*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 9 / Sri Devi Mahatyam - Durga Saptasati - 9 🌹*
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
*అధ్యాయము 2*
*🌻. మహిషాసుర సైన్యవధ - 3 🌻*
దేవతలు, ఋషులు తనను కొనియాడుచుండగా, ఆయాస లక్షణాలు ఏమీ లేని ముఖంతో, ఈశ్వరి అసుర దేహాలపై తన శస్త్రాస్త్రాలను ప్రయోగించింది.
దేవి వాహనమైన సింహం కూడా కోపంతో జూలు విదుర్చుచు అరణ్యంలో కార్చిచ్చువలె అసురసైన్యంలో సంచరించింది. యుద్ధం చేస్తూ దేవి విడిచే నిట్టూర్పులు వెంటనే నూర్లకొలది, వేలకొలది ఆమె సైన్యగణంగా రూపొందుచున్నాయి.
దేవి శక్తిచే అభివృద్ధి నొందుతున్న ఉత్సాహంతో ఈ సైన్యం గండ్రగొడ్డళ్ళతో, గుదియులతో,
అడ్డకత్తులతో తాకి అసురగణాలను నాశమొనర్చెను. ఈ సైన్యంలో కొందఱు ఆ యుద్ధమహోత్సవంలో తప్పెటలు కొట్టారు; కొందరు శంఖాలు ఊదారు. (50-54)
మణికొందఱు మృదంగం వాయించారు. అంతట దేవి తన త్రిశూలంతో, గదతో, బల్లెంలు కురిపించడంతో, ఖడ్గాదులతో నలకడంచేత, నూర్లకొలది మహాసురులను వధించింది. కొందఱిని తన ఘంటానినాదంతో అవశులైన వారిని పడద్రోసింది. ఇతరులను తన పాశంతో బంధించి నేలపై ఈడ్చింది. కొందఱు తీక్ష్మమైన ఆమె ఖడ్గపు వ్రేటులచే రెండుగా నఱకబడ్డారు.
ఇతరులు తీవ్రమైన ఆమె గదదెబ్బలు తిని భూమిపై పడిపోయారు. మరికొందరు ఆమె రొకటిపోటులతో
తీవ్రంగా గాయపడి నెత్తురు కక్కుకున్నారు. కొందరి వక్షం ఆమె త్రిశూల పోటుచే భిన్నమవడంతో భూమిపై పడిపోయారు. (55-59)
కొందరు సురవైరులు ఎడతెగక గ్రుచ్చుకొంటున్న బాణసమూహంచే ముళ్ళపందులను పోలి రణాంగణంలో ప్రాణాలు వదిలారు. కొందరి బాహువులు, కొందరి కంఠాలు తెగిపోయాయి. కొందరి శిరస్సులు నేలపై దొర్లాడాయి. కొందరి నడుములు ఖండింపబడ్డాయి. కొందరు మహాసురులు పిక్కలు తెగిపోవడంతో భూమిపై కూలారు. (60-61)
ఒకే చేయి, ఒకే కన్ను, ఒకే కాలు నిలిచి ఉన్న కొందరిని దేవి మరల రెండు ముక్కలుగా ఖండించింది. మరికొందరు శిరస్సులు ఛేదింపబడి పడిపోయి మళ్ళీ లేచారు. (62)
కొన్ని మొండాలు ఉత్తమాయుధాలు తీసుకుని దేవితో పోరాడాయి. మరికొన్ని మొండాలు ఆ యుద్ధంలో వాద్యాల లయను అనుసరించి నృత్యం చేసాయి. (63)
ఇతర మహాసురుల మొండాలు ఖడ్గాలు, బల్లాలు, కుంతములు ఇంకా చేతబట్టుకుని అప్పుడే తెగిన తలలతో “ఆగు, ఆగు” అని దేవిని ఉద్దేశించి కేకలు వేసాయి.
ఆ యుద్ధం జరిగిన రంగం అసురులు, ఏనుగులు, గుఱ్ఱములు, రథములు కూలి ఉండడం చేత నడువ శక్యంకాకుండా ఉంది. అసురుల, వారి ఏనుగుల, గుజ్రాల రక్తసమూహం వెంటనే మహానదీరూపమై ఆ సైన్యం మధ్యలో ప్రవహించింది.
గడ్డి, కట్టెల పెద్దరాశిని అగ్ని ఎలా క్షయమొనరుస్తుందో అలా ఆ అసుర మహాసైన్యాన్ని అంబిక క్షణమాత్రాన నాశనం చేసింది.
(64–67)
దేవి వాహనమైన సింహం జూలు విదుర్చుచు, మహానాదం చేస్తూ, సురవైరుల దేహాలలో ప్రాణాలకై వెదకుతున్నట్లు ఆ రణరంగంలో సంచరించింది. (68)
అక్కడ దేవీగణాలు అసురులతో చేసిన యుద్ధవైఖరిని చూసి సంతుష్టులై దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. (69)
శ్రీమార్కండేయ పురాణమునందలి సావర్ణి మన్వంతరమున “దేవీ మాహాత్మ్యము” లో “మహిషాసుర సైన్యవధ” యను పేరిటి ద్వితీయాధ్యాయము.
సశేషం....
🌹 🌹 🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి