: m -- 79 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
మీరు ఈ వ్రతమును ఏ ఫలితం కోసం చేస్తున్నారు? మీ ప్రవర్తన చూస్తుంటే మీ మనస్సులను ఎవరో హరించారని తెలుస్తున్నది. అతనిని భర్తగా పొందాలని మీరు అందరూ వ్రతం చేస్తున్నారు. మీరు ఎవరికోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి’ అన్నాడు. వాళ్ళు అందరూ నవ్విన నవ్వును బట్టి వాళ్ళందరూ తననే తమ భర్తగా కోరుకుంటున్నారని ఆయనకు తెలిసింది. ఆయన – నిజంగా మీరు నా ఇంటికి దాసీలుగా, భార్యలుగా వచ్చి నేను చెప్పినట్లుగా నడుచుకుంటామని అంటే నీటినుండి బయటకు రండి. మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను’ అన్నాడు.ఇక్కడ ‘దాసీ’ అనే పదమును చాలా జాగ్రత్తగా చూడాలి. దాని అర్థం – తాను చేసిన ప్రతి పనివలన తన భర్త అభ్యున్నతిని, తన భర్త కీర్తిప్రతిష్ఠలు పెరిగేటట్లుగా ప్రవర్తించడం. అలా ఎవరు ప్రవర్తిస్తారో వారు భార్య. స్త్రీ తానుచేసిన ప్రతి పనితో తన భర్త ఔన్నత్యమును నిలబెడుతుంది. అది అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. నేను చెప్పిన మాట వినాలని మీరు అనుకుంటే నేనొకమాట చెపుతాను. నేను చెప్పినట్లుగా మీరు ప్రవర్తించండి అన్నారు.
ఆయన ఆడపిల్లల వలువలు ఎత్తుకుపోవడం మదోద్రేకంతో చేసిన పని కాదు.
“మీరు నన్ను చూసి సిగ్గు పడతారేమిటి? చిన్నతనం నుండి మనం అందరం కలిసి పెరిగాము. శ్రీకృష్ణుడు బయట ఉన్నవాడు కాదు. ఈ కృష్ణుడు లోపల ఉన్నవాడు. అన్ని ప్రాణుల హృదయాంతరముల ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు. నేను లేని నాడు అది శివము కాదు శవము. నేను వున్నాను కాబట్టి మీరు మంగళప్రదులయి ఉన్నారు. వ్రతమును చేయగలుగుతున్నారు. మీరు నన్ను భర్తగా పొందాలనుకుని వ్రతం చేస్తున్నారు. ఒంటిమీద నూలుపోగు లేకుండా నీళ్ళలోకి దిగి స్నానములు చేస్తున్నారు. అలా దిగంబరంగా స్నానం చేయడం వలన వ్రతమునందు దోషం వచ్చింది. జలాధిదేవత అయిన వరుణుడి పట్ల అపచారం జరిగింది. వ్రతం చేసేవాళ్ళు వివస్త్రలై స్నానం చేయకూడదు. ఒంటిమీద బట్టతోటే స్నానం చేయాలి. మీరు అపచారం చేశారు. రేపు ఈ వ్రతము పూర్తయిన పిమ్మట కాత్యాయనీ వ్రతం చేశాము ఫలితం రాలేదని అంటారు. ఆయన ఒక ఆజ్ఞ చేశారు. నిజంగా మీరు వ్రతఫలితమును కోరుకుంటే నన్ను భర్తగా మీరు కావాలని అనుకుంటే నేనొక మాట చెపుతాను మీరు చెయ్యండి. ముప్పైరోజులనుండి మీరు వ్రతం చేయడం లేదు. ప్రతిరోజూ వ్రతభంగం చేస్తున్నారు. మీరు చేస్తున్న వ్రతభంగమునకు మీకు శిక్ష వేయాలి. మీకు ఫలితం ఇవ్వకూడదు. నేను శిక్ష వేయాలని అనుకోవడం లేదు. మీరు చేస్తున్న వ్రతంలోని భక్తికి నేను లొంగాను. మీ పొరపాటును దిద్దాలని అనుకుంటున్నాను. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం ఒకటి ఉంటుంది. మీరందరూ చేతులెత్తి నమస్కారం చెయ్యండి. ప్రాయశ్చిత్తం అయిపోతుంది మీ వలువలు మీకు ఇచ్చేస్తాను. ఆ వలువలు కట్టుకుని కాత్యాయనీ దేవిని ఆరాధించండి. నేను మీ భర్తను అవుతాను’ అన్నాడు స్వామి. వాళ్ళు వినలేదు. అదీ చిత్రం! వాళ్ళు మేము స్త్రీలం. నువ్వు పురుషుడివి. నీవు చెట్టుమీద కూర్చుని చూస్తుండగా మేము ఒడ్డుకు వచ్చి చేతులు ఎత్తి ఎలా నమస్కరిస్తాము? అలా కుదరదు’ అన్నారు.
భగవంతుడి పట్ల ప్రవర్తించే భక్తుడికి దేహభావన ఉండకూడదు. మీరు నా భర్తృత్వమును అడుగుతున్నారు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యం. మీరు నాయందు ఐక్యమును కోరినప్పుడు రెండు ఎక్కడ ఉంటాయి? రెండుగా ఉండిపోవాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలని అనుకుంటున్నారా? ఒకటి అయిపోవాలి అంటే రెండుగా ఉన్నవి అరమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్లిపోవాలి. ఒకటిగా అవుతూ రెండు తమ అస్తిత్వమును నిలబెట్టుకోవడం కుదరదు. మీరు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మీరు చేతులెత్తి మ్రొక్కండి. మ్రొక్కి వస్త్రములు తీసుకొనవలసింది’ అని అన్నాడు.
ముందు కొంతమంది గోపికలు అది కుదరదన్నారు. చాలా అల్లరి చేశారు. కృష్ణుడితో వాదించారు. వాళ్ళు ‘ఆడవాళ్ళం ఎలా వెడతాము? కొంటెకృష్ణుడు ఎన్నయినా చెపుతాడు. మనం వివస్త్రలుగా బయటకు వెళ్ళి చేతులు ఎత్తి నమస్కారములు పెడతామా? మనం స్త్రీలం. అలా చేయడం కుదరదు’ అన్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బయటకు వెళ్ళకుండా అలా కంఠం వరకు నీళ్ళలో మునిగి ఉందాము అనుకున్నారు. మార్గశీర్ష మాసం. మంచు బాగా కురుస్తోంది. వాళ్ళందరూ నీటిలో గడగడ వణికి పోతున్నారు. ఏమి చేస్తే బాగుంటుందని తర్జనభర్జనలు చేస్తున్నారు. అప్పుడు అందులో ఒక గోపిక – దేనికి మొహమాటం? ఆయన జగద్భర్త. ఇన్ని లీలలు చేసినవాడు. ఆయన పరమాత్మని మనం అంగీకరించాము. మనం అందరం కూడా మన నుదుటికి చేతులు తగిలేటట్టు పెట్టి కృష్ణుడికి నమస్కరిస్తే మనకి వచ్చిన దోషం ఏమిటి? ఈ దిక్కుమాలిన శరీరమునందు భ్రాంతి చేతనే మనం అన్ని కోట్ల జన్మలను ఎత్తాము. ఇవాళ ఈశ్వరుడే మన ఎదురుగా నిలబడి అలా నమస్కారం చెయ్యండి. మీరు చేసిన దోషము విరిచేసి మీకు ఫలితం ఇచ్చేస్తాను అంటున్నాడు. ఫలితం రావడానికి అడ్డంగా వున్నా దోషమును ఈశ్వరుడు చెప్పినా సరే ఈశ్వరుడి పేరెత్తనంటే ఆయన చెప్పినది చేయను అని అంటే మనకు ఫలితం ఎక్కడినుండి వస్తుంది? అందుకని నమస్కరిద్దాము అన్నది.
మనము ఒక వ్రతం చేస్తాము. వ్రతం చేసేముందు సంకల్పం చెపుతాము. అలా చేసినప్పటికీ వ్రతఫలితం అందరికీ ఒకేలా రాదు. ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు కానీ మనస్సు మీద నియంత్రణ ఉండదు. మనస్సు ఎక్కడికో పోతుంది. ఈశ్వరుడిని స్మరణ చేయదు. క్రతువులో దోషం జరుగుతున్నది. వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం జరిగి ఉంటే ఈశ్వరుని నామములు చెప్పడం ద్వారా ఆ దోషం విరిగిపోతుంది. నామ స్మరణతో వ్రతమునందు వస్తున్న దోషము పోతుంది. అందుకనే ఒకటికి పదిమాట్లు కనీసంలో కనీసం భగవంతుని నామము జపించాలి. పెద్దలు నామమునకు యిచ్చిన ప్రాధాన్యం క్రతువుకి ఇవ్వలేదు. నామము క్రతువునందు ఉన్న దోషమును విరుస్తుంది. అపుడు గోపికలు అందరూ కలిసి నామమును చెప్పి ఈశ్వరుడు చెప్పినట్లు చేస్తే మన వ్రతంలో దోషం పోతుంది అని, అందరూ కలిసి లలాటమునకు చేతులు తగిలిస్తూ ఒడ్డుకు వచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణపరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రములు వాళ్లకి ఇచ్చేశారు.
ఒక లీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ‘ఓ లక్షణవతులారా! మీరు చేసిన వ్రతము ఏమిటో నాకు అర్థం అయింది. కాత్యాయనీ దేవిని మీరు నోచిన నోము దేనికొరకు చేశారో ఆ ఫలితమును నేను మీకు ఇచ్చేస్తున్నాను’. కాత్యాయనీ దేవి నోమునోస్తే ఫలితమును కృష్ణుడు ఇస్తున్నాడు. ఇద్దరూ ఒకటేననే తత్త్వమును మనం తెలుసుకోవాలి. తత్త్వము తెలుసుకొనక పోతే మీయందు సంకుచితత్వము వచ్చేస్తుంది. ఉన్నది ఒక్కడే స్వామి ఎన్నో రూపములలో కనపడుతూ ఉంటాడు. ఉన్న ఒక్క పదార్థము అనేకత్వముగా భాసిల్లుతోంది. ‘ఇకమీదట మీరు చేసిన నోముకు ఫలితమును యిచ్చాను రాత్రులందు మీరు నాతో రమిస్తారు’ అన్నాడు. ఈ మాట చాలా పెడసరంగా కర్కశంగా ఉంటుంది. ఈ మాటకు అర్థం మనకు రాసలీలలో తెలుస్తుంది.
ఇక్కడ రాత్రులందు అనే మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లింగోద్భవం అర్థరాత్రి జరిగింది. కృష్ణ జననం అర్థరాత్రి జరిగింది. చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటిలో ఈశ్వరునితో క్రీడించడం అన్నది జ్ఞానమును పొందుటకు గుర్తు. జ్ఞానులై మోక్షం వైపు నడుస్తారనడానికి గుర్తు. ‘అందరూ చీకట్లో ఉంటే మీరు మాత్రం చీకట్లో నన్ను పొందుతారు. అనగా మీకు చీకటి లేదు మీకు అజ్ఞానము నివృత్తియై ఈశ్వరుని తెలుసుకుంటారు. ఆ జ్ఞానమును మీకు యిస్తున్నాను’ అన్నాడు. ఈ మాటలు విన్న తరువాత గోపికాంతలు ఆనందంతో మంద దగ్గరకు వెళ్ళారు. పశువుల దగ్గరకు వెళ్ళారు.
‘మంద’ అంటే పశువులతో కూడినది. అయితే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మందకడకు వెళ్ళారు అంటే వారు కేవలం ఆవుల దగ్గరకు, దూడల దగ్గరకు వెళ్ళారని కాదు. పాశముల చేత కట్టబడిన ప్రతిజీవి పశువే. ఇంట్లో వున్న భర్త కర్మపాశములతో కట్టబడ్డాడు. ఆయన ఒక పెద్ద పశువు. భార్య మరి కొన్ని పాశములతో కట్టబడింది. ఆవిడ మరొక పశువు. ఈ పశువుల పాశములను విడిపించగలిగిన వాడు ఎవడు ఉన్నాడో ఆయనే పశుపతి. ‘మీరు పశువులతో కలిసి పశువులలో ఉంటారు. ఎప్పుడూ నాయందే మనసు పెట్టుకుని మీరు అన్ని పనులు చేస్తూ ఉంటారు. నిరంతర భక్తి చేత జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ లేక కృష్ణసాయుజ్యమును పొందుతారు. నామము ఏదయినా ఫలితం ఒక్కటే’ అని గోపికా వస్త్రాపహరణ ఘట్టములో, కాత్యాయనీ వ్రత ఘట్టములో ఇన్ని రహస్యములు చొప్పించి కృష్ణపరమాత్మ చేసిన మహోత్కృష్టమయిన లీల ఆ కాత్యాయనీ వ్రతమనే లీల.
ఈ లీల తెలుసుకుంటే మనం ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏమి చేయాలో మనకు అర్థం అవుతుంది. అన్నిటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది. పూజా మంత్రములను చదువుతూ ఉంటే మనస్సు రంజిల్లి పోవాలి. అలా రంజిల్లి పోవాలంటే దానికి రెండే రెండు బాటలు ఉంటాయి. ఒకటి అర్థం తెలియనప్పుడు విశ్వాసము చేత పరమాత్మ నామమును పట్టుకోవాలి. అర్థం తెలిస్తే మీ మనస్సు తనంత తాను రంజిల్లుతుంది. అలా రంజిల్లుతూ నామములు చెపుతూ పూజ చేస్తే ఆ నామము మీ పాపములను దహిస్తుంది. నామము అర్థం తెలియకపోయినా అది పెద్దలు చెప్పిన నామము, దానిని స్మరించడం వలన ఒక శుభ ఫలితం కలుగుతుందని నమ్మి సంతోషంతో నామము స్మరిస్తూ పూజచేసినా, అంతే స్థాయిలో పనిచేస్తుంది విశ్వాసము అంతే. తెలుసుకుని చేసి విశ్వాసము లేకపోతే మాత్రం మరీ ప్రమాదం. ఏమీ తెలియకపోయినా భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు, తెలిసివున్న వాడి కంటే గొప్పవానిగానే పరిగణింపబడతాడు.
అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామము చెప్పగలిగితే జ్ఞానితో సమానము. ఈ విషయమును ఆవిష్కరించిన లీల కాబట్టి ఈ కాత్యాయనీ వ్రత ఘట్టము పరమోత్కృష్టమయిన ఘట్టము.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/
[20/11, 3:15 pm] +91 81055 36091: SRI SIVA MAHAPURANAM – 26 BY PUJYAGURUVULU Brahmasri Chaganti Koteswara Rao Garu
నటరాజు
పరమశివుని స్వరూపము అనేకరకములయిన మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది. పరమ శివునికి అరువది నాలుగు మూర్తులు ఉన్నాయి. శివుని స్వరూపమేమి అని అడిగితే శివలింగం అనే సమాధానం వస్తుంది.
సాధారణంగా శివాలయములలో లింగ స్వరూపమే ఉంటుంది.సాకారంగా పరమశివుడికి, పార్వతీదేవికి మూర్తి ఉన్నది. ఈ అరువది నాలుగులో ఒక భాగమును ‘ఘోర స్వరూపములు’ అంటారు. ఇవి శిక్షించడానికి వస్తాయి.రెండవది ‘అఘోరస్వరూపములు’ మంగళప్రదంగా ఉంటాయి. అటువంటి మూర్తిని చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది.
ప్రపంచంలో ఎన్ని రకములయిన విద్యలు ఉన్నాయో, ఎన్ని కళలు ఉన్నాయో అంతమంది కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభం చేసే ముందు నమస్కరించవలసిన లోకంలోని మూర్తిని ఆనంద తాండవమూర్తి అంటారు. ‘నటరాజు’ అని పిలుస్తుంటాం. శైవాగమము దానిని ‘ఆనంద తాండవ మూర్తి’ అని పిలుస్తుంది.ఆ తాండవం చెయ్యడంలో గొప్ప రహస్యములు కొన్ని ఉంటాయి.
ఆనంద తాండవం చేసిన పరమశివుడు ఎవరు ఉన్నారో ఆయనలో నుంచే సమస్త శాస్త్రములు ఉద్భవించాయి.ఆయనలో నుంచే సమస్తమయిన కళలు వచ్చాయి.ఒక్క శంకరుడు చేసిన తాండవంలోంచి 650 రకములైన నాట్యములు పుట్టాయి.ఇప్పటికీ ఈ కర్మభూమిలో బ్రతికినవి 108 రకముల నాట్యములు.కూచిపూడి, ఒడిస్సీ, భరతనాట్యము ఇవన్నీ ఆనంద తాండవ మూర్తి అయిన శంకరుని దగ్గరనుంచే వచ్చాయి.
ఈ ఆనంద తాండవ మూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది.ఈ చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టం.చేతులు కట్టుకుని ఆయన నాట్యమును నలుగురు మాత్రమే చూస్తారు.అందులో ఒకడు నందీశ్వరుడు, రెండవ వాడు భృంగి, మూడవ వాడు పతంజలి, నాల్గవ వాడు వ్యాఘ్రపాదుడు.ప్రదోషవేళలో జరిగే ఈ తాండవం జరుగుతు ఉంటుంది. స్వరూపంలో సమస్త లయకారకమై ఉంటుంది.ఈ తాండవం ప్రదోషవేళలో జరుగుతూంటుంది.ఆయన నాట్యము చేత ఈ లోకమునకు రాజయ్యాడు. అందుకే ‘నటరాజు’ అని పిలుస్తుంటాము.
ఆయన చేసే నాట్యం మామూలు నాట్యం కాదు. అది తెలుసుకుంటే చిదంబరంలో కనకసభ దగ్గరకు వెళ్లి పెద్ద ఆనంద మూర్తిని చూడవచ్చు. అక్కడ ఆ మూర్తిని చూడగానే ప్రణిపాతం చేసి సాష్టాంగనమస్కారం చేస్తారు. అఘోర స్వరూపముల యందు చాలా గొప్ప స్వరూపములలో ఆనందమూర్తి స్వరూపం ఒకటి.
ఆనంద తాండవం చూసే స్థాయి పొందిన వాళ్ళలో మొదటి వాడు నందీశ్వరుడు.ఆయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు. రెండవ వాడు భృంగి.మూడవవాడు పతంజలి. ఆదిశేషుని అవతారము.అందుకని ఆయన తల మనుష్యుడిగా ఉంటుంది.మిగిలిన శరీరం పాముగా ఉంటుంది.వ్యాఘ్రపాదుడికి తలకాయ మనుష్యుడిది ఉంటుంది. కింద పాదములు అవీ పెద్దపులివి ఉంటాయి. ఈ నలుగురు నిలబడి తాండవం చూస్తూంటారు.
ముప్పది మూడు కోట్లమంది దేవతలు అక్కడే ఉంటారు.బ్రహ్మ, శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటారు.పతంజలి తప్ప మిగిలిన దేవతలు ఎవరికి తోచిన వాద్య విశేషమును వారు వాయిస్తూంటారు.ఢమరుకం కదలిక చేత ఇన్ని రకములయిన సృష్టి ప్రారంభం అయింది. ఆయన చేతిలో ఉన్న ఢమరుకం కారణముగా ఈయన సృష్టికర్త అయ్యాడు. పరమేశ్వరుని సృష్టి కదలిక వలన కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి.ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడము అనే సమస్త కదలికలకు ఢమరుక సంకేతం.ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి ఆయన కదలికే కారణము.
ఈశ్వరుని కదలికకు నర్తనమని పేరు. ఇదే ఆనంద తాండవము. ఆనంద తాండవ మూర్తి చేతిలో కుడివైపు ఢమరుకం ఉంటుంది.ఎడమచేతి వైపు అగ్నిహోత్రం ఉంటుంది. ప్రపంచంలోని అన్ని వస్తువులు చివరకు భస్మమే అయిపోతాయి.ఈ విషయం లోపల బాగా నాటినట్లయితే వ్యక్తి తప్పుడు పనులు చేయడు.ఏది కాలంలో వచ్చిందో అది కాలమునందు ఉండదు అని అర్థం అయితే నడవడి యందు మార్పు వచ్చేస్తుంది.నటరాజస్వామిని పరిశీలించినట్లయితే ఆయన కుడికాలి క్రింద ఒక రాక్షసుడు ఉన్నాడు.ఈయన కాలుకింద పడుకుని తల ఎత్తి నవ్వుతూ ఉంటాడు ఏడవడు.మాయను గెలవడమే కుడికాలి కింద రాక్షసుని తొక్కి పట్టడం.ఎడమ కాలు బ్రాహ్మీ స్థితిని సూచిస్తుంది.
కుడికాలు మాయను తొక్కితే పైకి లేచేది ఎడమకాలు.అందుకే ఆనంద తాండవ మూర్తి ఎడమకాలు పైకి లేచి ఉంటుంది.ఊర్ధ్వముఖ చలనము చేసి ఈశ్వరుడిని తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది ‘నేనుగా ఉండడం’ నీవు నేర్చుకో. ‘నీవు నేనై ఉన్నానని’ తెలుసుకో.దానికి ధ్యానం అవసరం. ఇది చెప్పడానికి ఎడమచెయ్యి పైకి లేచిన ఎడమ పాదమును చూపిస్తుంది.కుడి చేయి అభయముద్ర పట్టింది. శివుడు చాలా తేలికయిన వాటిని పుచ్చుకుని పెద్ద శుభ ఫలితములను ఇస్తాడు.ఇది చెప్పడానికే ఆయన అభయముద్రను ప్రదర్శించాడు. పాపమును హరిస్తానని చెప్పాడు. హరించినప్పుడు ఉపాసకుడు క్రమంగా పెరుగుతాడు. పెరిగి ‘శివ’ – అంటే మంగళమును చేరతాడు.ఈ ‘శివ’ నుండి ఆనందతాండవమూర్తిలోనికి లయమయి ఆనందంగా మారిపోవాలి.అలా మారిపోతుంటే ఆయన దిగంబరుడుగా వచ్చాడు.అంటే శరీర భ్రాంతి లేకపోవడమును ఆనందం అంటారు.
ఆత్మస్వరూపి అయిన ఆనందతాండవమూర్తియందు సాధకుడు కలిసిపోయి ఆనంద తాండవ మూర్తి అయిపోతాడు.ఆయనకి మరల చావడం అనేది ఉండదు.ఇదే ఆఖరి చావు.
శివుని విశేషములను వేటినీ సామాన్యముగా తీసుకొనుటకు ఉండదు.కేవలం ఒక నటరాజ స్వామి వారి మూర్తిని పెట్టుకుని అష్టోత్తరం, సహస్రం చేస్తాను అంటే ఈ తత్త్వము ఆవిష్కరింపబడదు.ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం.కోరిక పుట్టినా అది నిలబడడం చాలా కష్టం.ఎందుకు అంటే కింద కుడికాలిక్రింద నవ్వుతూ ఒకడు బ్రతికే ఉంటాడు.వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో తెలియదు.ఎప్పుడయినా మాయ మళ్ళీ పట్టేస్తుంది.మళ్ళీ కూపంలోకి పడిపోతాడు.ఉదాహరణకు రావణాసురుడు శంకరుని ప్రార్థన చేశాడు.తనకు ఎటువంటి శంకరుని చూడాలని ఉన్నదో వివరిస్తూ స్తోత్రం చేశాడు “జటాటవీ గలజ్జల’ అని. ఇంత స్తోత్రం చేసిన రావణాసురుడు అలా నిలబడ లేకపోయాడు. పరమేశ్వరుని తనతో లంకకు రమ్మన్నాడు.ఏమయిపోయింది ఈ స్తోత్రం? అంతలో మాయ కమ్మింది.అడగడం కాదు. అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం.
నిలబడడానికి శివానుగ్రహం ఉండి తీరాలి.శివానుగ్రహం కలిగితే ఆయనే నడిపిస్తాడు. ఆనందతాండవమూర్తి అనుగ్రహం మనకు కలిగి మనుష్యజన్మ ప్రయోజనం నెరవేరేటట్లుగా నిర్హేతుక కృపాకటాక్షవీక్షణముల చేత ఈశ్వరానుగ్రహం ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేయాలి.
facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి