🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 76*
*****
*శ్లో:- అరా వప్యుచితం కార్యం ౹*
*ఆతిథ్యం స్వయమాగతే ౹*
*ఛేత్తు: పార్శ్వగతాం ఛాయామ్ ౹*
*నోపసంహరతే ద్రుమః ౹౹*
*****
*భా:- అల్పులకు తన, పర అనే భావం నరనరాన జీర్ణమై ఉంటుంది. ఉదారచరితులు లోకమంతటిని తమ కుటుంబంగా భావిస్తుంటారు. శత్రువైనా సరే ఈర్ష్యాద్వేషాలను, భేషజాన్ని ప్రక్కన పెట్టి, మన ఇంటికి తనంతట తానుగా ఒక మెట్టు దిగి వచ్చినపుడు చుట్టంగా భావించి, చక్కని అతిథి మర్యాద చేయడం మంచిపని. అది విజ్ఞతకు, విచక్షణకు శుభసూచకము. ఎలా అంటే మహావృక్షం కూడా తనను పెద్దగొడ్డలితో కట్టెలనిమిత్తం నరకడానికి వచ్చిన వాడికి కూడ ప్రక్కనే బాసటగా ఉన్న తన నీడను ఉపసంహరించుకోవడం లేదు. చల్లదనాన్ని ఇవ్వడం మానుకోదు. ఫలాలను తినవద్దనడం లేదు. పూలను కోసుకోవద్దనడం లేదు. కర్ణుడు తన ప్రాణాలకు ముప్పని తెలిసినా కవచ కుండాలాలను శత్రుభావనతో వచ్చిన ఇంద్రునికి ఇవ్వడం మానుకోలేదు. ఆవులు, గేదెలు తమను చంపే వాడికి కూడా పాలివ్వడం మానుకోవుగదా! లోకంలో ఉదారులకు తన,పర భేదం లేకుండా సాయపడడమే సహజగుణమని సారాంశము. చంపదగినవాడికి కూడా మేలు చేసి పంపడమే మేలని వేమన ఉద్భోధించడం గమనార్హము*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి