||నా దేశాన్ని మేలుకొలుపు తండ్రీ ||
ఎక్కడ పవిత్ర నదుల్లో శవాలు ప్రవహించవో
ఎక్కడ సామాన్యుల మృతదేహాలను శ్మశానాలు తిరస్కరించవో
ఎక్కడ నిరుపేదలను కాసుల ఆసుపత్రులు నిరాదరించవో
ఎక్కడ ప్రాణం కంటే ప్రాణవాయువు ఖరీదు కాదో
ఎక్కడ అత్యవసర మందులు నల్లబజారులో బందీకావో
ఎక్కడ ఆరోగ్యం అంగడి సరుకు కాదో
ఎక్కడ ప్రజారోగ్యం కంటే ఎన్నికల ప్రయోజనాలే పరమావధి కావో
ఎక్కడ దేశం కంటే కొందరు వ్యక్తులు గొప్పవారు కాలేరో
ఎక్కడ అసత్యాలూ, ఆర్భాటాలూ, అహంకారాలూ ఏలికలకు ఆభరణాలు కావో
ఎక్కడ బడులూ, ఆస్పత్రుల కంటే గుడులు గొప్పవి కావో
ఎక్కడ సైన్స్ మీద అజ్ఞానం పెత్తనం చేయదో
ఎక్కడ సత్యానికీ నిర్భయత్వానికీ సంకెళ్ళు పడవో
ఎక్కడ దేశద్రోహం దేశభక్తిగా..దేశభక్తి దేశద్రోహంగా చెలామణి కావో
ఎక్కడ త్యాగాన్ని స్వార్థం.. నిజాయితీని నిర్లక్ష్యం..
దేశ లాభాన్ని సొంత లాభం కబళించవో
అక్కడ ఆ సుందర సుప్రభాత స్వేచ్ఛా స్వర్గంలో
నా దేశాన్ని మేలుకొలుపు తండ్రీ..!!
........................ ...................
(రవీంద్రుడి జ్ఞాపకంలో..)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి