13, ఏప్రిల్ 2022, బుధవారం

మోక్షం కావాలి

 మోక్షం కావాలి 


ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక గూర్ఖా వచ్చాడు. మనుసులోని కష్టాల భారం ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. “విషయమేంటో అడుగు అతణ్ణి అడుగు” అని పక్కనున్న శిష్యునితో చెప్పారు స్వామివారు. 


ఆ గూర్ఖా స్వామివారితో, “నేను పుట్టినప్పడినుండి నాకు కష్టాలు తప్ప ఏమి తెలియవు. ఏదో నా పురాకృత పుణ్యకర్మ వల్ల దైవస్వరూపులైన పరమాచార్య దర్శనానికి రాగలిగాను. నేను మళ్ళీ పుట్టకుండా మీరు నన్ను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను” అని వేడుకున్నాడు. 


”అహా! అలాగే అవ్వని. ఇక నువ్వు మరలా పుట్టవు. నీకు మోక్షం ఇచ్చేస్తా” అని అనలేదు మహాస్వామివారు. చాలా ప్రేమతో అతనితో మాట్లాడారు. 


”అటువంటి వరాన్ని ఇచ్చే శక్తి నాకు లేదు. కాని నేను నిత్యం కొలిచే త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వరునకు ప్రార్థిస్తాను నీ కోరిక పూర్ణం అవ్వాలి అని” అని చెప్పారు. 


ఆ గూర్ఖా ఈ జవాబు చాలు అనుకున్నాడు. ప్రసాదం తీసుకుని వెళ్ళబోతూ, “నేను ఇక మళ్ళా పుట్టను. నాకు మరుజన్మ లేదు. ఇది ఈశ్వర శాసనం” అంటూ సంతోషంతో వెళ్ళిపోయాడు. 


జ్ఞానమనే వెలుగును పంచే మెరుస్తున్న కళ్ళతో స్వామివారు, “చాలాకాలం తరువాత పునావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్యం కావాలని కోరినవాడు ఇతనొక్కడే” అని తెలిపారు. 


నేను విన్న ఒక విషయం నాకు స్ఫురణకు వచ్చింది. ఒక పండితుడు రామాయణ ఉపన్యాసం చెబుతూ, “రాముడు సాక్షాత్ మనవావతారం. మనుష్యుడిగానే పుట్టాడు, మనుష్యుడిగానే కదిలాడు. మరి జటాయువుకు మోక్షాన్ని ఎలా ఇవ్వగలిగాడు అంటే అది కేవలం స్వధర్మాచరణ వల్ల మాత్రమే సాధ్యపడింది”


శ్రీమఠం ఉద్యోగులు, శిష్యులు ఎవ్వరూ స్వామివారు అపర శివావతారులు అని గ్రహించలేదు. కాని ఆ గూర్ఖా దాన్ని గ్రహించాడు. 


[సరస్సులో ఉన్న పద్మంయొక్క విలువ అక్కడే ఉన్న కప్పలకు కాని చేపలకు కాని తెలియదు. కాని ఎక్కడో అడవిలో ఉన్న తుమ్మెదకు దాని విలువ తెలుసు. అందులో ఉన్నది మకరందమని తెలుసు. దాన్ని గ్రోలడానికి పద్మం ఎక్కడ ఉన్నా తుమ్మెద వెతుక్కుని వచ్చి మరీ ఆస్వాదిస్తుంది]


--- శ్రీమఠం బాలు మామ, ‘ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్’ పరమాచార్య అనుభవాల సంగ్రహం


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: