🕉️ *వారణాసి మహిమ* 🕉️
అగస్యునికి కుమారస్వామి వారణాసి మహిమను వివరిస్తున్నాడు .ఇక్కడ మరణం సంభవిస్తే ముక్తియే . .ఈ మణికర్ణిక లోకి గంగ చేరింది .ఇది శ్రీ విష్ణువుకు చక్రపుష్కరిణి .పరబ్రహ్మ నివాస క్షేత్రం. రాజర్షి భగీరధుడు బాగీరధిని భూమి పైకి తెచ్చి తన పితామహు లందరికి ఉత్తమ లోకాలను కల్గించాడు .ఇక్కడ బంగారం ఉద్భ వించింది .చక్రపుష్కరిణి మణిశ్రవణం అనే పేరుతో పిలువబడుతుంది .మణికర్ణికలో గంగ చేరిన దగ్గర్నుంచి ఇది దేవతలకు నిత్య ఆవాసం అయింది .ఇక్కడ జ్ఞానంతో పనిలేదు .గంగాస్నానం విశ్వనాధ దర్శనమే ముక్తినిస్తుంది .యముడు మొదలైన వారు కూడా ఇక్కడి వారినేమీ చేయలేరు .అన్ని విఘ్నాలను పోగొట్టే వరుణానది ఉంది. కాశీకి దక్షిణంగా అసి నదికి ఉత్తరంగా వరుణానదిని దేవతలు నిల్పి మోక్షనిక్షేపంగా కాపాడు తున్నారు .
ఈ క్షేత్రంలో పడమరన వినాయకుడున్నాడు .ఈయన విశ్వనాథునికిరక్షకుడు. వినాయకుని అనుమతి లేని వారికి ప్రవేశం లేదు .పూర్వం దక్షిణ సముద్రతీరాన సేతుబంధనం దగ్గర మాతృభక్తిగల ధనుంజయుడు అనే వాడుండే వాడు .సన్మార్గం లో ధనం సంపాదించే వాడు .అర్ధులను సంతోషపెట్టే వాడు .వినయ సంపన్నుడు .విష్ణుపూజా దురంధరుడు గుణసంపన్నుడు. సదాచార సంపన్నుడు .తల్లి ని విశేషంగా పూజించి సేవించే వాడు. శివయోగిబోధ వల్ల అతనికి జ్ఞానం కలిగింది .తల్లి చనిపోయింది ఆమె అస్తికలను భద్రంగా ఒక రాగిపెట్టెలో పెట్టి పూజలు చేసి కావడిలో దాన్ని కాశీకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు .ఇతరు లెవ్వరు పెట్టెను ముట్టుకో కుండా జాగ్రత్తపడ్డాడు. దారిలోఒక అరణ్యంలో జ్వరంవచ్చి బాధ పడ్డాడు. కూలి వాడిని ఏర్పాటు చేసుకొని అతనితొ పెట్టె మోయించాడు. కాశీ కి చేరాడు. మోసే వాడినే కాపలా ఉంచి కావలసినవి కొనుక్కో వటానికి బజారు వెళ్లాడు. ఆ రాగిపెట్టెలో డబ్బు ఉంటుందని వాడు ఆశ పడ్డాడు. దాన్ని ఎత్తుకు పోయాడు .ధనుంజయుడు తిరిగి వచ్చి తెలుసుకొని బాధ పడ్డాడు. గంగాస్నానం విశ్వనాథ దర్శనం లేకుండా ఆ మోత గాడి ఇంటికి వెళ్లాడు. కూలివాడు ఆ పెట్టె ను దారిలోనే బ్రద్దలు కొట్టి అందులో అస్తికలే ఉన్నందున అక్కడ పారేసి పారిపోయాడు ఇంటికి వెళ్లి అతని భార్యను నిజం చెప్పమని ధనుంజయుడు కోరాడు ఆమె ఇంట్లో దాగి ఉన్న భర్తకు ఈ సంగతి చెప్పింది .ధనుంజయుడు అతడిని తీసుకొని ఆ ప్రదేశానికి చేరాడు .ఆ చోటును అంత పెద్ద అరణ్యం లో కని పెట్ట లేక హతాశుడై ఇంటికి తిరిగి వెళ్లి పోయాడు .
విషయం అందరికి చెప్పి, వారు చెప్పిన ప్రకారం గయకు వెళ్లి తల్లి శ్రాద్ధం పెట్టాడు .ప్రయాగ లో త్రివేణీ సంగమ స్నానం చేశాడు. తరువాత కాశీకి వచ్చి తల్లి అస్తికలను గంగలో కలిపితే విశ్వేశ్వరానుగ్రహం లేక పోవటం వల్ల నెట్టివేయబడ్డాయి .శ్మ అంటే శవం .శాన అంటే శయనించేది. అంటే శవం శయనించేది కనుక కాశి కి మహాశ్మశానం అని పేరొచ్చింది .అంటే ప్రళయ కాలంలో సమస్త భూతజాలం శవం పై ఈ మహా క్షేత్రం లో శయనిస్తుంది అని అర్ధం .కనుకనే మహాశ్మశానం అయింది .ప్రళయకాలంలో ఈశ్వరుడు ప్రతినిత్యం కాశీపట్నంలో త్రిశూలం పై ఉంచి రక్షిస్తూ ఉంటాడు .అందుకే కాశీకి ప్రళయభయం లేదు .కాశి కలికాల వర్జిత మైనది .దీనిని కాశి అని, వారణాసి అని, రుద్రావాసమని, మహాశ్మశానమని ,ఆనందకాననం ,దేవీపురమని అంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి