తల్లి… పరమోన్నతమైన దైవం.
భూప్రదక్షిణ షట్కేన
కాశీయాత్రాయుతేనచ
సేతుస్నాన శతైర్యశ్చ
తత్ఫలం మాతృవందనే
భూప్రదక్షిణలు, కాశీయాత్రలు, సేతుస్నానాలు ఇచ్చే పుణ్యఫలం ఎంతో, మాతృవందనం కూడా అంత పుణ్యఫలాన్ని ఇస్తుంది.
ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాం శతం పితా
సహస్రస్తు పితృన్మాతా గౌరవేణాతిరిచ్యతే (మనువు)
పదుగురు ఉపాధ్యాయులకన్న ఒక వంశాచార్యుడు అధికుడు,
అట్టి కులగురువులు నూరుగురి కన్న ఒక తండ్రి అధికుడు,
అట్టి వేయి మంది తండ్రులకన్న *తల్లి అధిక పూజ్యురాలు*. అంతేకాదు
‘‘న మాతుః పరదైవతమ్’’ (తల్లికి మించిన దైవం లేదు) అని శాస్త్రాలు చెబుతాయి.
మహనీయులందరూ ఆచరించి ఆదర్శంగా నిలుస్తారు.
*భగవాన్ రమణమహర్షి తల్లి అళగమ్మ. ధర్మాత్మురాలు, భక్తురాలు. ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదలి వెళ్లి పోయిన కొడుకు విషయమై ఎంతో దుఃఖించింది. చివరికి ఆ కుమారుని ఆచూకీ తెలిసికొని వచ్చింది. జడలు కట్టిన జుట్టుతో, కృశించిన దేహంతో ఉన్న కుమారుని చూసి కుమిలిపోయింది. ఇంటికి తిరిగి రమ్మని బతిమాలింది. తన కోరిక నెరవేరదని తెలిసికొని వెనుతిరిగింది. ఎంతో మానసిక క్షోభను అనుభవించింది. భర్త గతించిన తరవాత తన కుమారుని వద్దకు చేరింది. ఎందరెందరో దేశవిదేశీయులు తన కొడుకు సమక్షంలో అలౌకిక ఆనందాన్ని పొందటం కళ్లారా చూసింది. *అంతటి మహనీయుడిని లోకానికి ప్రసాదించిన తల్లిగా గౌరవం పొందింది*.
తల్లిపట్ల మహర్షి శ్రద్ధ, ప్రేమ సాటిలేనివి.
దాదాపు చివరి దశలో ఆరు సంవత్సరాలు తన వద్దనే ఆమె ఉండటానికి అంగీకరించారు. *స్కందాశ్రమంలో* ఉన్నప్పుడే ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురయింది. భగవాన్ ఆమె వద్దనే ఉండి ఆమెకు ఆనందం కలిగించాడు. చివరి క్షణాల్లో తన దివ్య హస్తాలను ఆమె తలపైన, హృదయం పైన ఉంచి జన్మజన్మల కర్మను నశింపచేసి ఆమెకు ముక్తి కలిగించాడు. ఆమె దేహాన్ని అరుణాచల పాదం వద్ద ఖననం చేశారు. తల్లిగారి సమాధిపై ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో మహర్షి ఎంతో శ్రద్ధను చూపారు. ఇటుకలను మోశారు. ఆ గుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి వెళ్లారు. ఎంతటి జ్ఞానికైనా తల్లి దైవమేనని ఆచరణ ద్వారా బోధించారు.
ప్రతిరోజూ తల్లి,తండ్రికి నమస్కారం vచేస్తే... జన్మ జన్మల ప్రారబ్దం వల్ల ఉన్న చెడు నశించును
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి