*ఆధ్యాత్మిక జీవనము*
జ్ఞానాతీత స్థితిని లేదా అధిదైవాన్ని సాక్షాత్కరించుకున్న మహనీయుల్ని ఋషులు లేదా ద్రష్టలు అంటారు. నిజానికి అందరూ ఏదో ఒక విధంగా ద్రష్టలే. ఇంద్రియార్థాల ఆకర్షణలను గ్రహించినవాడు, రూపంలో ఉన్న నక్షత్రాలను, గ్రహాలను గమనించే వాడు, ఇతరుల ఆలోచనలను కనిపెట్టగలిగినవాడు, యోచనలకు సంబంధించిన సిద్ధాంతాలను కనుగొన్నవాడు, మానవ హృదయ పోకడలను తెలుసుకున్నవాడు వీరందరూ ద్రష్టలే. కానీ పరమసత్యాన్ని అంతర్భుద్దితో సాక్షాత్కరించుకున్న వారినే ఋషులంటారు.
అయితే ఇటువంటి అంతర్భుద్ధిని ఉపయోగించే శక్తి ప్రతీ మనిషిలోనూ దాగి ఉంది. దీనినే *దివ్యచక్షువు* అంటారు. భగవద్గీతలో ఈ దివ్య చక్షువుల ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపి అర్జునునితో ఇలా పలికాడు.
*న తు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా*
*దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరమ్*
"నీ చర్మ చక్షువులతో నా విశ్వరూపాన్ని చూడలేవు. నా విశ్వరూపాన్ని చూడడానికి కావలసిన దివ్య చక్షువులను నీకు ప్రసాదిస్తున్నాను."
అయితే మనకున్న ఈ దివ్యచక్షువులను ఇప్పుడే ఉపయోగించలేక పోవడానికి ఉన్న అడ్డంకి మనకున్న *అజ్ఞానం* మాత్రమే. ఈ అజ్ఞానపు మైకం వలన సత్యమే అసత్యం కంటే అధ్వాన్నమైనదిగా కనిపిస్తుంది.
*శుభంభూయాత్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి