22, ఆగస్టు 2023, మంగళవారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 17*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 17*


*ప్రగాఢ ధ్యానాభ్యాసం*


భగవంతుడంటూ ఒకరు ఉండివుంటే  నిశ్చయంగా ఆయన నిజమైన ప్రార్థనలను ఆలకించి భక్తునికి దర్శనమిస్తాడు; ఆయన సాక్షాత్కారం పొందడానికి ఏదో ఒక మార్గం ఉండితీరాలి; అలా లేకపోతే జీవితమే నిరర్థకమని నరేంద్రుని గట్టి నమ్మకం. కాని అలాంటి భగవన్మార్గాన్ని బోధించడంలో బ్రహ్మసమాజం అనుకూలమైనది. కాదని కొద్ది రోజుల్లోనే నరేంద్రుడు గ్రహించకపోలేదు. 


సత్యాన్ని తెలుసుకోవాలి; భగవత్సాక్షాత్కారం పొందాలనే తపనతో ఒక క్రొత్త పద్ధతిలో ధ్యానాభ్యాసం ప్రారంభించాడు. భగవంతుణ్ణి సాకారునిగా తలచినా, నిరాకారునిగా ఎంచినా మానవ రూపాన్నీ, గుణాలనూ స్వీకరించకుండా మనం ఆయనను ధ్యానించలేం. దీనిని గ్రహించడానికి మునుపు నరేంద్రుడు బ్రహ్మ సమాజ పద్ధతి మేరకు భగవంతుణ్ణి నిరాకార సగుణ బ్రహ్మంగా ధ్యానించేవాడు. ఇదీ ఒక రకమైన కల్పనగా నిర్ధారణ చేసిన నరేంద్రుడు ఆ ధ్యాన పద్ధతిని విడిచిపెట్టి, "భగవంతుడా! నీ నిజస్వరూప దర్శనానికి నన్ను అర్హుణ్ణి చేయి" అంటూ ప్రార్థించాడు. 


ఆ తరువాత మనస్సును ఆలోచనారహితం చేసి, గాలిలేని చోట వెలిగే దీపశిఖలా మనస్సును నిశ్చలంగా ఉంచడానికి అభ్యాసం చేయసాగాడు. ఈ రీతిలో కొంతకాలం అభ్యసించిన తరువాత అతడి మనస్సు పూర్తిగా శాంతించింది. కొన్ని సమయాలలో దేహభావన, కాల భావన కూడా అతడికి మృగ్యమవడం కద్దు. ఇంట్లో అందరూ నిద్రించడానికి పోగానే, అతడు తన గదిలో ఈ తీరులో ధ్యానించేవాడు. అనేక రాత్రుళ్లు ధ్యానంలోనే గడచిపోయేవి.


ఆ కారణంగా ఒక రోజు నరేంద్రునికి అసాధారణమైన అనుభవం ఒకటి కలిగింది. ఆతడు ఇలా అన్నాడు: "ఏ ఆధారమూ లేకుండా మనస్సును ఏకాగ్రం చేసి స్థిరంగా నిలిపితే, మనస్సులో ఒక రకమైన ప్రశాంతతతో కూడుకొన్న పరమానందం జనిస్తుంది. ధ్యానానంతరం కూడా చాలాసేపు ఆ పరమానందపు మత్తు కొనసాగుతుంది. కనుక ఆసనాన్ని విడిచిపెట్టి వెంటనే లేవడానికి మనస్కరించదు.” అలాంటి ధ్యానానందాన్ని చవిచూడసాగాడు నరేంద్రుడు.🙏



*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: