🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సప్తపది!*
➖➖➖✍️
మూడు ముళ్ల బంధానికి, ఏడు అడుగులకు ఉన్న సంబంధమేంటి ?
సాధారణంగా హిందు వివాహ సాంప్రదాయంలో వివాహ సమయంలో దంపతుల చేత ఏడు అడుగులు వేయిస్తారు. హోమం చుట్టూ వేసే ఆ ఏడు అడుగులనే సప్తపది అంటారు. సప్తపదిలో వేసే ప్రతి అడుగుకు ఒక్కో అర్థముందంటారు మన పెద్దలు.
ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో జరిగే వివిధ క్రతువులకు ప్రత్యేకమైన అర్ధం, పరమార్ధం ఉంది. అపరిచితులైన ఇద్దరు వ్యక్తులను మంత్రబద్ధంగా ఒకటిగా చేస్తుంది వివాహం. పెండ్లి కుమారుడు కళ్యాణమండపానికి వచ్చిన తర్వాత కళ్యాణ దీక్షా కంకణం కడతారు పురోహితులు. అమ్మాయి తల్లితండ్రులు వరునికి కాళ్లు కడిగి , తమ కన్నబిడ్డను ధర్మార్ధ, కామ, మోక్షాలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేయించి కన్యాదానం చేస్తారు. వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టి , పిమ్మట మాంగల్యధారణ జరుగుతుంది.
వివాహ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వధువరుల కొంగు ముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికిన వేలును వరుడు పట్టుకునీ అగ్ని హోత్రం చుట్టూ ప్రదక్షణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్నే సప్తపది అంటారు. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం.
పురోహితుడు వధూవరులిద్దరిని అగ్నిసాక్షిగా జీవితాంతం ఒక్కటిగా కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటామనే ప్రమాణాలు చేయిస్తాడు.
"సప్తపది అంటే ఏడడుగులు కలిసి నడవడం!"
ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిస్తే మిత్రబంధం ఏర్పడుతుందని భావం. అందుకే పెద్దలు వివాహబంధం ఏడడుగుల బంధం అని అంటారు. మరి ఏడు అడుగుల వెనుక దాగున్న పరమార్థాలేంటో తెలుసుకుందాం...
మొదటి అడుగు:
*"ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు"*
ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయుగాక!"
రెండవ అడుగు..
*"ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు"*
ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తిని ఇచ్చుగాక
మూడవ అడుగు:
*త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు"*
ఈ మూడవ అడుగుతో విష్ణువు వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించుగాక.
నాలుగవ అడుగు:
*"చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు"*
ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందమును కలిగించుగాక.
ఐదవ అడుగు:
*"పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు"*
ఈ ఐదవ అడుగుతో విష్ణువు మనకు పశుసంపదను కలిగించుగాక.
ఆరవ అడుగు:
*"షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు"*
ఈ ఆరవ అడుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక.
ఏడవ అడుగు:
*"సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు"*
ఈ ఏడవ అడుగుతో విష్ణువు మనకు గృహాస్తాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమిచ్చుగాక.
మొత్తం జీవితానికి అవసరమయిన అంశాలన్నింటిని ఈ ఏడు అడుగుల్లోకి ఇమిడ్చి ప్రామాణికంగా రూపొందించడాన్నే సప్తపది అని అంటారు.✍️
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి