ప్రతి కుటుంబమూ భగవంతుని ఆరాధన తప్పక చెయ్యాలి. వీలు ఉన్నవారు సరియైన విధివిధానాలను అనుసరించి పెద్ద పెద్ద ఆరాధనలు చేస్తారు. మిగిలిన వారు కనీసంలో కనీసం రోజూ పది నిముషాలైనా ఈశ్వర పూజ చెయ్యాలి. కార్యాలయాలకు, ఉద్యోగాలకు వెళ్ళేవారు కనీసం ఈ లఘు పూజనైనా చేసి తీరాలి. ప్రతి గృహంలో తప్పక ఘంటానాదం వినబడాలి.
శివుడు, అంబిక, విష్ణు, వినాయక, సూర్యుడు ప్రతిమలను తప్పక ఆరాధించాలి. దీనినే ‘పంచాయతన పూజ’ అంటారు. సాంప్రదాయం ప్రకారం వీటిని కరచరణాదులతో అర్చించరు. ఈ ఐదుగురిని ప్రతిబింబించే ప్రకృతి ప్రసాదితములను వాడాలి. నర్మదా నది తీరంలోని ఓంకార కుండంనుండి శివస్వరూపమైన బాణ లింగం, సువర్ణముఖరి నది నుండి సంగ్రహించబడిన అంబిక రూపం, నేపాళంలోని గండకి నది నుండి విష్ణు స్వరూపమైన సాలిగ్రామం, తంజావూరు దగ్గరలోని వల్లంలొ లభించే సూర్య స్ఫటికం, గంగా నది ఉపనది అయిన సోనా నదివద్ద లభించే శోనభద్ర శిల వినాయక స్వరూపంగా మనదేశ ఐక్యతను చూపించే ఈ అయిదు రాళ్ళను పూజించాలి.
వీటికి కళ్ళు, ముక్కు, చెవులు మొదలగునవి ఉండవు. మూలలు లేకపోవడం వల్ల నీటితో శుభ్రపరచడానికి చాలా తేలిక. త్వరగా తేమ ఆరిపోతుంది. పెద్ద పూజగది కూడా అవసరం లేదు, ఒక చిన్న పెట్టె చాలు. ఈ పంచాయతన పూజను పునరుద్ధరించినవారు శంకర భగవత్పాదులు. షణ్మత స్థాపనాచార్యులై ఈ ఐదింటితో పాటు సుబ్రహ్మణ్య ఆరాధనను కూడా కలిపారు. ఈ ఐదు రాళ్ళతో పాటు చిన్న వేలాయుధాన్ని జతపరచాలి.
పూజ చెయ్యడానికి పెద్ద శ్రమ కూడా లేదు. నీకు ధృతి ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ఇంటిలో పూజ చేసుకునేటప్పుడు దేవతామూర్తులకి వండిన అన్నాన్ని మహా నైవేద్యంగా సమర్పించాలి. పరమాత్మ ఈ విశ్వమునంతటిని మనకోసం సృష్టించాడు. మన ఇంద్రియములచేత ఆ సృష్టిలోని వాటిచేత సుఖమును పొందుతున్నాము. అటువంటి వాటిని మనం తీసుకునే ముందు వాటిని భగవంతునికి అర్పించి తీసుకోవాలి. మనం ఏదేని నైవేద్యం సమర్పించేటప్పుడు దాన్ని ఆయనకే ఇచ్చివేస్తున్నమా? కేవలం భగవంతుని ముందు ఉంచి మరలా మనం పుచ్చుకుంటున్నాం.
కొంతమంది హేళనగా అడుగుతారు, ఇవన్నీ భగవంతుడు తింటాడా అని? నివేదన అంటే నిజంగా భగవంతునికి తినిపించడమా? ఆయనకు తినవలసిన అవసరం లేదు. పూజవల్ల మన మనస్సు శుద్ధమవుతుంది. కాబట్టి దాని వల్ల లాభం మనకే భగవంతునికి కాదు. “నివేదయామి” అంటే “నేను నీకు తెలియబరుస్తున్నాను” అని అర్థం, “నీకు ఆహారం పెడుతున్నాను” అని కాదు. మనం భగవంతునితో అదే చెప్పుకోవాలి, “ఈశ్వరా! మీ దయ వల్ల మాకు ఈ ఆహారాన్ని ప్రసాదించావు” అని. అలా భగవంతునికి నివేదించిన దాన్ని ఆయనను స్మరిస్తూ మనం తినాలి.
ఆయన అనుగ్రహం లేకపోతే అసలు బియ్యం ఎలా పండుతుంది. మేధావులు పరిశోధనలు చేసి పెద్ద పెద్ద విషయాలు వ్రాయవచ్చు. కాని అవేవి ఒక గింజ ధాన్యాన్ని కూడా పండించలేవు. కృత్రిమ బియ్యం తయారుచేయాలన్నా భగవంతుడు సృష్టించిన వాటిని ఉపయోగించే తయారుచెయ్యాలి. మనిషి తయారుచేసే ప్రతి వస్తువు చివరకు భగవంతుని సృష్టి కిందకే వస్తుంది. మరి దాన్ని భగవంతునికి నివేదించకుండా మొదట మనం స్వికరిస్తే అది పెద్ద దొంగతనమే అవుతుంది.
--- “దయివతిన్ కురల్“ పరమాచార్య స్వామి వారి ఉపన్యాసముల సంగ్రహము
అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి