*అష్టమ స్కంధము - పండ్రెండవ అధ్యాయము*
*శ్రీమహావిష్ణువు యొక్క మోహినీరూపమును జూచి, పరమశివుడు మోహితుడగుట*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీబాదరాయణిరువాచ*
*12.1 (ప్రథమశ్లోకము)*
*వృషధ్వజో నిశమ్యేదం యోషిద్రూపేణ దానవాన్|*
*మోహయిత్వా సురగణాన్ హరిః సోమమపాయయత్॥6766॥*
*12.2 (ద్వితీయ శ్లోకము)*
*వృషమారుహ్య గిరిశః సర్వభూతగణైర్వృతః|*
*సహ దేవ్యా యయౌ ద్రష్టుం యత్రాస్తే మధుసూదనః॥6767॥*
*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! శ్రీహరి స్త్రీ రూపమును ధరించి, అసురులను మోహింపజేసెననియు, దేవతలకు అమృతమును పంచియిచ్చెననియు పరమశివుడు వినెను. అంతట ఆయన పార్వతీదేవితో సహా వృషభమును అధిరోహించి, భూతగణములతో పరివృతుడై విష్ణులోకమునకు వెళ్ళెను.
*12.3 (మూడవ శ్లోకము)*
*సభాజితో భగవతా సాదరం సోమయా భవః|*
*సూపవిష్ట ఉవాచేదం ప్రతిపూజ్య స్మయన్ హరిమ్॥6768॥*
భగవంతుడైన శ్రీహరి సాదరముగా గౌరీశంకరులకు స్వాగత సత్కారములు నెరపెను. అప్పుడు పరమేశ్వరుడు దరహాసమొనర్చుచు గౌరవపూర్వకముగా శ్రీహరితో ఇట్లు వచించెను.
*శ్రీమహాదేవ ఉవాచ*
*12.4 (నాలుగవ శ్లోకము)*
*దేవదేవ జగద్వ్యాపిన్ జగదీశ జగన్మయ|*
*సర్వేషామపి భావానాం త్వమాత్మా హేతురీశ్వరః॥6769॥*
*శ్రీమహాదేవుడు ఇట్లనెను* దేవదేవా! నీవు సమస్త విశ్వమునందును వ్యాపించిన జగదధీశ్వరుడవు. జగత్స్వరూపుడవు, సమస్త చరాచర ప్రాణములకు మూలకారణము నీవే. నీవు అందరికిని ప్రభుడవు, ఆత్మవు.
*12.5 (ఐదవ శ్లోకము)*
*ఆద్యంతావస్య యన్మధ్యమిదమన్యదహం బహిః|*
*యతోఽవ్యయస్య నైతాని తత్సత్యం బ్రహ్మ చిద్భవాన్॥6770॥*
ఈ జగత్తు యొక్క ఆది మధ్యాంతములు నీ వలననే జరుగుచున్నవి. కాని, నీవు ఆది మధ్యాంత రహితుడవు. శాశ్వతమైన నీ స్వరూపమునందు ద్రష్ట, దృశ్యము, భోక్త, భోగ్యము అను భేదభావములు లేవు. వాస్తవముగా నీవే సత్యము, చిన్మాత్ర పరబ్రహ్మవు.
*12.6 (ఆరవ శ్లోకము)*
*తవైవ చరణాంభోజం శ్రేయస్కామా నిరాశిషః|*
*విసృజ్యోభయతః సంగం మునయః సముపాసతే॥6771॥*
మోక్షకాములైన మహాత్ములు ఇహపరలోకములయందలి ఆసక్తిని, అన్ని కోరికలను పరిత్యజించి, నీ పాదారవిందములను ఆరాధింతురు.
*12.7 (ఏడవ శ్లోకము)*
*త్వం బ్రహ్మ పూర్ణమమృతం విగుణం విశోకమానందమాత్రమవికారమనన్యదన్యత్|*
*విశ్వస్య హేతురుదయస్థితిసంయమానామాత్మేశ్వరశ్చ తదపేక్షతయానపేక్షః॥6772॥*
నీవు అమృతస్వరూపుడవు. ప్రాకృతగుణరహితుడవు. హర్షశోకములు లేని వాడవు. స్వయముగా పరిపూర్ణుడవు. కేవలము ఆనందస్వరూపుడవు. జనన మరణాది వికారములు లేనివాడవు. నీకంటెను వేరైనది ఏదియును లేదు. కాని, నీవు అన్నింటికంటెను వేరైనవాడవు. ఈ విశ్వము యొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు పరమకారణుడవు. జీవుల శుభాశుభకర్మలకు ఫలములను ఇచ్చువాడవు నీవే. జీవుల అపేక్ష మేరకు ఈ మాటలే చెప్పబడును. కాని, నిజమునకు నీకు ఎట్టి అపేక్షలును లేవు.
*12.8 (ఎనిమిదవ శ్లోకము)*
*ఏకస్త్వమేవ సదసద్ద్వయమద్వయం చ స్వర్ణం కృతాకృతమివేహ న వస్తుభేదః|*
*అజ్ఞానతస్త్వయి జనైర్విహితో వికల్పో యస్మాద్గుణవ్యతికరో నిరుపాధికస్య॥6773॥*
స్వామీ! కార్యకారణములు, ద్వైతాద్వైతములును అన్నియు నీవే. ఆభరణముల రూపములలో ఉన్న బంగారమునకును, సహజ సువర్ణమునకును భేదము లేనట్లు భేదాభేదములు అన్నియును నీవే. నీ వాస్తవస్వరూపమును ఎఱుగనివారు నీయందు వివిధ భేదభావములను, వికల్పములను కల్పింతురు. కారణ మేమనగ, నీయందు ఎట్టి ఉపాధులు లేకున్నను గుణములను ఆశ్రయించి, భేదములు ఉన్నట్లు ప్రతీతము అగుచుందువు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
**************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి