7, జులై 2020, మంగళవారం

ఇద్దరు ప్రియురాళ్లు

మనం ఇద్దరు ప్రియురాళ్ల గూర్చి తెలుసుకుందాము. 
మొదటి ప్రియురాలు తన ప్రియుడి ఫోటో దగ్గర పెట్టుకొని ఆ ఫొటోలో తన ప్రియుడిని చూసుకుంటూ రోజు ఒక ప్రేమ లేఖ తనకు తెలిసిన అడ్రసుకు రాస్తూ వున్నది.  తన ప్రియుని ఫోటో ఎల్లప్పుడు తన చెంతనే ఉంచుకుంటుంది.  ఆ ప్రియుడి గూర్చి అనేక విధాలుగా స్తోత్రాలు చేస్తూ ప్రియుడు తనని వెతుకుంటూ వస్తాడు చేపడతారు అని ఎప్పుడు అనుకుంటుంది.  అది చూసి తన మితృరాళ్లు ఆమెను యెగతాళి చేస్తూవుంటారు.  అయినా ఆమె తన ప్రయత్నం మానకుండా నిరంతరం తన ప్రియుడిగూర్చి మాత్రమే ఆలోచిస్తూ కాలం గడుపుతుంది. ఏనాడైనా తన ప్రియుడి రాక పోతాడా అనేది ఆమెకు నిరంతరంగా వున్న ఆశ.  ఆమె ఆశ నెరవేరుతుందా? ఆమె ప్రియుడు వస్తాడా అనేది ఒక పెద్ద సమస్య.  ముందుగా తన ప్రియుడికి తాను వ్రాసిన ప్రేమ లేఖ అందిందో లేదో తెలియదు. అందితే తాను ఏ విధంగా స్పందిస్తారో తెలియదు. ఇన్ని ప్రశ్నలు ముందు వున్నా తాను  మాత్రం తన ప్రియుడికోసం ఎదురు చూడటం మాత్రం మానటం లేదు. జీవితాంతం ఎదురుచూసిన సరే తన ప్రియుడిని పొందాలి అన్నదే ఆమె భావన. 

ఇక రెండో ప్రియురాలు గూర్చి తెలుసుకుందాం.  ఈమె కూడా తన ప్రియుడి ఫోటో సంపాయించింది, అంతే కాదు ఎంతో మందిని కలిసి అతి కష్టం మీద తన ప్రియుడి అడ్రస్ తెలుసుకుంది.  అంతే కాదు తన ప్రియుడు ఎక్కడో అమెరికాలో ( చాలా దూరంలో) ఉంటాడు. తాను వున్న పరిస్థితిలో తను  అమెరికా వెళ్లే స్థితి లేదు ఏమిచేయాలి అని ఆలోచనల మీద ఆలోచనలు. చివరికి తన ఆస్తి పాస్తులు తన వద్ద వున్న ధనమంతా కూడగట్టి విమానం ఎక్కి అమెరికా చేరాలని ప్రయత్నం. తాను విమానం ఇంతవరకు ఎక్కలేదు అది ఎలా వుంతుందోకూడా తెలియదు కానీ తన పూర్తి శక్తిని అంతటిని కూడబెట్టుకొని ప్రయాణం మొదలు పెట్టింది. తోటివారు ఆమె ప్రయత్నం చూసి నవ్వుకున్నారు. కొందరు నీకు ఇది సాధ్యం కాదు అని అనటమే కాకుండా ఆమె ప్రయత్నానికి ఎన్నో విధాలుగా అవరోధాలు కలుగ చేస్తున్నారు. కానీ ఆమెకు ఒకటే లక్ష్యం అది తన ప్రియుడిని చేరాలి.  ఆ లక్ష్యం ముందు ఏ అవాంతరం కూడా ఆమెకు కనపడటం లేదు తాను తిన్నది తిననిది కూడా ఆమెకు తెలియటంలేదు. తాను ఏ వస్త్రం ధరించింది అది అందంగా ఉందా లేదా అనే ఆలోచన లేనే లేదు. కేవలం ఒకటే జాశ అది తన ప్రియుడిని చేరుకోవాలన్నది మాత్రమే. ఆ జాస తోటే ఆమె అమెరికా విమానం ఎక్కింది. అమెరికా చేరింది ప్రియుడి అడ్రసు చేరుకుంది ప్రియుడిని కలుసుకుంది. ఇప్పుడు ఆమెకు ప్రియుడు తన కళ్ళ ముందు వున్నాడు.  ఆమెకు ప్రియుడి ఫొటోతో అవసరం లేదు. కేవలం ప్రియుడు తనని కనికరించాలి. ఆమె మనసంతా ప్రియుడు, ప్రియుడు ఇంకోటి లేనే లేదు. 

ఇప్పుడు చెప్పండి పైన వున్న ఇద్దరు ప్రియురాళ్లలో ఎవరు తన ప్రియుడి మనస్సు గెలుచుకుంటారు. ఎవరైనా సరే రెండవ ప్రియురాలే అని వెనువెంటనే చెపుతారు. ఎందుకంటె అదే లోక రీతి. 

పదాల మార్పు: ఇప్పుడు మొదటి ప్రియురాలు అనే పదాన్ని "భక్తుడు' అని రెండవ ప్రియురాలు అనే పదాన్ని "జిజ్ఞాసి" అని ప్రియుడు అనే పదాన్ని "భగవంతుడు" అని మర్చి చదవండి. 

ఆలా చదివితే మీకు రెండు విషయాలు బోధ పడుతాయి. మొదటి ప్రియురాలు కేవలం ప్రియుడి ఫోటో పెట్టుకొని తన ప్రయత్నం చేస్తున్నది.  కాబట్టి ఆమెకు ఫోటో చాలా అవసరం. అంటే భక్తునికి దేముడి ఫోటో, దేముడి విగ్రహం తప్పకుండ కావాలి అవి లేకుండా భక్తుడు దేముడిని ధ్యానం చేయలేదు. షోడాచోపచార పూజలు, సహస్రనామాలు, అష్టోత్తరాలు ఇవి అన్ని ప్రియుడికి వ్రాసే ప్రేమ లేఖలు.  వాటిని ప్రియుడు (భగవంతుడు) గ్రహించి ప్రియురాలిని(భక్తుడిని)  తన వద్దకు చేర్చుకుంటాడా లేదా అనేది ఒక పెద్ద ప్రెశ్న. దీనికి రెండు విధాల అవకాశం వుంది ఒకటి తన వద్దకు చేర్చుకోవచ్చు లేక చేర్చుకోక పోవచ్చు. మొదటి ప్రియురాలు (భక్తులు) లాంటి వారు అనేక మంది ఈ ప్రపంచంలో వుంటారు అందులో ఎవరిని ప్రియుడు (భగవంతుడు) ఎప్పుడు శ్వీకరిస్తాడు, అనేది కూడా అనుమానాస్పదం. కాబట్టి భక్తి మార్గం సుదూరమైనది. 

ఇక  రెండో ప్రియురాలు (జిజ్ఞాసి) గూర్చి ఆలోచిద్దాం. ఈ ప్రియురాలు అనేక కష్ట నష్టాలకు ఓర్చి ప్రియుడిని చేరుకుంది కాబట్టి తనకు ఫొటోతో పని లేదు విగ్రహారాధన షోడశ పూజలు (ప్రేమ లేఖలు) అవసరం లేదు ఎందుకంటె తాను  తన కళ్ళతో తన ప్రియుడిని (భగవంతుని) నిజ స్వరూపం చూస్తున్నది కాబట్టి. ఆ దర్శనంతో తన్మయం ఐపోయంది. ఇక తానూ అనే భావానే లేదు కేవలం ప్రియుడు (భగవంతుడు) ఈ స్థితినే "త్వమేవాహం" అని అంటారు.  ఈ భూమి మీద ఏ కొందరో ఈ స్థితిని చేరుకుంటారు.  వారు ఈ ప్రపంచంలో వుంటారు కానీ ప్రపంచంతో సంబంధంలేకుండా వుంటారు. ఇక్కడి వాళ్ళ దూషణ భిషణాలకు దూరంగా వుంటారు. 

ఏతా వాత తెలిసేది ఏమంటే భక్తి, జ్ఞాన మార్గాలు రెండు కూడా మంచివే కానీ జ్ఞాన మార్గం కష్టతరమైనది.  అయినా ఈ మార్గంతోటె మనం భగవత్ సాక్షాత్కారం పొందటం తొందరగా అవుతుంది.  
ఇప్పుడు మీరే ఆలోచించండి ఈ రెండిటిలో ఏది ఎవరికి ఆచరణీయం. 

గమనిక: ఇక్కడ అమెరికా, విమానం అనేవి కేవలం అవగాహనకు మాత్రమే కల్పించినవి. 

మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి ఈ జగత్తు (ప్రపంచం)  మొత్తం స్త్రీ భగవంతుడు ఒక్కడే పురుషుకు. జగత్తులో వున్నాం కాబట్టి అందరమూ స్త్రీ అంశాలోనే వున్నాము. లింగ దేహం కేవలం ఐహికమైనది మాత్రమే.  అది కేవలం సమాజం కోసమే. భగవంతుని విషయంలో స్త్రీ, పురుష, కుల వర్ణ భేదం లేదు.  ఈ సమాజపు కట్టుబాట్లు కేవలం సమాజం కోసం మాత్రమే పరిమితం.   ఆయన ప్రపంచంలో అందరూ ఒకటే, అందరు సమానమే.  ఈ విషయం తెలుసుకోటానికి మనకు చాలా జ్జ్ఞానం కావలి.  ఆ జ్ఞానం మనకు సత్గురువులు మాత్రమే ఇవ్వగలరు. 



కామెంట్‌లు లేవు: