19, జులై 2022, మంగళవారం

అటుదిటు ( చిన్నకథ)🌷

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

   *🌷అటుదిటు ( చిన్నకథ)🌷* 

                శశికళ ఓలేటి 

                   🌷🌷🌷

"ఏవండీ! సేతు మాధవరావు గారు , భార్యా వచ్చారు ఇందాకా...వాళ్ళ పెద్దబ్బాయి ఇంటి గృహప్రవేశం ట. పిలవడానికి వచ్చారు."


"ఏ సేతు మాధవరావు? "


"ఎంతమంది ఉన్నారేమిటి? అదే మన వియ్యంకుడు,మన అమ్మాయిని ఇచ్చుకున్న ఇంటి యజమాని!"..  అన్నారు లక్ష్మిగారు కాస్త వ్యంగ్యంగా. 


" ఓ ఆయనా. నేనేం ఇవ్వలేదు నా కూతుర్ని.‌ఆయనే‌ అడిగి మరీ చేసుకున్నాడు. ఇంతకీ ఏంటంటావు? ఈ ఉన్న ఊళ్ళో సంబంధాలు కాదు కాని, ఏదో దానికి పిలుపు..ఇహ‌ నీ అత్యుత్సాహం. చూడవోయ్...ఈ మొహమాటాలన్నీ నా వల్ల కాదు. ఆ సోదంతా వింటూ, అందరినీ పలకరిస్తూ,ముఖస్థుతులు చేస్తు కూర్చోడం నాకు తలనొప్పి. నా మాట విని...ఆ బట్టలూ గట్రా కొనేసి, ఏం చదివిస్తావో చదివించేసి‌ చక్కా‌వచ్చేయి. నేనయితే కలవలేను వాళ్ళతో.".. అంటూ నిక్కచ్చిగా చెప్పేస్తున్న భర్త అహంకారానికి ఒళ్ళు మండిపోయింది లక్ష్మి గారికి.‌


"అయినా ఆ శాఖాభేదం మీరు మనసులోంచి తీసేయట్లేదు. వాళ్ళు పద్ధతులన్నీ శాస్త్రోక్తంగా పాటిస్తున్నారు.ఇంట్లో ఆ దేవతార్చన లు, అనుష్టానాలు.. పితృకార్యాలు...సమస్తం ఎంతో వేదోక్తంగా జరుపుతారు. మనలాగా అన్నీ మమ‌ అనేసి నీళ్ళు వదిలేయరు. మన పిల్ల అదృష్టం అలాంటి ఇంట్లో పడడం.. ! మీ బడాయిలు‌ పక్కకు పెట్టి‌ నడవండి.‌ పిల్లకు తలవంపులు తేకూడదు.""...పెట్టవలసిన నాలుగూ పెట్టి... ఆదివారం వియ్యాలారి కొత్తింటికి బయలుదేర దీసింది భర్తగారిని.


‌‌ వెళ్తూనే ఆయన ఎవరితోనూ ఒక పలుకూ, పలకరింతా లేకుండా బిగుసుకుపోయాడు. ఆయన వ్యవహారానికి లక్ష్మి గారికి బీపీ పెరిగి పోతోంది.‌అమెరికాలో ఉన్న కూతురి కి ఎక్కడ మాటొస్తుందో అని, కలివిడిగా.. కొంగు బిగించి అన్ని పనుల్లోకీ‌ దూకేసింది.‌వియ్యపురాలి చేతిలో పని లాక్కుని మరీ చేసేస్తు, అందరితో అంటీ ముట్టనట్లు మాట్లాడుతున్న భర్తమీద ఒక కన్నేస్తు...తెగ అలిసిపోయింది.‌ 


వియ్యాలారు మర్యాదస్తులు.‌ వియ్యంకుడు,ఆయన అన్నదమ్ములు ఈయనతో కూర్చుని కబుర్లు చెప్తూ, ఈయన అప్పుడప్పుడు రాలుస్తున్న మాటలు ముత్యాలు శ్రద్ధగా ఏరుకుంటూ..బాగానే ఎంగేజ్ చేస్తున్నారు. 


 సందడంతా సద్దుమణిగింది. పాపం ఆఖరు వరకు ఉండి,అలిసిపోయిన వాళ్ళకు టీలు పెట్టీ అందించి మరీ సెలవు తీసుకుంది లక్ష్మి గారు. ఆయన మటుకు అదే‌ గోరోజనం మెయింటెయిన్ చేస్తు వెళ్ళొస్తా అని చెప్పేసి కారెక్కేసాడు. ఇంటిల్లిపాదీ బయటకొచ్చి మరీ వీడ్కోలిచ్చారు. 

" హమ్మయ్య! పెద్ద మొహమాటం వదిలిపోయింది.‌విసుగొచ్చేసిందనుకో అంత సేపు కూర్చోవాలంటే!"... అన్నారు బడాయి గా! 


" మీ ముక్తసరి ప్రవర్తనకు ఖచ్చితంగా వెనుక అనుకుంటార్లెండి.".. అంది ఆవిడ వెటకారంగా! 


‌‌వియ్యాలారింట....


" మన చిన్నాడి‌‌ మావగారు పదిమంది పెట్టే.‌ మనిషి మితభాషి అయినా మర్యాదస్తులు,చిరునవ్వు మొహంలో చెదరకుండా అందరినీ ఇట్టే ఆకట్టుకున్నారు.నిండుకుండ‌ తొణకదు‌ అంటే‌ ఇదే!"అంటూ భార్యతో అన్నారు వియ్యంకుడు.


" మరే! ఆయన నిండుకుండే. కానీ ఆవిడే‌ మహాగాభరా మనిషి. పదే‌పదే సాయం చేస్తానని ఓ కాళ్ళల్లో,చేతుల్లో పడిపోతూ..‌పనులు తెమలనివ్వకుండా!"....అంది వియ్యపురాలు కాస్త విస్సాటంగా.


 *శశికళ ఓలేటి గారి కథ.*

కామెంట్‌లు లేవు: