ॐ శంకరజయంతి శుభాకాంక్షలు
శంకర జయంతి ప్రత్యేకం - 7
( ఈరోజు వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )
శంకరుల అవతారం
6. స్తోత్రాలు - ప్రకరణలు - భాష్యాలు
ఇతర మతాలలో ఒక్కొక్క మతంలో ఒక్కొక్కటే గ్రంథం. సాధనలో ఏ స్థాయివారికైనా ఒకటే పద్ధతి తప్పని సరి.
కానీ హిందూత్వం - వివిధస్థితులలో, స్థాయిలలో ఉన్నవారికి సాధనలో వారిస్థాయి ఎరిగి, ఆ పైస్థితికి చేరుకునేందుకు సాహిత్యం వివిధ రకాలుగా ఉంటుంది.
జగద్గురువులు ఈ విషయానికి సంబంధించి, గ్రంథాలను మూడు రకాలుగా వర్గీకరించి అందించారు. అందులో
అ) స్తోత్రాలు:— సామాన్యులకు కూడా ఇహలోక సుఖంతోనూ, మోక్షము సులభంగా పొందేలాగానూ వివిధ దేవతలని స్తుతిస్తూండేవి స్తోత్రాలు.
శంకరులు అందించిన అనేక దేవుళ్ళమీద అనేక స్తోత్రాలతోపాటు శివానందలహరి, సౌందర్యలహరి వంటివి ఈ కోవలోకి వస్తాయి.
ఆ) ప్రకరణ గ్రంథాలు:— విశేషమైన శాస్త్ర జ్ఞానంలేక, కొద్ది అవగాహనగల మధ్యస్థాయి వారికోసం ఉద్దేశింపబడినవి.
పైస్థాయికి చెందిన జ్ఞాన సంబంధ విషయసారాన్ని గ్రహించి మరింత ఉన్నత స్థాయికి చేర్చే - ఆత్మబోధ,అపరోక్షానుభూతి, వివేకచూడామణి మొదలైనవి జగద్గురువులందించిన రెండవ కోవకు చెందినవి.
ఇ) భాష్యాలు:— మూడవ భాగంగా, శాస్త్ర పండితులకు మాత్రమే అధ్యయనం చేయడానికి సాధ్యమయ్యే వ్యాఖ్యాన గ్రంథాలు భాష్యాలు.
వివిధ శాస్త్ర సంప్రదాయాలతో సమన్వయిస్తూ శ్రుతి స్మృతులలోని వాక్యాలనుదహరిస్తూ, అద్వైత సిద్ధాన్తాన్ని బలపరుస్తూ శంకరభగవత్పాదులు భాష్యాలు రచించారు.
బ్రహ్మసూత్రాలుగా పిలువబడే శారీరక మీమాంసా, ఉపనిషత్తులు,భగవద్గీతపై వ్రాసిన భాష్యాలని ప్రస్థానత్రయంగా పిలుస్తారు. ఆ భాష్యాలను శంకరులు అనుగ్రహించారు. ఇవి గొప్ప శాస్త్రజ్ఞానంగల పండితుల స్థాయికి అవుసరమైనవి.
ఇట్లా సాధారణ, మధ్య, పాండిత్య స్థాయిలలో మూడు రకాల సాహిత్యాన్ని అనుగ్రహించారు శంకరులు.
తద్వారా ఏ స్థాయిలవారైనా, మూడంచెల మార్గం ద్వారా మూడుమెట్లు ఎక్కి ఉన్నతస్థితికి చేరుకునే అవకాశం కల్పించారు.
కొనసాగింపు
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి