1, ఫిబ్రవరి 2021, సోమవారం

సులోచన

 *సులోచన సంసారం..*


ఒక శనివారం నాటి సాయంత్రం ఐదు గంటల వేళ.."పల్లకీసేవ ఏడు గంటలకు ప్రారంభం అవుతుందని మైక్ లో చెపుతున్నారు..అందులో ఆడవాళ్లు పాల్గొనవచ్చా?" అంటూ ఒక యువతి నన్ను అడిగింది.."పూజ వరకూ పాల్గొనవచ్చు..పల్లకీ మాత్రం ఆడవాళ్ళ చేత మోయనియ్యరు.." అని చెప్పాను.."ఓహో అలాగా..! " అని..ఒక్కక్షణం ఆలోచించుకుని.."నేనొక్కదానినే వచ్చానండీ..పల్లకీవద్ద పూజ చేయించుకుంటాను..నాకొక టికెట్ ఇప్పించండి.." అన్నది.."సరే నమ్మా.." అని చెప్పి..మా సిబ్బంది వద్దకు వెళ్లి టికెట్ తీసుకోమని చెప్పాను..


ఆరోజు సాయంత్రం ఏడు గంటలకు పల్లకీసేవ లో ఆ యువతి పాల్గొన్నది..పూజారి గారికి తన గోత్రము..భర్తపేరు, తన పేరు..తన అత్త మామల పేర్లు తెలిపి అర్చన చేయించుకున్నది..పల్లకీసేవ వద్ద జరిగే పూజా కార్యక్రమాలు శ్రద్ధగా చూస్తూ..మధ్య మధ్య లో స్వామివారి ఉత్సవ మూర్తికి నమస్కారం చేసుకుంటూ ఉన్నది..పూజ అనంతరం పల్లకీ ని భక్తులు పల్లకీని మోసుకొని ఆలయం వెలుపల మూడు ప్రదక్షిణాలు చేసేటప్పుడు..పల్లకీ వెనకాల దత్తనామం స్మరిస్తూ..తానుకూడా ప్రదక్షిణాలు చేసింది..మొత్తం పల్లకీసేవ లో  అత్యంత భక్తిగా పాల్గొన్నది..


ప్రక్కరోజు ఆదివారం ఉదయం ప్రభాతసేవ ను కూడా మంటపం లో కూర్చుని భక్తిగా చూసింది..శ్రీ స్వామివారి సమాధికి అర్చకస్వాములు ఇచ్చే నక్షత్ర హారతి ని కళ్లకద్దుకొని..ఇవతలకు వచ్చేసింది..మరో గంట తరువాత..మా దంపతులము కూర్చుని ఉన్న చోటుకి వచ్చి నిలబడి.."మీతో కొద్దిగా మాట్లాడాలి..మీకెప్పుడు తీరిక అవుతుందో చెపుతారా..?" అని అడిగింది..మరో గంట వేచి ఉండమని చెప్పాను..మేము కూర్చున్న కుర్చీలకు వెనకాలే కొద్దీ దూరంలో నేల మీద పద్మాసనం వేసుకొని కూర్చుంది..


ఒక గంట తరువాత..స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల తాకిడి తగ్గిన తరువాత..ఆ యువతిని పిలిచాను..దగ్గరకు వచ్చింది.."అమ్మా..ఏదో మాట్లాడాలి అన్నావు కదా..ఇప్పుడు చెప్పుతల్లీ.." అన్నాను..


"మీ ఇద్దరినీ చూస్తుంటే..మా అమ్మానాన్న గుర్తుకొస్తున్నారు.." అని చెప్పి.."నాపేరు సులోచన..మాది నెల్లూరు..నాకు పెళ్లై ఏడేళ్లు అయింది..మా అత్తగారిది కూడా మంచి కుటుంబం..వాళ్లకూ మంచి పేరుంది..అది చూసే..మా నాన్నగారు ఈ సంబంధాన్ని ఒప్పుకున్నారు..అన్నీ బాగున్నాయి కానీ..మా వారికి తాగుడు వ్యసనం ఉంది...మనిషి మంచివాడే..నన్నూ బాగా చూసుకుంటాడు..వ్యాపారం కూడా బాగా చేస్తాడు..కానీ ఏం లాభం..రోజూ రాత్రికి తాగి ఇంటికొస్తాడు..మా పుట్టింట్లో కానీ..అత్తగారింట్లో కానీ..డబ్బుకు కొదవలేదు..అన్ని సౌకర్యాలూ ఉన్నాయి..కానీ ఈయన కున్న ఈ వ్యసనం తో నాకు మనఃశాంతి లేదు..ఇంతవరకూ సంతానం మాకు సంతానం లేదు..అందరు దేవుళ్లకూ మొక్కుకున్నాను..ఈమధ్య ఈ స్వామివారి గురించి విన్నాను..ఎందుకనో ఆశ కలిగింది..ఒక్కసారి ఇక్కడికొచ్చి మొక్కుకొని వెళదామని అనుకున్నాను..మా అత్తగారు కూడా.."నువ్వెళ్ళి స్వామిని వేసుకొని రా..మా వాడు బాగు పడితే..మనమందరం వెళ్లి ఆ స్వామివారి వద్ద మొక్కు చెల్లించుకుందాము.."అన్నది..శనివారం నాడు పల్లకీసేవ అని చదివాను..అందుకే నిన్న వచ్చి, ఆ సేవలో పాల్గొన్నాను..ఇప్పుడు స్వామివారి సమాధికి మొక్కుకుంటాను..నన్ను మీరు కూడా ఆశీర్వదించండి.." అన్నది..


"ముందుగా స్వామివారిని దర్శించుకో.." అని మా ఆవిడ ఆ అమ్మాయికి చెప్పింది..సరే అని చెప్పి..స్వామివారి సమాధి ని దర్శించుకొని..తన బాధ చెప్పుకొని ఇవతలికి వచ్చింది..శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద అర్చన చేయించుకొని..మళ్లీ మా వద్దకు వచ్చింది.."స్వామివారికి గట్టిగా నా గోడు చెప్పుకున్నాను..ఎందుకనో స్వామివారు నన్ను మరో నాలుగు వారాలు రమ్మన్నట్లు గా అనిపించింది..మొత్తం ఐదు వారాలు అవుతాయి..అదికూడా మనసులో అనుకున్నాను..ఇది ఆయన ఆదేశం అనిపించింది..తప్పకుండా నాలుగు వారాలు వస్తాను..ఆపై ఆయన దయ చూపితే..నా సంసారం ఒక గాడిన పడుతుంది..ఇదే చివరి ఆశ.." అని కన్నీళ్లు పెట్టుకున్నది..కొద్దిసేపటి తరువాత తేరుకొని.."వెళ్ళొస్తానండీ.." అని మా ఇద్దరికీ చెప్పి..చటుక్కున మా పాదాలకు నమస్కారం చేసి..వెళ్ళిపోయింది..అనుకున్న ప్రకారమే ఐదు వారాల పాటు సులోచన మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చి..ప్రతివారం పల్లకీసేవ లో అర్చన చేయించుకొని..ఆ రాత్రికి మంటపం లో నిద్రచేసి..తెల్లవారి ఆదివారం స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..తిరిగి వాళ్ళ ఊరెళ్ళింది..ఆఖరివారం లో మళ్లీ మా దంపతుల వద్దకు వచ్చి.."దత్తాత్రేయుడి దయ ఉంటే..మళ్లీ వస్తాను.." అని చెప్పి వెళ్లింది..


ఈ సంఘటన జరిగిన పద్దెనిమిది నెలల తరువాత..పోయిన జూలై నెలలో ఒక శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయం లో రెండు కార్లు వచ్చి స్వామివారి మందిరం ముందు ఆగాయి..అందులోంచి ముందుగా సులోచన..ఆతరువాత సుమారు ఆరుమంది వ్యక్తులూ దిగారు..మాదంపతుల దగ్గరకు వచ్చి.."నేను గుర్తున్నానా..నెల్లూరు నుంచి సులోచనను..ఈయన మా వారు ప్రభాకర్..ఆమె మా అత్తగారు, మా మామగారు..మా అమ్మానాన్న..అందరం వచ్చాము..స్వామివారి దయవల్ల మా సమస్య తీరిపోయింది..ఆయన పూర్తిగా మారిపోయారు.."అని పట్టరాని ఆనందం తో చెప్పింది..పైగాతాను మూడోనెల గర్భవతిని అనికూడా చెప్పింది..


సులోచన సమస్య ఒక్కరాత్రిలో తీరిపోలేదు..సంవత్సరం పట్టింది..కానీ ఆ అమ్మాయి ఓపిక గా స్వామివారినే నమ్ముకొన్నది..స్వామివారు భక్త సులభుడు కదా..అందుకే సులోచన సంసారం చక్కబడింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: