ఒక మైలురాయి. అనేక ముద్రణలు పొంది ప్రజల అభిమానాన్ని ఈనాటికీ చూరగొంటోంది. ఎందరో యువతీ యువకుల్ని కవులుగా తీర్చిదిద్దుతోంది. ఈ కవితా సంపుటికి 1969లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తిలక్‌ మరణానంతరం లభించాయి, ునజు చీ×+ను ఉఖీ చీజుజుA= గా ఇంగ్లీష్‌ లో అనువాదమైంది.

”సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు- అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు- చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి” అంటూ బలమైన కంఠంతో విశ్వ మానవ కళ్యాణానికి నిబద్ధుడై కరుణ కలికితురాయిగా తమ అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ అమృతం కురిసిన రాత్రులను, కవిత ఝరులను ప్రవహింపచేశారు దేవరకొండ బాలగంగాధర తిలక్‌. సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో – 45 ఏళ్ళ నడి వయసులో ఆయన 1966 జూన్‌ 30న అనారోగ్యంతో కన్నుమూయడం తెలుగు సాహితికి తీరని లోటు! ”యువకవి- లోక ప్రతినిధి- నవ భావామృత రసధుని- కవితా సతినొసట నిత్య రస గంగాధర తిలకం – సమకాలిక సమస్యలకు స్వచ్ఛస్ఫటిక ఫలకం- నడి నింగి మాయమయాడా – మన మిత్రుడు కవితా పుత్రుడు- కదన క్షాత్రుడు- సకల జగన్మిత్రుడు” అంటూ శ్రీశ్రీ తిలక్‌కు నివాళులు అర్పించారు. మనమూ స్మరించుకుందాం.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

8, సెప్టెంబర్ 2025, సోమవారం

నీలకంఠేశ్వరా


నీలకంఠేశ్వరా!   


మ: నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీవధూటీఘటీ/

ఘనకోటీ శకటీకటీ తటిపటీ గంధేభవాటీ పటీ/

ర, నటీ, హారిసువర్ణహార మకుటీ ప్రఛ్ఛోటికా పేటికల్/

కనదామ్నాయమహాతురంగ!

శివలింగా! నీలకంఠేశ్వరా!


ఎఱ్ఱాప్రెగ్గడ:-నీలకంఠేశ్వర శతకం.


         కాకతి రాజుల కాలంలో వీరశైవం మహోన్నత స్థితిని అందుకొన్నది. ఆమహా తరుణంలో శివకవులు నలుముఖముల విజృభించి అద్భుతమైన సాహిత్య సృజన చేశారు. నాడు శతకసాహిత్యం ఆవిర్భావ దశలో ఉన్నను మంచి మంచి శతకాలు వెలిశాయి. అందులో నీలకంఠశతకం ఒకటి."ట"కార యమకంతో నాట్యంచేసిన యీపద్యం నాటి కవులకు గల భాషాధికారానికి నిలువుటద్దం!


అర్ధములు: వీటీవధూటీ ఘటీ-వారాంగనా సముదాయము;కోటీ:కోటిధనము;శకటీకటీ- వాహన(బండ్లు)సముదాయము;తటిపటీర:నదీతీరములయందుపెరిగినచందనవృక్షములు;గంధేభవాటీ- మదగజ సముదాయము;పటీర-చందన: నటీ-నాట్యకత్తెలు;హారి-మనోహరమైన; సువర్ణహార-బంగరుహారములు;మకుటీ-కిరీటములు;ప్రఛ్ఛోటికా-పల్లకీలు;పేటికల్- పెట్టెలు; కనత్-ప్రకాశించు; ఆమ్నాయమహాతురంగ-వేదములే గుర్రములైనవాడా!; 


భావము:- ఓనీలకంఠేశ్వరా! వేదాశ్వా! నిను పూజించిన వారికి ఏమికొదవ?వారాంగనా సముదాయములేమి,అనేకకోట్ల ధనమేమి?వాహన సముదాయములేమి? ,చందనవృక్షాదులేమి, మదగజాదులేమి, కర్పూరాది సుగంధద్రవ్యాదులేమి,నట్టువరాండ్రేమి? బంగరు హారాదులేమి.సర్వము సంపన్నమే! నీవు శంకరుడవుగదా! స్వామీ !సదానీసేవాభాగ్యము ననుగ్రహింపుము.


విశేషాంశములు: భోగపుకాంతలు నాటి విలాస జీవనమునకు ప్రతీకలు.


గజాంతమైశ్వర్యం"-అనునది నాటి నానుడి. మదగజములు గలిగినవాడు ధనవంతులలో మేటి.

.చందనము కర్పూరాది సుగంధవస్తుసేవనము నాటిధనికుల జీవనరీతి.


బంగరుగద్దెలు హారములు మంజూషలు వారి అపారమైన ఐశ్వర్యమునకు నిదర్శనములు.


అలంకారం: వృత్యనుప్రాసము.

7, సెప్టెంబర్ 2025, ఆదివారం

Panchaag


 

ఉపవాసం చేయడం

 ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు - 


 * జీర్ణక్రియ - 


      జీర్ణావయవాలకు మంచి విశ్రాంతి లభించును . అజీర్ణము తొలగించి ఆకలి వృద్ది అగును. 


 * మలాశయం - 


       మలాశయంలోని మురికి బహిష్కరించబడి అజీర్ణం తొలగును . క్రిములను , బ్యాక్టీరియాలను నాశనం చేయును . 


 * మూత్రపిండములు - 


       మూత్రపిండములలోని విషపదార్ధములు , రాళ్లు బయటకి వెడలును . 


 * ఊపిరితిత్తులు - 


        ఉపిరితిత్తులోని నంజు , నీరు బహిష్కరించబడి ఆయాసము నివారించును . శ్వాసక్రియ చక్కగా జరుగును . 


 * గుండె - 


       గుండె చుట్టు , లోపల చేరిన కొవ్వు , నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును . అధికంగా తినడం వలన రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ అయ్యి గుండెజబ్బులు వచ్చును . 


  * లివర్ , స్ప్లీన్ - 


        ఆహారం జీర్ణం అగుటకు ఇవి ముఖ్యముగా పనిచేయవలెను . ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలో మాలిన్యాలు తొలగించబడి జీర్ణక్రియ వృద్ధిచెందును . 


 * రక్తప్రసరణ - 


       రక్తదోషములు నివారణ జరుగును. ఉపవాసం వలన రక్తప్రసారం చురుకుగా జరుగును. కావున తిమ్మిర్లు , మంటలు , నొప్పులు నివారణ అగును. 


 * కీళ్లు - 


        కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు , నీరు , మాంసం , ఇతర మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును. 


 * నాడి మండలము - 


        ఉపవాసం వలన నాడీ మండలం శుద్ది జరిగి వ్యాధి నివారణ జరుగును. 


 * జ్ఞానేంద్రియములు - 


        జ్ఞానేంద్రియాలలోని మాలిన్యములు కూడా నివారణ అగును. 


 * చర్మము -  


        చర్మము కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కని రంగు వచ్చును . 


 * మనస్సు - 


        మనస్సు నిర్మలం అగును. కోపతాపములు నివారించును . ఆధ్యాత్మిక చింతనకు పునాదులు ఏర్పడును . 


        పైన చెప్పినవే కాకుండా మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి . దురభ్యాసాలను విడుచుటకు ఉపవాసం మిక్కిలి ఉపయోగపడును. ఉపవాసం అనగా ఆహారం తీసుకోకపోవడం ఉపవాసం కాదు. ఉపవాసానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటి గురించి తరవాతి పోస్టులలో వివరిస్తాను . 


  

      మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

5, సెప్టెంబర్ 2025, శుక్రవారం

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి

 

 దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి 

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత తెలియని తెలుగువారు వుండరు. నిజానికి పండిత పామరులకు ఎల్లప్పుడూ నాలుకమీద ఆడే సామెత ఇది.దీనిని సాధారణ సామాజిక అర్ధంలో యేమని అంటారంటే క్రమశిక్షణతో నిర్ణీత సమయంలో పనులు ముగించుకోవాలి. కాలం గడచినతరువాత వగచిన ప్రయోజనం లేదు. ఇంకా కొంచం వివరంగా చెప్పాలంటే సమయంలో చేయాల్సిన పనులు సమయంలోనే చేయాలి కానీ కాలయాపన చేయకూడదు. ఒక రైతు వర్షం రాగానే భూమి దున్ని పైరు వేయటానికి సిద్ధపడాలి, అదే కాలం దాటినదాకా కాలయాపన చేస్తే పైరు పండదు సరికదా పెట్టిన పెట్టుబడికూడా వృధా అవుతుంది

అసలు సామెత ఎలా పుట్టిందా అని ఆలోచిస్తే నాకు తట్టినది. పూర్వం కిరోసిన్ దీపాలు కూడా లేనప్పుడు అంటే అప్పుడు కరంట్ అస్సలు లేదనుకోవాలి. ఆముదంతో దీపాలు వెలిగించేవారట. చిన్న మట్టి ప్రమిదలో ఒకటో రెండో ప్రత్తివత్తులు వేసి ఆముదం పోసి దీపం వెలిగించేవారు. ఇప్పడు మనం దీపావళికి వెలిగిస్తున్నాము. అయితే దీపం ప్రమిదలో ఆముదం వున్నంతవరకు మాత్రం వెలుగుతూ ఉండేది. తరచూ దానిలోని ఆముదాన్ని చూసుకుంటూ రాత్రిపూట ఇంట్లో పనులు చేసుకునేవారు. అంటే వారు దీపం ఆరిపోకముందే అన్నీ పనులు ముగించుకొని మంచం మీదకు చేరాలి. అది వారి దిన చర్య. అంటే త్వర త్వరగా పనులు చేసుకోవాలి. సామెతను మనం ఆధ్యాత్మిక జీవితానికి చక్కగా అన్వయించుకోవచ్చు

ప్రపంచం మొత్తం వెలుగుతో నిండి వున్నది వెలుగు మనకు పగటిపూట సూర్యభగవానులద్వారా వస్తున్నదన్నది అందరకు  తెలిసిన సత్యం. వెలుగు ఉంటేనే ప్రతి వస్తువు ప్రకాశిస్తుంది. వెలుగుతోటె మనకు మనముందు వున్న కుండ కుండగా, గ్లాసు గ్లాసుగా, మనిషి మనిషిగా కనిపించుతున్నాడు. మరి ఆలా కనిపిస్తున్నది ఎవరికి అని ప్రశ్నిస్తే నాకు అని సమాధానం ఇస్తాము నేను ఎవరు అని ఆలోచించి మన మేధావులు మనకు ఇచ్చిన సమాధానం నాలో వున్న నేను నేను అనే ప్రకాశం వలననే నేను నేనుగా బాసిల్లుతున్నాను( తెలియపడుతున్నాను) ప్రకాశాన్ని మన ఋషులు ఆత్మ అని ఆత్మ పరమాత్మ అంశమని మనకు తెలియపరిచారు. మన ఉపనిషత్తులు కూడా సత్యాన్నే తెలుపుతున్నాయి. "అహం బ్రహ్మస్మి' అనే మహా వాక్యము ఇంకా 'తత్వమసి' అనే మహావాక్యాలు విషయాన్నే తెలుపుతున్నాయి. ఒక సూర్యుడు నీరు వున్న అనేక కుండలలో అనేక సూర్యుళ్ళలాగా ఎలా కనపడుతున్నాడో అదేవిధంగా ఒక పరమాత్మా అనేక జీవులలో అనేక ఆత్మలుగా మనకు గోచరిస్తున్నాడు. ఆత్మే జీవులలో (మనుషులలో) వెలిగే ప్రకాశం లేక దీపంగా మనం అభివర్ణించవచ్చు. దీపం ఎంతసేపు వెలుగుతూ వుండాలని నిర్ధారించే ఆముదము మనిషి ఆయుష్షు గా మనం తెలుసుకోవచ్చు. ఏరకంగా అయితే మనం ఇంట్లో దీపం ఆరిపోకముందే ఇంటి కార్యాలన్నీ చక్కదిద్దుకుంటామో అదే విధంగా జీవుడు తనలోని దీపం (ఆయుష్షు) ఆరిపోకముందు తన జీవన వ్యాపారాలన్నీ ముగించుకోవాలి

నేను పుట్టింది శారీరిక సుఖాలను, భోగాలను అనుభవించటానికి కాదు ఇవన్నీ శరీరానికి సంబందించినవి, మరియు తాత్కాలికమైనవి అని ఎప్పుడైతే సాధకుడు తెలుసుకుంటాడో అప్పుడు అతని మనస్సు నిత్యం సత్యము, శాశ్వితము అయిన పరబ్రహ్మ సుఖం వైపు మళ్లుతుంది. అది తెలుసుకున్న ముముక్షువు మోక్షార్ధి అయి సాధన చేసి జీవైక్యం పొందుతాడు. అద్వితీయ అనుభవానికోసం ప్రతి సాధకుడు కృషిచేయాలి. సాధనాత్ సాధ్యతే సర్వం.

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ భార్గవ శర్మ