29, నవంబర్ 2021, సోమవారం

పెళ్లి అడ్డంకులు తొలగించే వ్రతము

 పెళ్లి అడ్డంకులు తొలగించే వ్రతము


సీత,రాముల వివాహా వేడుకనే వివాహపంచమి అని పిలుస్తారు.


హిందూ అచారా సాంప్రదాయాల ప్రకారం సీతారాముల పెళ్ళిరోజును పండుగగా జరుపుకోవటం అనవాయితీగా వస్తుంది. నవంబరు – డిసెంబరు నెలల మధ్యకాలంలో శుక్లపక్షపు ఐదవ రోజున ఈ వేడుక జరుపుకుంటారు. సీతాదేవి శ్రీరామచంద్రుడు వివాహం చేసుకున్నారని పురాణాలు చెప్పడంతో ప్రతి ఏడాది సీతారాముల వివాహ వార్షికోత్సవం నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తోంది.


సీతారాముల వివాహ బంధాన్ని నేటికి అంతా ఆదర్శంగా భావిస్తున్నారు. ఎక్కడైన వివాహ వేడుకకు హాజరైతే తప్పకుండా పెళ్ళిజంటను సీతారాముల్లా కలకాలం అన్యోన్యంగా ఉండాలని దీవిస్తుండటం మనం చూసే ఉంటాం. అంటే సీతారాముల వైవాహిక జీవితం ఎంతగా ఆదర్శవంతంగా మారిందో అర్ధమౌతుంది. సీతకోసం రాముడు, రాముని కోసం సీత ఇలా వారి జీవితం కష్టాల నడుమ సాగిన వైనాన్ని నేటి తరానికి కధలు కధలుగా చెప్తుంటారు.


భర్త అడువులకు వెళుతుంటే రాజప్రసాదంలో ఉండలేక భర్తతో అడవిలో కష్టాలు అనుభవించటానికైనా సిద్దమై అతనితో కలసి అడవుల బాటపడుతుంది. ప్రస్తుతం భార్యభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకుని ఎలాంటి పరిస్ధితులు ఎదురైనా ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ వైవాహిక జీవితాన్ని ముందుకు సాగించాలి.


రావణుడు సీతను అపహరించుకు వెళ్ళిన సందర్భంలో లంకలో ఆమె మనస్సు మార్చే ప్రయత్నం రావణుడు చేసినప్పటికీ ఆమెకు రామునిపై ఉన్న ప్రేమ,అప్యాయత ఏమాత్రం చెరగలేదు. రాముడు తనను లంకనుండి విడిపించుకు తీసుకువెళతాడన్న నమ్మకంతో ఉంది. అదే సమయంలో రాముడు సైతం భార్యకోసం, ఆమె జాడకోసం అనేక ప్రయత్నాలు చేసి చివరకు ఆమెను విడిపించుకుని తీసుకురావటం కూడా రామునికి సీతపై ఉన్న ప్రేమానురాగాలను తెలియజేప్తుంది.


అలాంటి అదర్శదంపతుల వివాహమహోత్సవపు రోజును నేటికి వివాహ పంచమిగా ప్రతిఏటా నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. వివాహ పంచమి వ్రతం ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్ల పక్షంలో 5వ రోజును వివాహ పంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదిన వివాహ పంచమి నిర్వహించనున్నారు. వివాహ పంచమి డిసెంబర్ 07, 2021 రాత్రి 11 గంటలకు ప్రారంభమై, 08 వ తేదీ డిసెంబర్ 2021 రాత్రి 09 గంటల 25 నిమిషాలకు ముగుస్తుంది.


ఈ వివాహ పంచమి వ్రతం రోజు పెళ్లి కాని వారు వివాహ పంచమి వ్రతం చేయటం వల్ల వారికి తొందరగా వివాహ గడియలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోయి అనంతరం వివాహం జరగడమే కాకుండా వీరి వైవాహిక జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా గడుపుతారు. వివాహపంచమి రోజు హిందువులు ఈ వ్రతాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పంచమి రోజు సీతారాముల ప్రతిమలను ప్రతిష్టించి వారికి వివాహం జరిపించి వివిధ రకాల నైవేద్యాలతో పూజించడం వల్ల వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది.


భారతదేశం, నేపాల్ లోని మిథిల ప్రాంతంలో శ్రీ రాముడితో సంబంధం ఉన్న దేవాలయాలు, పవిత్ర స్థలాలలో సీత, రాముడి వివాహ ఉత్సవంగా జరుపుకుంటారు. సీతారాముల ఆలయంల్లో ఘనంగా వేడుకలు, పూజలు, యాగాలు నిర్వహిస్తారు. చాలా ప్రాంతాలలో శ్రీ రామచరితమానస్ పారాయణం చేస్తారు. నేపాల్‌ ప్రాంతంలో సీతాదేవి జన్మ స్థలమని నమ్ముతారు అందుకే ఆప్రాంతంలో వివాహపంచమి వేడుకలను వైభవంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకలను తిలకించేందుకు మనదేశం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రతిఏటా తరలి వెళుతుంటారు.

కామెంట్‌లు లేవు: