✍️...నేటి చిట్టికథ
చిన్నపాటి అవసరం కోసం ఎంతటి మహావృక్షాన్నయినా కొట్టిపారేసే స్వార్థం మనిషిది.
ఆ స్వార్థంతోనే పచ్చటి పుడమి కాస్తా ఎడారిగా మారిపోతోంది.
రుతువులు సైతం గతి తప్పేలా భూమి సెగలు కక్కుతోంది. అందుకనే ‘భూమి కాపాడండి బాబులూ’ అంటూ స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.
కానీ వేల ఏళ్ల క్రితమే మహాభారతంలో పర్యావరణం విలువని గుర్తుచేసే కథ కనిపిస్తుంది.
ఆ కథ ప్రకారం...
అనగనగా కాశీరాజ్యంలో ఓ వేటగాడు ఉండేవాడు. అతను తన బాణాలకి విషం రాసి వాటితో జంతువులను వేటాడేవాడు. అలా ఓ రోజు వేటగాడు యథావిధిగా సమీపంలోని అడవికి చేరుకున్నాడు. అడవిలోపల అడుగుపెట్టగానే అతనికి లేళ్ల గుంపు కనిపించింది. వెంటనే వాటికి గురిచూసి బాణాలు వదిలాడు. వేటగాడి దురదృష్టమో, లేళ్ల అదృష్టమో కానీ అతని బాణాలన్నీ గురితప్పాయి. వాటిలో ఒక బాణం పోయి పోయి నేరుగా ఒక చెట్టులోకి దిగబడిపోయింది.
బాణం కొసకి విషం ఉండటం వల్ల చెట్టు మాడిపోవడం మొదలుపెట్టింది. చెట్టుకి ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి, పండ్లు చెట్టు మీదనే కుళ్లిపోయాయి, కాండం యావత్తూ ఎండిపోయింది
. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక నివాసం ఉంటోంది. తన చిన్నప్పటి నుంచీ ఆ చిలుక ఆ చెట్టులోనే ఉంటోంది. దానికి ఆ చెట్టంటే చాలా అభిమానం. దాంతో ఆ చెట్టుని వీడి పోయేందుకు దానికి మనసు ఒప్పలేదు. నిద్రాహారాలు లేకుండా ఆ తొర్రలోనే బాధపడుతూ కాలం గడపసాగింది చిలుక.
ఒకో రోజూ గడవసాగింది. కానీ చిలుక మాత్రం తన పంతాన్ని వీడలేదు. ఆకలిదప్పులతో అలాగే కాలాన్ని వెళ్లదీస్తోంది. తన సుఖదుఖాలలో భాగమైన చెట్టు అలా మోడువారిపోవడం చూసి దానికి ఆకలే వేయడం లేదు. చెట్టు పట్ల చిలుకకి ఉన్న అభిమానం ఇంద్రుడి వరకూ పాకింది. దాంతో స్వయంగా ఆయనే మానవరూపాన్ని ధరించి చెట్టు దగ్గరకు వచ్చాడు.
‘నీకు నీడనిచ్చిన చెట్టు పట్ల చూపిస్తున్న విశ్వాసం అనితర సాధ్యం. కానీ మోడువారిన చెట్టునే ఆశ్రయించి పచ్చటి నీ జీవితాన్ని ఎందుకు పాడుచేసుకుంటావు. ఈ చెట్టు మీద ఉంటే నీకు పండ్లు కాదు కదా, ఆకులు కూడా దక్కవు. ఈ విశాలమైన అడవిలో నువ్వు జీవనం సాగించేందుకు మరో చెట్టే దొరకలేదా! నా మాట విని అందవిహీనంగా మారిన ఈ చెట్టుని వీడి మరో చోటు చూసుకో’ అని సూచించాడు.
తన దగ్గరకి మనిషిరూపంలో ఉన్నవాడు ఇంద్రుడని చిలుక గ్రహించింది. దాని ఆత్మసౌందర్యం స్వచ్ఛమైంది కదా! అందుకే- ‘అయ్యా! మీరు ఇంద్రుడన్న విషయం నాకు తెలుసు. కానీ నేను ఈ చెట్టుని వీడే ప్రసక్తే లేదు. ఈ చెట్టు మీదనే నేను పుట్టాను, దీని మీదే నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఈ చెట్టు నన్ను కన్నబిడ్డలా, కంటికిరెప్పలా కాపాడుకుంది. ఎండావానల నుంచి, ఆకలిదప్పుల నుంచి, శత్రువుల చూపు నుంచి నన్ను రక్షించింది. ఇలాంటి చెట్టుని కష్టకాలంలో వీడి నేను ఎక్కడికి పోగలను. మనుషులు సంశయంలో ఉంటే దేవతలు వారిని సమాధానపరుస్తారు. కానీ మీరు దేవతలై ఉండి కూడా నా నిశ్చయాన్ని మార్చాలని ఎందుకు చూస్తున్నారు!’ అని చెప్పుకొచ్చింది.
చిలుక నిబద్ధతకి, విశ్వాసానికీ ఇంద్రుడికి నోటమాటరాలేదు. ‘నీలాంటి చిన్న జీవికి కూడా ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. నీ నేస్తం పట్ల విశ్వాసానికి మెచ్చాను. ఏదన్నా వరాన్ని కోరుకో!’ అంటూ అభయమిచ్చాడు.
‘అయ్యా! దయచేసి నన్నూ ఈ చెట్టునీ వేరుచేయకండి. మీరు నిజంగా ఏదన్నా వరాన్ని ప్రసాదించాలనుకుంటే... ఈ చెట్టు మళ్లీ చిగురించేలా... పండ్లు, పుష్పాలతో కళకళలాడేలా దీవించండి,’ అంటూ వేడుకొంది.
చిలుక మాటలకి మురిసిన ఇంద్రుడు ఓ నాలుగు చుక్కల అమృతాన్ని ఆ చెట్టు మీద చిలకరించగానే... అది మళ్లీ జీవం పోసుకొంది.
ఒక చెట్టుని ఆశ్రయించి బతికే చిలుకకే ఇంత విశ్వాసం ఉంటే.... భూమిలోని అణువణువు మీదా ఆధారపడే మనిషికి ఇంకెంత విశ్వాసం ఉండాలి ..
🍁🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి