24, మే 2022, మంగళవారం

పేదవారు

  పేదవారు 

తరచూ మనం అనేకమంది అనేక కష్టాలు పడుతూ పేదరికంలో మ్రగ్గుతున్న వారిని  చూస్తుంటాము. వారిని చుస్తే మనకు జాలివేస్తుంది కూడా. కొంతమంది అనేక రోగాలతో బాధపడుతుంటారు, కొంతమంది తినటానికి తిండిలేక ఉండటానికి ఇల్లు లేక కాళ్లకు చెప్పులు లేక ఇలా ఇలా అనేక బాధలతో ఇబ్బంది పడుతున్నవారిని చూస్తుంటే మనస్సు తరుక్కోని పోతుంది

దైవ సృష్టిలో ఇలా కొంతమందిని పేదవారిగా, కొంతమందిని ఇశ్వర వంతులుగా ఎందుకు సృష్టించాడా అని విచారిస్తే నాకు లభించిన సమాధానాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను. నేను ఎంతవరకు సరిగా చెప్పానన్నది ప్రాజ్ఞులైన పాఠకులే తెలపాలి

పేదరికానికి కారణం ఏమిటని విచారిస్తే నాకు లభించిన కారణాలు మూడు అవి ఏమిటంటే 1) గత జన్మ ప్రారబ్ద ఫలము 2)తామస ప్రవ్రుత్తి ఫలము 3) జ్ఞ్యాన పరీక్షాసమయ ఫలము ఇప్పుడు ఒక్కొక్కటి విస్తరిద్దాం

1) గత జన్మ ప్రారబ్ద ఫలముపూర్వ జన్మలో పాపము ఎక్కువాగా చేసి తగినంత పుణ్యం చేయనందున  ప్రారబ్ధ ఫలాన్ని అనుభవించటానికి ఇప్పుడు పేదరికాన్నివ్యాధుల్నిఅంగ వైకల్యాలని అనుభవించక తప్పదు  పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం"  అన్న శ్లోకార్ధం ప్రకారం గత జన్మలో చేసిన పాపం కొంత వ్యాధుల రూపంలో బాధిస్తుంది. కాబట్టి వ్యాధులను నివారించుకోవటానికి ఔషధ సేవనం చేయాలి. ఇక పేదరిక నిర్ములన చేయటానికి పుణ్యకార్యాలు చేయాలి అంటే దైవ చింతన, సజ్జన సేవన , పరోపకార కార్యాలు ఇలా చేయటం వలన వారి ప్రారబ్ధంలో ఉన్నపాప జాబితా తొలగించి పుణ్యం చోటు  చేసుకుంటుంది. పేదరికంలో వున్నవారు ఎట్టి పరిస్థితిలోను మనో ధుర్యాన్ని వీడకూడదు. సదా భగవంతుని స్మరిస్తూ పేదరికాన్ని అవలీలగా అధిగమించాలి

2) తామస ప్రవ్రుత్తి ఫలము: ఇది చాలా ప్రమాదకరం మనం చూస్తూవుంటాము. తల్లిదండ్రులు పిల్లవానికి మంచిగా ఇల్లు వాకిలి అమర్చి జీవయోపధీకి ఉద్యోగమో, వ్యాపారమో అమర్చి వెళ్లిన తల్లిదండ్రులు గతించిన వెనువెంటనే వున్న ఆస్తిపాస్తులన్నీ అమ్మే చివరికి సంసారాన్ని " అమ్మ బువ్వ-అయ్యా బువ్వ" అన్నట్లుగా చేస్తారు. పురుషుడు సమర్ధుడు కాకపొతే ఉన్నవన్నీ పోయి పేదరికం సంప్రాప్తం అవుతుంది

దక్షుడు లేని యింటికి బదార్థము వేఱొక చోటనుండి వే

లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను గల్లగాదు ప్ర

త్యక్షము వాగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే

యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా

తాత్పర్యం:-

 కుటుంబానికైనా సమర్థుడైన యజమాని లేకపోతే ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా అది ఎటూ చాలకుండా ఖర్చవుతూ పోతుందిఎలాగంటేగండి పడిన తటాకంలోకి ఎన్ని వాగుల నీళ్లు వచ్చి చేరుతున్నా అవి అందులో నిలువవుఎప్పటి కప్పుడు జారుకుంటూనే ఉంటాయి కదాగృహ ఆర్థిక నిర్వహణ కూడా ఇలాంటిదే అని అర్ధం

గృహ యజమాని సమర్థుడై  ఉండి వచ్చిన ఆదాయాన్ని గృహవ్యయాన్ని సమన్వయము చేసుకుంటూ ఒక ప్రణాళికా బద్దంగా జీవనం గడిపితే ఇల్లు స్వర్గంగా ఉంటుంది. తక్కువ రాబడి వున్నా పేదరికం ఉండదు. కానీ అదే దుర్వ్యసనాలకు పాల్పడి దుష్ట జన సాంగత్యం (దుర్మార్గులతో స్నేహితం) చేస్తూ అవసరాలకు మించిన ఖర్చులు పెడుతూ అదుపు లేకుండా విలాసాలకు వెళుతూ ఇతరులతో పోల్చుకొని వారిలాగా ఉండాలని తనకు అవసరము వున్నా లేకున్నా వివిధ వస్తువులను కొని అప్పులు చేస్తూ అవి తీర్చలేక చతికిల పడితే అట్టి వారిని పరమేశ్వరుడు కూడా ఆడుకొనలేడు. భార్య భర్తలు ఇద్దరు చక్కగా వారి ఆదాయ వ్యయాలను సరి చూసుకొని డాంబికాలు పోకుండా ఇతరులతో పోల్చుకోకుండా జీవనం సాగించాలి. అటువంటి వారితో లక్ష్మీదేవి సదా వెంటనే ఉంటుంది. .

నిన్న జరిగిన ఒక సంఘటన ఇక్కడ పేర్కొంటాను. ఒక వీధి వ్యాపారస్తుడు ప్లాస్టిక్ సామానులు విక్రయిస్తూ మా ఇంటిముందుకు వచ్చాడు.నేను మాకు కావలసిన వస్తువులను కొని డబ్బులు ఇవ్వటానికి గేటు వద్దకు వెళ్ళితే మా గేటుమీద వున్న నా నామ ఫలకం (NAME PLATE) చూసి చదివి అయ్యా PG.D.P.M.I.R అంటే డిగ్రీ అని నన్ను అడిగాడు నేను నా నామ ఫలకం మీద నా పేరు ప్రక్కన నేను చదివిన డిగ్రీలు "B.Sc,LL.B., PG.D.P.M.I.R" లు వ్రాసుకొన్నదానిని పేర్కొంటు ఆటను సందేహాన్ని వెలిబుచ్చాడు. నేను అతని విద్య స్థాయిని తెలుసుకొనే నిమిత్తము నీవు ఏమి చదివావు అని అడిగాను ఎందుకంటె అతని స్థాయికి తగినట్లుగా సమాధానం చెప్పాలని. దానికి నేను M.B.A. చదివానని చెప్పాడు. అది విని నా మెదడు సూన్యం (mind blank) అయ్యింది. అతని ప్రశ్నకు సమాధానంగా అది ఒక పోస్ట్ గ్రాడ్యువేట్ డిప్లమా అని చెప్పి మరల నీవు M.B.A.చదివి ఇలా వీధి వర్తకునిగా ఎందుకు వ్యాపారం చేస్తున్నావని అడిగానుదానికి తానూ గతంలో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేశానని అది మూసి వేశారని కాబట్టి ఆంధ్రా నుండి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నానని రోజుకు వెయ్యి నుండి పదిహేను వందలవరకు లాభం దొరుకుతున్నదని సంతోషంగా చెప్పాడు. నాకు అతడు ఒక కర్మ యోగిలాగా కనపడ్డాడు..   కాబట్టి మిత్రులారా ఎప్పుడు మనిషి తాను గొప్పవాడని లేని పోనీ డాంబికాలు పోకుండా అవసరానుగుణంగా తన జీవితాన్ని మలుచుకోవాలి. ఆలా సమయానుకూలంగా ప్రవర్తించే వారు సాదా సంతోషంగా వుంటారు

అనువుగాని చోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా..?
విశ్వదాభిరామ.. వినుర వేమ..!!

మనిషి డాంబికాన్ని, అహంకారాన్ని విడనాడి, వినయాన్ని అనుకవత్వాన్ని సంతరించుకుంటే సదా సంతోషంగా ఉంటాడు. పేదరికం అనేది అస్సలు ఉండదు. రోజుల్లో బ్రతకటానికి అనేక మార్గాలు వున్నాయి. నిజానికి కొన్ని సందర్భాలలో  సంపాదనకు చదువుకు సంబంధం లేదనిపిస్తుంది నాకు

3) జ్ఞ్యాన పరీక్షాసమయ ఫలము తరహా పేదరికం ప్రస్తుత సమయంలో ఉండక పోవచ్చుభగవంతుడు తన భక్తునికి మోక్షాన్ని ప్రసాదించాలని తలచినప్పుడు భక్తునికి జ్ఞ్యాన పరిపక్వత కలిగినదా లేదా అని భగవంతుడు పరీక్షించాలని పేదరికాన్ని సంప్రాప్తిస్తాడని దివాజ్ఞ్యములు వక్కాణిస్తారుకానీ ఇప్పటి సమాజంలో అంతగా జ్ఞ్యన సముపార్జన చేసిన వారు అరుదుగా వుంటారో లేక లేరో భగవంతునికే తెలియాలి. ఇప్పుడు దైవ భక్తులం అని చెప్పుకునే స్వామీజీలు, బాబాలు, సత్ గురువులు (వారంతట వారే చెప్పుకుంటారు) వారి ఆర్భాటం వారు వారి భక్తుల వద్దనుండి పొందే కానుకలు చూస్తూ ఉంటే అన్ని వృత్తి వ్యాపారాలకంటే వారి వృత్తే (ఇలా వ్రాయటానికి నేను చాలా బాధపడుతున్నాను) చాల లాభదాయకంగా ఉన్నట్లు కనపడుతుంది. రాజకీయ నాయకులతో, బడా బడా షావుకార్లతో ( వేరే పదం వాడటానికి నా మనస్సు అంగీకరించలేదు) వారికి సంబంధాలుఇంకా కొన్ని సందర్భాలలో కొన్ని అసాంఘిక కార్యా కలాపాలలో కూడా వీరి పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నది. ఏతా వాత చెప్పేదేమిటంటే ప్రస్తుత సమాజంలో భగవంతుడికి తమ భక్తులను పరీక్షించే శ్రమ లేదనిపిస్తుంది

కాబట్టి మిత్రులారా 

కృషితో నాస్తి దుర్భిక్షం

, జపతో నాస్తి పాతకమ్

మౌనేన కలహో నాస్తి

నాస్తి జాగరతో భయమ్

అన్నట్లు కృషి చేసే వారికి దరి దాపుల్లో దారిద్యం రాదు

గమనిక: వ్యాసం చదివిన ఒక్క పాఠకుడైన తన జీవన సరళి మార్చుకొని ఉన్నత పదాన్ని చేరుకుంటే వ్యాసకర్త కృషి సఫలీకృతం అయినట్లే

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

 

 

 


కామెంట్‌లు లేవు: