14, ఆగస్టు 2023, సోమవారం

రామాయణమ్ 290

 రామాయణమ్ 290

...

సీతమ్మ మాటలు విని శిరస్సుపై అంజలి ఘటించి వినయముగా ఆంజనేయుడు ఆమెతో  ఇట్లనెను.

.

తల్లీ నీవిచ్చట ఉన్నట్లు  రాముడు ఎరుగడు!  రామునికి నీ సమాచారం  తెలిసిన వెంటనే సమస్త వానర గణములు ,భల్లూక సైన్యములు వెంటపెట్టుకొని ఇచ్చటకు రాగలడు.

.

రాముని మార్గమునకు, ఆయన శత్రు నాశమునకు అడ్డు ఏది? సముద్రమును క్షోభింపచేసి మరీ దాటగలడమ్మా!

.

నీవు లేక నిముసముకూడా నిదురించుటకు లేదు తల్లీ రామచంద్రుడు.వంటి మీద తేళ్లు,జర్రులు పాకినా ఈగలు ముసిరినా  వాటి స్పృహ ఏమాత్రము లేకుండా అనుక్షణమూ నీ నామ స్మరణము లోనే ఆయన కాలము వెళ్ళబుచ్చుతున్నాడు తల్లీ!

.

ఆయనకు

ఏదో ఆలోచన

ఎడతెగని మథన

.

ఆయన

ఎదలో నీవే

ఆయనఎదుటా నీవే

సమస్తప్రకృతిలో నీవే

అంతెందుకు?

ఆయన ఎటుచూసినా 

అటు నీవే కనపడుతున్నావమ్మా!

.

విరిసిన మొగ్గచూసినా

కురిసే వానచూసినా

మురిసే నాసీత నా చెంత లేదే?

ఇదే ఆయన చింత!

.

ఆ రాకుమారుడురాముడు నీవే లోకముగా బ్రతుకు తున్నాడమ్మా!

.

రాముని బాధ తన బాధ ఒకటేఅని తెలిసికొని శోకము , ఆనందముకలగలసి శరత్కాలప్రారంభములో మబ్బులో  దాగిన చందమామ ఉన్న రాత్రి వలె సితమ్మ ఉండెను.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: