*🌷అక్రమ మార్గం🌷*
(కొచ్చెర్లకోట జగదీశ్ గారి కథనం)
🌷🌷🌷
స్కూల్లో ఐఐటీ బ్రిడ్జ్ కోర్సు, నీట్ క్రాష్ కోర్సంటూ నేర్పించే మాస్టర్లు క్లాసయిపోయాక సైకిలు మీద పిల్లాడెలా వెళ్లాలో నేర్పించరు.
అపసవ్య దిశలో సైకిళ్లమీద, బైకులమీద ఇష్టానుసారంగా వచ్చేస్తూ కార్లకీ, బస్సులకీ అడ్డంపడిపోతూ, ఒక్కొక్కసారి యాక్సిడెంటుకి కూడా లోనవుతూ ఉంటారు.
రాత్రివేళ ఊరు నిద్రపోతుండగా రోడ్లమీద జనసమ్మర్దం తగ్గినప్పుడు దగ్గరుండి మరీ పిల్లలకు సైకిల్ తొక్కడం నేర్పుతాడు నాన్న. ఎందుకటా? ఎటువంటి ప్రమాదమూ కలగకూడదని.
తీరా నేర్పించిన తరవాత వాడికి ఎడాపెడా తొక్కడం వచ్చేస్తుంది. ఎలాకావాలంటే అలా తొక్కడమే కాకుండా ఎటుపడితే అటు, ఏ దారి దగ్గరైతే ఆ దారమ్మట వెళిపోవడం కూడా వచ్చేస్తుంది.
ఇక ఏ ప్రమాదమూ లేనట్టే! ఉంటేగింటే తనవల్ల ఊళ్లోవాళ్లకి ఇబ్బందే తప్ప!
బండిమీద ముందొకరినీ, వెనకాల మరో ఇద్దరినీ ఎక్కించుకుని, స్కూల్ బ్యాగులని ముందు కుక్కేసి, రాంగ్ సైడ్ నడుపుతూ స్కూలుకి పిల్లల్ని దింపే అంకుళ్లూ ఆంటీలూ పొద్దున్న లేస్తే వాట్సప్‌లో సూక్తులూ, సూత్రాలూ బోధిస్తారు.
కొణిదెల నీహారికని అలా పెంచకూడదని, గల్లా సిద్ధార్ధగాడికి డబ్బెక్కువైందనీ తీర్పులిచ్చేస్తారు. ఆర్యన్‌ఖాన్ అసలెందుకలా తయారయ్యాడో నెంబర్లేసి మరీ కారణాలు చెబుతారు.
అక్రమ మార్గమంటే కేవలం మాదకద్రవ్యాలు మాత్రమే కాదు. పిల్లలకి క్రమమైన మార్గం ఏదో చెప్పకపోవడం కూడా!
రోజూ సాయంత్రం ఆరింటికి బయలుదేరి ఏడుకిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్‌కి వెళతాను. దాదాపు పదిపన్నెండు మద్యం దుకాణాలు, వాటిముందు ఈగల్లా జనం, రోడ్డుమీద ఎక్కడబడితే అక్కడ వాహనాలు అడ్డదిడ్డంగా పెట్టేసి షాపు ముందు మాత్రం పద్ధతిగా క్యూలో నిలబడే కుర్రాళ్లు, అంకుళ్లు వందల్లో ఉంటారు.
మద్యం చట్టబద్ధమే కాదు, చవక కూడా.
మాదకద్రవ్యాలు చట్టవ్యతిరేకమే కాదు, చాలా ఖరీదు కూడా!
అంతే తేడా!
ఒకవేళ అదే గంజాయి ప్యాకెట్లు చవకగా, విచ్చలవిడిగా వీధుల్లో అమ్మితే ఎగబడి కొనుక్కునేది మన పిల్లలే! ఈ అంకుళ్లే!
అంచేత....
డబ్బున్న మారాజుల పిల్లలకు వాటిని లోపలికి తీసుకోవడం ఎలా తెలుసో, వాళ్ల తల్లిదండ్రులకు వారిని బయటకు ఎలా తీసుకురావాలో కూడా తెలుసు.
బెంగపడకండి.
........కొచ్చెర్లకోట జగదీశ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి