7, మే 2022, శనివారం

భాష్యపాఠం చెప్పిన స్వామివారు

 భాష్యపాఠం చెప్పిన స్వామివారు


దాదాపు ఇరవైఅయిదు సంవత్సరాల క్రితం పరమాచార్య స్వామివారు సతారాలోని శ్రీ శంకర మఠంలో పదకొండు నెలల పాటు మకాం చేశారు. 


అప్పుడు మా నాన్నగారు శ్రీ కాశీనాథ శాస్త్రి గారు మహాస్వామి వారి నోటి నుండి ప్రస్థానత్రయ (ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత) భాష్యం వినాలన్న తమ కోరికను స్వామివారికి విన్నవించారు.


అందుకు స్వామివారు, “అలాగే భవిష్యత్తులో చూద్దాం” అని తెలిపారు.


రెండు నెలలు గడచిన తరువాత, స్వామివారు మమ్మల్ని పిలిచి, భాష్య పుస్తకాలను తెప్పించుకుని, వాటిని వివరించడం మొదలుపెట్టారు. శ్రీ రాజగోప అయ్యర్ అనే వారొకరు ప్రతి ఉపనిషత్తు నుండి మొదటి వాక్యాన్ని మాత్రం చదివేవారు. స్వామివారు ఆ ఉపనిషత్తుకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకుషంగా ఎందఱో భాష్యకారుల భాష్యాన్ని ఉదహరిస్తూ తెగిన ఆనకట్ట నుండి పారే నీటిలా విస్తారంగా వివరించేవారు. ప్రతి రోజూ ఏడుగంటల పాటు ఈ భాష్యపాఠం కొనసాగేది. మాపై పరమాచార్య స్వామివారికి ఉన్న కారుణ్యాన్ని తెలపడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది?


ఈ సుదీర్ఘ ఉపన్యాసాలు పన్నెండు రోజులపాటు సాగి చివరకు పరిసమాప్తమయ్యాయి. కేవలం పరమాచార్య స్వామివారు ఒక్కరే ఏడుగంటల పాటు పాఠం చెప్పేవారు. ఆశర్యపోయే విశ్స్యం ఏంటంటే, ఏమాత్రం శ్రమ లేకుండా చెప్పడమే కాకుండా ప్రతి రోజూ ఎంతో ఉత్సాహంతో పాఠం చెప్పేవారు.


ఈ ఉపకారానికి మేము ఎన్ని జన్మలు ఎత్తి మహాస్వామివారికి సేవ చేసుకోవాలో.


స్వామివారి దర్శనానికి ప్రతిరోజూ ఒక కళాశాల అధ్యాపకులొకరు వచ్చేవారు. కాని అతను ఎన్నడూ స్వామివారికి తనను పరిచయం చేసుకోవడం కాని, మాట్లాడడానికి ప్రయత్నించడం చేయడం కాని చేసేవాడు కాదు. బహుశా స్వామివారి దర్శనమే తనకి అపరిమిత ఆనందాన్ని కలిగించేదేమో. 


అయిదారు నెలల తరువాత ఒకరోజు స్వామివారు అతణ్ణి చూసి, “నువ్వు ఇప్పుడు ఇక్కడకు వచ్చావేమిటి?” అని అడిగారు స్వామివారు.


అతను ఆశ్చర్యంతో, “నేను ఇక్కడకు రోజూ వస్తున్నాను పెరియవా” అని బదులిచ్చాడు.


మహాస్వామివారు మరలా అదే ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న పరమార్థం ఏమిటో అతనికి అర్థం కాక అయోమయంగా ఇంటికి చేరుకున్నాడు. ఇంటిలోకి అడుగుపెట్టగానే, నేలపై పడ్డ ఒక ఉత్తరం కంటపడింది. దాని తీసుకుని చదివాడు. “చాలా ముఖ్యమైన సమాచారం. వెంటనే ఫలానా ప్రాంతంలో ఉన్న ఫలానా కళాశాలకు వెళ్లి నీ పని మొదలుపెట్టు” అన్నది సారాంశం.


ఆ ఉత్తరంలో ఉన్న విషయం ఏమిటో మహాస్వామివారికి ముందే ఎలా తెలుసు? ఏమైతేనేమి, ఆ అధ్యాపకుడు పెట్టెబేడా సర్దుకుని ఇంకో ఊరికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు.


పరమాచార్య స్వామివారు మకాం చేసిన చోట విపరీతంగా నల్లులు చేరాయి. ఎక్కడ కాలు పెడితే అక్కడ నల్లులు ఉన్నాయి. కొన్నిసార్లు మహాస్వామి వారి శరీరంపై కూడా తెనేపట్టుని అంటుకున్న తేనెటీగల గుంపులా అధిక మొత్తంలో నల్లులు గుంపులుగుంపులుగా ఉండేవి.


వాటిని చంపడానికి ఒక భక్తుడు క్రిమిసంహారక మందును తెచ్చాడు. మహాస్వామివారికి ఈ విషయం తెలిసి ఆ భక్తుణ్ణి పిలిచారు.


“మన శరీర పోషణం కొరకు మనం ఆహారం తీసుకుంటాము. నల్లులకు మనుష్య శరీరంలో ఉన్న రక్తమే ఆహారం. నల్లులు తమకు తామే ఆహారాన్ని తీసుకుంటాయి. ఆహారం లేకపోతే అవి ఎలా బ్రతుకుతాయి? నిజమే కదా?” అని అడిగారు.


“బ్రతికున్నవాటికి జీవహింస జరగరాదు. మనకు ఏదైనా సహాయం చేసేవారిపై మనం ఇష్టం కలిగిఉండడం గొప్ప విషయమేమీ కాదు. మన పెద్దలు చెప్పినట్టు మనకు అపకారం చేసేవారిని కూడా అమనం ఇష్టపడగలిగే వారే ధర్మాత్ములు”

ఈ మాటలు విన్న తరువాత ఆ భక్తునికి పరమాచార్య స్వామివారి గదిలో ఆ క్రిమిసంహారక మందును చల్లడానికి మనస్సు ఉంటుందా?


ఆశ్చర్యపరిచేది ఇది కాదు. ఈ సంభాషణ జరిగిన ఒకట్రెండు రోజుల తరువాత ఆ గదిలో నుండి నల్లులు మాయమైపోయాయి - ఇది అద్బుతాలకే అద్భుతం అంటే.


--- బ్రహ్మశ్రీ కృష్ణ శాస్త్రి జోషి, శ్రీ శంకర మఠం, సతారా. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: