24, మే 2022, మంగళవారం

అమ్మ తీర్పు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

     🙏  *అమ్మ తీర్పు*  🙏           

                 🌷🌷🌷

‘మా ఫ్రెండ్స్ వస్తున్నారు....మందు పార్టీ ఉంది, చికెన్ చేయమంటే, పందిలా పడుకుంటావా?' కోపంగా కాలితో ఒక్క తన్ను  తన్నగానే జ్వరంతో టాబ్లెట్ వేసుకుని పడుకున్న వసుధ ఉలిక్కిపడి లేచింది.  నిద్రలో నుండి హఠాత్తుగా భయపడి లేచేసరికి ఒక్క క్షణం అయోమయంగా అనిపించింది. ఎదురుగా భీకరంగా కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ భర్త,  కృష్ణమూర్తి.

‘ఎప్పుడూ ఆ దేభ్యం మొహం వేసుకుని ఉంటావు.....ఇల్లు అంటే రావాలి, రావాలి; అనిపించేలా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా ...నీ మొండితనం నీదే....ఏదీ వండావా? ’ రంకెలేస్తూ అంటున్నాడు.


‘జ్వరం వచ్చిందండీ, చేతకావట్లేదు, నీరసంగా అంది.


‘ఛీ ...ఎప్పుడూ రోగాలు రొష్టులే, ఎప్పుడు చక్కగున్నావ్ కనుక దరిద్రపు కొంప, దరిద్రపు కొంపాని' కాలితో ముందున్న పిండి గిన్నెను విసిరి తంతూ విసురుగా వెళ్ళిపోయాడు.  ఇల్లంతా ఎగజల్లినట్లు పిండి అంతా పరుచుకు పోయింది.  బాగు చేసే ఓపిక లేక అలాగే ఒరిగిపోయింది వసుధ.


అలా వెళ్ళినవాడు పేకాడుతూ క్లబ్బులో ఆ రాత్రంతా ఉండి పోయాడు.  తర్వాత అక్కడే అలాగే నిద్రపోయాడు.  తెల్లవారి పొద్దెక్కిన తర్వాత ఇంటికి బయల్దేరాడు.


‘అంటీ మీకీ తాళం చెవి ఇమ్మంది’ అంటూ పక్కింటి అమ్మాయి తాళం చెవి చేతిలో పెట్టింది.  గుడికో, ఏదైనా పేరంటానికో వెళ్ళినప్పుడల్లా అలా ఇచ్చి పోవడం పరి పాటే.  లోనికి వెళ్ళగానే రాత్రి హాంగోవర్ తగ్గడానికి బాత్రూం కెళ్ళి స్నానం చేసి వచ్చాడు.  తల తుడుచుకుంటూ నడుస్తుంటే కాలికి ఎదో తగలడంతో, టవల్ పక్కకు తీసేస్తూ కిందకి చూసాడు.  కింద నిన్న తను తన్ని వెళ్ళిన పిండి. ఏదో అనుమానంతో చుట్టూ పరికించి చూసాడు.  ఎప్పటిలా ఇల్లు కడిగిన ముత్యంలా అద్దంలా మెరిసిపోవటం లేదు.  ఇల్లంతా అస్తవ్యస్తంగా దుమ్ము దుమ్ముగా ఉంది.  అతని భ్రు ముడి పడింది. పెళ్ళయి ముప్పై వసంతాలు దాటుతున్నా ఎన్ని సార్లు ఎంత పెద్ద గొడవలైనా ఇల్లిలా ఉన్న దాఖలాలు లేవు.  ఏమయ్యింది....నిజంగానే ఆరోగ్యం బాలేక హాస్పిటల్ కి వెళ్ళిందా...కనీసం తనకి ఫోన్ చేస్తుందే....తను తాగిన మత్తులో ఏమైనా ఎత్తలేదా... సెల్ తీసి చూసాడు.  ఏ కాల్ లేదు, సరే తనే ఫోన్ చేద్దామనుకుని చేసాడు. ఊహు, స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎంత చేతకాక పోయినా ఇల్లిలా ఎన్నాడూ పెట్టలేదు.  ఆ పరిసరాలు, ఆ నిశ్శబ్దం చికాకు కలిగిస్తున్నాయి.  అసహనంగా అతి భారంగా పావుగంట గడిచింది.... సమయం గడుస్తున్నకొద్దీ కోపం పెరుగుతోంది.. ఆకలి వల్లనేమో అది రెట్టింపవుతుంది.  సరే టీవీ పెడదామనుకుని రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు.  అది బరువుగా పెట్టిన దాని కింది కాగితం ఫాన్ గాలికి ఎగిరి కింద పడింది.  తీస్తూ ఆశ్చర్య పోయాడు.  అది ఉత్తరం.


అతని కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు తీసాయి.


‘నేను చాలా విసిగిపోయాను. అలసిపోయాను.  ఇక నా మనస్సుతో, మీతో ఘర్షణ పడే ఓపిక నాకు లేదు.  పెళ్ళయిన దగ్గరనుండి మీరు నన్ను కేవలం ఒక వస్తువుగా, భావోద్రేకాలు లేని మరమనిషిగానే భావించారు. అందమైన మీ రూపం వెనుక అందమైన మనస్సుంటుందను కున్నానే కానీ అందం వెనక ఇంత వికృతమైన మనస్సుంటుందనుకోలేదు.  మీకు కావాల్సిన సుఖం, సదుపాయాలను అందించే రోబోలాగానే తప్ప నాకూ మనస్సుంటుందని, దానికేన్నో ఆశలున్నాయని మీరనుకోలేదు. పెళ్ళయి ముప్పై వసంతాలు దాటినా మీరు మారలేదు.  కనీసం పిల్లలూ నా మనస్సు అర్ధం చేసుకోలేదు.  అందుకే ఈ మిగిలిన జీవితం అయినా నా కిష్టమైనట్లుగా గడపడానికి గడప దాటుతున్నాను. ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు.  ఎన్నో జన్మల తర్వాత ఇంతటి ఉత్తమమైన మనిషి జన్మ వస్తుందంటారు.  ఆ జన్మ సార్ధకత చేసుకునేలా నాకు నేనుగా బతుకుతాను.  మా అమ్మావాళ్ళు బతికి ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడో ఇచ్చిన డబ్బులు ఇప్పుడు అవసరానికి ఉపయోగపడుతున్నాయి.  పిల్లలకి నా ఆశీస్సులు.  నన్ను వెదకడానికి ప్రయత్నించవద్దు... నా పిచ్చిగానీ మీరెందుకు వెతుకుతారు?  ఒక పనిమనిషిని పెట్టుకుంటారు.’


సెలవ్.... వసుధ.


ఉత్తరం చదివి హతాశుడయ్యాడు. అస్సలు జీర్ణించుకోలేక పోతున్నాడు.  ఇంత కాలం కనీసం తనన్న మాటకు ఎదురుకూడా చెప్పలేనిది ఇప్పుడు ఏకంగా ఎగిరేపోతుందా?  ఇది కలా,  నిజమా? చేతులు వణుకుతుంటే కాగితం ఎగిరిపోయి టేబిల్ పై నున్న కృష్ణుని పాదాల చెంత పడింది.


కాస్సేపటికి తేరుకుని కర్తవ్యమ్ గుర్తొచ్చిన వాడిలా కొడుక్కి ఫోన్ చేసాడు, ‘అమ్మ వచ్చిందా’ అంటూ, ‘లేదు ఎందుకు ఇంట్లో లేదా?' కొడుకు అడుగుతుంటే పెట్టేసాడు. కూతురుకు చేసాడు. అక్కడా లేదనే సమాధానం వచ్చింది. మైండ్ అంతా బ్లాంక్ అయిపొయింది. షుగర్ పేషంట్ కావడం వల్లనేమో శరీరం వణకడం మొదలయ్యింది.


కొడుకు హరగోపాల్ మళ్ళీ ఫోన్ చేసాడు.  తరచి తరచి అడగ్గా విషయం చెప్పాడు.  చెల్లి దగ్గరకెల్లిందేమో కంగారు పడవద్దన్నాడు. అక్కడా లేదన్నాక కంగారు పడి బయల్దేరుతా నన్నాడు.  కూతురు వినీల ఫోన్ చేసింది. విషయం తెలిసి తానూ అల్లుడితో చెప్పి బయల్దేరుతానంది. మృదుమధురంగా రవలించే కాలి పట్టాలతో ఇంట్లో నడయాడే ఇల్లాలు లేక ఇంట్లో స్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది.  ఇంటి ముందు శుద్ది చేసి ముగ్గేసిన ఆనవాళ్ళు లేవు.  పూజ గదినుండి వచ్చే సాంబ్రాణి , అగర్బత్తి సువాసనలు లేవు.  భయం భయంగా బ్రష్ అందిస్తూ, కాళ్ళకు మడుగు లొత్తుతూ , ఇష్టమైనవి కష్టమైనా చేసిపెట్టే ప్రేమదేవత లేదు.  బీపీ, షుగర్ మందులు వేళకు ఇచ్చే ఆత్మీయత లేదు.  ఏం చేసినా ఎందుకు చేసావని గాని, ఎందుకు చేయలేదని గాని అడిగే దిక్కులేదు. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందని తొలిసారి తెలిసిందతనికి.  నిగ్రహించుకున్న నిబ్బరం నీరుగారిపోతుంటే అతనికి తెలియకుండానే రెండు కళ్ళల్లోనుండి కన్నీళ్ళు వరదలయ్యాయి.  అలాగే నెమ్మదిగా అచేతనావస్థలో స్పృహ తప్పిందతనికి.


కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో బెడ్ మీదున్నాడు.  ఆసుపత్రిలో చిన్న రూమ్.  పక్కన మరో బెంచీ మీద కూతురు, కొడుకు కూర్చుని ఉన్నట్లున్నారు.  వారి మాటలు వినబడుతుంటే మళ్ళీ భారంగా కళ్ళు మూసాడు.


‘ ఏమో అన్నయ్యా....అసలు అమ్మ ఇలా ఎందుకు చేసింది.  ఏం తక్కువయ్యింది?  నాన్న తాగడం,  కోప్పడ్డం అంతా మామూలేగా... కొత్తేం కాదుగా.... ఏదో మనస్సు ఆపుకోలేక వచ్చాను.  ఆయన అప్పటికే కోప్పడుతున్నాడు, పిల్లలకి ఆయనకు కష్టం అవుతుందని.  త్వరగా వచ్చేస్తానన్నాను.  అయినా నాన్న షుగర్ పేషంట్ అని తెలిసీ ఎలా వెళ్ళింది?  నాన్న ఫ్రెండ్స్ సమయానికి రాబట్టి సరి పోయింది గాని, లేదంటే.....ఏదేమైనా నేను ఈ వేళ వెళ్ళిపోతాను’ వినీల అంటోంది.


‘నువ్వెళ్తే ఎలా?  మీ వదిన అయితే ఈ చాకిరీ ఏం చేయదు.  తనకీ చిన్న పిల్ల ఉంది.  అర్ధం చేసుకో... నాన్నను మా ఇంటికి తీసుకెళితే కూడా ఊర్కోదు.  నాకూ ఆఫీస్ ఉంది.  ఈయనతో ఏ టైం కి ఏమవుతుందో?  ఈ టెన్షన్ నేను భరించలేను.’


‘ఆయనకసలే ముక్కు మీద కోపం.  నేను తీసుకువెళ్ళలేను.  ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందే, ఇంతకీ అమ్మ ఎక్కడికి, ఎందుకు వెళ్ళినట్లు.  అమ్మే ఉంటే ఈ తలనొప్పి ఉండేదే కాదు కదా!'


‘నేను అందుకే తెలిసిన వాళ్ళనందరినీ వాకబు చేశా....ఉత్తరం ప్రకారం చూస్తే, ఏదైనా ఆశ్రమంకో, హరే రామ హరే కృష్ణ లాంటి మఠం కో వెళ్లి ఉంటుంది’.


‘అవున్రా...నువ్వలా అంటే నాకు గుర్తొస్తోంది.  ఒకసారి అమ్మ ‘అమ్మ అనాధాశ్రమం’ గురించి ఏదో పేపర్ లో చదివి దాని వివరాలు ఎవరికో కావాలి అని నెట్ లో చూసి చెప్పమంది.’  ఉత్సాహంగా అంది వినీల.


‘అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. నెట్ లో సర్చ్ కొట్టి ఈ రెండు మూడు రోజుల్లో ఇలాంటి ఆనవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చారా అని తెలుసుకుంటాను.   ఒకవేళ దొరికితే మనం అదృష్టవంతులమే....’


‘హలో....’అమ్మ 

వృద్ధాశ్రమమానండీ .. డొనేషన్ ఇవ్వడానికి మాకు కొన్ని వివరాలు కావాలండీ... ఓహో... వంద మంది ఉంటారా.......ఈ రెండు రోజుల్లో మీ దగ్గర ఎవరైనా కొత్తవాళ్ళు చేరారా?  ఆమె పేరు ఏమిటండీ?  ఆ..అవునండీ...వసుధనే, ఉన్నారండీ. మేము ఫోన్ చేసినట్లు 

చెప్పకండి.  మేము వస్తాము. విరాళం తెస్తాము’


‘ఆ... ఏంట్రా అన్నయ్యా !అమ్మ అక్కడికే వెళ్ళిందా?అబ్బా.. ఎంత అదృష్టం !దేవుడు మన మొర ఆలకించాడు...’


అన్నీ వింటున్న క్రిష్ణమూర్తి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.  తనను ఒక్క రోజు చూసుకోవడం కష్టమయ్యింది పిల్లలకి.  భరించే అమ్మ దొరికిందని సంబర పడుతున్నారు.  నిజంగా వసుధ దేవత.  ఎన్ని రకాలుగా కష్ట పెట్టాడు.  అయినా ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు.  మాటకు ఎదురు చెప్పలేదు.  ఈ కొన్ని గంటలలోనే ఆమె లేకుండా తను ఉండలేదన్నది అర్ధమయ్యింది. బుద్ది వచ్చింది.  తనకు వసుధ కావాలి.  తను లేకుండా ఆమె బ్రతుకగలదేమోగాని ఆమె లేనిది తను బ్రతకలేడు.  డాక్టర్ లోనికి రాగానే హరగోపాల్, వినీల ఆయనతో కల్సి బెడ్ దగ్గర కొచ్చారు.


‘నాన్నా...నాన్నా....అదిగో డాక్టర్ వచ్చారు.  లే నాన్నా...’ పిల్లలు పిలుస్తున్నారు.  నెమ్మదిగా అప్పుడే మెలకువ వచ్చినట్లు కళ్ళు విప్పాడు.


‘ఎలా ఉంది...కొంచెం నీరసంగా ఉంటుంది... మరేం భయం లేదు.  మీరు డిశ్చార్జ్ కావొచ్చు.  కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ‘డాక్టర్ వెళ్ళిపోయాడు.


‘నాన్నా....అమ్మ ఆచూకీ తెలిసింది నాన్నా... ఈ రోజే వెళదాం...’ పిల్లలు డిశ్చార్జ్ కి సన్నాహాలు చేస్తూ అన్నారు.


*********************


‘అమ్మ అనాధాశ్రమం ‘ అన్న బోర్డ్ దగ్గర సరాసరి వెహికిల్ ని ఆపి దిగారు, కృష్ణమూర్తి, వినీల, హరగోపాల్.


‘నవమాసాలు మోసి, కనీ, పెంచి, లాలించి, పాలించి,అనారోగ్యం లో సేవ చేసి, రక్షనిచ్చి, ఆసరా అయి, శక్తి ఉడిగి పండుటాకై నీ చేతిలోనే నేలరాలుతుంది...’ ఎదురుగా బిడ్డకు పాలిస్తున్న అమ్మ బొమ్మ దగ్గర రాసి ఉంది.


WOMAN-------W -- Wonderful Mother


O--- Outstanding friend


M--- Marvelous Daughter


A—Adorable sister


N—Nicest gift to Men from God


వినీల ఇలా అక్కడున్న కొటేషన్లు చదువుతుంటే, హరగోపాల్ తొందర పెట్టి తీసుకెళ్ళాడు.


ఆఫీస్ రూమ్ లో పెద్దావిడ కూర్చుని ఉంది. ఆవిడ పైన ‘జీవితం ఒక అద్దం లాంటిది. అద్దాన్ని చూసి నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతుంది.  దాన్ని చూసి ఏడిస్తే మనల్ని చూసి ఏడుస్తుంది.  తేడా అద్దంలో లేదు. మనలో ఉంది.  జీవితం లోని సమస్యలు కూడా అంతే.  అందుకే ధైర్యంగా ఎదుర్కోవాలి’ అన్న కొటేషన్ రాసి ఉంది.  ఆవిడతో వివరాలు చెప్పి వసుధను ఒక్కసారి పిలిపించమని చెప్పారు.  ఆవిడ పక్కనే ఉన్న ఒక విశాలమైన రూమ్ చూపెట్టి అక్కడ కూర్చోండి, పిలిపిస్తాను అంది.  ముగ్గురు ఆ గదిలోకి నడిచారు.  ఆ గది గోడల పైనన్నీ అందంగా రాసిన ఆణిముత్యాల్లాంటి కోటేషన్లే.  టెన్షన్ తో ఉన్న మనస్సు మళ్ళించడానికన్నట్లు మౌనంగా అంతా ఆ కొటేషన్లు చదవడంలో మునిగిపోయారు.


‘ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడువక తప్పదు.


ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు.


ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు.


ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాకతప్పదు.


ఎంత గొప్ప ప్రదేశాన్ని చూసినా తిరిగి సొంత గూటికి చేరక తప్పదు.


ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు.


ఇదే జీవితం’


‘జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే!


ఎన్ని సార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది.


గమ్యం అనంతం, గమనం అనేకం.


ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా కదిలిపోయేదే జీవితం! ‘


 *ముసలితనం* 


‘నీ శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు,


నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు,


నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు,


నీ పనులకు ఒకరి మీద ఆధార పడిన రోజు,


నీ భావాన్ని నీ నోటితో పలుకలేని రోజు’


నీ నిస్సహాయస్థితి కి నీకే జాలికలిగే రోజు నీ జీవితంలో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలిసిపోతుంది.


కానీ అప్పటికే అంతా చేజారిపోతుంది.


తప్పులు దిద్దుకునే అవకాశం కూడా ఉండదు’


చదువుతున్న కృష్ణమూర్తికి నిన్నటి తన పరిస్థితి గుర్తొచ్చి కళ్ళల్లో నీరు ఉబికింది. తలుపు శబ్దం కావడంతో గుమ్మం వైపు చూసారంతా.


పసుపు పచ్చని చీరలో, నుదుట ఎర్రటి బొట్టు ప్రకాశవంతంగా వెలుగుతుంటే మృదు మధుర అందెల సవ్వడి ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తుంటే గంభీరంగా అడుగుపెట్టింది.


‘అమ్మా, అమ్మా,’ అంటూ చిన్నపిల్లల్లా రెండు వైపులా ఏడుస్తూ హత్తుకు పోయారిద్దరు పిల్లలు.  భుజంపై తల ఆన్చిన ఇద్దరినీ ఆర్తిగా భుజాలపై అలాగే రెండు చేతులతో తలనిమురుతూ ఉండి పోయింది వసుధ .


‘అమ్మా...నీకేం తక్కువయ్యిందని వచ్చావ్?' ముందు హరగోపాల్ అన్నాడు విడివడుతూ...


‘అన్నీ ఎక్కువే అయ్యాయి, భరించలేక వచ్చా’ స్పష్టంగా అంది వసుధ .


‘ నీకేదవసరమైనా అన్నీ క్షణాల్లో నాన్న తెచ్చిపెడుతున్నాడుగా, ప్రేమ లేకుంటేనే అలా చేస్తాడా? .’వినీల ఆరా..


‘మొన్ననే గోపాల్ పెళ్ళిలో బంగారం కూడా కొనిచ్చాను.  ప్రేమలేకుంటేనే చేస్తానా?  ఏం లేదని ఇలా వచ్చావ్?’  భర్త అసహనం.


‘ మనశ్శాంతి.  అది దొరకకనే వచ్చా...మీరు నన్ను పిలిచే పిలుపు ఏమిటో తెలుసా...’ఏయ్ మనిషీ...ఇగో... ఓ దేభ్యం మొహం..’ ఇవీ నా బిరుదులు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కన్నవాళ్ళని శాశ్వతంగా వదిలి పెళ్లి కాగానే చిరకాలం కష్టసుఖాల్లో తోడూ నీడై కలిసి ఉంటాడని గుడ్డి నమ్మకంతో వస్తాం.  కానీ ఎన్నడూ నా మనస్సు ఏమిటో కనీసం అర్ధం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఆ.. ఏంటీ.. బంగారం కొనిచ్చానన్నారు కదూ...నేను అడిగానా, అది కేవలం సమాజంలో మీ స్టేటస్ సింబల్ గా కనబడడానికే.  మీకు అన్నీ ఎప్పటికీ అమర్చి పెట్టే భార్య ఈ రోజు మీరు చెప్పింది వండలేదంటే,  ఏ బాధ ఉందో అని ఆలోచించక, చేయిచేసుకునే మనిషికి ఎం ప్రేమ ఉందనుకోవాలి?  ఏ అనురాగ బంధమూ లేని మీతో ఇంకా ఉంటే అది నా మూర్ఖత్వమే అవుతుందనిపించింది.

చిన్నప్పటి నుండి నా మనస్సులో ఎన్నో కోరికలు ఉండేవి.  ఎంతో చదువుకోవాలని, ఏవేవో చదవాలని, పుస్తకాలు రాయాలని ఎన్నో కోరికలు.  కాని ఒక్కటీ నెరవేరలేదు.  కారణం, ఆయనకిష్టం లేదు కాబట్టి.  ఇప్పుడు చదివి ఎవర్ని ఉద్ధరించాలని అంటూ ప్రతీ దానికి ఆంక్షలే.  అందుకే ఈ చరమాంకం లోనైనా ఇప్పుడైనా ఓపెన్ యునివర్సిటీ ద్వారా ఇంకా చదువుకుంటాను.  గుడిలో అందరూ నేను పాడే పాటలు కీర్తనలు చాలా ఇష్టపడతారు. ఎంతో మంది రాసియ్యమని అడిగేవారు.  అలా అవన్నీ గ్రంధస్తం చేస్తాను.  అలనాటి మన సంప్రదాయ సంస్కృతులలో భాగంగా ఉన్న ఎన్నో పాటలు, కొంగుచాపే పాట, తలుపుల దగ్గర పాడేపాట, అప్పగింతల పాట, బతుకమ్మ పాటలు, మన సంస్కృతీ సంప్రదాయాలు తెలిపే మంగళ హారతి పాటలు, జోల పాటలు ....ఇలా ఎన్నో పాటలు కనుమరుగవుతున్న సంప్రదాయాలన్నింటిని గ్రంధస్తం చేయాలనుకుంటున్నా.  ఆయన మారతాడని ఇంతకాలం ఎన్నో భరించా... కానీ నేను ఆయనకు ఒక అవసరం మాత్రమే  అని తెలుసుకున్నా, అందుకే నా కిష్టమైనట్లు కనీసం ఈ జీవిత చరమాంకం లోనైనా బతకాలనుకుంటున్నా’.


‘అమ్మా...అమ్మ భువిపై దేవుడి అపురూపమైన సృష్టి అంటారు . తల్లికి బిడ్డలపై ఎంతో ప్రేమఉంటుంది కదా!  అందులో ఆడపిల్లని, నా కోసమైనా ఒక్కసారి ఆలోచించలేవా అమ్మా?' వినీల అంది.


‘బిడ్డలకు రెక్కలు లేనప్పుడు వాటికి తల్లి సంరక్షణ అవసరమైనంత కాలం తల్లిగా నా బాధ్యత నేరవేర్చాను.  ఇప్పుడు నీకు అన్నీ ఆలోచించే విచక్షణా జ్ఞానం ఉంది. ఎప్పుడూ...'అమ్మా! పిల్లలతో నాకు ఇంత కష్టం అవుతుంది' అని అంటావు.  పుట్టింట్లో నీకు పూర్తి విశ్రాంతి ఇస్తాను.  నీ ఇంటి కొచ్చి ఏదో రెండు మూడు నెలలకో నాలుగు రోజులు చేయగలను.  కాని మళ్ళీ నాలుగు రోజులకే 'వచ్చి హెల్ప్ చేయవచ్చుగా' అంటావ్.   నాకూ వయసై పోతుంది... ఇదివరకులా వేగంగా చేసే శక్తి నాకు లేదు.  పైగా నీకు చంటిపిల్ల ఉన్నప్పుడు నాన్న కేరళ లో ఉన్న ఏదో ఫంక్షన్ కి నన్ను తీసుకుని వెళితే, ఈ వయస్సులో హనీమూన్లా తిరుగుతున్నారని అల్లుడు తప్పుపట్టాడని చెప్పావే కాని,’ మరి ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళలేదు. వారి డబ్బులతో వారు వెళ్ళారు... కాళ్ళు చేతులు ఈ మాత్రం ఆడినప్పుడే వెళ్ళాలి కదా' అని మీ ఆయనకీ సర్ది చెప్పుకోలేక పోయావు. ఎప్పుడూ అయ్యో బిడ్డ కష్టపడుతుందని అవో, ఇవో చేసి పంపే నా ఆరాటమే కాని, ఒక్కసారైనా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అడిగావా? ఎందుకంటే అమ్మ అది ఆశించదు.   నిజమే... కానీ మళ్ళీ నీ కడుపున పుట్టినవాళ్ళు కూడా నీలాగే తయారవుతారు.  అప్పుడు నా బిడ్డ మనసు ఎంత వేదన పడుతుందో నాకు తెలుసు.  అది నేను భరించలేను.  కాబట్టి అలాంటి సందేశం సున్నితంగా యువత లోకి చొచ్చుకుపోయేలా చేయాల్సిన అవసరం ఇప్పుడుంది.   నాలా, నా బిడ్డ గాని, మరో అమ్మ మనసు గానీ బాధ పడొద్దని నా ఆశ‘ వినీల కళ్ళనిండా నీళ్ళు నిండాయి.


‘అమ్మా!  మరి నేనేం తప్పు చేసాను.  కనీసం నువ్వు నా దగ్గరికైనా రాకుండాఎందుకు వెళ్ళిపోయావు?’  కినుక చూపాడు కొడుకు.


‘మానవ శరీరం గరిష్టంగా 45 డే(యూనిట్ల) బాధను భరించగలదట.  కానీ బిడ్డకు జన్మ నిచ్చేప్పుడు తల్లియాభై ఏడు డే (యూనిట్ల) నొప్పి భరిస్తుందట. అది 20 ఎముకలు ఒకేసారి విరిగితే పడే బాధకు సమానమట.  కాని అంత బాధ భరించి తన కడుపును చీల్చి జన్మ నిచ్చిన తల్లి, బిడ్డను చూసి అంత బాధ మర్చి పోతుందట.  కోడలు ‘మీ అమ్మ కి ఎప్పటికీ కూతురంటేనే ఇష్టం.  నేను చదువుకుంటూ పాపని చూసుకోవడం ఎంత కష్టం, వచ్చి సహాయం చేయొచ్చుగా... ఆమె కన్నీచేసి పెడుతుంది.  అదే కొడుకంటే ప్రేమే లేదు' అంటూ ఎన్నో అందని చెప్పావు.  అంటే వచ్చి మీ దగ్గర కొన్ని రోజులున్నాను.  నేనున్నన్ని రోజులు వంట గదిలో గాని, ఏపనిలో గాని నేను చేసింది తనకు నచ్చదు.  ఏదో అని చీదరించుకుంటుంది.  భయం భయంగా బతికాను.  ఆమె నన్ను అలా అన్ని మాటలంటున్నప్పుడు నీ మనసుకి తెలీదా నా మనసు.   ఆమెకు నేను రెండేళ్లుగానే తెలుసు కావచ్చు.  కాని నీకు నేను నువ్వు పుట్టినప్పటి నుండి తెలుసు.  ఒక్క సారి నేనలాంటి దాన్ని కాదని నాకు భరోసా ఇవ్వలేదు. అయినా ఇవన్నీ అని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కాని రేపు నీ కొడుకుతో మీరలా బాధపడొద్దని.  నేను అనుకున్న కొన్ని పనులు ఈ జన్మ ముగిసేలోగా చేయాలని మాత్రమే వచ్చేసాను.  నన్ను క్షమించండి....’


‘వసుధా!' జీవితం లో తొలిసారి మార్దవంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే పిలిచాడు కృష్ణమూర్తి.


‘నిన్ను ఎన్నో కష్టాలు పెట్టిన మాట నిజమే.  కాని నీ మనస్సింతగా గాయపడుతుందనుకోలేదు. నువ్వు లేని క్షణమొక యుగమైంది.  నువ్వు లేక నేను బతక లేను....రా వసుధ..నా అవసరం కోసం నిన్ను పిలవడం లేదు.  అక్కడే ఉండి నీకిష్టమైనవన్నీ చేసుకో. ఇక నుండి నీ ప్రతీ కష్టం పంచుకుంటాను. పేకాట, తాగుడు వదిలేసాను. ఇకముందు కూడా వాటి జోలికి పోను.  నువ్వేన్నోసార్లు అవి మానేయడానికి డాక్టర్ దగ్గరకు కౌన్సిలింగ్ కి రమ్మన్నావు.  కదా వస్తాను.  నిన్న డాక్టర్ చెప్పాడు. నీకు తరచూ అనారోగ్యం ఎందుకొస్తుందో. బాబుకు కిడ్నీ చెడిపోతే ఎవరికీ తెలవద్దంటూ నీ కిడ్నీ ఇచ్చావు కదా, దానివల్లనేనట.  నిజంగా ‘అమ్మ ‘ అనే పదానికి నువ్వు నిలువెత్తు నిదర్శనం.  ఇక నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను.  నా మీద ఒట్టు.  నన్ను నమ్ము వసుధా. ప్లీజ్’ కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు కృష్ణమూర్తి.


‘అమ్మా, నా ప్రాణం నిలబెట్టిన నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా.‘


‘అమ్మా...నీ తల్లి మనస్సు అర్ధం చేసుకోలేక పోయాను.  ఇంకా నేను బాధ పడకూడదనే తపన పడుతున్న నిన్ను చూస్తే నాకు సిగ్గేస్తోందమ్మా, నన్ను క్షమించమ్మా.’ పిల్లలిద్దరూ కన్నీళ్ళతో తల్లి పాదాలు అభిషేకం చేస్తున్నారు.


‘మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటి వారి లోని లోపాలు, తప్పులూ మరింత చిన్నవిగా కనిపిస్తాయి.  ఓర్పు క్షమాగుణం పెరుగుతాయి.  ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో దాదాపు అన్ని సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి...‘ ఐశ్వర్యారాయ్ కావాలంటే అందం ఉండాలి..కాని మదర్ తెరిస్సా కావాలంటే మనస్సుంటే చాలు..’ ఎదుట ఉన్న కొటేషన్లు ఆమెకు దిశానిర్దేశం చేస్తున్నట్లున్నాయి.


ఆ ప్రాంగణం లోని గుడిలోని జేగంటలు తధాస్తు అన్నట్లు మంగళకరంగా మోగాయి. 

ప్రతి ఒక్కరు చదివి అందరి చేత చదించాల్సిన వ్యాసం.


అమ్మకు జేజేలు

👏👏👏👏👏

🙏ఈ  కథ వ్రాసిన  వారికి నా  అభినందనలు. 🙏

యీ మెసేజ్ చూసిన ప్రతి ఒకరు మీ తల్లి తండ్రులను ఏవిధమైన యిబ్బంది కలుగకుండా ప్రేమగా ఆప్యాయంగా, అత్తమామలను తన తల్లి తండ్రులగా చూసుకుంటే వృద్దాప్యంలో వున్న వారికి ఏ సమస్య వుండదు.  అనాధ ఆశ్రమాలు వుండవు.


 *సేకరణ:  వాట్సాప్.*

కామెంట్‌లు లేవు: