మన మహర్షులు - 22
దధీచి మహర్షి
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
భారతీయ సంప్రదాయంలో త్యాగానికీ, దానానికీ ఓ గొప్ప స్థానం ఉంది.
త్యాగం, దానం అనే వాటిని అందరూ అలవాటు చేసుకోవాలని, అలాంటి వారు సమాజాన్ని ఉద్ధరించటం కోసం, లోకకల్యాణం కోసం జీవితాన్ని గడిపే మహనీయులుగా ఉంటారని మన రుషుల చరిత్రలు వివరిస్తున్నాయి.
గొప్ప గుణాలైన త్యాగం, దానం అనే వాటిని అలవరచుకొని నిస్వార్థంగా తన ప్రాణాలను లోకకల్యాణం కోసం అర్పించిన కారణంగానే దధీచి మహర్షి పేరు ఈ నాటికీ నిలిచి ఉంది.
ఆ మహర్షికి సంబంధించిన కథ ఇది.
దధీచి మహర్షి తండ్రి, చ్యవన మహర్షి తల్లి సుకన్య, దధీచి చిన్నతనం నుంచీ సరస్వతీ నది దగ్గర ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు.
ఒకనాడు ఇంద్రుడు ఉత్తమ
శాస్త్రాలన్నీ దధీచికి చెప్పాడు. ఇవి ఎవరికైనా చెప్తే నీ తల నరికేస్తానని కూడ చెప్పాడు.
ఇది తెలుసుకుని అశ్వినీ దేవతలు దధీచిని కలిసి ఇంద్రుడు చెప్పిన శాస్త్రాలు వాళ్ళకి చెప్పమని అడిగారు. చెప్తే ఇంద్రుడు తలనరికేస్తానన్నాడు కదా.. నీకు ఏమీ కాకుండా మేం చేస్తామని చెప్పి అశ్వినీ దేవతలు మొదట దధీచి తల తీసి వేరే చోట దాచి అతడికి గుఱ్ఱం తల అతికి శాస్త్రాలు నేర్చుకున్నారు.
ఇంద్రుడు వచ్చి దధీచి తల నరికేశాడు. అశ్వినీ దేవతలు వాళ్ళు దాచిన దధీచి తల మళ్ళీ అతికించారు. దధీచి బ్రతికిపోయాడు.
ఇలా తన శ్రేయస్సు గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ఎదుటివారి కోరికలను ఎప్పుడూ తీర్చేవాడు దధీచి.
ఇలా ఉండగా ఒకసారి దక్షప్రజాపతి యజ్ఞం చెయ్యాలని అనుకుని దధీచిని శిష్యులతో కలిసి రమ్మని పిలిచాడు. దధీచి శిష్యుల్ని తీసుకుని వెళ్ళాడు. దక్షప్రజాపతి శివుణ్ణి, శివభక్తుల్ని పిలవలేదు.
దధీచి దక్షప్రజాపతిని నీకీ దుర్భుద్ధి ఎలా పుట్టింది?
దేవాదిదేవుడైన శివుడు లేకుండా యజ్ఞం ఎలా చేస్తావు? అని శివుణ్ణి స్తోత్రం చెయ్యడం మొదలుపెట్టాడు.
దక్షప్రజాపతి ఇక్కడ శివుణ్ణి తలిచే వాళ్ళుంటే వెళ్ళిపొండన్నాడు.
దధీచి శిష్యుల్తో సహాలేచి నేనెన్ని చెప్పినా నువ్వు లెక్క చేయడం లేదు. నీ యజ్ఞం సర్వనాశనమయిపోతుంది. నువ్వు చేస్తున్న యజ్ఞానికి వచ్చిన వాళ్ళు కూడా నాశనమయిపోతారని శపించాడు.
తర్వాత వీరభద్రుడి వల్ల దక్షయజ్ఞం నాశనమయిపోయింది.
రాక్షసులు దేవతల మీద విజృంభించి యుద్ధం చేస్తున్నారు. దేవతలు వాళ్ళ బాధపడలేక శస్త్రాస్త్రాలన్నీ దధీచికి ఇచ్చి దాచమని చెప్పి ఎక్కడికో పారిపోయారు. దధీచి సరే అని ఎక్కువకాలం దాచలేక భస్మం చేసి మంత్రజలం తో అన్నీ మింగేశాడు. అవన్నీ జీర్ణమయిపోయి రక్తనాళాల్లోను ఎముకల్లోనూ చేరిపోయాయి.
లోక కంటకుడైన వృతాసురుడనే రాక్షసుడిని సంహరించటానికి దేవతలు ఆయన దగ్గరకు వచ్చి అత్యంత శక్తిమంతమైన ఆ మహర్షి వెన్నెముకను ఆయుధంగా రాక్షస సంహారానికి ఉపయోగించాలని అనుకుంటున్నట్లు చెప్పగానే దధీచి మహర్షి లోకకల్యాణం కోసం ఎంతో ఆనందంగా దేవతల కోర్కెను మన్నించాడు.
తనకు తానుగా శరీరాన్ని విడిచిపెట్టి..తన అస్తులను ఆయుధాలుగా చేసికొమన్నాడు.
దేవతలు దధీచి అస్థుల్ని వజ్రాయుధం లాంటి ఆయుధాలుగా
చేసుకుని రాక్షసుల్ని సంహరించారు.
దధీచి భార్య పేరు సువర్చల, కొడుకు పేరు పిప్పలాది. కొడుకు కూడా గొప్ప తపస్వి.
దధీచి మహర్షి ఎంత గొప్పవాడో చూశారా!
గొప్ప తపశ్శాలే కాకుండా తను మరణించి తన ఎముకల్ని ఆయుధాలుగా ఉపయోగించుకుని రాక్షసుల్ని చంపమన్నాడు తన శరీరాన్ని మంచి పనికోసం ఉపయోగించాడు.
గొప్పవాళ్ళెప్పుడూ వేరే వాళ్ళకోసమే బ్రతుకుతారని అర్ధమయింది కదా !
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి