శ్రీనాధుని కవితా వైభవం!
శా: కాలాంతఃపుర కామినీ కుచతటీ కస్తూరికా సౌరభ
శ్రీలుంటాకము చందనాచల తట శ్రీఖండ సంవేష్ఠిత
వ్యాల స్ఫార ఫణాకఠోర విష నిస్వాసాగ్ని పాణింధమం
బేలా నాపయి దక్షిణానిలము పక్షీ , సేయు దాక్షిణ్యమున్;
శృంగార నైషధము- ద్వి:ఆ:- 32 ప: శ్రీ నాధుడు.
అద్భుతమైన కవిత్వంతో ఆంధ్రదేశాన్ని ఓలలాడించిన కవిసార్వభౌముడుశ్రీనాధుడు. "నైషథం విద్వదౌషధమ్ " అనేపండితోక్తి శ్రీనాధకృత నైషధము వలననే నని కొందరి యభిప్రాయము. మూలగ్రంథకర్త హర్షుడు గూడ సామాన్యుడుగాడు. అంత మహోన్నత గ్ంధమును వాసి తగ్గకండా అనువదించుట సామాన్యమైన విషయముకాదు. ఆమహద్గౌరవము శ్రీనాధునకే దక్కినది. పండిత జనైక వేద్యమైన యీగ్రంథములోని యొకపద్యం మీకోసం!
హంస నలుని చేతఁజిక్కి నన్ను విడిచినచో నీకొక యుపకారమును జేతున్నది. ఏమాయుపకృతి?లోకోత్రర సౌందర్య రాసి యగు దమయంతిని నీకు గూర్తునన్నది. ఆమెకు నీకు పెండిలి గావింతునన్నది. దమంయంతీ సౌందర్యమును రమణీయముగా వర్ణించి యామెపై నలునకు వలపు బుట్టించినది. నలుడు విరహమున బడినాడు. ప్రాచీన గ్రంథములలో యిదియొక ముఖ్యమైన వర్ణనము. ఈవిరహ మున చంద్ర, మన్మధ, వసంత, మలయానిలాదులను ,తూలనాడు విధానముండును. మనమిప్పుడు నలుడుమలయానిలమును(చల్లగాలి) దూషించుటను విందుముగాక!
విరహులకు చల్లగాలి అగ్ని కీలలను బోలి బాధించునట! అదిగో ఆబాధలో నున్నాడు నలుడు.
అర్ధవివరణ:- కాలాంతఃపురకామినీ- యమునిపట్టపురాణి; కుచతటీ-స్తనములయందలి; కస్తూరికా- కస్తూరీ ద్రవ్యము యొక్క; సౌరభశ్రీ- పరిమళ వైభవమును; లుంటాకము- దోచుకొను నట్టిది; చందనాచలతట- చందనపర్వత ప్రాంతము నందలి; శ్రీఖండ-మంచిగంధపు చెట్లపయి; సంవేష్ఠిత- నివసించే(చుట్టుకొనియుండే) వ్యాల- సర్పములయొక్క;స్ఫార- గొప్పనైన; ఫణాకఠోర-సర్పముల భయంకరమైన; విష-విషపూరితమైన; నిస్వాసాగ్ని- నిట్టూర్పుల అగ్గ్నితో; పాణింధమంబు-చేయికలిపిన (సమానమైన) దక్షిణానిలము-మలయానిలము;పక్షీ- ఓపక్షిరాజమా! నాపై -నామీద; దాక్షిణ్యము- దయను; ఏలచేయున్- ఎందుకు చేయును?
భావము: కాలుని యంతఃపుర కాంతల కుచ సీమల నలంకరించిన కస్తూపరిమళమున పనపహరించునదియు ,మలయాచల సానువుల యందలి చందన వృక్షముల పైనివసించు భయంకర సర్పముల నిట్టూర్పులచే విషదిగ్ధమైన యీమలయానిలము నాపై నేల దయను జూపును?
విశ్లేషణ: విరహులకు చలిగాలి శతృవు. అది విషతుల్యము. విషము చేయుపనియేమి? ప్రాణములను దొలగించును. అటులనే యీగాలులు విరహులకు ప్రాణాంతకములట! అదే విషమును నలుడు హంసకు దెలుపు చున్నాడు. ఓపక్షిరాజా! నీవర్ణనతో
దమయంతి పై నాకు వలపు బుట్టించితివి. ఇపుడు నాకామెతో పరిణయము గానియెడల విరహ వేదన నన్నుదహింపక మానదు.
మలయానిలమును చల్లగాలిగా భావింప వీలుగాదుగదా! ఏలనన?
ఇది దక్షిణానిలము గదా! దక్షిణదిశా పాలకుడు యముడు. అతనియంతఃపుర కాంతల స్తన వ్యాప్త కస్తూరికా పరిమళ
వ్యప్తమై, చందనాచల స్థిత భయంకర ఫూత్కార సమేతమై వచ్చు నీగాలి విషతుల్యము గాక మరేమి? కావున నాబ్రతుకిపుడు నీ వశమైనది.కావున సత్వరమే బోయి ఆమెకుగూడ నాపై వలపు గలిగించి మావివాహమును జరిపించమని నలుని సూచన!
ఈపద్యమున "కాలాంతఃపుర------శ్రీలుంటాకము" చందనాచల----పాణింధమంబు"- అనేరెండు పెద్ద సమాసాలను ప్రయోగిస్తూ! నలుని విరహ బాధలోని గాఢతను వివరించెను.
శ్రీలుంటాకము---- పాణిధమంబు; అను సంస్కృత పదములతో తన యపారమైన పాండిత్యము నభివ్యక్తము గావించెను.
ఈవిధముగా నీపద్యము శ్రీనాధుని యపార వైదుష్యమునకు ప్రతీక యైనది;
స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి