3, జనవరి 2022, సోమవారం

హవిర్ హరయే నమః🙏🕉️

 🕉️🙏హవిర్ హరయే నమః🙏🕉️


 ఒకానొకకాలంలో కుంభకోణంలో సుదర్శనుడనే విష్ణుభక్తుడు నివసిస్తూండేవాడు. 


ఆయనకు తన ఇంటికి సమీపంలోనే శ్రీరాముడికి , శ్రీకృష్ణుడికి ఆలయాలను నిర్మించి తరించాలనే కోరిక కలిగింది.

కాని ఆయనవద్ద ఒక ఆలయం నిర్మించడానికి కావలసిన ధనం మాత్రమే వున్నది. ఎవరికి ఆలయం నిర్మించాలనే సంశయంలో పడ్డాడు సుదర్శనుడు.


 ఒకనాటి రాత్రి సుదర్శనుని స్వప్నంలో శ్రీరాముడు

గోవులను కాస్తూ కనిపించాడు. సుదర్శనునికి

ఆశ్చర్యం కలిగింది. "కృష్ణుడు కదా..గోవులని కాసేది ? 

గోవులను మేపినందున

కదా 'గోపాలకునిగా' పిలువబడుతున్నాడు .


మరి ఇక్కడ రాముడు గోపాలకునిగా

దర్శనమిస్తున్నాడే , ఏమిటి దీని అంతరార్ధం అని ఆలోచించాడు. అప్పుడు రాముడు సుదర్శనునితో , 

' కృష్ణుడు మాత్రమే గోపాలకుడా? నేను

గోవుల కాపరిగా వుండతగనా

ఒప్పుకోరా? అని ప్రశ్నించాడు. ఇంతలో కల చెదిరింది.


తృళ్ళిపడి లేచాడు సుదర్శనుడు. మహావిష్ణువు

తనకి ఏదో సంకేతమివ్వబోతున్నాడని భావించాడు.


మరునాడు ఉదయం కుంభకోణంలోని సారంగపాణి

ఆలయానికి వెళ్ళి అక్కడ కొలువైయున్న మహావిష్ణువుని శరణు వేడుకుని

 " స్వామీ ..మీరు నాకేదో సందేశమివ్వ

బోతున్నారు

అదేమిటో తెలియజేసి కర్తవ్యం ఆజ్ఞాపించడని కోరాడు.


అప్పుడు మహావిష్ణువు ఆ ఆలయంలో వున్న ఒక అర్చకుని ద్వారా సుదర్శనునికి

ఒక విషయం తెలియచేశాడు.

" సుదర్శనా.. నీవు వున్న నివాసానికి సమీపమున

రాముడే గోపాలకునిగా

కొలువై వుంటాడు. "   

శ్రీరాముని మూలవిరాట్ గా గోపాలకుడైన శ్రీకృష్ణుని 

ఉత్సవ విగ్రహంగానూ ప్రతిష్టించమని పరమాత్మ అనుజ్ఞ అని బోధించాడు. 


భగవంతుని కరుణకు పాత్రుడైన సుదర్శనుడు పరమానందంతో రాముని

మూల విగ్రహంగాను , కృష్ణుని

ఉత్సవ విగ్రహంగాను ప్రతిష్టించడానికి ఏర్పాట్లు ఆరంభించాడు 


కానీ ఆ ఊరులో నివసించే ఒక పండితుడు లోక విరుధ్ధమైన ఈ ఆలయ నిర్మాణానికి అడ్డుతగిలాడు.

ఉత్సవ విగ్రహం, మూలవిగ్రహం ఒక స్వామివే

అయివుండాలి, ఉత్సవమూర్తి

కృష్ణుని గా, మూలవిగ్రహం

రామునిగా ప్రతిష్టించి

పూజించరాదు అని అన్నాడు.

నేను రామునికి, కృష్ణుని కి వేరు వేరు

ఆలయాలు నిర్మించలేక

పోతున్నానని

చాలా రోజులుగా బాధ పడ్డాను. 

ఇప్పుడు నారాయణుని

ఆనతి ప్రకారం ఇద్దరికి కలిపి ఒక ఆలయం నిర్మించాలనుకుంటే బయటవారి

 అడ్డంకులు ఏర్పడినందుకు అమితంగా విచారించాడు సుదర్శనుడు.

ఆ సమయంలో ఒక బాలుడు అక్కడకి వచ్చి పండితునితో

"కృష్ణునికి మాత్రమే గోపాలుడనే పేరు సార్ధకమని మీరెలా చెపుతారు. 

గో అనే వేదాలను విశ్వప్రళయ సమయాన  

మత్స్యావతారం ధరించి కాపాడిన 

మహావిష్ణువు గోపాలుడే.

గో అనే పర్వతాన్ని వీపు మీద మోసి కాపాడినందున 

కూర్మమూర్తి కూడా గోపాలుడే.

భూమి జలప్రళయంలో

ములిగిపోకుండా సముద్రమునుండి కాపాడిన

వరాహమూర్తి గోపాలుడే.

ప్రహ్లాదుడు ' గో ' అని స్తుతించగానే దయతో

అనుగ్రహించిన నారసింహుడు గోపాలుడే.


' గో' అనే భూమిని తన మూడడుగులతో కొలిచిన వామనుడు

గోపాలుడని పిలువబడుతున్నాడు.

గో అనే భూలోకంలోని

అధర్మాన్ని నాశనం చేసి శిష్ట రక్షణ చేసిన

పరశురాముడు గోపాలుడే.

" గో' అనే భూలోకాన్ని పాలించిన రాముడు 

గోపాలుడే. 

గో అనే భూమిని

నాగలితో దున్నిన బలరాముడు

గోపాలుడే.  


భవిష్యత్తులో అవతరించబోయే

 కల్కి కూడా యీ భూమిని కాపాడే గోపాలుడే.

" ఈమాత్రం తెలియని మీరూ ఒక

పండితులేనా ? " అని హేళనగా నవ్వి

ఆ బాలుడు మాయమైనాడు.

ఆ బాలుడు మహావిష్ణువు కాదు అనడానికి వీలులేదు.


మహావిష్ణువు అనుగ్రహం ప్రకారం ,సుదర్శనుడు 

కోరుకున్న విధంగా ఉన్నతమైన ఆలయం నిర్మించబడినది.

సంప్రోక్షణం జరిగింది. 


ఆ ఆలయమే ఈనాటికీ

కుంభకోణం తోపు వీధిలో వున్న 

శ్రీ రాజగోపాల స్వామివారి

ఆలయం. ఆ ఆలయంలో

మూలవిగ్రహం గా శ్రీ రాముడు

సీతా లక్ష్మణ సమేతుడై, హనుమంతుడు సేవిస్తుండగా

దర్శనమిస్తున్నాడు.


శ్రీ కృష్ణుడు ఉత్సవ మూర్తిగా, రుక్మణీ ,సత్యభామా సమేతుడై రాజగోపాలునిగా పశువులను మేపే

గోపాలునిగా దర్శన

మనుగ్రహిస్తున్నాడు.

సుదర్శనుని వెతుకుతూ వచ్చి తనే స్వయంగా సుదర్శనునికి అనుగ్రహం ప్రసాదించినట్లు , తన భక్తులను సమయానుకూలంగా

 తానే స్వయంగా వచ్చి కాపాడుతున్నందున

మహావిష్ణువు 

"హవిః" అని 

పిలువబడుతున్నాడు.

హవిః అంటే యివ్వడం

అని అర్ధం. సుదర్శనుడు

ఆలయం నిర్మించిన సమయంలో ఏర్పడిన

అడ్డంకులు తొలగించినట్లు 

మహావిష్ణువు తనను కోరివచ్చే భక్తులకు ఏర్పడే సకల

ఆడ్డంకులను తొలగిస్తున్నందువలన

' హరిః' అని పిలువబడుతున్నాడు.


భక్తుల న్యాయ సమ్మతమైన కోరికలను తీర్చి ఆదుకుంటున్న 

శ్రీమహావిష్ణువు

' హవిర్ హరిః' అని పిలువబడుతున్నాడు.

యీ నామము సహస్రనామములలో

361 వ నామము.


' హవిర్ హర నమః' అని నిత్యం జపించే భక్తులకు నారాయణానుగ్రహం తప్పక సిధ్ధిస్తుంది...

కామెంట్‌లు లేవు: