5, ఏప్రిల్ 2022, మంగళవారం

విశ్వగురువులు

 విశ్వగురువులు


గత కొన్ని సంవత్సరాలుగా నేను, మా కుటుంబం మొత్తం పరమాచార్య స్వామివారి భక్తులం. ఆచార్యులకు, మాకు మధ్యన ఒక దృఢమైన బంధం ఏర్పడిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. గత కొద్ది నెలలుగా మహాస్వామి వారి గురించి ఎందఱో ఎన్నో విషయాలను పంచుకున్నారు. స్వామివారి దర్శనానికి కంచి మఠానికి వెళ్ళినప్పుడు నాకు కలిగిన కొన్ని అనుభవాలను, నాపై, నా కుటుంబ సభ్యులపై స్వామివారు కురిపించిన అనుగ్రహాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అంతటి నిర్మలమైన, ప్రశాంతమైన మోమును నేను ఎప్పుడూ చూడలేదు. కేవలం కరుణను, ప్రసన్నతను ప్రసరించే మోము అది. దయను వర్షించే అయస్కాంతం లాంటి ఆ కళ్ళు ఎందరినో ఆదరించడం నన్ను కదిలించివేసింది.


ఇటువంటి సందర్భంలో కంచి మఠానికి, ఆచార్యులకు మమ్మల్ని దగ్గర చేసిన ఒకట్రెండు విషయాలను ప్రస్తావించబోతున్నాను. ఏ సామాజిక విషయాలు అయితే మాట్లాడడానికి అయిష్టపడతానో, అవి నేను సమాజంలో మాట్లాడడానికి అయిష్టపడాలి. అయితే పరమాచార్య స్వామివారు ఏమి చేసినా అది భక్తులను అశీర్వదించడానికే కాబట్టి నేను మాట్లాడాలి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక్క విషయం, ఎవరైనా ఎంతటి కష్టమైన పని అయినా మఠం కోసం చెయ్యాలని తలపెడితే, అందుకు స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా లభించి అది అత్యంత త్వరగా, పరిపూర్ణంగా పూర్తవుతుంది.


చాలా సంవత్సరాల క్రితం భారీ వర్షం కురుస్తున్న ఒకరోజు, పూర్తిగా తడిసిపోయిన ఇద్దరు వ్యక్తులు కంచి మఠం తరుపున ఒక విషయం నాకు తెలియజేయడానికి కాంచీపురం నుండి వచ్చారని నాకు తెలిపారు. వారిని నేను లోపలకు రమ్మన్నాను. పరమాచార్య స్వామివారు చిదంబర నటరాజ స్వామి వారికి వజ్ర కిరీటం చేయ సంకల్పించారని, కాని కొద్దిగా ధనం తక్కువ అవ్వడం వల్ల అది పూర్తీ కాలేదని వారు నాకు చెప్పారు. వారు మద్రాసుకు వచ్చిన పని, కొందరు భక్తులను కలిసి వారి వద్ద నుండి విరాళాలు సేకరించడానికే. దానికి ఇంకా ఎంత ధనం కావాలో అంట ధనం ఇవ్వడానికి నేను సిద్ధమని పరమాచార్య స్వామివారికి తెల్పమని వెంటనే వారికీ చెప్పాను. తరువాత స్వామి వారి దగ్గరకు వెళ్లి, నా మాటను నేరవేర్చాను. మహాస్వామి వారి ఆశీస్సుల వల్ల కిరీటం పని పూర్తయ్యింది. అలాగే మహాస్వామి వారికి, మఠానికి మేము మరింత దగ్గరయ్యాము.


దాదాపు మూడు సంవత్సరాల క్రితం, గల్ఫ్ యుద్ధం జరుగుతున్న సమయంలో మన మాజీ రాష్ట్రపతి శ్రీ ఆర్. వేంకటరామన్ గారు శ్రీమఠంలో ఉన్నప్పుడు, అక్కడి వైద్యులు పరమాచార్య స్వామి వారి ఆరోగ్య స్థితిని అంచనా వెయ్యడానికి స్వామివారి పూర్తి శరీరం స్కాన్ చెయ్యాలన్న అభిప్రాయాన్ని తెలిపారు. కాని మహాస్వామి వారు ఎటువంటి వాహనం ఎక్కరు కాబట్టి స్కానింగ్ యంత్రాలు ఉండే మద్రాసుకు శ్రీవారిని తీసుకుని వెళ్ళడం కుదరని పని. దాంతో మొబైల్ స్కానింగ్ మిషన్ ను అమెరికా నుండి తెప్పించాలాని రాష్ట్రపతి గారు అభిప్రాయపడ్డారు. అ యంత్రం కోసం వారు అమెరికా అధ్యక్షులు బుష్ (సీనియర్)ను సంప్రదించారు. గల్ఫ్ యుద్ధం కోసం అన్ని యంత్రాలను అక్కడకు పంపడంతో భారతదేశానికి పంపలేమని బుష్ తెలిపారు. ఇతర వ్యక్తుల ద్వారా అదృష్టవశాత్తు అమెరికాలోనే ఉన్న ఒక యంత్రాన్ని గుర్తించారు. శ్రీ వేంకటరామన్ మరియు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆ యంత్రాన్ని కాంచీపురానికి చేర్చే బాధ్యతను నాకు అప్పగించారు. ఆశ్చర్యంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ అధునాతన యంత్రం అమెరికా నుండి కంచీపురానికి క్షేమంగా వచ్చింది. ఆ యంత్రానికి ఎటువంటి హాని లేకుండా రావడం ఆనందకరమైతే, ఆ వచ్చిన యంత్రం స్వామివారిని పరీక్షించి వారి ఆరోగ్యం సరిగ్గా ఉందని తెలపడం మరింత ఆనందకరం. ఇది నా జీవితంలో మరచిపోలేని అనుభం.


మరొక్క సంఘటన కూడా చెప్పుకోవాలి. జనవరి 1992 మొదటి వారంలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం చెయ్యబోతున్న ‘శ్రీ వేంకటేశ్వర ఇంజనీయరింగ్ కళాశాల’ ఉత్సవం విజయవంతం అవ్వడానికి పరమాచార్య స్వామివారి ఆశీస్సుల కోసం నేను నా భార్య కాంచీపురం వెళ్ళాము. స్వామివారి ఆశీస్సులు తీసుకుని, తిరిగి వెళ్ళడానికి స్వామి వారి అనుమతి తీసుకున్న తరువాత నాకు ఒక శాలువా బహూకరించారు. స్వామివారు ఆ శాలువాను చూసి స్వామివారు కాస్త నిరాశ పడ్డారు. మమ్మల్ని కొద్దిసేపు వేచి ఉండమని చెప్పారు. స్వామివారు వేసుకున్న శాలువా తీసి, దాన్ని మృదువుగా తలకు రుద్దుకుని, నన్ను తమ పక్కకు పిలిపించుకుని, దాన్ని నాకు ఇవ్వాల్సిందిగా అక్కడున్న సేవకుడిని, దాన్ని నా భార్యకు ఇవ్వాల్సిందిగా నాకు సైగచేశారు. చెప్పాలంటే మాటల్లో చెప్పలేని పులకింతను పొందాము.


మా అబ్బాయి పెళ్ళికి పది నెలల ముందు మేము కంచి మఠానికి వెళ్ళినప్పుడు మరొక అద్భుత సంఘటన జరిగింది. మేము పరమాచార్య స్వామివారిని దర్శించుకుంటున్నప్పుడు స్వామివారి అంతేవాసులు మా అబ్బాయి అశ్విన్ వివాహం నిశ్చయమైందని మహాస్వామి వారికి తెలిపారు. పెళ్లి పత్రికతో సహా వచ్చి మహాస్వామి వారి ఆశీస్సులు తీసుకుందామని మేము ముందుగానే అనుకుని ఉండడం వల్ల ఆ విషయం స్వామివారితో ప్రస్తావించలేదు. స్వామివారు వెంటనే ఒక కొబ్బరికాయ తీసుకుని రమ్మని తెలిపి, ముందుగానే మాకు ఆశీపూర్వకంగా ఇచ్చారు. సాధారణంగా స్వామివారి ఆశీస్సులను ప్రత్యేకంగా అడిగినప్పుడే ఇలా చేస్తుంటారు. కాని స్వామివారు ఎంతో దివ్యదృష్టితో ఈ పని చేశారు. తరువాత కూడా మేము స్వామి వారి ఆశీస్సులను పొందలేకపోయాము. ఎందుకంటే, పెళ్ళికి పదిహేను రోజుల ముందరే స్వామివారు బ్రాహ్మీభూతులయ్యారు. జరిగిన విషయం తెలుసుకుని శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఆశ్చర్యపోయారు.


ప్రముఖులు, విద్యావేత్త అయిన మా తాతగారు డా. రాజా సర్ అన్నామలై చెట్టియార్ గారి స్ఫూర్తితో తమిళనాడులో కాని పుదుచ్చేరిలో కాని ఒక ఉన్నత విద్యాసంస్థను నెలకొల్పాలని చూస్తున్న తరుణంలో 1998లో నాకు కలిగిన మరొక అనుగ్రహం, శ్రీపెరుంబదూర్ లో ఉన్న శ్రీ వేంకటేశ్వర ఇంజనీయరింగ్ కాలేజి యాజమాన్య బాధ్యతలు తీసుకోవాల్సిన అవకాశం దొరకడం. పరమాచార్య స్వామి మరియు వారి ఇద్దరి శిష్యుల అనుగ్రహం వల్ల ఈరోజు శ్రీ వేంకటేశ్వర ఇంజనీయరింగ్ కాలేజ్ తమిళనాడులో ఉన్న ప్రముఖ కలాశాలలో ముందు వరుసలో ఉన్నది.


1993 మేలో జరగబోయే కనకాభిషేకానికి భక్తుల నుండి బంగారము, ధనము స్వీకరించే ఉపసమితికి అధ్యక్షునిగా నన్ను నియమించడం న అదృష్టం. అది చాలా కష్టమైనా బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. కాని మహాస్వామి వారి అనుగ్రహం వల్ల వచ్చిన ఉత్సాహం చిన్నదేమీ కాదు. విరాళాలు విరివిగా వచ్చాయి. మొదలుపెట్టిన నాటినుండే ఎటువంటి ఇబ్బంది లేకుండా బగారం కొనుగోలు, రవాణా అన్నీ సక్రమంగా జరిగాయి. 1993 మే 27న పెద్ద ఎత్తున పరమాచార్య స్వామివారికి కనకాభిషేకం నిర్వహించడం జరిగింది. ఆ అరుదైన ఉత్సవాన్ని తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.


పరమాచార్య స్వామివారు ఈ శతాబ్దపు మహోన్నత ఆధ్యాత్మిక చక్రవర్తి. స్వామివారి శతాబ్దపు జీవితం ఎన్నో ఉన్నత విషయాలు, అవిరళ కృషి, అద్భుతమైన విజయాల సమాహారం. స్వామివారు ఒక విజ్ఞాన సముద్రం. అంతే కాదు వారు కరుణా సముద్రులు కూడా. ఎన్నో దేశాల వివిధ నాగరికతల, సంప్రదాయాల, పద్ధతులపై ఎంతో లోతైన అవగాహన, పట్టు ఉన్నావారు. హిందూ వారసత్వపు పవిత్రతను కాపాడాలన్నదే వారి చిరకాల కోరిక. దేశ, జాతి, కుల, వర్గ, మత బేధాలు లేని విశ్వగురువు పరమాచార్య స్వామివారు. జనవరి 8 స్వామివారు శరీరం వదిలిన రోజు, ఎన్నో లక్షల మందిని కదిలించిన దృశ్యం స్వామివారిని చివరిసారిగా చూడడానికి వచ్చిన క్రైస్తవ నన్ లను, మహమ్మదీయ ప్రజలను చూసినప్పుడు.


--- డా. ఎ.సి. ముత్తయ్య. “kamakoti.org” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: