29, నవంబర్ 2021, సోమవారం

రాముడిలో

 *రాముడిలో ఏమంత గొప్పదనం ఉంది?*

 

*మాయలు మంత్రాలు చూపించలేదు.*

*#విశ్వరూపం ప్రకటించలేదు.*


*జీవితంలో ఎన్నో కష్టాలు... జరగరాని సంఘటనలు... చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు.*


*పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు... తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు.*


*కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు... అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస వధ చేశాడు.*


*అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు.*


*అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ... ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.*


*💠 శాస్త్ర ధర్మం 💠*


*తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే.*


*💠 స్నేహ ధర్మం 💠*


 *మాయలేడి కారణంగా సీతమ్మను వదలి, పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని, రావణుడిని ముప్పు తిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు  నేలకూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహ ధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా మహనీయుడు.*


 *💠 యుద్ధ ధర్మం 💠*


*వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు... వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియధర్మం. అంతేకాదు, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.*


*రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు*


*మరణాంతారం వైరాని నివృత్తం నః ప్రయోజనం | క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ||*


*‘విభీషణా! శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అంటాడు... ఇదీ రాముడి ధర్మవర్తన.*


*💠 దయా ధర్మం 💠*


*సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్య బహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్రతీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య.*


*అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంకారాజ్యానికి రాజును చేస్తానని ప్రతి


జ్ఞ చేస్తాడు. కానీ, సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు. అంతా విన్న రాముడు విభీషణుడే కాదు... చివరకు రావణుడే తనను ఆశ్రయించినా... అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం క్షత్రియధర్మం. దయాధర్మం కూడా. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధభూమిలో ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు.*


*💠 మనుష్య ధర్మం 💠*


*రామరావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలూ ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు...’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు.*


*‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’*


*అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే. సాధారణ వ్యక్తిని మాత్రమే’ అంటాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్యధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలూ అనుభవించాడు. మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు.*


*💠 సోదర ధర్మం 💠*


*రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుంది? రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! నీవెవరు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా? అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్రమూర్తీ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ,  సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామా! ధన్యురాలను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ... పరస్త్రీల పై రామయ్య చూపించే సోదరధర్మం.*


*పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి... కాలపరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం.*


*రాముడు అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళిక బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం. మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి. వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది.*


*రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే శ్రీరామ జయరామ జయ జయరామ*


*🕉️🙏🙏🙏 🚩జై శ్రీ రామ్🚩

కామెంట్‌లు లేవు: