అదొక పెద్ద దట్టమైన అడవి. ఎన్నో చెట్లు చేమలు మృగాలు ఆ అడవిలో ఆశ్రయం పొందుతున్నాయి.. ఎంతో అన్యోన్యంగా తమతమ జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి.
అలాంటి అడవివో కార్చిచ్చు దావానలంలా వ్యాపించింది ఓ రోజు. పెద్ద పెద్ద మంటలు పైకెగసి వ్యాపిస్తున్నాయి. ఎటు చూసినా మంటలే. జంతువులన్నీ భయంతో అటు ఇటు పరుగిడుతూ భీకరంగా అరుస్తున్నాయి.
ఈ అరుపుల్లో ఆర్తనాదాలలో పెద్ద చిన్న, సాధు కౄర తారతమ్యం లేదు. ఈ మంటల్లోనుండి బ్రతికి బయటపడడమే వాటన్నటి ఏకైక లక్ష్యం. కాని మూగ జీవులు. అవి ఏమి చేయగలవు మంటలను ఆర్పలేని ఓ అయోమయ పరిస్థితి.
అలాంటి ఓ నిస్సహాయ తరుణంలో ఒక కొంగ మాత్రం ఎంతో హడావుడిగా పైకెగురుతూ కనపించింది. ఒక్క సెకను క్రితమే అది ఇటు నుంచి అటు వెళ్ళింది. మరో సెకన్లో మళ్ళా అటు నుంచి ఇటు. అలా ఎన్ని సార్లు పచార్లు చేసిందో.
ఇవన్నీ ఓపిగ్గా ఓ నక్క కనిపెడుతూనే ఉంది. ఒక్కసారి ఉండబట్టలేక ఆ కొంగను ఆపి ఏంటి కొంగా, ఇంత పెద్ద పెద్ద మంటలు పైకెగసి పట్తూంటే నీవు అటు ఇటు వెళ్తూనే ఉన్నావు. ఏం చేస్తున్నావు జాగ్రత్త మంటలు నిన్ను కబళించగలవు అంది.
అందుకు ఆ కొంగ ఈ అడవిలో కొద్ది దూరంలో ఓ చిన్న సరస్సు ఉంది. నేను ఎన్నో ఏళ్ళుగా ఈ అడవిలో నివసిస్తూ నా పిల్లలను కాపాడుకుంటూ ఆ ఏటిలోను చేపలను తింటూ ఆ నీటిని తాగేదాన్ని. ఇప్పుడు ఈ మంటలతో నా నివాస స్థలం కనుమరుగవుతుంటే ఎలా ఊరుకోగలను. నా శక్తీ కొలదీ ఆ సరస్సు నుండి నీటిని నా నోటి ద్వారా సేకరించి ఈ మంటలను ఆర్పడానికి యత్నిస్తున్నాను అంది.
అందుకు ఆ నక్క ఒకసారి పెద్ద నవ్వు నవ్వి నీకేమైనా మతి పోయిందా ఇంత పెద్ద కార్చిచ్చును ఆర్పడానికి నీవు తెచ్చే ఒక్కొక్క బిందువు నీళ్ళు ఎలా సరిపోగలదు నీకు పిచ్చి కాకపోతే అంది.
అందుకు ఆ కొంగ ఆ విషయము నాకూ తెలుసు. కాని ఇన్ని రోజులు ఈ అడవి వల్ల ప్రయోజనం పొందినదాన్ని. నేనెలా ఊరుకోగలను. నా వంతు సహాయము చేస్తున్నాను. అందరూ వాటి వాటి శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు సహాయం అందిస్తే ఎంతటి విపత్కర పరిస్థితులైనా ఇట్టే ఎదుర్కొనగలం అంది. ఆ నక్క ఓ నవ్వు నవ్వి అట్నుంచి వెళ్ళిపోయింది.
ఇవన్నీ గమనిస్తున్న ఆ ఆడవి దేవతలు కొంగ యొక్క విశాల దృక్పథానికి ఎంతో ఉప్పొంగి అప్పటికప్పుడు ఆ అడవిలో భారీ వర్షం పడేటట్టు తమ ప్రయత్నాన్ని చేపట్టారు. అంతే కొద్ది సేపట్లోనే ఆ దావానలం మటుమాయం. జంతువులు చెట్లు చేమలు ఊపిరి పీల్చుకున్నాయి.
వీటన్నిటికి కారణం ఆ కొంగ యొక్క సమయస్ఫూర్తే. తనవల్ల ఏమవుతుంది అని ఊరుకోక తన వీలును బట్టి సహాయం కల్పించి ఆ కార్చిచ్చును ఆర్పగలిగింది.
ఈ నాటి ఎర్త్ డే సంధర్భంగా మన భూమాతను ఎలా కాపాడుకోవాలి అన్న సందేశం ప్రజలందరికి అందజేయాలన్న తపనే ఈ కల్పిత కథానిక.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి