15, మార్చి 2022, మంగళవారం

ఎంత అదృష్టమో

 ఎంత అదృష్టమో!


     "ఆహా!  మీరు ఎంత అదృష్ట వంతులయ్యా! ధర్మరాజా!" అన్నాడు  నారద మహర్షి. 

 ఇంతకీ ఏమిటి ఆ  అదృష్టం?


జలజాత ప్రభవాదులున్ మనములో చర్చించి  భాషావళిన్ 


పలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు మీ యింటిలో 


చెలియై మేన మరందియై  సచివుడై చిత్త ప్రియుండై మహా 


ఫల సంధాయకుడై చరించుటలు మీ భాగ్యంబు రాజోత్తమా!


 (ఆంధ్ర మహా భాగవతం- 

- బమ్మెర పోతన)


  'శ్రీకృష్ణుడు సామాన్యుడా?

 వర్ణించటానికి మాటలకూ

ఊహించటానికి మనస్సుకూ  అందని వాడు. 

 'కృష్ణుడు' అనే పేరుతో  ఆవిర్భవించిన  ఆది దేవుడు.  

ఆ పరబ్రహ్మ తత్త్వమే  ఈ రూపంతో దిగి వచ్చింది.  

"యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ.."

అన్న ఉపనిషత్సూక్తికి ఆలంబనం ఈ స్వామి. 

సత్యమూ, జ్ఞానమూ, అనంతమూ అయిన ఆ పరబ్రహ్మే   కృష్ణుడుగా  అవతరించాడు.

సత్యము- అంటే  ఎప్పుడూ ఉండేది.  భూత భవిష్య ద్వర్తమానాలు అనే తేడా లేకుండా అన్ని కాలాల లోనూ ఉండే  అసలు సిసలు తత్త్వమే సత్యం.

అలాంటి సత్య స్వరూపుడు  కృష్ణుడు.  

ప్రతి జీవుడూ  తప్పక తెలుసుకో వలసిన 'జ్ఞానం' అతడే. 

అంతటి వాడు మీ ఇంటిలో  మీకు ఎంత సన్నిహితుడుగా ఉన్నాడు!

 మీకు స్నేహితుడుగా మెలగుతున్నాడు.   బావగా మీతో  బంధుత్వం పాటిస్తూ మీకు ఆనందం కలిగిస్తున్నాడు.    మీకు మంత్రిగా ఉంటూ మీ పనులన్నీ  సక్రమంగా, సార్థకంగా  సాగటానికి దోహదం చేస్తున్నాడు.  

మీ హృదయాలకు ఎంతో చేరువై,   మీకు ప్రీతిపాత్రుడుగా ఉన్నాడు అతడు.  అన్నింటినీ మించి  మోక్ష  సామ్రాజ్యాన్ని కరతలామలకం చేసి,  మీకు గొప్ప  ఫలాన్ని కట్టబెట్టగల ముకుందుడు ఆ స్వామి.   అంతటివాడు  మీకు ఇంత దగ్గరివాడై  మెలగటం  మీ అదృష్టం కదా! " అన్నాడు  నారద మహర్షి. 


   అంతటి వాడు పాండవులకు ఇంతటి సన్నిహితుడై  ఎందుకు ఉన్నాడు ?  

ఏమిటి  పాండవులు చేసిన పుణ్యం?

అని ఆలోచిస్తే,  ఒకే ఒక్క కారణం కనిపిస్తుంది. 

సత్య ధర్మాలకు కట్టుబడి ఉండటం పాండవుల స్వభావం.  కష్టమైనా  నష్టమైనా  భరిస్తూ, ధర్మ మార్గాన్ని మాత్రం వదలని దీక్షా దక్షులు పాండవులు. 


వాసుదేవుడు పాండవ పక్షపాతి.   కాదు కాదు.

ధర్మ పక్షపాతి " అని తమ నాటకాలు పలికించారు  తిరుపతి వేంకట కవులు.  


"యతో ధర్మో యత స్సత్యం 

యతో హ్రీ రార్జవం యతఃl

 తతో భవతి గోవిందః 

యతః కృష్ణ స్తతో జయఃll"

(సత్యమూ ధర్మమూ కూడని పనులకు వెనుకంజ వేసే స్వభావమూ మనసూ మాటలూ  చేతలూ ఒకే విధంగా ఉండటం అనే స్వభావం   ఉన్నచోట 

ఆ వ్యక్తులకు అండగా  ఉంటాడు శ్రీకృష్ణుడు.  

వారిని గెలిపించే విజయ సారథి అవుతాడు  శ్రీకృష్ణుడు.

  

   అర్జునుడి రథానికే కాదు, 

పాండవుల జీవిత రథాలకూ  సారథి శ్రీకృష్ణుడే. 


కారణం...?

పాండవులు అవకాశ వాదులవలె  సుఖ సన్నివేశాలు పట్టుకుని వేళ్ళాడే  వాళ్ళు కాదు. 

ధర్మమే ఊపిరిగా ఉన్నవారు పాండవులు. 


కనుక వారి "భక్తికి" మెచ్చి 

వారి దగ్గరే ఎప్పుడూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. 


పరికింపగ పరమాత్ముడె 

పరమాప్తుడు జగతిలోని 

                 ప్రాణుల కెల్లన్

వరదుండగు  ఆతనిపై 

పరమంబగు  ప్రేమ కాదె 

                  భక్తి యనంగా.

                 (-స్వీయం)


నమస్సులతో 


మీ 


మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి.

కామెంట్‌లు లేవు: