3, జనవరి 2022, సోమవారం

నిట్టూర్పు

 *నిట్టూర్పు*

ఘరానా...కరోనా

*రచన.. గుళ్ళపల్లి రాధాకృష్ణన్...

 ( భారతదేశం):


ఓరి దేవుడా!

నన్ను నేను నేనే మరచిపోయేలా.. తేలికగా, నీ ఏలికగా దయ చేయుము.. దయచేసి!

గతించిన యమగండ

కాల కరాళ నృత్య పథ ఘట్టనలో నలిగిన మానవాళి

నిర్ద్వంద నిర్భంధ

ద్వంద్వ క్రూరమైన సంవత్సరాలు!

విపత్తు వాహకాలు!

మంత్రగత్తెల జంట జవరాల వత్సరాలు

ఘోరమై భారమై 

భూగోళం దద్దరిల్లేలా కూల దోచేసింది

వేదన.. నైరాశ్య శూన్య విశ్వాసం రాజ్యమేలింది

గుండె గడ్డ కట్టే ఊయలలో.. 

ఊపిరి ఆడని అనుక్షణాలు.

దాని దానవత్వం 

అణవనువునా 

వక్ర అదృద్యమాన

క్రిమి ..పరిక్రమి 

అడుగు

అడుగులో వెంబడించి కబళించ 

మింగే చీకటిని.. పొరపాటునైన మర్చిపోవద్దు.. 

ఏమర పాటు వద్దు...

చెమటలు పట్టించే బెదిరింపులు..

భయపడిన బంధుత్వం

భంగపడ్డ ధీరత్వం పట్టించుకోని మానవత్వం ఉక్కిరిబిక్కిరైన భద్రత..వలయాలు ఆలయాలు

వైద్య అపన్న హస్తం

కోసం కడ చూపులు

నిశ్శబ్ద నిష్క్రమణలు

తలుచుకుంటే.. జలదరింపు వణుకు.. వద్దు వద్దు

ఎప్పుడూ.. ఎప్పుడూ

డ్రాగన్‌ తలుపు తెరవకండి.. కోరి

కోరల చిక్కకండి

కర్కశ యమ పాశ కరోనా డ్రాగన్.. 

శవ వాహక శకటాలు

వెళ్ళిపోలేదు సుమీ!

తస్మాత్ జాగ్రత్త!

బతికి... బతికించండి

చాలు.. చాలు.

మానవజాతి దౌర్భాగ్య దుస్థితి కనికరం కరువై

అలసి సొలసి మాసిన ఆలంబన కోల్పోయిన

కుటుంబాల వ్యధార్ధ

యదార్థ గాథలు చిరునవ్వుల వధ వ్యధ.. 

లెక్కించలేని లెక్కకందని ప్రతి బంధకాలు చితికిన

స్థితి గతుల

ఇనుప కౌగిలి మడతలో మూలిగి నలిగిన అనాథ స్వరాలు

నరకపు లోయల ఉయాలలో హృదయ విదారక విచార హృదయ వలయాలు అప మృత్యు శకటం

ఎక్కి దిగలేదుట! ఎవ్వడూ...

భయం గుప్పిట్లో ముప్పు ముంగిట్లో

చిక్కిన గుప్పెడు గుండె ఘోషల మౌన రొదనల భీషణలు

నిశీధి రాతిరిన విధిరాతల వెక్కిరింపుల నడుమ

ఒంటరి మది తుది పయనం...

కన్నీళ్లు పాలించిన

దుఃఖపు మరకల 

నిశ్వాస నిరాశల నైరాశ్య ఆశ్వాసాల ఆవాసాల ఆవహిత

చీకటి రాజ్యం!!! నిలదొక్కుకోగలమా మృత్యు కుహరపు

కర్కశ కోరల పట్టుబడి నెట్టబడి

ప్రతి ఇల్లూ నిరాశ్రుల అనాధ ఆశ్రమం అయోమయం..

అవిశ్రాంతి, నిద్రలేని రాత్రులలో జీర్ణించుకోలేని చేదు నిజాలు దయనీయ జ్ఞాపకాల దొంతరలు..

ఆప్తుల క్షేమ పునరా

గమన క్షణ క్షణ ఉద్విగ్న ఉద్వేగ నిరీక్షణ...

ఆర్తిగా అర్ధిస్తు

ప్రార్ధిస్తు... 

మనస్తాపంతో

ముకుళిత హస్తాలతో వాడిపోని పూల గుత్తితో కళ్లోత్తు కొంటూ కళ్ళలో వత్తులు వెలిగించు కుంటూ...

అమరుల 

శ్మశాన వాటిక గులాబీల తోటకాగా.. ఏకాకుల

పోలికేకల రోగుల ధీన స్వర రాగాలు ఘరానా

కరోనా బాధితులు

స్వాంతనతో ఆసాంతం చిరునవ్వుతో 

ఇల్లు చేరాలని 

చీకటి ఇంటి దీపాలు వెలగాలని ఆశిస్తూ..

.ఆరోగ్యకరమైన నూతన సంవత్సరానికి 2022కి స్వాగతం పలుకుతూ....

****************

కామెంట్‌లు లేవు: