10, నవంబర్ 2020, మంగళవారం

బ్రతుకు బండి

 బ్రతుకుమీద భ్రాంతి లేదు

మృత్యువంటే భయం లేదు

మనుగడ .. మృత్యువుల మధ్య

బ్రతుకు బండి సాగుతోంది

భారంగా !


భోగించాలన్న ఆశాలేదు

యోగి కావాలన్నధ్యాసాలేదు

భోగి.. యోగిల మధ్య

జీవితం జరిగిపోతుంది

జారుకుంటూ!


జ్ఞానికావాలన్న వాంఛాలేదు

అజ్ఞానిగా మిగలాలనీ లేదు

జ్ఞానం.. అజ్ఞానం మధ్య

జీవనం సాగిపోతుంది

పడుతూ.. లేస్తూ !


సంపాదనపై అనురక్తీలేదు

సంపద అంటే విరక్తీలేదు

అనురక్తీ.. విరక్తుల మధ్య

కాలం గడిచిపోతుంది

యధావిధిగా !


చావంటే భయం లేదు

చచ్చిపోవాలనీ లేదు

ఉఛ్వాశ.. నిశ్వాసల మధ్య

ఊపిరి సాగిపోతుంది

నిశ్శబ్దంగా!


ఆకలని  ధ్యాసా లేదు

అన్నం మానాలనీ లేదు

తినటం .. తిరగటం మధ్య

తనువు సాగిపోతుంది

యాంత్రికంగా !


కీర్తి కావాలని కోరుకోవటంలేదు

అపకీర్తి మూటకట్టాలనుకోవటంలేదు

అన్నీ.. అశాశ్వతమని

అందుకోసం ఆరాటమెందుకని

బ్రతుకు సాగుతోంది.. మామూలుగా!


భౌతిక వాంఛలను కాదన్నదీలేదు

ఆధ్యాత్మికతపై విరక్తీలేదు

భౌతికత .. ఆధ్యాత్మికతమధ్య

ఆవిరైపోతుంది ఆయువు

అయోమయంగా!


పాపం చేయాలనీలేదు

పుణ్యం మూట కట్టాలనీలేదు

పాప పుణ్యాల మధ్య

పుణ్యకాలం కరిగిపోతుంది

దిశారహితంగా!

👏👏👏

కామెంట్‌లు లేవు: