1, ఫిబ్రవరి 2021, సోమవారం

ఋష్యశృంగుడు

 మన మహర్షులు- 10

ఋష్యశృంగుడు

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷


ఋష్యశృంగ మహర్షి గురించి రామాయణము లోని బాల కాండము లో వివరించబడింది.


 దశరథుని మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు


.కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి పుత్రుడే మన ఋష్యశృంగ మహర్షి. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై, 

విబాండక మహర్షి నేర్పుతాడు.


 ఋష్యశృంగుడు బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెరిగాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.


అంగరాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో వర్షాలు పడడం మానేసి అనావృష్టి తో క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగా, వారు ఋష్యశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే రాజ్యములో వర్షాలు పడాతాయి అని మంత్రులు సలహా చెబుతారు.


రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, విషయ సుఖాలంటే తెలియవని, అందువలన ఋష్యశృంగుని రప్పించటం దుర్భేద్యమైన కార్యమని, దానికి తరుణోపాయంగా అందమైన స్త్రీలను ఋష్యశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు.


 ఆ స్త్రీలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తారు. ఆ శబ్దాలకు ఋష్యశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋష్యశృంగుడిని చూసి విభండక మహర్షి ఆశ్రమములో లేడని తెలుసుకొని ఋష్యశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని , స్త్రీపురుష భేదము తెలియని ఋష్యశృంగుడు వారికి ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి, ఋష్యశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋష్యశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. 


వారితో చెలిమి ఏర్పడి  వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది.


కపటనాటకము ద్వారా ఋష్యశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని ఆయన తండ్రి అయిన విభండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటారు.


 రోమపాదుడు తన కూతురైన శాంత ను ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు


ఋష్యశృంగుడు దశరథుడికి పుత్రసంతానం  కోసం అశ్వమేధయాగం, పుత్రకామేష్టి చేయించాడు. కులగురువయిన వసిష్ఠ మహర్షి సహాయంతో పుత్రకామేష్టి శాస్త్రోక్తంగా చేయించాడు ఋష్యశృంగుడు. ఆ అగ్నిహోత్రంలోంచి ఒక దివ్య పురుషుడు వచ్చి ఒక బంగారు పాత్రలో పాయసాన్ని ఇచ్చి దశరథుణ్ణి ఈ పాయసం నీ భార్యలకు ఇస్తే సంతానం కలుగుతుందని చెప్పాడు. పాయసాన్ని నలుగురు భార్యలకు తినిపించి శ్రీరామ భరత లక్షణ శత్రుఘ్నులనే నలుగురు కొడుకుల్ని పొందాడు దశరథుడు. పరమపవిత్రమైన యాగాన్ని పూర్తిచేయించి ఋష్యశృంగుడు భార్య శాంతను తీసుకుని తన తండ్రి విభాండకుడి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు


 తర్వాత ఋష్యశృంగుడు ద్వాదశ వార్షిక యజ్ఞం చేశాడు.


ఋష్యశృంగుడు రాసిన గ్రంథం “ఋష్యశృంగ స్మృతి" అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. దానిలో ఆచారం, శౌచం, శ్రాద్ధం, ప్రాయశ్చిత్తం మొదలయిన వాటి గురించి రాయబడి ఉంది. 


ఋష్యశృంగుడి దేవాలయము ఇప్పటి శృంగేరి కి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో ఉంది. ఈ ఆలయం లో శివలింగానికి శృంగం ఉండడం గమనించవచ్చు..ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది.ఇప్పటికి తీవ్ర క్షామం అనుభవిస్తున్న ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి జగద్గురువుల ఆదేశాల మేరకు పూజలు చేస్తూవుంటారు...వారి ప్రాంతాలు చక్కగా వానలు పడి సుభిక్షమవుతాయి...


🌸జై శ్రీమన్నారాయణ🌸


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: