గీత పారాయణ ఫలం:
1.ప్రధమ అధ్యాయ ఫలం:-గీతాపారాయణము పూర్తిగా గానీ,లేక ఒక అధ్యాయము గానీ,లేక సగము అధ్యాయము గానీ,లేక ఒక శ్లోకం గానీ,లేక శ్లోకార్థము గానీ,కడకు ఒక పాదము గానీ,కనీసం ఒక పదము గానీ భక్తిపూర్వకంగా ఎవడు కావించునో అతడు సుశర్మ వలె ముక్తుడగును.ఎట్లనిన ------
పూర్వం సుశర్మయను బ్రాహ్మణుడు కలడు.అతడు విషయలోలుడై,దురాచారపరుడై,జీవితమును భ్రష్టమొనర్చుకొని,మరణించి, పెక్కు యమయాతనల ననుభవించి, తిరిగి మరుజన్మలో ఎద్దు అయి పుట్టెను.అది భారములను మోయుచు,మోయుచు ఒకనాడొక పర్వత ప్రాంతమున భారాధిక్యముచే క్రిందపడి మ్రుతి నొందెను.అద్దాని దీనదశను జూచి ఆ మార్గమున బోవుచున్న కొందరు దానికి సద్గతులు కలుగుటకై తమ పుణ్యములోని కొంత భాగమును ధారబోసిరి.అందొక వేశ్యయూ తానేమీ పుణ్యము చేయలేదని తలచి, ఏదైనా చేసియుండినచో ఆ వ్రుషభమునకు కర్పించితినని సంకల్పించెను.వేశ్యయొక్క పుణ్యముచే ఆ వ్రషభము పుణ్యలోకములకు వెళ్ళి మరల పూర్వ జ్ణానం గల ఉత్తమ బ్రాహ్మణ జన్మను బొందెను. అంతట ఆ బ్రాహ్మణుడు తనకు పూర్వజన్మమున సుక్రుతమును ధారబోసిన వేశ్య ఇంటికి వెళ్ళి ఆ సుక్రుతము ఎట్టిది అని అడుగగా,ఆమె చిలుకను చూపించి,ఆ చిలుకపలుకు వాక్యములను వినుటచేత తన మనస్సు పునీతమైనదని, చెప్పెను.అంతట వారిద్దరునూ ఆ చిలుకను సమీపించి ప్రశ్నింపగా,ఆ చిలుక పూర్వజన్మలో తానొక విద్వాంసుడనని, గురుధూషణాది పాపములను జేసి మరణించి తిరిగి చిలుకయై పుట్టి అరణ్యము లో దీనావస్థలో ఉన్న తనను ఒక మునిపుంగవుడు తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి పోషించుచున్నాడు అనియూ చెప్పెను.అచ్చోట గీత ప్రధమాధ్యాయము అతడు తన శిష్యులకు నిరంతరము బోధించు చుండగా విని క్రమముగా దానిని ఉచ్ఛరించగల్గితిననియు, ఒకనాడు ఒక దొంగ తన్నపహరించి ఈ వేశ్యకు అమ్మెననియు చెప్పెను.వేశ్యకు పాపవిముక్తి,సుశర్మకు సద్గతి లభించెను.
తస్మా దధ్యాయ మాద్యం పఠతే శ్రుణుతే స్మరేత్
అభ్యసేత్తస్య న భవేత్ భవాంభోధిర్దురుత్తరః.
కాబట్టి గీత ప్రధమాధ్యాయమును ఎవడు పఠించునో,శ్రవణము చేయునో,లేక స్మరించునో అట్టివాడు సంసారసాగరమును సులభముగా దాటిపోవును.
గీత ప్రథమాధ్యాయము పారాయణచే ----పాపవిముక్తి, పూర్వజన్మ స్మృతి కల్గును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి