19, జులై 2022, మంగళవారం

పాదుకా స్పర్శనం - పరమాత్మ దర్శనం

 పాదుకా స్పర్శనం - పరమాత్మ దర్శనం


పరమాచార్య స్వామికి గొప్ప భక్తులైన పోలూర్ శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ గారు జీవితంలో ఒక్కసారైనా స్వామివారి పాదుకలను తాకాలని ఆశపడేవారు. వారు సాంప్రదాయక బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతూ పోస్ట్ మాష్టరుగా ఉద్యోగం చేసేవారు. తలపై శిఖతో మూడుపూటలా సంధ్యావందనం చేసే నిష్టాగారిష్టుడు.


భగవంతుడే భక్తుని వద్దకు వెదుక్కుంటూ వస్తాడని నమ్మేవారు. దాన్ని నిజం చేస్తున్నట్టుగా మహాస్వామివారు కలశపక్కం జిల్లాలో మకాం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య అయ్యర్ మహాస్వామివారి దర్శనానికి బయలుదేరగా, స్వామివారు ఈశ్వరాలయానికి వెళ్తున్నారు. వెంటనే స్వామివారు వెళ్ళిన దారిలో ఈశ్వరాలయానికి వెళ్ళాడు. కొద్దిదూరంలో మహాస్వామివారు ఆలయానికి వెళ్తుండడం గమనించారు. అప్పుడే ఆయన దృష్టి మహాస్వామివారి పాదాలపై, వారు వేసుకున్న దివ్యపాదుకలపై పడింది.


ఒక్కక్షణం ఇలా ఆలోచించారు. “ఒక్కసారి పరమాచార్య స్వామివారి పాదుకలను తాకగలిగితే, ఈ జన్మకే కాదు ఇక నాకు మరో జన్మంటూ ఉండదు” అని. మహాస్వామివారు దేవాలయం బయట ఆగి ఒకసారి అందరిని చూశారు. సుబ్రహ్మణ్య అయ్యర్ పరిగెత్తుకుని వెళ్లి గుంపులో చేరాడు. స్వామివారి పాదుకలను చూసుకునే భాగ్యం కల్పించాలనే మహాస్వామి వారు ఆలయ దర్శనానికి వచ్చారు అని తనలో తానూ అనుకున్నాడు.


పరమాచార్య స్వామివారు అందరిని పలకరించి, “నేను లోపలి వెళ్లి స్వామీ దర్శనం చేసుకుని వచ్చేదాకా ఎవరైనా నా పాదుకలను చూసుకుంటారా?” అని అడిగారు. ఇది వినగానే ఆ భాగ్యం ఎవరికీ కలుగుతుందో అని అందరూ ఉత్సుకతతో చూస్తున్నారు. మరలా స్వామివారు, “ఈ గుంపులో శాస్త్రోక్తమైన శిఖముడి ఉన్నవారెవరైనా ఈ పనికి రావచ్చు” అని అన్నారు.


అక్కడున్నవారందరిలో స్వామివారి సహాయకులు వినా శిఖముడి ఉన్నవారు సుబ్రహ్మణ్య అయ్యర్ ఒక్కరే. మనం విన్నట్టు రామాయణంలో ఆ రోజు భరతునికి కలిగిన భాగ్యం ఈ రోజు సుబ్రహ్మణ్య అయ్యర్ కు దక్కింది. వొణుకుతున్న చేతులతో, కళ్ళల్లో ఆనందభాష్పాలతో ఆ పాదుకలను చేతిలోకి తీసుకున్నారు సుబ్రహ్మణ్య అయ్యర్.


ఆయన ఆలయం వెలుపల ఆనందంగా నిల్చుని ఆ పాదుకలను అత్యంత మృదువుగా తాకుతూ, కళ్ళతో చూస్తూ, తలపై పెట్టుకుంటూ తనలో తాను రమిస్తున్నాడు. స్వామివారి అనుగ్రహానికి కరిగి కన్నిరైపోయాడు. స్వామివారితో సహా అందరూ దర్శనానికి లోపలి వెళ్ళారు. నిజమైన భక్తుడికి భగవంతుని విషయంలో ‘చాలు’ అనే మాట ఉండదు. సుబ్రహ్మణ్య అయ్యర్ విషయంలో కూడా అంతే. స్వామివారి పాదుకలు లభించడం మహా భాగ్యమే. కానీ అందరిలా మహాస్వామివారితో కలిసి ఈశ్వర దర్శనం చేసుకునే భాగ్యం కలగలేదు కదా అనుకున్నాడు.


పరమాచార్య స్వామివారికి స్వాగతం పలికిన పిదప ఆలయ అర్చకులు శివునకు మంగళ నీరాజనం ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నారు. స్వామివారు ఆ అర్చకున్ని ఆపమని తమ పార్శదున్ని పిలిచి, “బయట నా పాదుకలు పట్టుకుని నిలుచున్న అతణ్ణి లోపలికి పంపు, ఆ పాదుకలను నీవు తీసుకుని” అని పంపారు.


తక్షణమే సుబ్రహ్మణ్య అయ్యర్ రెండవ కోరికను కూడా స్వామివారు తీర్చారు. గర్భాలయంలో నాగాభరణం ధరించి, బిల్వామాలతో విరాజమానంగా ఉన్న శివలింగానికి మంగళ హారతి ఇస్తున్నారు. శివలింగం చుట్టూ కట్టిన పంచె జలపాతంలా పక్కనే మహాస్వామివారు నిలబడి ఉండగా ఇరువురికి ఏకకాలంలో నీరాజనం అర్పించారు అర్చక స్వాములు. అమ్మవారి ఆలయంలో కూడా సుబ్రహ్మణ్య అయ్యర్ కు ఇలాంటి దృశ్యాన్నే అనుగ్రహించారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: