21, నవంబర్ 2022, సోమవారం

ఆధ్యాత్మిక చక్రవర్తి

 నాదస్వర చక్రవర్తి - ఆధ్యాత్మిక చక్రవర్తి


అది 1950 ప్రారంభంలో పరమాచార్య స్వామివారు తమిళనాడులోని తంజావూరు జిల్లాలో పర్యటిస్తున్న సమయం. మాయవరం ప్రజలు మహాస్వామివారి పట్టణ ప్రవేశ ఉత్సవాన్ని పెద్ద ఎత్తున తలపెట్టారు. అటువంటి సమయంలో స్వామివారు పల్లకిలో ఏనుగులు, గుర్రాలు మొదలగు పీఠ లాంఛనాలతో పురప్రవేశం చేసేవారు.


మహాస్వామి వారి పల్లకి ధర్మాపురం మఠం సమీపానికి వస్తుండగా, పండర సన్నిధి స్వామివారిని తగు మర్యాదలతో ఆహ్వానించి శ్రీవారివెంటే వస్తున్నారు. మహాస్వామివారి ఊరేగింపుగా మాయవరం పట్టణంలోకి ప్రవేశిస్తోంది.


అప్పుడు నాదస్వర సామ్రాట్టుగా ఖ్యాతి గడించిన శ్రీ టి.యన్. రాజరత్నం పిళ్ళై దగ్గర్లో ఎదో కచేరి ముగించుకుని తిరువడుత్తరైలో ఉన్న తమ స్వగృహానికి వెళ్తున్నారు. ఆయన కేవలం పేరులోనే కాదు నిజజీవితంలో కూడా రారాజు లాగానే బ్రతికేవారు. వారి లెటర్ ప్యాడ్ లో కూడా “ప్రపంచ నాదస్వర సామ్రాట్ తిరువడుత్తరై రాజారత్నం పిళ్ళై” అని రాసుకున్నారు. వారు తమ పేరుప్రతిష్టలకు తగ్గట్టుగా పెద్ద పడవలాంటి స్టూడ్ బేకర్ కారులో ప్రయాణించేవారు.


కలైక్కుడి హోటల్ దగ్గర్లో ఉన్న గడియార స్థంభం వద్ద నుండి వెళ్తుండగా అక్కడున్న జనసమూహాన్ని చూసి “ఏమిటి ఈ కోలాహలం?” అని అడిగారు. కంచి పరమాచార్య స్వామివారు మాయవరం వచ్చారని పక్క వీధిలో ఉత్సవం సాగుతోందని చెప్పారు. ఈ విషయం విన్న వెంటనే కారు పక్కన ఆపమని చెప్పి, క్రిందకు దిగి చొక్కా విప్పి, అంగవస్త్రాన్ని నడుముకు చుట్టుకుని గడియార స్థంభం వద్ద నుంచొని నాదస్వరం వాయించడం మొదలుపెట్టారు.


శంకర! ఏమి ఆ అద్భుత సన్నివేశం. అటుగా వెళ్తున్న స్వామివారు నాదస్వరం వినబడగానే, “టి.యన్.ఆర్ నాదస్వరం వాయిస్తున్నట్టు ఉన్నాడు. పదండి అటు వెళ్దాం” అని అటు బయలుదేరారు. పట్టణ ప్రవేశ ఉత్సవం గడియార స్థంభం వద్దకు బయలుదేరింది. టి.యన్.ఆర్ కోరుకున్నది కూడా ఇదే!


అక్క్కడ నిలబడి టి.యన్.ఆర్ ఎంతో ఉత్సాహంతో, పారవశ్యంతో దాదాపు గంటన్నర పాటు నాదస్వరం వాయించారు. అది వినడానికి మొత్తం మాయవరం అక్కడకు చేరింది. మహాస్వామి వారు కూడా ఆ నాదస్వర విన్యాసానికి ముగ్ధులై పరవశించిపోయారు. టి.యన్.ఆర్ ను ఆశీర్వదించి కమలా పండును ప్రసాదంగా ఇచ్చారు స్వామివారు.


టి.యన్.ఆర్ వెంటనే నేలపై పడి సాష్టాంగం చేసి లేచి నిలబడి, “నా జన్మకు ప్రయోజనం కలిగింది” అని అన్నారు.


--- vandeguruparamparaam.wordpress.com


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: