శివ శబ్ద మహిమ
#శివ_శబ్ద_మహిమ
ఒకసారి ఓ పల్లెటూరి వానికి ఒక సందేహం కలిగింది. అతడు ఒక యోగి దగ్గరకు వెళ్లాడు. శివా అని పిలిచినంతనే పుణ్యం వస్తుంది అంటారు కదా. నిజంగా వస్తుందా అని అడిగాడు. అతడీ ప్రశ్నను కైలాసవాసుడే విన్నాడు. యోగి దగ్గరకు సన్యాసిగా వచ్చి ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను అన్నాడు. యోగి చిరునవ్వుతో అంతకన్నా కావాల్సింది ఏముంది స్వామీ అన్నాడు. ఓ జానపదుడా ఇదిగో ఈ నీకు కనిపించే ఈ చీమ చెవి దగ్గర ‘ఓం నమశివాయ’ అని అరువు అని చెప్పాడు. చీమ చెబుతుందా అన్నాడు జానపదుడు. ముందు అయితే చెప్పింది చేయి అన్నాడు సన్యాసి. జానపదుడు అట్లాగే చేశాడు. చీమ కాస్తా ప్రాణాలు కోల్పోయింది. రామ రామ! ఎంత ఘోరం జానపదుడు అనుకొన్నాడు. అట్లానే సీతాకోక చిలుక, లేడి దగ్గర శివనామం చెప్పించి వాటినీ హరీ అనిపించాడు. అంతలో అక్కడికి ఓ దంపతులు అప్పుడే పుట్టిన శిశువును తీసుకొని వచ్చి అయ్యా! ఈ శిశువును ఆశీర్వదించండి అన్నారు. సన్యాసి ఎప్పటిలాగా శివనామం చెప్పమన్నాడు. జానపదుడు గడగడా వణికి, అయ్యా! అన్నాడు. మరేం ఫర్లేదు చెప్పు అని ప్రోత్సహించాడు సన్యాసి. ‘నమఃశివాయ’ అని జానపదుడు అనగానే ఆ శిశువు ‘అయ్యా! పరమ పుణ్యచరితా! మరొక్కసారి నమశివాయ అనవా’ అన్నాడు. ఇదేమి చిత్రం అని చూస్తుంటే ఆ శిశువు ఇలా చెప్పాడు. ‘అయ్యా! చీమ దగ్గరనుంచి ఇప్పటిదాకా ఆ శివనామం చెపితేనే మనిషిగా మారాను. మరి ఇప్పుడు మరోసారి శివనామం వింటే నేను దివ్యునిగా మారిపోతాను కదా. సందేహం ఎందుకు’ అన్నాడు. శివశబ్దంలోని మహిమ తెలుసుకొన్న జానపదుడు ఆగకుండా శివనామాన్ని జపిస్తూ కదులుతున్నాడు.
ఓంనమఃశివాయ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి