🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
*🌷ఫొటోషూట్🌷*
(ఈనాటి వివాహ వేడుకలలో వింత పోకడలు) రచన: జి.యస్. లక్ష్మి.
🌷🌷🌷
రెండురోజులక్రితమే వరంపిన్ని కొడుకు పెళ్ళికి ముందు జరిగే ఫొటోషూట్ కోసం రమ్మని ఫోన్ చేసి మరీ మరీ చెప్పింది. కొడుకునీ, కాబోయే కోడలినీ అప్పటికప్పుడే నాల్రోజుల ముందునుంచీ వీడియోలు తీస్తున్నారుట. ఇప్పుడు బంధువులందరితో కలిసి వాళ్ళిద్దరినీ షూట్ చేస్తారుట. అందుకని వరంపిన్ని పొద్దున్నే పదిగంటలకల్లా వచ్చెయ్యమంది. పిన్నితో సరే నన్నాను, కానీ నాకేవిటో ఈ ఫొటోషూట్ ల గురించి అస్సలేవి తెలీదు. ఆమాట పిన్నితో అంటే నేను అప్డేట్ లో లేనంటుంది. అందుకని అప్పటికి పిన్నికి సరేనని చెప్పి నిన్న వదినని అడిగేను అసలీ గొడవంతా ఏవిటని. వదిన ఇలాంటి విషయాలన్నీ భలే గమ్మత్తుగా చెప్తుంది. ఏదడిగినా ముందు దాని మూలాల్లోకి వెళ్ళిపోతుంది. దాని చరిత్రంతా చెప్పుకొచ్చి కానీ ప్రస్తుతం లోకి రాదు. అందుకనే సాధారణంగా నేను వదినని కదపను. కానీ వరంపిన్ని పిలిచినప్పుడు వెళ్ళేముందు అసలు ఈ ఫొటోషూట్ గురించి తెల్సుకోవాలి కదా, అని వదినకి ఫోన్ చేసి అడిగేను. అంతే ఇంక వదిన మొదలెట్టింది.
వదిన _ నీకు మన ఊళ్ళల్లో ఇళ్ళల్లో గోడలమీద వరసగా ఫ్రేములు కట్టిన ఫొటోలు ఉండేవి ..గుర్తుందా!
నేను _ గుర్తు లేకేం.. చిన్నప్పుడు అమ్మమ్మగారింటి కెళ్ళినప్పుడు చూసేదాన్నిగా..
వదిన – అవన్నీ ఎవరి ఫొటోలూ..
నేను "ఎవరివేంటీ, ఆ ఇంట్లో పెళ్ళిళ్ళూ, పేరంటాలూ అయినప్పుడు అందరూ కలుస్తారు కనక అందరివీ కలిపి గ్రూప్ ఫొటోలుండేవి, ఇంకా మధుపర్కాలతో, కర్పూరం దండలతో ఎవరి పెళ్లయితే వాళ్ల ఫొటోలుండేవి. మా అమ్మమ్మింట్లో అయితే మా అందరి మావయ్యల, పిన్నిల పెళ్ళిఫొటోలూ ఉన్నాయి.
వదిన – కదా! ఆ టైములో కల్సిన కుటుంబవంతా ఫొటోగ్రాఫర్ ని పిల్చి గ్రూప్ ఫొటో కూడా తీయించుకునేవారు.
నేను – అవునవును. అలాంటివి కూడా ఉన్నాయి.
వదిన – ఆ తర్వాత కొన్నాళ్ళకి పెళ్ళి జరుగుతున్నప్పుడు ఫొటోగ్రాఫర్ ని పెట్టి పెళ్ళిఫొటోలు తీయించుకునేవారు కదా..
నేను – అవును.. జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడూ, మంగళసూత్రం కడుతున్నప్పుడూ, తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు, ఇలా ప్రతీదీ తీసేవారు. వాటిల్లో అసలు వాళ్ళ కన్న వాళ్ల మధ్యన కూర్చున్న పురోహితుడు మటుకు చక్కగా పడేవారు..
వదిన – హహ.. సర్లే..ఆ పైన చాలామంది చేతుల్లోకి కెమెరాలు వచ్చేయి. మెడలో కెమెరా వేసుకుని పెళ్ళిళ్ళలో తిరుగుతూ మగపిల్లలు హీరోల్లా ఫీలైపోయేవారు.
నేను – అవునవును.. మా అన్నయ్య అలాగే నా పెళ్ళిఫొటోలన్నీ తీసేడు.
వదిన – ఆ తర్వాత వీడియో లొచ్చేయి. ఈ వీడియోలు వచ్చేక ఫొటోలూ, వీడియోల మీద లక్షలు ఖర్చుపెట్టడం మొదలైంది. అందులోనూ కేటరింగు లొచ్చేసేక, ఇదివరకులాగా పెళ్ళివాళ్లకి షాపింగ్ తప్ప వేరే పనులేమీ లేవు, కనక ఈ వీడియోలకోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవడం ఎక్కువైంది. ఇంకిప్పుడైతే మరీనూ.. ఒక్కళ్ళూ ఇద్దరే పిల్లలవడంతోనూ, అప్పటికే ఆ పిల్లలు కూడా బాగా సంపాదించేవాళ్లవడంతోనూ పెళ్ళిళ్ళు చేయించడం ఈవెంట్ మేనేజ్ మెంట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంకంతే… వాళ్ల బిజినెస్ పెంచుకోవడం కోసం పాత సాంప్రదాయాలని మళ్ళీ మొదలెట్టీ, పక్కరాష్ట్రాలవారి సాంప్రదాయాలను కూడా కలిపేసీ వాళ్ళు పెళ్ళిళ్ళను రోజులతరబడి మహా వైభవంగా చెయ్యడం మొదలెట్టేరు.
వదిన ఊపిరి పీల్చుకోవడంకోసం ఆగింది.
నేను – అది సరే.. అసలు సంగతి చెప్పు. మనలో ఇలా పెళ్ళికూతురూ, పెళ్ళికొడుకూ ముందుగా కలిసి డేన్సులు చేసే పధ్ధతి ఎప్పట్నించి మొదలైందీ..
వదిన – కూల్ స్వర్ణా.. అలా తొందరపడితే ఎలా చెప్పూ.. విత్తం కొద్దీ వైభోగం అనే సామెత విన్నావు కదా.. ఇప్పుడు చేతిలో బోల్డు డబ్బులున్నాయి. అవి చూపించుకుందుకు ఇలాంటి సమయం కోసవే కదా చూస్తుంటారు. అసలే మనలో చాలామంది సినిమాపిచ్చి వాళ్ళున్నారు. హీరోలా హెయిర్ స్టెయిలూ, డ్రెస్సూ, నడకా, మాటా అన్నీ అనుకరించేస్తుంటారు. అలాగే వాళ్లని ఫాలో అయిపోతూ మనవాళ్ళు పెళ్ళికి ముందే డ్యూయట్లు పాడేసుకుని కొండలెక్కీ, నీళ్ళలో దూకీ, బురదలో దొర్లీ, వీడియోలు తీయించేసుకుంటున్నారు. మొన్నామధ్య వాట్సప్ లో వైరల్ అయిన వీడియో చూసేవు కదా!
నాకు ఒక్కసారి ఆ వీడియో గుర్తొచ్చింది. అందులో పెళ్ళికొడుకు డ్రెస్సులో ఒకతను తలకిందకీ కాళ్ళు పైకీ పెట్టి నిలబడ్డాడు. అంటే చేతులమీద నిల్చుని కాళ్ళు పైకి పెట్టుకుని ఉన్నాడన్నమాట. పట్టుచీరతో, పూలజడతో, ఒంటినిండా నగలతో ఉన్న పెళ్ళికూతురు బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఓ సినిమాపాటకి అతని చుట్టూ నాలుగువైపులా తిరుగుతూ డేన్సు చేస్తోంది. అది చూస్తుంటే అనకూడదు కానీ నాకైతే సినిమాల్లో చూపించినట్టు విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటూంటే తపోభంగం చెయ్యడానికి మేనక చేసిన డేన్సులా అనిపించింది. ఆ పిల్ల డేన్సు ఎప్పటికవుతుందో, ఈ లోపల ఆ పిల్లాడు కింద పడిపోతాడెమో నని క్షణక్షణం ఆ వీడియోని ఉత్కంఠతో చూసిన విషయం గుర్తొచ్చింది. వీళ్ళ సరదాలు సంతకెళ్ళా.. ఇలా శీర్షాసనాలూ గట్రా వెయ్యకుండా చక్కగా ఏ పూలతోటలోకో వెళ్ళి ఆ డేన్సేదో చేసుకుంటే చూసేవాళ్ళు సుఖపడతారు కదా అనిపించింది. దాని గురించి ఆ రోజు వదినా నేనూ చాలాసేపే మాట్లాడుకున్నాం. వదిన మాటలకి ఇంక నాకు విసుగొచ్చేసింది.
నేను - అసలు సంగతి చెప్పకుండా ఈ ఉపోద్ఘాతమంతా ఏంటి వదినా..డబ్బులుంటే వాళ్ళిష్టమొచ్చినట్టు చేసుకోమను. ఆసనాలూ వెయ్యమను, సముద్రంలోకీ దూకమను. అదేదో ఆ పెళ్ళికొడుక్కీ, పెళ్ళికూతురికీ సంబంధించిన విషయం కదా.. మరి మనందర్నీ ఫొటోషూట్ అంటూ పిలవడ మెందుకూ! పాయింట్ కి రా.
వదిన - రామాయణం అంతా విని రాముడికి సీత ఏవైతుందీ అన్నాట్ట నీలాంటివాడే.. వాళ్లల్లో వాళ్ళు చేసుకుంటే వాళ్ళకున్న గొప్ప ఆలోచనలూ, వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బూ మనకెలా తెలుస్తాయీ.. అందులోనూ సినిమాల్లో కూడా హీరో, హీరోయిను వెనకాల అటో డజనుమందీ, ఇటో డజనుమందీ ఆడా మగా ఎక్సరసైజులు చేస్తుంటారు కదా! అలా చెయ్యడానికన్నమాట మనం..
వింటున్న నాకు నీరసమొచ్చేసింది.
నేను - అంటే నువ్వూ, నేనూ, పద్మక్క, లక్ష్మివదినా, వాళ్లక్కా, వరంపిన్ని చెల్లెలూ ఇలా అందరం వాళ్ల వెనకాల డేన్సు చెయ్యాలా.
వదిన - వాళ్ళేకాదు. వాళ్లతోపాటు వారి భర్తలు కూడా చెయ్యాల్సిందే..
నేను - నిజవా? వాళ్లందరూ కూడా వస్తారా?
వదిన - ఎందుకురారూ.. వాళ్ళూ బంధువులేగా…. అందరూ వస్తారు, డేన్సులూ చేస్తారు.
నేను - ఎలా నాకు డేన్సు రాదే..
వదిన - రానక్కర్లేదు. అటూ ఇటూ చేతులు తిప్పడం, పక్కనున్న పిట్టగోడమీంచి అందరం ఒకరి చేతులు ఒకరం పట్టుకుని ఒక్కసారిగా దూకడం లాంటివి ఉంటాయంతే.. నువ్వేం ఖంగారు పడకు.. నేను పక్కనే ఉంటానుగా..
నేను - సరే అయితే, ఇంతకీ నువ్వేం చీర కట్టుకుంటున్నావ్.. కంచిపట్టా, బెనారసా, పోచంపల్లా..
వదిన - దానిగురించి నువ్వేం కష్టపడక్కర్లేదులే, మీ వరం పిన్ని అందరికీ ఒక్కలాంటి చీరలు, పంచెలూ కొనేసింది. అందరం బేండుమేళంగాళ్ళమే..
వదిన ఫక్కున నవ్వుతూ ఫోన్ పెట్టేసింది.
నాకు ఒక్కసారిగా తల తిరిగిపోయింది. చిన్నప్పుడు ఒకే తాను కొనేసి మగపిల్లలందరికీ లాగులూ, చొక్కాలూ కుట్టించేసే వారు. అప్పుడు వాళ్లని ఆడపిల్లలం బేండుమేళం అని వెక్కిరించేవాళ్ళం. హూ.. చేసిన పాపం ఊరికే పోతుందా! ఇప్పుడు మేవే బేండుమేళం అయిపోయేం అనుకున్నాను బాధగా.
తప్పదుకదా అనుకుంటూ పొద్దున్నే లేచి వరంపిన్ని ఇంట్లో ఫొటోషూట్ కి వెళ్ళాలని పనులన్నీ గబగబా చేసేసుకుంటున్నాను. అదేంటో బైటకి వెళ్ళాలనుకున్నప్పుడే మరిన్ని పనులు కనపడుతూ ఉంటాయి. మొత్తానికి ఇంక పని అయిందనిపించుకుని, బయల్దేరదామా అంటూ వదినకి ఫోన్ చేసేను. ఎత్తలేదు వదిన.
ఇంకా వదిన పనవలేదేమోనని కాసేపాగి మళ్ళీ చేసేను. ఊహూ.. అప్పుడూ ఎత్తలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. పోనీలెమ్మని అప్పటికి ఊరుకుని మరో అరగంటయేక మళ్ళీ చేసేను. ఈసారి వదిన ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. దాంతో నాకు కంగారొచ్చింది. మామూలుగా నేను చేసినప్పుడు వదిన ఏదైనా పనిలో ఉంటే ఆ పనవగానే నా కాల్ చూసుకుని తనే చేస్తుంది. అలాంటిది ఇవాళ మూడుసార్లు చేసినా మళ్ళీ చెయ్యలేదు సరికదా, ఫోన్ కూడా స్విచాఫ్ చేసేసిందేవిటీ, అనుకుంటూ ఇంక అన్నయ్యని అడుగుదామని అన్నయ్యకి చేస్తుంటే అప్పుడు వచ్చింది వదిన నుంచి ఫోన్. వెంటనే పలికేను.
“ఏవైంది వదినా..ఫోన్ స్విచాఫ్ ఎందుకు చేసేవ్..”
“అంటే హాస్పిటల్ కి వెళ్ళేను. పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫోన్లు ఆఫ్ చెయ్యమన్నారు. అందుకనీ..’
“హాస్పిటల్ కా, ఎందుకూ, ఎవరికి ఏవైందీ..” ఆదుర్దాగా అడిగేను.
అట్నించి వదిన ఒక దీర్ఘమైన నిట్టూర్పు వదిలింది.
“నీకు మా పక్కింటాయన తెల్సుకదా.. పిల్లలిద్దరూ ఒకళ్ళు ఢిల్లీలోనూ, ఇంకోళ్ళు బెంగుళూర్ లోనూ ఉంటున్నారు. ఆ పిల్లలిద్దరూ కల్సి ఆ దంపతులకి నలభై సంవత్సరాల పెళ్ళిరోజు చేద్దామని తలపెట్టేరు. ఆయనకి అంతగా ఇష్టం లేకపోయినా పిల్లలని కాదనలేక సరేనన్నారు. మామూలుగా ఆ దంపతులు ఏమనుకున్నారంటే ఆ రోజు పొద్దున్నే గుడిలో పూజలూ, హోమాలూ చేసుకోవడం, ఆ తర్వాత బంధువులూ, స్నేహితులతో విందూ ఉంటుందనుకున్నారు.
కానీ పిల్లలిద్దరూ కల్సి మీకసలు లైఫ్ ఎంజాయ్ చెయ్యడవే తెలీదూ, పెళ్ళిరోజంటే సంబరంగా జరుపుకోవాలీ అంటూ ఎవరో ఈవెంట్ వాళ్ళకి వీళ్ళని అప్పచెప్పేరుట. వాళ్ళు వీళ్ళని ఈ రోజుల్లో పెళ్ళిళ్ళలో డేన్సులు చేస్తున్నట్టు ఇద్దర్నీ కల్సి డేన్సు చెయ్యమంటూ ఆ స్టెప్స్ అవీ వెయ్యడం నేర్పించేరుట. ఆయన నేను చెయ్యను మొర్రో అంటున్నా కూడా ఆవిడ "పిల్లలు సరదా పడుతున్నారు, అంతా వీడియో తీసుకుని తర్వాత పిల్లలు సంతోషంగా చూసుకుంటారు" అంటూ మొదలెట్టిందిట. ఇంక ఆ స్టెప్స్ వేయడంలో ఆవిడకి కాలు మడతపడి, కిందపడి నడుము విరిగినంత పనైందన్న మాట. ఆవిణ్ణి చూడ్డానికే హాస్పిటల్ కి వెళ్ళేను” అంది.
“అదేంటి వదినా…పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఇలా డేన్సులు చేస్తున్నారా!”
“ఎందుకు చెయ్యరూ.. ఇప్పుడు మీ వరంపిన్ని కొడుకు పెళ్ళిలో చెయ్యడానికి మనం వెళ్ళట్లేదూ!” ఎదురు ప్రశ్న వేసింది వదిన.
ఒక్కసారి నాకు ఖంగారుగా అనిపించింది. సినిమాల్లో ఇలా పెళ్ళిళ్ళలో వెనకాల పెద్దవాళ్ళు చేసే డేన్సు చూసి చిరాకు పడటం గుర్తొచ్చింది. సీరియల్స్ లోనూ, రియాలిటీ షోల్లోనూ అయితే మరీనూ.. ఇంతంత లావున్నవాళ్ళు అలా వంకరలు తిరుగుతూ అర్ధంపర్ధం లేని సినిమా పాటలకి డేన్సులు చెయ్యడం చూస్తుంటే కడుపులోంచి వికారం పుట్టుకొస్తోంది.
అంటే ఇప్పుడు మేం కూడా అలాగే స్టెప్పులు వేస్తూ, తిప్పుకుంటూ, పిట్టగోడలెక్కి దూకుతూ, ఒకళ్ళ నొకళ్ళు వెక్కిరించుకుంటూ డేన్సులు చేస్తే అవన్నీ వీడియో తీస్తారా.. రేప్పొద్దున్న నేను చేసిన డేన్సు చూసి నాకే వికారం వస్తుందేమో?
ఒక్కసారి వరంపిన్నింటికి ఫొటోషూట్ కి వెళ్ళడం మానేస్తేనో అనిపించింది. కానీ ఇప్పటికే ఇంకా రాలేదేంటంటూ వరంపిన్ని రెండుసార్లు ఫోన్ చేసింది.
ఏమిటి చెయ్యడం.. వెళ్ళడమా.. మానడమా? భగవంతుడా! నాకేది దారి.
------------------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి