1, జూన్ 2021, మంగళవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*సమాధి గది నిర్మాణం..సూచన..*


*(నలభై ఐదవరోజు)*


శ్రీ స్వామివారు దగ్గరుండి ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు..మీరాశెట్టి దంపతులు ఆర్ధిక సహాయం చేస్తున్నారు..పనివాళ్ళు ను శ్రీధరరావు గారు ఏర్పాటు చేస్తున్నారు..చక చకా నిర్మాణం జరుగుతున్నది..


ఒకరోజు మధ్యాహ్నం తరువాత, మీరాశెట్టి గారు మొగలిచెర్ల లోని శ్రీధరరావు గారింటికి వచ్చారు..మామూలు కుశల ప్రశ్నల తరువాత..తీరుబడిగా కూర్చున్నాక..


"స్వామివారు ఈరోజు ఒకమాట చెప్పారు..ప్రధాన గదిలో.. భూగృహం లాగా కట్టించమన్నారు.. అందులో కూర్చుని తాను తపస్సు చేసుకుంటానని చెప్పారు.." అని మీరాశెట్టి గారు శ్రీధరరావు దంపతులతో చెప్పారు..


ఆ మాట విని ప్రభావతి గారు  ఆశ్చర్యంగా.."ప్రత్యేకంగా భూగృహం నిర్మించమని చెప్పారా?..ఇందులో ఏదో అర్ధం దాగివుంది.." అని..శ్రీధరరావు గారి వైపు చూసి.."శ్రీవారూ!  మీరు వెళ్లి పూర్తివివరం కనుక్కోండి..మీరాశెట్టి గారూ మీరు కూడా తొందరపడి భూగృహం పని మొదలుపెట్టకండి..అన్ని సంగతులూ కూలంకషంగా మాట్లాడి ఆపైన చూద్దాము.." అన్నారు..


"అందుకే గదమ్మా నేను ఇక్కడిదాకా పరిగెత్తుకొచ్చింది..నాకు వివరం చెప్పలేదు..ఇప్పుడు లోపల మళ్లీ గొయ్యి త్రవ్వి..అందులో చిన్న గది లాగా తయారు చేయడం అనేది నాకు మనసుకు సరిగ్గా తోచడం లేదు..మీరిద్దరూ ఒకసారి ఆయనతో మాట్లాడండి.." అని శ్రీధరరావు గారితో ప్రభావతి గారితో చెప్పారు మీరాశెట్టి గారు..


అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు..శ్రీధరరావు గారు ఆలస్యం చేయలేదు..పని వాడికి చెప్పి గూడుబండి సిద్ధం చేయించి..నాలుగు గంటల కల్లా ప్రభావతి గారిని కూడా వెంటబెట్టుకొని మీరాశెట్టి గారితో సహా ఫకీరు మాన్యం చేరారు..


వీళ్ల రాక కోసమే ఉన్నట్లు..శ్రీ స్వామివారు పాక వెలుపల..ఆశ్రమానికి అభిముఖంగా నిలబడి వున్నారు..ముగ్గురూ శ్రీ స్వామివారి వద్దకు వెళ్లి కలిశారు..


"నాయనా..లోపల భూగృహం కట్టించమని చెప్పారట..ఎందుకోసం?..మీ తపస్సుకు ఈ గది సరిపోతుందని మీరే చెప్పారు కదా!..మీరిచ్చిన కొలతల ప్రకారమే నిర్మాణం జరుగుతున్నది..మధ్యలో ఈ భూగృహ ప్రస్తావన ఎందుకు?.." ప్రభావతి గారు గబ గబా అడిగేసారు..


శ్రీ స్వామివారు పక పకా నవ్వారు.."మీరాశెట్టి మిమ్మల్ని వెంటబెట్టుకొచ్చాడా?..సరే!..రండి..ఈ సందేహం కూడా నివృత్తి అవ్వాలి గదా!.." అన్నారు శ్రీ స్వామివారు ..


వీళ్ళందరినీ వెంటబెట్టుకొని ఆ గది ముందు వైపు నిలబడి గంభీరంగా చూస్తూ..


"అమ్మా!..నేను సాధకుడిని..తీవ్ర సాధన నా లక్ష్యం..ఇక్కడ గది లాగా కట్టిస్తున్నారు..బాగానే వుంది..దానికి తలుపులు కూడ వస్తాయి..నేను లోపల కూర్చుని ధ్యానం చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది లేదు..కానీ తరచూ హఠయోగ ప్రక్రియలో సమాధి స్థితి కి వెళుతుంటాను..ఆ సమయంలో ఒక్కొక్కసారి చిన్నపాటి అలికిడికి కూడా సమాధి స్థితి భగ్నం అవుతుంది..ఇతమిద్దంగా ఇలా జరుగుతుంది అని నేను మీకు వివరించలేను..అది అనుభవించేవారికే అవగతం అవుతుంది..అందుకని నేను ముందుగా ప్రతిపాదించిన గదిలోనే..నాలుగు అడుగుల లోతు.. నాలుగడుగుల వెడల్పు తో చిన్న గది "నేలమాళిగ" లాగా కట్టించమన్నాను..నా తపోసాధన కొఱకు జాగ్రత్తలు నేను తీసుకోవాలి కదా?.."


"మరో విషయం కూడా మీకు తెలియచేయాల్సిన అవసరం ఉంది..నా తదనంతరం ఈ ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది..ఇప్పుడు నిర్మించబోయే ఆ భూగృహమే నా సమాధి అవుతుంది..నేను అందులోనే వుండబోతాను..ఎందరో తమ తమ కోర్కెలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు..ఆ సమాధినే దర్శించి తరిస్తారు..ఇక్కడ నేను ధారపోస్తున్న తపశ్శక్తి మహిమాన్వితం అయినది..అది ఈ క్షేత్రం లో కొన్ని వందల ఏళ్ల పాటు నిక్షిప్తమై ఉంటుంది..ప్రతి పనికీ ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది..నాకు నిర్దేశింపబడిన కర్మను నేను పూర్తిగా నెరవేర్చి..మోక్షానికి వెళతాను..నేను చేస్తున్న ఈ తపో యజ్ఞానికి సహాయం చేసిన మీ అందరి పేర్లూ కూడా చిరస్థాయిగా నిలచిపోతాయి.." 


శ్రీధరరావు దంపతులతో పాటు మీరాశెట్టి గారు కూడా నివ్వెరపోయి వింటున్నారు..ఇంతా ఈ ఆశ్రమ నిర్మాణమే ఓ కొలిక్కి రాలేదు..మరి ఈ స్వామివారేమో..తన తదనంతరం ఇక్కడ సమాధి ఉంటుంది అని చెపుతున్నారు..ఇంతా చేస్తే శ్రీ స్వామివారు ముప్పై యేళ్ళ వయసుకూడా లేని యువకుడు..అప్పుడే మోక్షం గురించిన ఆలోచనలు చేస్తున్నారే.. పరి పరి విధాల ఆలోచించి ఆయోమయానికి గురయ్యారు..


"మీరు చెప్పినట్టు ఆ నేలమాళిగను సిద్ధం చేయిస్తాము..మీరు నిశ్చింతగా తపస్సు కొనసాగించండి..మోక్షం..సమాధి..ఇవన్నీ ఇప్పుడెందుకు స్వామీ!..మీలాటి సిద్ధపురుషులు కొంతకాలం పాటు మా మధ్యలో వుండి.. మాకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయాలి..ఇప్పుడిప్పుడే ఇటువంటి ఆలోచనలు చేయకండి.." అన్నారు శ్రీధరరావు గారు..


శ్రీ స్వామివారు ఒక్కసారిగా పెద్దగా నవ్వి.."కాలమహిమను ఎవ్వరూ తప్పించలేరు..ముందు ముందు అన్నీ మీకు అర్ధం అవుతాయి.." అన్నారు..


శ్రీ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి..ఇవతలికి వచ్చేసారు..మీరాశెట్టి గారు అటునుంచి అటే తమ గ్రామానికి వెళ్లిపోయారు..శ్రీధరరావు దంపతులు మాత్రం శ్రీ స్వామివారి మాటలనే తలుచుకుంటూ మౌనంగా మొగలిచెర్ల కు చేరారు..


తపోసాధన..సందేహం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: