15, మార్చి 2022, మంగళవారం

ఈ ప్రశ్నకు సమాధానం

 శ్రీ సీతారామాభ్యోనమః. శ్రీ హనుమతే నమః


ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కొంచెం ఇబ్బందే.


అసలు ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు శ్రీ హనుమ జన్మ ఉద్దేశ్యం ఏంటో చూద్దాం. అలాగే ఆయన అవతరించిన అపూర్వమైన విధానం కూడా చూద్దాం.


ఆయనను .. మారుతాత్మజుడు(వాయు నందనుడు) రుద్రవీర్య సంభవుడు, కేసరీ నందనుడు..ఇలా కదా పిలుస్తాం. అంటే శ్రీరామచంద్రమూర్తి భూమి మీద చేయవలసిన కార్యంలో హనుమకు వున్న ప్రాముఖ్యత కు అనుగుణంగా..వాయుదేవుడు, పరమశివుడు..తమ తమ శక్తులు ఇస్తే, కపి రూపం కావాలి కాబట్టి.. కేసరి,అంజనాదేవి ల సహాయంతో భూమి మీదకు వచ్చాడు ఆ అప్రమేయ పరాక్రముడు. పరమశివుడే, శ్రీరాముల వారి మీద వున్న పరమ భక్తితో , ఆంజనేయస్వామి గా వచ్చాడంటారు కూడా కదా.


సరే. మనకు వాల్మీకి మహర్షి రామాయణంలో కిష్కింధ కాండలో మొదటి సారి కనపడతారు..శ్రీ హనుమ. అనన్యసామాన్యమైన కార్యాలు చేస్తాడు..రావణ వధ జరిగే వరకు. ఆ తర్వాత రామానుగ్రహం చేత, ఆయన ఆజ్ఞ తీసుకొని,కలియుగాంతం వరకు వుంటానని వుండి పోతాడు. అదికూడా తపస్సు చేసుకుంటూ. మహాభారతంలో భీమసేనుడికి కూడా కనప డేది..హిమాలయాలలో కదా. అవతార ఉద్దేశ్యం అయిపో యింది కనుక ఆయన ఇంకా ఎక్కడా కనపడడు.


మహానుభావులు,తపస్సు చేసుకునేవారు ..ఇలా చాలా మందికి దర్శనం ఇచ్చాడు అంటారు. నా బోటి సామాన్యులకు కష్టకాలంలో ఆదుకుంటో వుంటాడు.


మరి వివాహం ఎప్పుడు అయింది స్వామికి. పరాశర సంహిత, ఇంకా కొన్ని సంహితలలో ఉందంటారు. దానిని సహాయంగా తీసుకొని మన తెలుగునాట చాలా దేవాలయాలు కూడా కట్టారు. ఈ మధ్యకాలంలో రాసిన సుప్రభాతంలో వుంటుంది "సువర్చల" ప్రస్తావన. కానీ హనుమ అష్టోత్తరంలో కానీ సహస్రనామాల్లో కానీ మనకు వివాహం విషయం కానరాదు. కనీసం వెయ్యి ఎనిమిది పేర్ల లో .... "సువర్చలా ప్రాణనాధాయ నమ: " అని వుండాలి కదా! అదే నాకు ..ఈ ప్రస్తావన ను ఆనాటి పెద్దలే నమ్మ లేదేమో అని అనిపిస్తుంది.


ఇకపోతే ఇంకొక రకమైన లెక్క కూడా ఉంది. అది నాలుగు యుగాలు అయిపోయిన తర్వాత మళ్లీ సృష్టి మొదలవుతుందని అప్పుడు ఈ నాలుగు యుగాలు పునరావృతం అవుతాయని చెప్తారు. అంటే మళ్లీ శ్రీరాముడు శ్రీకృష్ణుడు వస్తారని. అలా వచ్చిన ఒక యుగంలో హనుమంతుల వారికి వివాహం అయిందని ఒక వర్గం ప్రజలు చెప్తారు. దాని ఆధారంగానే హనుమంతుల వారికి సువర్చలాదేవికి వివాహం అయిందని చెప్పి చెప్తారు. ఇంకా చెప్పాలంటే దేశంలో యింకో రాష్ట్రంలో ఎక్కడా భార్యతో కూడి వున్న హనుమ దేవాలయాలు చూడలేదు.

కామెంట్‌లు లేవు: