ముసలి వారిని అంత్య క్షణాలలో ఉన్న వారిని ఏ విధంగా చూడాలి అనే విషయం మహా భారతం లో చెప్పారు. దానినే ఇవాళ ఆధునిక వైద్యనిపుణులు చెప్తున్నారు.
ఆధునిక ప్రపంచ వైద్యులను విస్మయ పరిచే అంశం భీష్మ నిర్యాణంలో ఉంది
ప్రపంచంలో మొదటి ఆధునిక అంత్యదశ సేవాశ్రమం అనే హాస్పీస్ ను 1967లో ఇంగ్లండుకు చెందిన నర్సు ఏర్పాటు చేసిందని అంటున్నారు.
దీనికి ముందర క్రీస్తు శకం 11వ శతాబ్దంలో క్రైస్తవంలోని రోమన్ కేథలిక్కు వర్గానికి చెందినవారు ఏర్పాటు చేశారనే వారు కూడా ఉన్నారు.
కానీ వీటన్నింటికన్నా ముందర మహాభారతంలో భీష్మనిర్యాణ ఘట్టంలో అంత్యదశ సేవల గురించి అద్భుతమైన వివరణ ఉంది.
అదేమిటో చూద్దా౦
భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులు పోరాడి ఒళ్ళు అంతా బాణాలు గుచ్చుకోగా నేలకు ఒరిగిపోయాడు.
అయితే ఆయన వెంటనే చనిపోలేదు కదా.
58 రోజులు అ౦పశయ్య (బాణశయ్య) మీద బ్రతికారు. ఆ 58 రోజుల్లో భీష్ముడిని పాండవులు చూసుకున్న తీరులో ఆధునికులు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నింటినో తెలుసుకోవచ్చు.
భీష్మ నిర్యాణంపై ఆంధ్రవ్యాసుల వారు చెప్పిన వివరాలు చూద్దాం..
‘‘మనం చాలా తప్పు చేస్తున్నాము. సీనియర్ సిటిజన్ల పేరుతో 60 ఏళ్ళు కాగానే ముసలాళ్ళుగా ముద్రవేసి వారిని పట్టించుకోవడంలేదు.
కానీ విదేశాల్లో వృద్ధుల నుంచీ ఎన్నో రహస్యాలు తెలుసు కుంటున్నారు.
జీవితంలో వారు గడించిన అనుభవాలను విదేశీయులు సేకరించి వారివారి రంగాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు.
మనం వాళ్ళలాగా ఆలోచి౦చలేక పోతున్నాం. ముసలాళ్ళు ఒక బరువు అనుకుంటున్నాము.
ఎంతో విలువైన అనుభవసారాన్ని కోల్పోతున్నాము !
ప్రతీ వృద్ధుని దగ్గరా తాను పనిచేసిన రంగంలో విశేషమైన అనుభవ జ్ఞానం ఉంటుంది.వారి వద్ద ఆ అనుభవాలను సేకరి౦చగలగాలి. నిజానికి దీనివల్ల వృద్ధులకు కూడా తమను సమాజం నిర్లక్ష్యం చేస్తోంది అనే భావన పోతుంది. మనకు దాని వల్ల వివిధ రంగాలకు కావలసిన అనుభవ జ్ఞానం వస్తుంది.
ఈ విజ్ఞానం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పరిశోధనలు చేసినా దొరకదు.
కేవలం వృద్ధుల దగ్గర మాత్రమే ఆ అనుభవ జ్ఞానం ఉంటుంది.
దీనికి అద్భుతమైన ఉదాహరణ మహాభారతంలో ఉంది.
18 రోజుల యుద్ధంలో
18 అక్షౌహిణుల సైన్యం నాశనం అయ్యాక, దుర్యోధనుడు కూడా చనిపోయాక, ధర్మరాజు పట్టాభిషేకం ద్వారా చక్రవర్తి అయ్యాడు.
ఈ సమయంలో ధర్మరాజుకు వ్యాసుడు, కృష్ణుడు అద్భుతమైన సలహా ఇస్తారు.
అప్పటికి భీష్ముడు ఇంకా జీవించే ఉన్నాడని ధర్మరాజుకు గుర్తు చేస్తూ అపారమైన జ్ఞాన సంపద ఆ కురు వృద్ధుడి దగ్గర ఉందని ఆయన గతిస్తే ఆయనతో పాటే ఆ మహావిజ్ఞానం అంతరిస్తుందని, కనుక వెళ్ళి తాతను సేవించి తెలుసుకోమని సలహా ఇస్తారు.
వారి సలహా వల్ల భారతంలోనే అతి పెద్ద పర్వం "శాంతి పర్వం" పుట్టింది.
అందులో *భీష్ముడు చెప్పిన విషయాలు సకల శాస్త్ర సారాలు.* విష్ణుసహస్ర నామం కూడా అందులోదే.
కనుక వృద్ధులను సేవించడం వలన సమాజానికి ఏ౦ ప్రయోజనం ఉంటుందో భారతం తెలుపుతోంది.
ఆంధ్రవ్యాసుల వారి మార్గ దర్శకత్వంలో మరింత లోతుగా పరిశోధన చేస్తే అద్భుతమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
1. భీష్ముడు క్రింద పడగానే వేలాది కన్యలు వచ్చి ఆప్రదేశాన్ని శుభ్రంచేసి గంధపు పొడి, పేలాలుచల్లి, పూవులతో అలంకరించారని రాసారు.(వాళ్ళే ఇప్పటి నర్సులు)
2. భీష్ముడి దగ్గరకు ఎవరెవరు వచ్చారో వ్యాసుడు వివరంగా చెప్పాడు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
తూర్యాణి శతసంఖ్యాని తథైవ నటనర్తకాః శిల్పినశ్చ తథాఽఽజగ్ముః కురువృద్ధం పితామహం ॥_
భీష్ముడి దగ్గరకు సంగీత వాయిద్యాలను వందల సంఖ్యలో తీసుకొని గాయకులు, నటులు, నర్తకులు, శిల్పులు (ఇంజనీరింగు విభాగంవారు) వచ్చారని వ్యాసుడు చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం.
రోగి వేరు అంత్యకాలంలోని వ్యక్తి వేరు. చికిత్స ఉన్నంత కాలమే ఒక వ్యక్తి రోగి అవుతాడు. చికిత్స లేనప్పుడు అతడు పేషె౦టు కాడు. అతడికి చేయాల్సిన వైద్యం అంత్యకాల సేవ. అది వేరే ఉంటుంది.
అదే ఆరోజు పా౦డవులు భీష్ముడికి చేశారు. అంత్యకాలంలో ఉన్న భీష్ముడికి ఆనందం కలిగించడం కోసం నటులు, నర్తకులు, గాయకులు, సంగీతకారులు వచ్చారు. నేడు కూడా ఆసుపత్రులలో సైతం టివిలు, మ్యూజిక్ సిస్టంలు ఉంచుతున్నారు. ఇక పాలియేటివ్ కేర్ సెంటర్లలో అయితే అంత్యకాలంలో వారు ఆడుకోవడానికి ఆటవస్తువులు కూడా ఉంచుతున్నారు._
ఇక్కడ అతిముఖ్యమైన అంశం ఏమిటంటే భీష్ముడి దగ్గరకు వారంతా వచ్చారు. అంతేకానీ వారు ఎవరు సంగీత వాయిద్యాలను వాయించారని కానీ, నటులు, నాట్యకారులు నాట్యం చేశారని కానీ చెప్పలేదు. దీనికి కారణం భీష్ముడు తాను మానవ భోగాలకు అతీతుడను అయ్యాను అనినందువల్ల. అయితే వేల సంవత్సరాల క్రితం భారతంలో పాలియేటివ్ కేర్ పురుడుపోసుకుందని చెప్పడానికి ఇది రెండో అతి ముఖ్యమైన శ్లోకం భీష్మపర్వంలో ఉంది.
3. దీని తరువాత అతి ముఖ్యమైంది శాంతిపర్వంలో ఉంది.
"భీష్ముడి మరణశయ్య దగ్గరకు భూమి మీద నివసి౦చిన మహారాజులే కాదు.. ముల్లోకాల్లో ఉన్న మహర్షులు, యతులు, పరమహంసలు, దేవతలు అ౦దరూ వచ్చారు.
వారిలో నారదాది సంగీత విద్వాంసులు ఉన్నారు.
శ్రీకృష్ణుడు వచ్చి భీష్ముడి బాధలు పోగొట్టగానే వ్యాస మహర్షితో కూడిన సమస్త రుషి గణాలూ రుగ్, యజుస్, సామగానాలు చేశారు. అన్ని రుతువులకు చెందిన పుష్పాలు ఏక కాలంలో విరిసి కురిశాయి. దేవతలు, అప్సరసలు వచ్చి సంగీత వాయిద్యాలు మ్రోగించి గానం చేశారు. పవిత్రమైన, ప్రశాంతమైన, స్వచ్ఛమైన చల్లటి గాలి వీచింది. ఆ ప్రాంతంలో ఉన్న సమస్త జంతు పక్షిజాతి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాయి. భీష్మునికి అత్యంత ఆనందదాయకమైన వాతావరణం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడు సూర్యాస్తమయం చూసి రేపు వస్తానని వెళ్ళాడు.
ఇక్కడ ఇచ్చిన ప్రతి వర్ణన అంత్యదశసేవల్లో చాలా ముఖ్యమైంది. దీనిలో, రెలిజియస్ హీలింగ్, యోగా, మ్యూజిక్ థెరపీ, పుష్పవైద్యం వంటివి ఉన్నాయి.
అన్నిటికీ మించి పేషంటుకు ఉన్న విజిటర్స్ సమయాన్ని మహర్షులు కూడా గౌరవించి అస్తమయం అవుతుండడంతో మరలా రేపు వస్తానని కృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు వద్ద శలవు తీసుకొని వెళ్ళిపోయారు. ధర్మరాజు, కృష్ణుడు కూడా వెళ్ళిపోయారు.
4. ఇక్కడ అతి ముఖ్యమైన వర్ణన వ్యాసుడు చేస్తాడు. పాండవుల రథాలు వెళ్ళిన తీరు మహానదిని తలపించిందని చెప్పాడు.
తతో రథైః కాంచనచిత్రకూబరై ర్మహీధరాభైః సమదైశ్చ దంతిభిః।
హయైః సుపర్ణైరివ చాశుగామిభిః పదాతిభిశ్చాత్తశరాసనాదిభిః
యయౌ రథానాం పురతో హి సా చమూ
స్తథైవ పశ్చాదతిమాత్రసారిణీ।
పురశ్చ పశ్చాచ్చ యథా మహానదీ
తమృక్షవంతం గిరిమేత్య నర్మదా॥
ఈ వర్ణన చదవకపోతే తరువాత ధర్మరాజుకు ఉన్న మహత్తరమైన విజ్ఞానం మనకు అర్థం కాదు.
5. మర్నాడు ధర్మరాజు ఉదయాన్నే భీష్ముని దర్శనానికి వెళుతూ అర్జునుడిని పిలుస్తాడు. పిలిచి ఇలా అంటాడు.
‘‘అర్జునా ఈ రోజు ఏవిధమైన మందీ మార్బలం, సైన్యం లేకుండా నేను సోదరులతో మాత్రమే వెళ్లదలచాను. మన అశ్వగజరథ సైన్య పరివారం వెళ్ళివస్తూ ఉండడం వలన అంపశయ్యమీది భీష్ముడికి ఇబ్బంది కలుగకూడదు. కనుక సైన్యాన్ని, భటులను వద్దని చెప్పు. ఈ రోజు నుంచీ నేను భీష్ముడి దగ్గర ముఖ్యమైన రహస్యాలు తెలుసుకోబోతున్నాను. కనుక అనవసరమైనవారు అక్కడకు రావడం నాకు ఇష్టంలేదు‘‘ అన్నాడు.
ఇది నేటికీ ఆచరించదగిన ముఖ్య విషయం. ఎవరైనా గొప్ప వ్యక్తి చనిపోవడమో, జబ్బుపడడమో జరిగితే ముందుగా ట్రాఫిక్కు పోలీసుల గుండెలు ఆగిపోతాయి. వచ్చేవారు పలకరించడానికి వస్తున్నారా ? లేక తమ హోదాలు వెలగబెట్టుకోవడానికి వస్తున్నారో తెలియని సందర్భాలు కోకొల్లలు. భారీగా వాహనాలు రోడ్ల మీద పార్కుచేసి ట్రాఫిక్కు స్తంభింప చేయడంతో మొదలుపెడితే గన్ మెన్లు హోదా చూపించుకోవడం, బుగ్గకార్ల హడావుడి ... ఇదంతా చూస్తే ఎంత ఇబ్బ౦దిగా ఉంటుందో ఒక సారి ఎవరికి వారు గమనించుకుంటే మంచిది.
శ్రీకృష్ణుడు కూడా శైబ్య, సుగ్రీవ, వలాహక, మేఘపుష్ప అనే తన రథాశ్వాలను శబ్దం లేకుండా వెళ్ళమని ప్రార్థించాడట. పశువులైన ఆ గుర్రాలు మహావేగంతో పయనించినా భూమి మీద అతి సుకుమారంగా వెళ్ళాయని వ్యాసుడు చెప్పాడు. నేడు ఆసుపత్రుల దగ్గరకు వాహనాలలో వెళ్ళేవాళ్ళు ఆ గుర్రాలను చూసి నేర్చుకోవలసి౦ది ఎ౦తో ఉ౦ది.
ఆసుపత్రి ఏరియా దయచేసి హారన్ మ్రోగించవద్దు అనే బోర్డు ఎవరూ పట్టించుకోరు. లోపల మరణావస్థలో ఉన్నపేషంట్ల వినికిడి అవయవాలు మహాబాధ పెడతాయని ఎప్పటికి తెలిసి వస్తుందో నేటి వాహన చోదకులకు ?
మహాభారతం నేడు కూడా ఎందుకు అనే ప్రశ్నకు ఈ శ్లోకాలు చాలు. ఎంత నిర్లజ్జగా మనం నేడు బ్రతుకుతున్నామో తెలియడానికి.
వేల సంవత్సరాల క్రితం మరణ శయ్య మీద ఉన్న వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్ళాలో చెప్పిన మరో గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు.
వ్యాసుడు చెప్పిన లక్షా పదివేల శ్లోకాల్లో ఏం ఉందో చదువుకుంటే మనిషిగా మనం ఎంత పసి (పశు) ప్రాయంతో జీవిస్తున్నామో తెలుస్తుంది. నేటి ప్రభుత్వాల కారణంగా మాత్రు భాష అడుగంటి భారతంలో ఏం ఉందో చదివి తెలుసుకోలేక బ్రతుకుతున్నాము.
ఏ అమెరికా, ఇంగ్లండు వారో హాస్పీస్ సేవలు మా దగ్గరే పుట్టాయి అంటే నిజమే కాబోలు అనుకునే జాతి తయారైంది. ఇకనైనా కళ్ళు తెరుద్దాము. మన౦ కాకపోయినా మన వారసులకైనా భాష పట్ల...సనాతన సా౦ప్రదాయల పట్ల.
గ్ర౦థ పఠన౦ పట్ల ప్రేమాభిమానాలు కలిగేలా చదువు చెప్పాలి
బాల్య౦ ను౦డే ప౦చత౦త్ర౦.. భారత రామాయణ గాథలు చెప్పాలి
దయచేసి పాఠశాల చదువే కాదు. పాతకాల పురాణాల పట్ల అవగాహన కలిగి౦చ౦డి. గ్ర౦థ పఠన౦ స౦స్కారాన్ని నేర్పుతు౦ది. నడవడిక నేర్పుతు౦ది. మ౦చి మనిషిగా తీర్చిదిద్దేది పుస్తక పఠనమే సుమా.
నేటి బాలలే రేపటి రాజులు ! కష్ట౦ తెలిసినవారే సుఖపడగలరు....
సర్వేజన సుఖినో భవ౦తు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి