21, జూన్ 2021, సోమవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*శ్రీ స్వామివారి సమాధి..ఒక పుణ్యక్షేత్రం..*


*(అరవై ఐదవ రోజు)*


శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందిన పిదప..శ్రీ స్వామివారి పార్థివదేహాన్ని ఆశ్రమం లోని ప్రధాన గది లో ఉన్న నేలమాళిగ లోనే సమాధి చేయడం జరిగిపోయింది..శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించారు..


1976 మే 7వతేదీ మధ్యాహ్నం నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు..విజయవాడ నుంచి శ్రీ చెక్కా కేశవులు గారు, వారి తోడల్లుడు మెంటా మస్తాన్ రావు గారు కూడా ఆరోజు మొగలిచెర్ల చేరుకున్నారు.. మీరాశెట్టి గారు అక్కడే వున్నారు..అందరూ కలిసి..శ్రీ స్వామివారి ఆశ్రమమును నిర్వహించే బాధ్యత శ్రీధరరావు గారికి అప్పజెప్పారు..వారూ సరే నన్నారు..ప్రస్తుతానికి యెవరినైనా ఒక మనిషిని కాపలాగా ఉంచుదాము అని ఆలోచన చేశారు..కానీ వారికి ఆ నిమిషంలో తెలీదు..ఇంకో రెండు మూడు రోజుల కల్లా భక్తులు వెల్లువలా వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుంటారని..


"సంతానం కావాలంటే..మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద మ్రొక్కుకోండి..సంతానం కలుగుతుంది.."!


"గ్రహ బాధలున్నాయా?..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద వర పడండి.. తీరి పోతాయి!.."


"దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తున్నారా..ఆ స్వామి వద్ద నిద్ర చేయండి..క్షణంలో బాగు పడతారు!.." 


ఇలా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడసాగింది..అందుకు తగ్గట్టే దృష్టాంతరాలు కనబడ సాగాయి..


మే 9వ తేదీ ఆదివారం నాటి నుంచి శ్రీ స్వామివారి సమాధి దర్శించడానికి భక్తులు రావడం మొదలుపెట్టారు..వెంటనే శ్రీధరరావు గారు ముందుగా అక్కడొక పూజారిని ఏర్పాటు చేశారు.. శాస్త్రోక్తంగా పూజా విధానాలు ఏర్పడ్డాయి..క్రమంగా భక్తుల రాక పెరగసాగింది..అనతి కాలంలోనే..శ్రీ స్వామివారి ఆశ్రమం కాస్తా.."శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం"  గా రూపాంతరం చెందింది..మట్టి రోడ్డు వేసారు..బస్సులు నేరుగా మందిరం వద్దకే రాసాగాయి..విద్యుత్ సౌకర్యం వచ్చింది..ఒకటి రెండు దుకాణాలు వెలిశాయి..కొంతమందికి ప్రత్యక్ష..మరికొంతమందికి పరోక్ష ఉపాధి కల్పన జరిగింది..మెల్ల మెల్లగా మొగలిచెర్ల గ్రామం పేరు.. శ్రీ స్వామివారి మందిరం వలన అందరికీ తెలియసాగింది..


"ఇది దత్తుడి భూమి!..పుణ్యక్షేత్రంగా మారుతుంది!.." అని శ్రీ స్వామివారు పదే పదే చెప్పిన మాట శ్రీధరరావు ప్రభావతి గార్ల మనసులో వినబడుతూ ఉండేది..అందుకు తగ్గట్టు గానే..మొగలిచెర్ల గ్రామ శివార్ల లో ఉన్న తమ భూమి..అదికూడా ఒకప్పుడు  ఫకీరు మాన్యం గా పిలవబడ్డ బీడు భూమి..నేడు తమ కళ్ల ముందే..వేలాది మందికి స్వాంతన చేకూర్చే పుణ్య ప్రదేశంగా మారిపోయింది..ప్రస్తుతం అన్నదానమూ జరుగుతున్నది..ఎంతో మంది భక్తులు తమ తమ బాధలు తీరిపోయాయని చెప్పుకుంటూ వుంటారు..కొంతమంది భక్తుల అనుభవాలను ముందు ముందు రోజుల్లో తెలుసుకుందాము..


ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరియు శ్రీ స్వామివారు సిద్ధిపొందిన వైశాఖ శుద్ధ సప్తమి తిథి నాడు శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవం ఘనంగా జరుగుతాయి..(ఈ సంవత్సరం ఏప్రిల్ 22 వ తేదీ నాడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన..)


ప్రతి చరిత్రకూ ముగింపు తప్పనిసరి..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర నేటితో సమాప్తి చేస్తున్నాను ..ఈ చరిత్ర చదివి ఎంతో మంది నన్ను ప్రోత్సహించారు...వారందరికీ పేరు పేరునా నా ధన్యవాదములు..


అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే..


ఇది ఒక సాధకుని తపోభూమి..


ఇది ఒక అవధూత ఆశ్రమం..


అదే..మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..


శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్న భక్తుల అనుభవాలు..శ్రీ స్వామివారి లీలలు..రేపటి నుండి ధారావాహికంగా చదువుకుందాము..


సర్వం

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: