14, ఫిబ్రవరి 2021, ఆదివారం

మొగలిచెర్ల

 *తపన...ఆర్తి..*


"ఎల్లుండి శనివారం నాటికి మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి రావడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నామండీ..కానీ ఇంతలోనే అవాంతరం ఎదురైంది..మా వారికి ఆఫీస్ లో ఏదో ఎంక్వయిరీ ఉన్నదట..అందువల్ల రాలేకపోతున్నాము..మళ్లీ వీలుచూసుకొని తప్పకుండా వస్తాము.." అని బెంగుళూరుకు చెందిన మహేశ్వరి గారు ఫోన్ చేసి చెప్పారు.."అయితే..మీకొఱకు బుక్ చేసి ఉంచిన రూమ్ ను వేరే వాళ్లకు కేటాయించమంటారా.."? అని అడిగాను.."వేరే వాళ్లకు ఇచ్చేయండి..ఈసారి మేము వచ్చేముందుగా మీకు తెలుపుతాము..ఈసారికి మాకు అదృష్టం లేదనుకుంటాము.." అన్నారు మహేశ్వరి గారు..మహేశ్వరి గారి కొఱకు తీసివుంచిన రూమ్ ను వేరే వాళ్లకు ఇచ్చేసాము..


శనివారం ఉదయం పది గంటల సమయం లో శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం ముందు కారు వచ్చి ఆగింది..అందులోనుండి మధ్యవయస్కులైన దంపతులు దిగారు..వారితోపాటు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా దిగారు..మందిరం లోపలికి వచ్చి..సిబ్బంది ఉన్న టేబుల్ వద్ద నిలబడి.."ఇక్కడ ప్రసాద్ గారంటే ఎవరు?." అని అడిగారు..మా సిబ్బంది నా వైపు చూపించారు..ఆ దంపతులు నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ మొన్న మీకు కాల్ చేసి, మేము రావటం లేదు..మా కోసం ఉంచిన రూమ్ ను వేరేవాళ్లకు ఇవ్వండి..అని చెప్పిన మహేశ్వరిని నేనే..వీరు మావారు రాజరత్నం..వాడు మా అబ్బాయి కార్తీక్..అమ్మాయి సుధారాణి..మావారికి ఆఫీస్ లో పని ఉన్నది అని చెప్పాము కదండీ..కానీ ఆ ఆఫీసర్లు రావడం లేదని నిన్న మధ్యాహ్నం తెలిపారట..మొగలిచెర్ల వెళ్లి ఆ అవధూత మందిరాన్ని చూసి వద్దాము..అని మావారు చెప్పారు..అందుకని వెంటనే బైలుదేరాము..మీకు వీలుంటే మాకోసం ఒక రూమ్ ఇవ్వగలరా?.." అన్నారు.."అమ్మా..ఏవీ ఖాళీ లేవు..కాకుంటే..కామన్ రూమ్ ఒకటి ఉన్నది..సుమారు ఇరవై మంది వరకూ అందులో ఉండొచ్చు..మీరు కాకుండా..మరెవరైనా వస్తే..అందులో మీతో పాటు వుంటారు..ప్రస్తుతానికి అదొక్కటే మార్గం..అందులో వుండండి.." అని చెప్పాను.."సరేలేండి..సర్దుకుంటాము.."అన్నారు..


రూమ్ కు వెళ్లి స్నానాదికాలు ముగించుకొని వచ్చారు..సాయంత్రం జరిగే పల్లకీసేవ గురించి వివరాలు అడిగి..అందులో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేయించుకున్నారు..మధ్యాహ్నం అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి వచ్చి.."ప్రసాద్ గారూ..మీతో మాట్లాడాలి..మాకు సమయం ఇస్తారా.."? అని అడిగారు.."ఇప్పుడు ఖాళీగానే వున్నాను..చెప్పండి.." అన్నాను.."నేను చెపుతాను.." అని రాజారత్నం గారు అన్నారు.."చెప్పండి.." అన్నాను.."మా ఆఫీస్ లో నాకూ..నా పైన ఉన్న అధికారులకూ మధ్య విబేధాలు ఉన్నాయండీ..నేను ఎంత పని చేసినా..ఏదో ఒక లోపం చూపి నన్ను వేధిస్తున్నారు..నేను లంచం తీసుకోను..నా పని వరకూ నిజాయితీగా చేస్తుంటాను..అది వారికి నచ్చటం లేదు..అందువల్ల నన్ను టార్గెట్ చేసుకొని వేధిస్తున్నారు..నాకు మానసికంగా వత్తిడి గా ఉంది..వేరే డిపార్ట్మెంట్ కు వెళదామని ప్రయత్నం చేసాను..నిన్న కూడా నన్ను వేరే చోటుకి బదిలీ చేయమని అప్లికేషను ఇచ్చాను..తీసుకున్నారు..తరువాత చూస్తాం అన్నారు..ఈ పరిస్థితులు మార్చమని అందరు దేవుళ్లకూ మొక్కుకున్నాను..ఈ మధ్య సోషల్ మీడియా లో ఈ స్వామివారి గురించి చదివి..ఇక్కడికి రావాలని నిశ్చయం చేసుకున్నాను..ఇంతవరకూ నా సమస్య చెప్పాను..ఇక రెండోది వినండి..వీడు మా అబ్బాయి..ఇంజినీరింగ్ పూర్తి చేసాడు..క్యాంపస్ లోనే సెలెక్ట్ అయ్యాడు..ఈరోజుకు సరిగ్గా రెండు నెలల తరువాత ఉద్యోగం లో చేరాలి..కానీ ఈ మధ్య తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు..డాక్టర్లకు చూపించాము..మామూలు వైరల్ ఫీవర్ అని చెప్పారు..కానీ..తగ్గడం లేదు..వీడి గురించి కూడా స్వామివారికి విన్నవించుకోవాలని అనుకున్నాము.." అన్నాడు..


"రేపు ఉదయం ప్రభాతసేవ తరువాత స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, మీ సమస్య అక్కడ చెప్పుకోండి..మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది.." అని చెప్పాను..సాయంత్రం పల్లకీసేవ లో ఆ కుటుంబం పాల్గొన్నది..అందరూ స్వామివారి మంటపం లో నేల మీదే పడుకున్నారు..తెల్లవారుజామున రాజారత్నం, మహేశ్వరి గార్లు స్నానం చేసి వచ్చి మందిరం చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేశారు..వాళ్ళ అబ్బాయి కార్తీక్ మాత్రం నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి చేసాడు..తన సోదరుడి తోపాటు అమ్మాయి కూడా అన్ని ప్రదక్షిణాలు చేశారు..ఆ కుటుంబం మొత్తం అత్యంత భక్తి తో మసలుకున్నారు..స్వామివారి ప్రభాతసేవ పూర్తి కాగానే..రాజారత్నం గారి కుటుంబం స్వామివారి సమాధి దర్శించుకున్నారు..స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చారు..


"ప్రసాద్ గారూ..వచ్చేవారం కూడా మేము ఇక్కడకు వస్తామండీ..అలా మొత్తం మూడు వారాలు వస్తాము..ఈ క్షేత్రం లో ఎక్కడలేని ప్రశాంతత ఉన్నది..ఇక మేము బైలుదేరుతామండీ..వచ్చేవారం ఆపై వారం కూడా మాకు రూము వద్దు..మంటపం లోనే పడుకుంటాము..స్వామి సన్నిధి లోనే పడుకుంటే..స్వామికి దగ్గరగా ఉన్నట్టు ఉంది.." అని చెప్పి వెళ్లిపోయారు..


ఆ తరువాత గురువారం మధ్యాహ్నం రెండు గంటల వేళ.."ప్రసాద్ గారూ..నేను రాజారత్నం మాట్లాడుతున్నాను..స్వామివారి దయతో నాకు బదిలీ అయింది..నేను కోరుకున్న డిపార్ట్మెంట్ కే నన్ను మార్చారు..మరో మాట..అక్కడినుంచి వచ్చిన తరువాత మా అబ్బాయి అనారోగ్యం కూడా లేదు..ఉషారుగా వున్నాడు..ఎల్లుండి శనివారం మేము వస్తున్నాము..ఇంకా ఇంటికి కూడా ఫోన్ చేయలేదు..మీరు స్వామివారి దగ్గరే వుంటారు కనుక..మొట్టమొదట మీకే చెపుతున్నాను.." అన్నారు..


అనుకున్న విధంగానే రాజారత్నం గారి కుటుంబం మూడు వారాలూ వచ్చారు..మొదటి వారం లోనే వారి సమస్యలు తీరిపోయినా..ముందుగా మొక్కుకున్న విధంగా మూడు శనివారాలూ వచ్చి పల్లకీసేవ లో పాల్గొని..మంటపం లో నేల మీదే పడుకొని..ప్రక్క ఆదివారం ఉదయం ప్రదక్షిణాలు చేసి..స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్లారు..


స్వామివారి సమాధిని దర్శించుకోవాలి అనే తపన..ఆర్తి..ఉన్నవాళ్లను స్వామివారు తప్పకుండా కాపాడుకుంటారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: